వచ్చే ఏడాది 5.6% వృద్ధి: సిటీ గ్రూప్
న్యూఢిల్లీ: వచ్చే 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీడీ) వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండొచ్చని సిటీ గ్రూప్ అంచనా వేసింది. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం కొలువుదీరటం, పెట్టుబడులు పుంజుకోవడం, మెరుగైన రుతుపవనాలు వంటివి దీనికి అత్యంత కీలకమని నివేదికలో పేర్కొంది.
‘ఎల్ నినో’ ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవచ్చని.. దీంతో వ్యవసాయ ఉత్పాదకత తగ్గే రిస్క్‌లు పొంచిఉన్నట్లు సీటీ గ్రూప్ వెల్లడించింది. కంపెనీలు పెట్టుబడులపై నిర్ణయాలకు ఎన్నికలు పూర్తయ్యేదాకా వేచిచూడనున్నాయని అభిప్రాయపడింది. కేంద్రీయ గణంకాల సంస్థ(సీఎస్‌ఓ) ఈ ఏడాది(2013-14) వృద్ధి రేటు 4.9%గా ఉండొచ్చని ముందస్తు అంచనాల్లో పేర్కొనడం తెలిసిందే. సిటీ గ్రూప్ ఈ ఏడాది వృద్ధి 4.8%గా అంచనా వేసింది.
ద్రవ్యలోటు 4.7 శాతానికి: ఆర్థిక శాఖ
ఈ ఏడాది(2013-14) ద్రవ్యలోటు 4.7 శాతానికి కట్టడికావచ్చని(లక్ష్యం 4.8%) ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. 2జీ స్పెక్ట్రం వేలానికి స్పందన బాగుండటం(6 రోజుల్లో రూ.56,500 కోట్ల బిడ్‌లు లభించాయి), కోల్ ఇండియా భారీ డివిడెండ్ ఇతరత్రా అంశాలు ఇందుకు దోహదం చేయనున్నాయని చెప్పారు.