ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, కాస్ట్‌కటింగ్ వల్ల స్టార్టప్ కంపెనీలతోపాటు దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఈ లేఆఫ్స్ సెగ బ్యాంకింగ్ రంగాన్ని తాకింది. దాంతో బ్యాంకులు తమ ఉద్యోగులను కొలువు నుంచి తొలగిస్తున్నాయి.
యూఎస్ మల్టీనేషన్ ఇన్వెస్టర్ బ్యాంకు సిటీ గ్రూప్ తాజా త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను పోస్ట్ చేసింది. దాదాపు రూ.15 వేలకోట్ల మేర నష్టాలు నమోదైనట్లు బ్యాంక్ ఇటీవల రిగ్యులేటరీకు రిపోర్ట్ చేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో నష్టాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం రాబోయే రెండేళ్లలో కనీసం 20,000 ఉద్యోగాల్లో కోత విధించాలని యోచిస్తోంది.
తిరిగి లాభాల బాట పట్టడానికి, వాటాదారులకు నగదును తిరిగి ఇవ్వడానికి సిటీ గ్రూప్ 'కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణ' చేపట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా వచ్చే రెండేళ్లలో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. సిటీగ్రూప్‌లో ప్రస్తుతం 2,39,000 మంది పని చేస్తున్నారు. నష్టాలను తగ్గించుకోవడంలో భాగంగా వచ్చే రెండేళ్లలో ఇరవైవేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 8 శాతంగా ఉంది.
ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన!
సిటీ గ్రూప్ 2022 ఏడాదిలో 2.5 బిలియన్ డాలర్ల లాభాలతో పోలిస్తే ప్రస్తుత నాలుగో త్రైమాసికంలో 1.9 బిలియన్ డాలర్ల(రూ.15 వేలకోట్లు) నష్టాన్ని మూటగట్టుకుంది. ఆదాయం మూడు శాతం తగ్గి దాదాపు 17.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ట్రేడింగ్ విభాగం నుంచి వచ్చే ఆదాయం అంతకు ముందు సంవత్సరం కంటే 19 శాతం తగ్గి రూ.36 వేలకోట్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment