ఉద్యోగులకు వణికిపోతుంటే.. సీఈవోకి ఆనందం ఏంటి అనుకుంటున్నారా? రెండింటికీ సంబంధం లేదు కానీ ఆ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. వేలాది మంది ఉద్యోగులను తొలంచాలని యోచిస్తున్న సిటీ గ్రూప్ తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జేన్ ఫ్రేజర్ వేతన పరిహారాన్ని మాత్రం పెంచింది.
సీఈవో జేన్ ఫ్రేజర్ 2023 వేతన పరిహారం సుమారు 6 శాతం పెరిగి 26 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.215 కోట్లు) చేరుకుందని సిటీ గ్రూప్ తాజా ఫైలింగ్‌లో తెలిపింది. ఇందులో ఆమె మూల వేతనం 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.12.5 కోట్లు) కాగా 3.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ.30 కోట్లు) క్యాష్ బోనస్. మిగిలిన 20.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.172 కోట్లు) పర్ఫామెన్స్ ఆధారిత స్టాక్స్ అని ఫైలింగ్ ద్వారా తెలుస్తోంది.
2008 ఆర్థిక సంక్షోభం నుంచి కంపెనీ సంస్థాగత, నిర్వహణలో మార్పులను అమలు చేయడంలో, అంతర్జాతీయంగా వ్యాపార వృద్ధిలో ఫ్రేజర్ చేసిన కృషి ఆధారంగా వేతన పరిహారాన్ని నిర్ణయించినట్లు బ్యాంక్ బోర్డు పేర్కొంది. ఇతర బ్యాంకింగ్ సంస్థల్లోనూ సీఈవోల వేతన పరిహారాలు ఇటీవల పెరిగాయి. జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ పరిహారం 4.3 శాతం, మోర్గాన్ స్టాన్లీస్ మాజీ సీఈవో జేమ్స్ గోర్మాన్ 17 శాతం పెరిగాయి. ఇక గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సీఈవో వేతన పరిహారమైతే ఏకంగా 24 శాతం పెరిగింది.
యూఎస్ మల్టీనేషన్ ఇన్వెస్టర్ బ్యాంకు సిటీ గ్రూప్ గత నెలలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను పోస్ట్ చేసింది. దాదాపు రూ.15 వేలకోట్ల మేర నష్టాలు నమోదైనట్లు రిగ్యులేటరీకు రిపోర్ట్ చేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో నష్టాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం రాబోయే రెండేళ్లలో కనీసం 20,000 ఉద్యోగాల్లో కోత విధించాలని యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment