
అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం సిటీగ్రూప్ సిబ్బంది చేసిన పొరపాటుతో బ్యాంక్‌లోని డబ్బులు మొత్తం ఖాళీ అయ్యేవి. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. సిటీ బ్యాంక్ గత ఏప్రిల్ నెలలో 280 డాలర్లకు బదులుగా 81 ట్రిలియన్ డాలర్లను (ప్రస్తుత మారక విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో రూ.6,723 లక్షల కోట్లు) పొరపాటున ఓ ఖాతాదారుడి ఖాతాలో జమ చేసింది.
ఈ పొరపాటును ఇద్దరు ఉద్యోగులు పట్టుకోలేకపోయారు. డబ్బులు జమ చేసిన 90 నిమిషాల తర్వాత మూడో ఉద్యోగి గుర్తించారని నివేదిక తెలిపింది. అయితే బ్యాంకు నుంచి నిధులు పూర్తిగా ఆ ఖాతాలోకి బదిలీ కాలేదని, తృటి తప్పిందని (near miss) ఫెడరల్ రిజర్వ్, కంప్ట్రోలర్ ఆఫ్ ది కరెన్సీ కార్యాలయానికి సీటీగ్రూప్ తెలియజేసింది.
"ఇంత పరిమాణంలో చెల్లింపు వాస్తవానికి పూర్తి కాలేదన్న విషయాన్ని పక్కన పెడితే మా డిటెక్టివ్ నియంత్రణలు రెండు సిటీ లెడ్జర్ ఖాతాల మధ్య ఇన్‌పుట్ దోషాన్ని వెంటనే గుర్తించాయి. మేము ఎంట్రీని తిప్పికొట్టాము" అని సిటీగ్రూప్ ప్రతినిధి ఈ-మెయిల్ ప్రతిస్పందనలో తెలిపారు. "మా నివారణ నియంత్రణలు పొరబాటున బ్యాంకు నుంచి నిధులు బయటకు వెళ్లకుండా నిలిపివేస్తాయి" అని పేర్కొన్నారు. ఈ సంఘటన బ్యాంకుపై గానీ, తమ క్లయింట్లపై గానీ ఎలాంటి ప్రభావం చూపలేదని బ్యాంక్ ప్రతినిధి తెలిపారు.
ఇలాంటివి 10 పొరపాట్లు
సిటీ బ్యాంక్‌లో 1 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించి ఇలాంటి పొరపాట్లు గత ఏడాది మొత్తం 10 జరిగాయని అంతర్గత నివేదికను ఉటంకిస్తూ ఎఫ్‌టీ తెలిపింది. అంతకు ముందు ఏడాది నమోదైన 13 కేసులతో పోలిస్తే ఇది తగ్గినప్పటికీ, యూఎస్ బ్యాంక్ పరిశ్రమలో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన పొరపాట్లు అసాధారణమని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment