citi bank
-
ఉద్యోగులు వణికిపోతుంటే.. సీఈవోకి ఆనందం!
ఉద్యోగులకు వణికిపోతుంటే.. సీఈవోకి ఆనందం ఏంటి అనుకుంటున్నారా? రెండింటికీ సంబంధం లేదు కానీ ఆ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. వేలాది మంది ఉద్యోగులను తొలంచాలని యోచిస్తున్న సిటీ గ్రూప్ తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జేన్ ఫ్రేజర్ వేతన పరిహారాన్ని మాత్రం పెంచింది. సీఈవో జేన్ ఫ్రేజర్ 2023 వేతన పరిహారం సుమారు 6 శాతం పెరిగి 26 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.215 కోట్లు) చేరుకుందని సిటీ గ్రూప్ తాజా ఫైలింగ్‌లో తెలిపింది. ఇందులో ఆమె మూల వేతనం 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.12.5 కోట్లు) కాగా 3.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ.30 కోట్లు) క్యాష్ బోనస్. మిగిలిన 20.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.172 కోట్లు) పర్ఫామెన్స్ ఆధారిత స్టాక్స్ అని ఫైలింగ్ ద్వారా తెలుస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి కంపెనీ సంస్థాగత, నిర్వహణలో మార్పులను అమలు చేయడంలో, అంతర్జాతీయంగా వ్యాపార వృద్ధిలో ఫ్రేజర్ చేసిన కృషి ఆధారంగా వేతన పరిహారాన్ని నిర్ణయించినట్లు బ్యాంక్ బోర్డు పేర్కొంది. ఇతర బ్యాంకింగ్ సంస్థల్లోనూ సీఈవోల వేతన పరిహారాలు ఇటీవల పెరిగాయి. జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ పరిహారం 4.3 శాతం, మోర్గాన్ స్టాన్లీస్ మాజీ సీఈవో జేమ్స్ గోర్మాన్ 17 శాతం పెరిగాయి. ఇక గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సీఈవో వేతన పరిహారమైతే ఏకంగా 24 శాతం పెరిగింది. యూఎస్ మల్టీనేషన్ ఇన్వెస్టర్ బ్యాంకు సిటీ గ్రూప్ గత నెలలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను పోస్ట్ చేసింది. దాదాపు రూ.15 వేలకోట్ల మేర నష్టాలు నమోదైనట్లు రిగ్యులేటరీకు రిపోర్ట్ చేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్లో నష్టాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం రాబోయే రెండేళ్లలో కనీసం 20,000 ఉద్యోగాల్లో కోత విధించాలని యోచిస్తోంది. -
ఒకే బ్యాంకులో వచ్చే రెండేళ్లలో 20 వేలకు పైగా లేఆఫ్స్..!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, కాస్ట్‌కటింగ్ వల్ల స్టార్టప్ కంపెనీలతోపాటు దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఈ లేఆఫ్స్ సెగ బ్యాంకింగ్ రంగాన్ని తాకింది. దాంతో బ్యాంకులు తమ ఉద్యోగులను కొలువు నుంచి తొలగిస్తున్నాయి. యూఎస్ మల్టీనేషన్ ఇన్వెస్టర్ బ్యాంకు సిటీ గ్రూప్ తాజా త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను పోస్ట్ చేసింది. దాదాపు రూ.15 వేలకోట్ల మేర నష్టాలు నమోదైనట్లు బ్యాంక్ ఇటీవల రిగ్యులేటరీకు రిపోర్ట్ చేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్లో నష్టాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం రాబోయే రెండేళ్లలో కనీసం 20,000 ఉద్యోగాల్లో కోత విధించాలని యోచిస్తోంది. తిరిగి లాభాల బాట పట్టడానికి, వాటాదారులకు నగదును తిరిగి ఇవ్వడానికి సిటీ గ్రూప్ 'కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ' చేపట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా వచ్చే రెండేళ్లలో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సిటీగ్రూప్‌లో ప్రస్తుతం 2,39,000 మంది పని చేస్తున్నారు. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా వచ్చే రెండేళ్లలో ఇరవైవేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 8 శాతంగా ఉంది. ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన! సిటీ గ్రూప్ 2022 ఏడాదిలో 2.5 బిలియన్ డాలర్ల లాభాలతో పోలిస్తే ప్రస్తుత నాలుగో త్రైమాసికంలో 1.9 బిలియన్ డాలర్ల(రూ.15 వేలకోట్లు) నష్టాన్ని మూటగట్టుకుంది. ఆదాయం మూడు శాతం తగ్గి దాదాపు 17.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రేడింగ్ విభాగం నుంచి వచ్చే ఆదాయం అంతకు ముందు సంవత్సరం కంటే 19 శాతం తగ్గి రూ.36 వేలకోట్లకు చేరుకుంది. -
యాక్సిస్ చేతికి ‘సిటీ ఇండియా’
న్యూఢిల్లీ: అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్‌కి చెందిన భారత రిటైల్ బ్యాంకింగ్ వ్యాపార విభాగాన్ని దేశీ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ. 12,325 కోట్లుగా ఉండనుందని యాక్సిస్ బ్యాంక్ బుధవారం వెల్లడించింది. 2023 ప్రథమార్ధంలో డీల్ పూర్తి కాగలదని పేర్కొంది. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కొనుగోలుతో యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాల సంఖ్య 2.85 కోట్లకు, బర్గండీ (ప్రీమియం) కస్టమర్లు 2.3 లక్షల పైచిలుకు, కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరతాయి. డీల్ ప్రకారం .. విలీనం పూర్తయ్యేవరకూ కస్టమర్లకు సర్వీసులు అందించినందుకు గాను రూ. 1,500 కోట్ల వరకూ సిటీ బ్యాంక్‌కు యాక్సిస్ చెల్లించనుంది. నియంత్రణ సంస్థ నుంచి తొమ్మిది నెలల్లో అనుమతులు రాగలవని, చెల్లింపులు పూర్తయిన తర్వాత సంక్లిష్టమైన అనుసంధాన ప్రక్రియ మొదలు కాగలదని భావిస్తున్నారు. అనుసంధాన ప్రక్రియ 2024 సెప్టెంబర్ నాటికి పూర్తి కావచ్చని అంచనా. సంస్థాగత క్లయింట్ల వ్యాపార విభాగం ఈ డీల్‌లో భాగంగా ఉండదని సిటీగ్రూప్ తెలిపింది. ఆయా విభాగాల్లో మరింతగా విస్తరిస్తామని సిటీ ఇండియా విభాగం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆషు ఖుల్లార్ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో దీటుగా పోటీపడేందుకు యాక్సిస్ బ్యాంక్‌కు ఈ కొనుగోలు ఉపయోగపడనుంది. కోటక్ మహీంద్రా బ్యాంకులో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ విలీనం (రూ. 12,500 కోట్లు) .. ఈ స్థాయి డీల్స్‌తో చివరిది. జీవితకాల అవకాశం.. సిటీ బ్యాంక్ డీల్‌ను ‘జీవితకాలంలో ఒకసారి లభించే అవకాశం‘గా యాక్సిస్ బ్యాంక్ ఎండీ అమితాబ్ చౌదరి అభివర్ణించారు. వ్యాపార వృద్ధి ప్రయోజనాలు గణనీయంగా ఉండటంతో ఈ డీల్వైపు మొగ్గు చూపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కొనుగోలు వల్ల వడ్డీ ఆదాయంతో పాటు ఫీజు, వడ్డీయేతర ఆదాయాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని యాక్సిస్ బ్యాంక్ సీఎఫ్‌వో పునీత్ శర్మ చెప్పారు. సిటీబ్యాంక్ ఖాతాదారులకు యథాప్రకారంగా రివార్డులు, ఆఫర్లు మొదలైనవి కొనసాగుతాయని చౌదరి తెలిపారు. సిటీ బ్యాంక్ కస్టమర్లంతా యాక్సిస్ బ్యాంక్‌కు మారేందుకు తమ సమ్మతి తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. కస్టమర్లు యాక్సిస్ బ్యాంకుకు మారేందుకు ఇష్టపడితే యథాప్రకారం తమ ఖాతాలు, క్రెడిట్ కార్డులు, ఇతర లావాదేవీలు కొనసాగించవచ్చు. లేదా నిష్క్రమించవచ్చు. యాక్సిస్ బ్యాంక్ విస్తృత నెట్వర్క్, ఆఫర్లు సిటీబ్యాంక్ కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటాయని చౌదరి పేర్కొన్నారు. ఒకవేళ కస్టమర్ల సంఖ్య తగ్గిపోయిన పక్షంలో ఆ మేరకు యాక్సిస్ చెల్లించే మొత్తం కూడా తగ్గే విధంగా ఒప్పందంలో షరతులు ఉన్నాయని, అలాగే ఇరు పక్షాలు కూడా ఏ కారణంతోనైనా వైదొలిగేందుకు కూడా వీలు కల్పించేలా నిబంధనలు ఉన్నాయని వివరించారు. సిటీగ్రూప్ ఇకపై భారత్‌లో సంస్థాగత బ్యాంకింగ్ వ్యాపారం కొనసాగింపుపై దృష్టి పెట్టనుంది. కార్డుల్లో టాప్ 3లోకి యాక్సిస్.. దాదాపు 86 లక్షల కార్డులతో యాక్సిస్ బ్యాంక్ దేశీయంగా క్రెడిట్ కార్డుల జారీలో నాలుగో స్థానంలో ఉంది. సిటీగ్రూప్ డీల్‌తో కొత్తగా మరో 25 లక్షల క్రెడిట్ కార్డుహోల్డర్లు జతవుతారు. దీంతో కార్డుల వ్యాపార విభాగంలోని టాప్ 3 బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ ఒకటిగా ఎదుగుతుంది. డిపాజిట్ల పరిమాణం మరో రూ. 50,200 కోట్ల మేర పెరుగుతుంది. అలాగే, సిటీ వెల్త్.. ప్రైవేట్ బ్యాంకింగ్ సాధనాలకు సంబంధించి రూ. 1,10,900 కోట్ల విలువ చేసే ఆస్తులు (ఏయూఎం) కూడా యాక్సిస్‌కు జతవుతాయి. తద్వారా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో 3వ అతి పెద్ద బ్యాంకుగా యాక్సిస్ ఎదగనుంది. సిటీ బ్యాంక్‌కు 18 నగరాల్లో ఉన్న 7 కార్యాలయాలు, 21 శాఖలు, 499 ఏటీఎంలు, దాదాపు 3,600 మంది ఉద్యోగులు యాక్సిస్ బ్యాంక్ కిందకి చేరతారు. 30 లక్షల మంది కస్టమర్లు జతవుతారు. యాక్సిస్ బ్యాంక్ రిటైల్ వ్యాపార పోర్ట్‌ఫోలియో రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు ఉంది. శతాబ్దం క్రితం సిటీగ్రూప్ ఎంట్రీ.. సిటీగ్రూప్ 1902లో భారత్‌లో అడుగుపెట్టింది. 1985లో కన్జూమర్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. సిటీ రిటైల్ ఖాతాల పరిమాణం రూ. 68,000 కోట్లుగా ఉంది. ఇందులో రిటైల్ రుణాల ఖాతాలు రూ. 28,000 కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సిటీగ్రూప్ లాభాల్లో భారత విభాగం వాటా 1.5 శాతం స్థాయిలో ఉంది. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సిటీబ్యాంక్ ఇండియా నికర లాభం రూ. 4,918 కోట్ల నుంచి రూ. 4,093 కోట్లకు తగ్గింది. నికర మొండిబాకీలు (ఎన్పీఏ) రూ. 143 కోట్లు, స్థూల ఎన్పీఏలు రూ. 991 కోట్లుగాను ఉన్నాయి. తొలి మహిళా సీఈవో జేన్ ఫ్రేజర్ సారథ్యంలోని సిటీబ్యాంక్ అధిక రాబడులు అందించే ఆదాయ వనరులపై దృష్టి పెట్టే క్రమంలో 13 మార్కెట్లలో రిటైల్ వ్యాపారం నుంచి నిష్క్రమించాలని గతేడాది నిర్ణయించుకుంది. భారత మార్కెట్ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే సిటీగ్రూప్ తాజా డీల్ కుదుర్చుకుంది విదేశీ బ్యాంకుల గుడ్‌బై.. ఏఎన్జెడ్, ఆర్బీఎస్ తదితర బ్యాంకుల నిష్క్రమణ కొన్నాళ్లుగా పలు విదేశీ బ్యాంకులు భారత మార్కెట్ నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయి. ఏఎన్జెడ్ గ్రిండ్లేస్, ఆర్బీఎస్, కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా వంటి దిగ్గజాలు తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించేసుకున్నాయి. కార్పొరేట్ బ్యాంకింగ్‌పై మరింతగా దృష్టి పెట్టే దిశగా 2012లో బ్రిటిష్ బ్యాంకింగ్ దిగ్గజం బార్క్లేస్ భారత్‌లో తమ రిటైల్ కార్యకలాపాలను భారీగా తగ్గించేసుకుంది. చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్ కంపెనీ... గట్టి కౌంటర్ ఇచ్చిన మీషో..! నాన్–మెట్రో ప్రాంతాల్లో మూడో వంతు శాఖలను మూసేసింది. 2016లో కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా .. భారత మార్కెట్ నుంచి నిష్క్రమించింది. అదే ఏడాది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్బీఎస్) కూడా అంతర్జాతీయంగా తమ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారత్‌లో కార్పొరేట్, రిటైల్, సంస్థాగత బ్యాంకింగ్ వ్యాపార విభాగాలను మూసివేయాలని నిర్ణయించుకుంది. గ్రిండ్లేస్ బ్యాంకును స్టాండర్డ్ చార్టర్డ్‌కు 1.34 బిలియన్ డాలర్లకు విక్రయించడం ద్వారా ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, 2011లో ముంబైలో కొత్త శాఖను ప్రారంభించడం ద్వారా దేశీ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించింది. మరికొన్ని.. ఇక, 2011లో డాయిష్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వ్యాపారాన్ని ఇండస్ఇండ్ బ్యాంక్‌కు విక్రయించేసింది. 2013లో యూబీఎస్.. భారత్ నుంచి నిష్క్రమించింది. మోర్గాన్ స్టాన్లీ తన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగిస్తూ.. ఇతర బ్యాంకింగ్ సేవలకు సంబంధించిన లైసెన్సును అప్పగించేసింది. అదేవిధంగా 2015లో మెరిల్ లించ్, బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ మొదలైనవి తమ కార్యకలాపాలను తగ్గించేసుకున్నాయి. హెచ్ఎస్బీసీ రెండు డజన్ల పైగా శాఖలను మూసివేసి, కార్యకలాపాలను సగానికి తగ్గించుకుంది. 2020లో బీఎన్పీ పారిబా తన వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపార విభాగాన్ని మూసివేసింది. చదవండి: గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్..! -
ఈ బ్యాంకుల్లో అపరిమిత ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్..!
ముంబై: ఎటీఎం లావాదేవీలపై బ్యాంకులు ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేసుకోవచ్చునని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో బ్యాంకు ఖాతాదారులపై మరింత భారం పడనుంది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ ట్రాన్సాక్షన్ పరిమితి దాటితే ట్రాన్సాక్షన్ ఫీజును వసూలు చేయనున్నాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపితే ఒక్కో లావాదేవీకి రూ. 20 నుంచి రూ.21 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు 2022 జనవరి 1, నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 ఉచిత ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చును. ఇతర బ్యాంకు ఏటీఎంలో మెట్రో నగరాల్లో 3 సార్లు, గ్రామీణ ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను నిర్వహించవచ్చును. కాగా కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం అపరిమిత ఎటీఎం లావాదేవీలు జరుపుకోవచ్చునని ప్రకటించాయి. ఇండస్ఇండ్, ఐడీబీఐ వంటి ప్రైవేటు బ్యాంకులు ఈ ఆఫర్‌ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వాటికి పూర్తిగా అపరిమిత ఉచిత ఎటీఎం లావాదేవీలను జరుపుకోవచ్చును. కాగా ఐడీబీఐ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించిన కనీస ఉచిత పరిమితులకు అనుగుణంగా ఉచిత ఎటీఎం లావాదేవీలను అందిస్తుంది. బ్యాంక్ తన స్వంత ఎటిఎంలలో 5 ఉచిత లావాదేవీలను, ఇతర బ్యాంక్ ఎటిఎంలలో, ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలను కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోర్టీ చాకో పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ తన బ్యాంకు ఖాతాదారులకు దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలను అందిస్తోందని ఇండస్ఇండ్ బ్యాంక్ తన వెబ్సైట్ పేర్కొంది. సేవింగ్స్ ఖాతాలో రూ.25వేల కంటే ఎక్కువ సగటు బ్యాలెన్స్ నిర్వహిస్తోన్న అకౌంట్ హోల్డర్లకు సిటీ బ్యాంకు కూడా అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తోంది. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న వారికి ఏ ఏటీఎంలోనైనా అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్ ఇవ్వనుంది. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్! -
భారీ తప్పిదం : వేల కోట్లు మళ్లిపోయాయి
న్యూయార్క్ : అతిపెద్ద బ్యాంకు సిటీబ్యాంక్ ఒక చిన్న తప్పు కారణంగా భారీ వివాదంలో చిక్కుకుంది. న్యూయార్క్ సిటీబ్యాంకు శాఖలో చోటుకున్న క్లరికల్ తప్పిదం కారణంగా ఏకంగా 900 మిలియన్ డాలర్లు (సుమారు 6700 కోట్ల రూపాయలు) ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఇపుడు ఈ సొమ్మును రాబట్టుకునేందుకు సిటీ గ్రూపు నానా కష్టాలు పడుతోంది.తాజా నివేదిక ప్రకారం కొంత డబ్బును బ్యాంక్ తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ ప్రముఖ కాస్మొటిక్ కంపెనీ రెవ్లాన్ వివాదానికి దారి తీసింది. ఈ ఊహించని పరిణామంతో ఇప్పటికే అప్పుల ఊబిలో ఇరుక్కున్న రెవ్లాన్ మరింత సంక్షోభంలో పడిపోయింది. అంతేకాదు కంపెనీ మొత్తం బకాయిలకు ఈమొత్తానికి సమానం కావడం మరింత ప్రకంపనలు పుట్టించింది. ఈ పొరపాటు సిటిగ్రూప్ను చాలా కాలం పాటు వెంటాడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాలను పరిశీలిస్తే.. కరోనా వైరస్ సంక్షోభంతో సౌందర్యోత్పత్తుల సంస్థ రెవ్లాన్, సుమారు బిలియన్ డాలర్ల మేరకు బకాయి పడింది. దీంతో ఈ కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి దిగాయి. సంబంధిత రుణాలను 2023లోగా తిరిగి చెల్లించాలని డిమాండు చేస్తూ యూఎంబీ బ్యాంక్, రుణదాతల తరపున రెవ్లాన్‌పై దావా వేసింది. ఈ కేసులో సిటీ బ్యాంకును కూడా ప్రతివాదిగా చేర్చాయి. ఈ నేపథ్యంలో సిటీ బ్యాంకు 900 మిలియన్ డాలర్ల మొత్తాన్ని పొరపాటున రెవ్లాన్ ఖాతా నుంచి రుణదాతల ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు బ్రిగేడ్, హెచ్‌పీఎస్, సింఫనీతో సహా రుణాలిచ్చిన సంస్థలు తిరస్కరించాయి. తమకు అందిన సొమ్ము రుణానికి, వడ్డీకి సమానమని వాదిస్తున్నాయి. దీంతో వ్యవహరం మరింత ముదిరింది. ఇది ఈ శతాబ్దానికే అతి పెద్ద తప్పిదమంటూ దివాలా సలహాదారు మైఖేల్ స్టాంటన్ విమర్శించారు. అయితే ఈ పరిణామంపై సిటీ గ్రూప్ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై బ్యాంకు అంతర్గత దర్యాప్తును ప్రారంభించింది. అటు అసలు ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని రెవ్లాన్ తెగేసి చెప్పింది. -
భారీ క్రెడిట్ కార్డు మోసం : కోట్లు కొల్లగొట్టారు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ క్రెడిట్ కార్డు మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నాట్ ప్లేస్ బ్రాంచ్‌లో ఉన్న సిటీ బ్యాంక్‌లో ఈ మోసం జరిగింది. మోసగాళ్లు సేవింగ్స్ అకౌంట్లు ఓపెన్‌చేసి, ఆ తర్వాత క్రెడిట్ కార్డులు పొంది, వాటిని ఫుల్‌గా వాడేసుకుని బిల్లులు చెల్లించుకుండా పారిపోయారు. ఇలా బ్యాంక్‌కు రూ.2.4 కోట్ల క్రెడిట్ కార్డుల బకాయిలను చెల్లించలేదు. ఇలాంటివి మొత్తం 36 కేసులు నమోదైనట్టు అమెరికాకు చెందిన సిటీ బ్యాంక్ సీపీ బ్రాంచ్ తెలిపింది. తప్పుడు అడ్రస్‌లతో కస్టమర్లు క్రెడిట్ కార్డులు పొందారని, ఎన్సీఆర్లో పలు ప్రాంతాల్లో వీరు ఈ కార్డులను స్వైప్ చేసినట్టు పేర్కొన్నారు. 35 మంది 15 మంది కార్డులపై రుణాలు కూడా పొందినట్టు రిపోర్టులు వెల్లడించాయి. దీనిపై సిటీ బ్యాంక్ అధికారులు ఢిల్లీ పోలీసుల వద్ద ఫిర్యాదు దాఖలు చేసింది. ‘ప్రభుత్వం ఆమోదించిన ఐడెంటీ డాక్యుమెంట్లు ఆధార్, ప్యాన్, ఓటర్ ఐడీ కార్డులతో వారు క్రెడిట్ కార్డులను పొందారు. బ్యాంక్ అంతర్గత విచారణలో 36 అకౌంట్లలో 16 అకౌంట్లను నలుగురు వ్యక్తులే తెరిచినట్టు వెల్లడైంది’ అని సిటీ బ్యాంక్ నార్త్ జోన్ మేనేజర్ హితేష్ వర్మ తెలిపారు. ఈ నలుగురు అకౌంట్ హోల్డర్స్ కూడా ఒకే నివాసా చిరునామాను అందించారని సిటీ బ్యాంక్ తెలిపింది. 36 మందిలో 11 మంది తాత్కాలిక క్రెడిట్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసినట్టు పేర్కొంది. తాత్కాలిక క్రెడిట్ సౌకర్యమనేది క్రెడిట్ కార్డు లేదా బ్యాంక్ ఖాతా ద్వారా జరిపిన లావాదేవీలు ఏమైనా వివాదాస్పదమైతే, బ్యాంక్ ద్వారా జారీ చేసే క్రెడిట్ సిస్టమ్. 36 మంది కస్టమర్లలో 33 మంది కస్టమర్లు వారిచ్చిన రెసిడెన్స్ అడ్రస్‌లలో అసలు వారి నివసించడం లేదని తెలిసింది. నలుగురు రాణి బాగ్‌లో ఉంటున్న ఆఫీసు అడ్రస్‌లను ఇచ్చారు. ఆఫీసు పేరును మార్చి ఇచ్చారు. మొత్తం ఈ కార్డులపై రూ.2.14 కోట్ల మోసం జరిగింది. ఒక్కో కార్డుపై రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల మోసం జరిగినట్టు తెలిసింది. -
విమాన టిక్కెట్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్
దేశీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సిటీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను వాడుతూ ఎవరైతే విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటారో వారికి రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఇండిగో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. 2018 ఏప్రిల్ 18 నుంచి 2018 ఏప్రిల్ 21 మధ్యలో టిక్కెట్లను బుక్ చేసుకునే వారు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే కనీస లావాదేవీ రూ.7500 ఉండాలి. అంతేకాక ఇండిగో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారు మాత్రమే ఈ ఆఫర్‌ను పొందవచ్చని ఎయిర్‌లైన్స్ తెలిపింది. అయితే కార్డుల ద్వారా నిర్వహించే మొట్టమొదటి చెల్లుబాటు లావాదేవీ మాత్రమే ఈ ఆఫర్ కింద ప్రయోజనాలకు అర్హత సాధిస్తుంది. టిక్కెట్ బుక్ చేసిన 90 రోజుల్లో కస్టమర్ల కార్డుకు ఈ క్యాష్ బ్యాక్ అందుతుంది. ఈ ఆఫర్‌ను, క్యాష్‌బ్యాక్‌ను ట్రాన్సఫర్ చేయడానికి, ఎక్స్చేంజ్ చేయడానికి కుదరదని ఇండిగో పేర్కొంది. ఈ ఆఫర్లో పాల్గొనే కస్టమర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏమన్నా దెబ్బతింటే ఇండిగో బాధ్యత వహించదని కూడా తెలిపింది. ఈ ఆఫర్‌ను మరే ఇతర ఆఫర్ లేదా ప్రమోషన్‌కు కలుపబోమని ఇండిగో వెల్లడించింది. ముందస్తు ప్రకటన లేకుండానే ఆ ఆఫర్‌ను ఇండిగో, సిటీ బ్యాంకు ఏ సమయంలోనైనా సవరించడం లేదా ఆపివేయడం జరుగవచ్చని, ఈ ఆఫర్‌పై ఉన్న అన్ని ఫిర్యాదులను, సమస్యలను సిటీ బ్యాంకుతో సంప్రదించి పరిష్కరించుకోవాలని, ఇండిగో దీనికి బాధ్యత వహించదని కూడా చెప్పింది. -
మళ్లీ ‘టీజర్’ రుణాలు!
విశ్లేషకులు ఏమంటున్నారంటే.. వడ్డీరేట్లు రానున్న కాలంలో దిగివచ్చే అవకాశం ఉందని.. అందువల్ల స్థిర వడ్డీరేట్ల స్కీమ్‌లలో చిక్కుకోవడం మంచిది కాదనేది నిపుణుల అభిప్రాయం. పాక్షిక స్థిర వడ్డీ(కొన్నాళ్ల తర్వాత ఫ్లోటింగ్లోకి మారేది) రుణాల్లో ముందస్తు చెల్లింపులపై జరిమానాలు చాలా ఎక్కువని చెబుతున్నారు. ముందుగానే చెల్లించదలచుకున్న రుణ మొత్తంపై 2% జరిమానా, సర్వీస్ ట్యాక్స్ కూడా ఉంటుందని రిటైల్ లెండింగ్ డాట్‌కామ్ డెరైక్టర్ సుకన్య కుమార్ అంటున్నారు. అయితే, ఇప్పుడు ఆఫర్ చేస్తున్న స్థిర వడ్డీరేటు ప్రస్తుత ఫ్లోటింగ్ రేటు కంటే తక్కువని, మూడేళ్ల క్రితం టీజర్ రుణాల్లో స్థిర వడ్డీరేటు ఫ్లోటింగ్ కంటే ఎక్కువగా ఉన్నట్లు కుమార్ పేర్కొన్నారు. ముంబై: ఒకప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘టీజర్’ గృహ రుణాలు మళ్లీ సందడి చేస్తున్నాయి. అయితే, గతంలో దేశీ బ్యాంకులు వీటిపై దృష్టిపెట్టగా... ఈసారి విదేశీ బ్యాంకులు రుణగ్రహీతలను ఆకట్టుకునే పనిలోపడ్డాయి. పండుగ సీజన్ సందర్భంగా సిటీబ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్‌లు ఈ టీజర్ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రారంభంలో ఒకటిరెండు సంవత్సరాలపాటు నిర్ధిష్టకాలానికి స్థిరంగా కొంత రాయితీ వడ్డీరేటును వసూలు చేసి తదనంతరం అప్పటి రేటు ప్రకారం వడ్డీరేట్లను కొనసాగించేవిధంగా రూపకల్పన చేసినవాటినే టీజర్ రుణాలుగా పిలుస్తున్నారు. ఇలాంటి టీజర్ రుణాలు కస్టమర్లను తప్పుదోవపట్టిస్తున్నాయంటూ ఆర్బీఐ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో దేశీ బ్యాంకులు క్రమంగా వీటికి స్వస్తిపలికాయి. అయితే, ఆర్బీఐ కన్నెర్రకు గురికాకుండా ఈ లోన్ స్కీమ్‌లు పూర్తిగా పారదర్శకంగా ఉండేవిధంగా విదేశీ బ్యాంకులు ఇప్పుడు జాగ్రత్తపడుతుండటం గమనార్హం. తక్కువ రేటుతో గాలం... హెచ్ఎస్బీసీ బ్యాంక్, సిటీ బ్యాంక్‌లు తమ టీజర్ గృహ రుణ ఆఫర్లను నవంబర్ 30లోపు బుకింగ్ చేసుకునే రుణ దరఖాస్తులకు వర్తింపజేస్తున్నాయి. సిటీ బ్యాంక్ ఈ ఆఫర్‌ను గత నెలలోనే ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 2015 సెప్టెంబర్ వరకూ 10.25% స్ధిర వడ్డీరేటును (హోమ్ క్రెడిట్ ఫెసిలిటీ కాకుండా) వసూలు చేస్తుంది. ఆ తర్వాత నుంచి బేస్ రేటు ఆధారిత వడ్డీరేటును అమలు చేస్తుంది. అంటే బేస్ రేటుకు ఒక శాతం వడ్డీరేటు కలిపి వసూలు చేస్తుంది. హోమ్ క్రెడిట్ అంటే.. ఎవరైనా కస్టమర్ రూ. 10 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నారనుకుందాం. ఆ కస్టమర్‌కు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.3 లక్షలు గనుక ఉంటే అందులో రూ.2 లక్షలను బ్యాంక్ బ్లాక్ చేసేందుకు అనుమతిస్తే.. మొత్తం రుణంపై కాకుండా కేవలం రూ.8 లక్షలపై మాత్రమే వడ్డీరేటును విధిస్తారు. ఈ హోమ్ క్రెడిట్‌తో టీజర్ గృహ రుణాలపై సిటీ బ్యాంక్ 2015 సెప్టెంబర్ వరకూ 10.5% వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది ఆతర్వాత బేస్ రేటుపై 1.25% చొప్పున వడ్డీరేటు ఉంటుంది. కాగా, ప్రస్తుతం సిటీ బ్యాంక్ చర(ఫ్లోటింగ్) వడ్డీరేటు 10.75 శాతంగా ఉంది. హెచ్ఎస్బీసీ విషయానికొస్తే... తొలి ఏడాది టీజర్ గృహ రుణాలపై 10.25 శాతం వడ్డీరేటు వసూలు చేస్తోంది. తర్వాత నుంచి బేస్‌రేటు, అప్పటి ఫ్లోటింగ్ రేటు మార్జిన్‌ను వర్తింపజేస్తుంది. గృహ రుణ కన్సల్టెంట్ల అభిప్రాయం ప్రకారం.. ఏడాది తర్వాత హెచ్ఎస్బీసీ స్కీమ్‌లో బేస్ రేటుపై 0.5 శాతం వరకూ అధిక వడ్డీరేటు ఉండొచ్చని అంచనా. స్టాన్ చార్ట్ మూడేళ్ల ఆఫర్... టీజర్ గృహ రుణ ఆఫర్ కింద మూడేళ్లపాటు(2016 వరకూ) 10.26% స్థిర వడ్డీరేటును స్టాన్‌చార్ట్ ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ బేస్ రేటు 10.25%. కాగా, మూడేళ్ల తర్వాత ఎలాంటి వడ్డీరేటును అమలు చేస్తుందో వివరాలు అందుబాటులో లేవు. అప్పటి మార్కెట్ పరిస్థితుల ప్రకారం బ్యాంక్ నిర్ణయం తీసుకోవచ్చనేది బ్యాంకింగ్ వర్గాల అభిప్రాయం.