మళ్లీ ‘టీజర్’ రుణాలు! | Again 'teaser' loans? | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘టీజర్’ రుణాలు!

Published Fri, Nov 1 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

మళ్లీ ‘టీజర్’ రుణాలు!

మళ్లీ ‘టీజర్’ రుణాలు!

 విశ్లేషకులు ఏమంటున్నారంటే..
 వడ్డీరేట్లు రానున్న కాలంలో దిగివచ్చే అవకాశం ఉందని.. అందువల్ల స్థిర వడ్డీరేట్ల స్కీమ్‌లలో చిక్కుకోవడం మంచిది కాదనేది నిపుణుల అభిప్రాయం. పాక్షిక స్థిర వడ్డీ(కొన్నాళ్ల తర్వాత ఫ్లోటింగ్‌లోకి మారేది) రుణాల్లో ముందస్తు చెల్లింపులపై జరిమానాలు చాలా ఎక్కువని చెబుతున్నారు. ముందుగానే చెల్లించదలచుకున్న రుణ మొత్తంపై 2% జరిమానా, సర్వీస్ ట్యాక్స్ కూడా ఉంటుందని రిటైల్ లెండింగ్ డాట్‌కామ్ డెరైక్టర్ సుకన్య కుమార్ అంటున్నారు. అయితే, ఇప్పుడు ఆఫర్ చేస్తున్న స్థిర వడ్డీరేటు ప్రస్తుత ఫ్లోటింగ్ రేటు కంటే తక్కువని, మూడేళ్ల క్రితం టీజర్ రుణాల్లో స్థిర వడ్డీరేటు ఫ్లోటింగ్ కంటే ఎక్కువగా ఉన్నట్లు కుమార్ పేర్కొన్నారు.
 
 ముంబై: ఒకప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘టీజర్’ గృహ రుణాలు మళ్లీ సందడి చేస్తున్నాయి. అయితే, గతంలో దేశీ బ్యాంకులు వీటిపై దృష్టిపెట్టగా... ఈసారి విదేశీ బ్యాంకులు రుణగ్రహీతలను ఆకట్టుకునే పనిలోపడ్డాయి. పండుగ సీజన్ సందర్భంగా సిటీబ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌లు ఈ టీజర్ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రారంభంలో ఒకటిరెండు సంవత్సరాలపాటు నిర్ధిష్టకాలానికి స్థిరంగా కొంత రాయితీ వడ్డీరేటును వసూలు చేసి తదనంతరం అప్పటి రేటు ప్రకారం వడ్డీరేట్లను కొనసాగించేవిధంగా రూపకల్పన చేసినవాటినే టీజర్ రుణాలుగా పిలుస్తున్నారు. ఇలాంటి టీజర్ రుణాలు కస్టమర్లను తప్పుదోవపట్టిస్తున్నాయంటూ ఆర్‌బీఐ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో దేశీ బ్యాంకులు క్రమంగా వీటికి స్వస్తిపలికాయి. అయితే, ఆర్‌బీఐ కన్నెర్రకు గురికాకుండా ఈ లోన్ స్కీమ్‌లు పూర్తిగా పారదర్శకంగా ఉండేవిధంగా విదేశీ బ్యాంకులు ఇప్పుడు జాగ్రత్తపడుతుండటం గమనార్హం.
 
 తక్కువ రేటుతో గాలం...
 హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్, సిటీ బ్యాంక్‌లు తమ టీజర్ గృహ రుణ ఆఫర్‌లను నవంబర్ 30లోపు బుకింగ్ చేసుకునే రుణ దరఖాస్తులకు వర్తింపజేస్తున్నాయి. సిటీ బ్యాంక్ ఈ ఆఫర్‌ను గత నెలలోనే ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 2015 సెప్టెంబర్ వరకూ 10.25% స్ధిర వడ్డీరేటును (హోమ్ క్రెడిట్ ఫెసిలిటీ కాకుండా) వసూలు చేస్తుంది. ఆ తర్వాత నుంచి బేస్ రేటు ఆధారిత వడ్డీరేటును అమలు చేస్తుంది. అంటే బేస్ రేటుకు ఒక శాతం వడ్డీరేటు కలిపి వసూలు చేస్తుంది. హోమ్ క్రెడిట్ అంటే.. ఎవరైనా కస్టమర్ రూ. 10 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నారనుకుందాం. ఆ కస్టమర్‌కు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.3 లక్షలు గనుక ఉంటే అందులో రూ.2 లక్షలను బ్యాంక్ బ్లాక్ చేసేందుకు అనుమతిస్తే.. మొత్తం రుణంపై కాకుండా కేవలం రూ.8 లక్షలపై మాత్రమే వడ్డీరేటును విధిస్తారు. ఈ హోమ్ క్రెడిట్‌తో టీజర్ గృహ రుణాలపై సిటీ బ్యాంక్ 2015 సెప్టెంబర్ వరకూ 10.5% వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది ఆతర్వాత బేస్ రేటుపై 1.25% చొప్పున వడ్డీరేటు ఉంటుంది. కాగా, ప్రస్తుతం సిటీ బ్యాంక్ చర(ఫ్లోటింగ్) వడ్డీరేటు 10.75 శాతంగా ఉంది.
 
 హెచ్‌ఎస్‌బీసీ విషయానికొస్తే... తొలి ఏడాది టీజర్ గృహ రుణాలపై 10.25 శాతం వడ్డీరేటు వసూలు చేస్తోంది. తర్వాత నుంచి బేస్‌రేటు, అప్పటి ఫ్లోటింగ్ రేటు మార్జిన్‌ను వర్తింపజేస్తుంది. గృహ రుణ కన్సల్టెంట్‌ల అభిప్రాయం ప్రకారం.. ఏడాది తర్వాత హెచ్‌ఎస్‌బీసీ స్కీమ్‌లో బేస్ రేటుపై 0.5 శాతం వరకూ అధిక వడ్డీరేటు ఉండొచ్చని అంచనా.
 
 స్టాన్ చార్ట్ మూడేళ్ల ఆఫర్...
 టీజర్ గృహ రుణ ఆఫర్ కింద  మూడేళ్లపాటు(2016 వరకూ) 10.26% స్థిర వడ్డీరేటును స్టాన్‌చార్ట్ ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ బేస్ రేటు 10.25%. కాగా, మూడేళ్ల తర్వాత ఎలాంటి వడ్డీరేటును అమలు చేస్తుందో వివరాలు అందుబాటులో లేవు. అప్పటి మార్కెట్ పరిస్థితుల ప్రకారం బ్యాంక్ నిర్ణయం తీసుకోవచ్చనేది బ్యాంకింగ్ వర్గాల అభిప్రాయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement