Standard Bank
-
మళ్లీ ‘టీజర్’ రుణాలు!
విశ్లేషకులు ఏమంటున్నారంటే.. వడ్డీరేట్లు రానున్న కాలంలో దిగివచ్చే అవకాశం ఉందని.. అందువల్ల స్థిర వడ్డీరేట్ల స్కీమ్‌లలో చిక్కుకోవడం మంచిది కాదనేది నిపుణుల అభిప్రాయం. పాక్షిక స్థిర వడ్డీ(కొన్నాళ్ల తర్వాత ఫ్లోటింగ్లోకి మారేది) రుణాల్లో ముందస్తు చెల్లింపులపై జరిమానాలు చాలా ఎక్కువని చెబుతున్నారు. ముందుగానే చెల్లించదలచుకున్న రుణ మొత్తంపై 2% జరిమానా, సర్వీస్ ట్యాక్స్ కూడా ఉంటుందని రిటైల్ లెండింగ్ డాట్‌కామ్ డెరైక్టర్ సుకన్య కుమార్ అంటున్నారు. అయితే, ఇప్పుడు ఆఫర్ చేస్తున్న స్థిర వడ్డీరేటు ప్రస్తుత ఫ్లోటింగ్ రేటు కంటే తక్కువని, మూడేళ్ల క్రితం టీజర్ రుణాల్లో స్థిర వడ్డీరేటు ఫ్లోటింగ్ కంటే ఎక్కువగా ఉన్నట్లు కుమార్ పేర్కొన్నారు. ముంబై: ఒకప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘టీజర్’ గృహ రుణాలు మళ్లీ సందడి చేస్తున్నాయి. అయితే, గతంలో దేశీ బ్యాంకులు వీటిపై దృష్టిపెట్టగా... ఈసారి విదేశీ బ్యాంకులు రుణగ్రహీతలను ఆకట్టుకునే పనిలోపడ్డాయి. పండుగ సీజన్ సందర్భంగా సిటీబ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్‌లు ఈ టీజర్ రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రారంభంలో ఒకటిరెండు సంవత్సరాలపాటు నిర్ధిష్టకాలానికి స్థిరంగా కొంత రాయితీ వడ్డీరేటును వసూలు చేసి తదనంతరం అప్పటి రేటు ప్రకారం వడ్డీరేట్లను కొనసాగించేవిధంగా రూపకల్పన చేసినవాటినే టీజర్ రుణాలుగా పిలుస్తున్నారు. ఇలాంటి టీజర్ రుణాలు కస్టమర్లను తప్పుదోవపట్టిస్తున్నాయంటూ ఆర్బీఐ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో దేశీ బ్యాంకులు క్రమంగా వీటికి స్వస్తిపలికాయి. అయితే, ఆర్బీఐ కన్నెర్రకు గురికాకుండా ఈ లోన్ స్కీమ్‌లు పూర్తిగా పారదర్శకంగా ఉండేవిధంగా విదేశీ బ్యాంకులు ఇప్పుడు జాగ్రత్తపడుతుండటం గమనార్హం. తక్కువ రేటుతో గాలం... హెచ్ఎస్బీసీ బ్యాంక్, సిటీ బ్యాంక్‌లు తమ టీజర్ గృహ రుణ ఆఫర్లను నవంబర్ 30లోపు బుకింగ్ చేసుకునే రుణ దరఖాస్తులకు వర్తింపజేస్తున్నాయి. సిటీ బ్యాంక్ ఈ ఆఫర్‌ను గత నెలలోనే ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 2015 సెప్టెంబర్ వరకూ 10.25% స్ధిర వడ్డీరేటును (హోమ్ క్రెడిట్ ఫెసిలిటీ కాకుండా) వసూలు చేస్తుంది. ఆ తర్వాత నుంచి బేస్ రేటు ఆధారిత వడ్డీరేటును అమలు చేస్తుంది. అంటే బేస్ రేటుకు ఒక శాతం వడ్డీరేటు కలిపి వసూలు చేస్తుంది. హోమ్ క్రెడిట్ అంటే.. ఎవరైనా కస్టమర్ రూ. 10 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నారనుకుందాం. ఆ కస్టమర్‌కు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.3 లక్షలు గనుక ఉంటే అందులో రూ.2 లక్షలను బ్యాంక్ బ్లాక్ చేసేందుకు అనుమతిస్తే.. మొత్తం రుణంపై కాకుండా కేవలం రూ.8 లక్షలపై మాత్రమే వడ్డీరేటును విధిస్తారు. ఈ హోమ్ క్రెడిట్‌తో టీజర్ గృహ రుణాలపై సిటీ బ్యాంక్ 2015 సెప్టెంబర్ వరకూ 10.5% వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది ఆతర్వాత బేస్ రేటుపై 1.25% చొప్పున వడ్డీరేటు ఉంటుంది. కాగా, ప్రస్తుతం సిటీ బ్యాంక్ చర(ఫ్లోటింగ్) వడ్డీరేటు 10.75 శాతంగా ఉంది. హెచ్ఎస్బీసీ విషయానికొస్తే... తొలి ఏడాది టీజర్ గృహ రుణాలపై 10.25 శాతం వడ్డీరేటు వసూలు చేస్తోంది. తర్వాత నుంచి బేస్‌రేటు, అప్పటి ఫ్లోటింగ్ రేటు మార్జిన్‌ను వర్తింపజేస్తుంది. గృహ రుణ కన్సల్టెంట్ల అభిప్రాయం ప్రకారం.. ఏడాది తర్వాత హెచ్ఎస్బీసీ స్కీమ్‌లో బేస్ రేటుపై 0.5 శాతం వరకూ అధిక వడ్డీరేటు ఉండొచ్చని అంచనా. స్టాన్ చార్ట్ మూడేళ్ల ఆఫర్... టీజర్ గృహ రుణ ఆఫర్ కింద మూడేళ్లపాటు(2016 వరకూ) 10.26% స్థిర వడ్డీరేటును స్టాన్‌చార్ట్ ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ బేస్ రేటు 10.25%. కాగా, మూడేళ్ల తర్వాత ఎలాంటి వడ్డీరేటును అమలు చేస్తుందో వివరాలు అందుబాటులో లేవు. అప్పటి మార్కెట్ పరిస్థితుల ప్రకారం బ్యాంక్ నిర్ణయం తీసుకోవచ్చనేది బ్యాంకింగ్ వర్గాల అభిప్రాయం. -
అల్లుడా.. మజాకా..!
= మామను బురిడీ కొట్టించిన అల్లుడు = కోట్లు వస్తాయని రూ.35.43 లక్షలు కాజేశాడు అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: జామాతా దశమ గ్రహం అన్న నానుడి ఓ యువకుడు నిజం చేశాడు. కాళ్లు కడిగి, కన్యాదానం చేసిన మామను మోసగించి లక్షలాది రూపాయలు కాజేశాడు. ఇందుకు సంబంధించి టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఆదర్శనగర్‌లో సహకార శాఖలో పని చేసి రిటైరైన రామకృష్ణ కుటుంబం నివాసముంటోంది. రెండేళ్ల క్రితం తన కూతురికి ఆమె ప్రేమించిన యువకుడు శ్రవణ్‌తో వివాహం చేశాడు. పెళ్లైన కొన్ని రోజులకే మామ ఆస్తిపై కన్నేసిన శ్రవణ్ దాన్ని కాజేసేందుకు వ్యూహం రచించాడు. కామన్ వెల్ఫేర్ సొసైటీ పేరుతో మామ సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్న విషయాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ఇందులో భాగంగా తాను హైదరాబాద్‌లోని క్రిస్టియన్ ఫోక్ అసోసియేషన్‌కు డెరైక్టర్‌గా పని చేస్తున్నానని, ఇప్పటికే ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే 21 సొసైటీలు పని చేస్తున్నాయని, మీ సొసైటీని కూడా చేరిస్తే భారీగా విరాళాలు అందుతాయని మామను నమ్మించాడు. ఇందుకోసం స్టాండర్డ్ బ్యాంకులో ఖాతా తెరవాలని, అందులో రూ.2 లక్షలు డిపాజిట్ చేసి, డోనర్స్‌కు ఆ ఖాతా నెంబరు ఇస్తే, వారు అందులో నగదు డిపాజిట్ చేస్తారని తెలిపాడు. ఆ బ్యాంకు సంబంధించిన వివరాలేవీ తనకు తెలియదని రామకృష్ణ చెప్పగా, రూ. రెండు లక్షలు ఇస్తే గంట వ్యవధిలో తన మిత్రులు హైదరాబాదులోని బ్రాంచిలో ఖాతా తెరుస్తాడని చెప్పాడు. మామను పక్కనే పెట్టుకుని ఆన్లైన్లో ఖాతా తెరచినట్లు సెల్‌కు వచ్చిన మెసేజ్ పంపించాడు. మరుసటి రోజే ఆ ఖాతాలో రూ.25 కోట్లు జమ అయినట్లు మరో మెసేజ్ పంపాడు. అంత డబ్బు ఒక్కసారిగా తన ఖాతాలో పడినట్లు తెలియడంతో ఉబ్బితబ్బిబ్బైన రామకృష్ణ ఖాతాలో నిజంగానే అంత డబ్బు జమ అయిందో? లేదో? చూసి రావాలని అల్లుడిని పురమాయించాడు. మరుసటి రోజు వచ్చిన అల్లుడు ఆ రోజు మరో రూ.10 కోట్లు జమ అయిందని చెప్పాడు. అయితే, ఈ మొత్తాన్ని ఆరు నెలల వరకూ వాడుకోడానికి వీలుండదని, అప్పటి వరకూ డిపాజిట్‌గానే ఉంచాలని చెప్పాడు. ఈ మేరకు తన స్నేహితుడైన వర్మ అనే వ్యక్తితో ఫోన్ చేయించి విదేశీయునిలా ఆంగ్లంలో మాట్లాడించాడు. క్రిస్టియన్‌గా మారి సేవలు చేయాలని.. విశ్రాంత జీవితం సుఖ సంతోషాలతో గడపాలంటే క్రిస్టియన్‌గా మారాలని, అలా చేస్తే మీ పేరు మీద చర్చి కట్టిస్తామని, అందుకు కొంత మొత్తం ముందస్తుగా చెల్లిస్తే, పనులు చేపట్టేందుకు త్వరలో తమ దేశం నుంచి సహకరిస్తామని విదేశీయుడిలా తానే ఫోన్ చేసి తెలిపాడు. అది కూడా నిజమని నమ్మిన రామకృష్ణ అల్లుడి చేతికి డబ్బు అందజేశాడు. ఈ క్రమంలో ఆర్థికంగా చితికి పోయాడు. లెక్కలు చూసుకుంటే అల్లునికి అప్పగించిన సొమ్ము రూ. 35.43 లక్షలుగా తేలింది. అల్లుని వైఖరిలో వచ్చిన మార్పులను గమనించిన ఆయన తాను డిపాజిట్ చేసిన సొమ్మునైనా వాపసు తీసుకుందామని అల్లుడికి తెలియకుండా హైదరాబాదుకు వెళ్లి స్టాండర్డ్ బ్యాంకు మేనేజర్‌ను కలిశాడు. ఆ ఖాతా నకిలీదని అతను చెప్పడంతో, విదేశీయుల పేరుతో తనకు వచ్చిన కాల్స్‌పై ఆరా తీశాడు. అలా నాటకమాడింది తన అల్లుని అసిస్టెంట్ వర్మగా గుర్తించాడు. ఈ విషయంపై అల్లుడిని నిలదీయగా అతను ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని సమాధానమిచ్చాడు. దీంతో ఆయన తన అల్లుడిపై హైదరాబాదులోని ఓ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అయితే, అక్కడి పోలీసులు ఫిర్యాదుపై చర్య తీసుకోకపోగా, సమాచారాన్ని అల్లుడికి అందించారు. దిక్కుతోచని స్థితిలో అనంతపురం చేరుకున్న ఆయన సోమవారం ఉదయం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.