= మామను బురిడీ కొట్టించిన అల్లుడు
= కోట్లు వస్తాయని రూ.35.43 లక్షలు కాజేశాడు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: జామాతా దశమ గ్రహం అన్న నానుడి ఓ యువకుడు నిజం చేశాడు. కాళ్లు కడిగి, కన్యాదానం చేసిన మామను మోసగించి లక్షలాది రూపాయలు కాజేశాడు. ఇందుకు సంబంధించి టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఆదర్శనగర్‌లో సహకార శాఖలో పని చేసి రిటైరైన రామకృష్ణ కుటుంబం నివాసముంటోంది. రెండేళ్ల క్రితం తన కూతురికి ఆమె ప్రేమించిన యువకుడు శ్రవణ్‌తో వివాహం చేశాడు. పెళ్లైన కొన్ని రోజులకే మామ ఆస్తిపై కన్నేసిన శ్రవణ్ దాన్ని కాజేసేందుకు వ్యూహం రచించాడు.
కామన్ వెల్ఫేర్ సొసైటీ పేరుతో మామ సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్న విషయాన్ని ఆధారంగా చేసుకున్నాడు. ఇందులో భాగంగా తాను హైదరాబాద్‌లోని క్రిస్టియన్ ఫోక్ అసోసియేషన్‌కు డెరైక్టర్‌గా పని చేస్తున్నానని, ఇప్పటికే ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే 21 సొసైటీలు పని చేస్తున్నాయని, మీ సొసైటీని కూడా చేరిస్తే భారీగా విరాళాలు అందుతాయని మామను నమ్మించాడు.
ఇందుకోసం స్టాండర్డ్ బ్యాంకులో ఖాతా తెరవాలని, అందులో రూ.2 లక్షలు డిపాజిట్ చేసి, డోనర్స్‌కు ఆ ఖాతా నెంబరు ఇస్తే, వారు అందులో నగదు డిపాజిట్ చేస్తారని తెలిపాడు. ఆ బ్యాంకు సంబంధించిన వివరాలేవీ తనకు తెలియదని రామకృష్ణ చెప్పగా, రూ. రెండు లక్షలు ఇస్తే గంట వ్యవధిలో తన మిత్రులు హైదరాబాదులోని బ్రాంచిలో ఖాతా తెరుస్తాడని చెప్పాడు. మామను పక్కనే పెట్టుకుని ఆన్‌లైన్‌లో ఖాతా తెరచినట్లు సెల్‌కు వచ్చిన మెసేజ్ పంపించాడు.
మరుసటి రోజే ఆ ఖాతాలో రూ.25 కోట్లు జమ అయినట్లు మరో మెసేజ్ పంపాడు. అంత డబ్బు ఒక్కసారిగా తన ఖాతాలో పడినట్లు తెలియడంతో ఉబ్బితబ్బిబ్బైన రామకృష్ణ ఖాతాలో నిజంగానే అంత డబ్బు జమ అయిందో? లేదో? చూసి రావాలని అల్లుడిని పురమాయించాడు. మరుసటి రోజు వచ్చిన అల్లుడు ఆ రోజు మరో రూ.10 కోట్లు జమ అయిందని చెప్పాడు. అయితే, ఈ మొత్తాన్ని ఆరు నెలల వరకూ వాడుకోడానికి వీలుండదని, అప్పటి వరకూ డిపాజిట్‌గానే ఉంచాలని చెప్పాడు. ఈ మేరకు తన స్నేహితుడైన వర్మ అనే వ్యక్తితో ఫోన్ చేయించి విదేశీయునిలా ఆంగ్లంలో మాట్లాడించాడు.
క్రిస్టియన్‌గా మారి సేవలు చేయాలని..
విశ్రాంత జీవితం సుఖ సంతోషాలతో గడపాలంటే క్రిస్టియన్‌గా మారాలని, అలా చేస్తే మీ పేరు మీద చర్చి కట్టిస్తామని, అందుకు కొంత మొత్తం ముందస్తుగా చెల్లిస్తే, పనులు చేపట్టేందుకు త్వరలో తమ దేశం నుంచి సహకరిస్తామని విదేశీయుడిలా తానే ఫోన్ చేసి తెలిపాడు. అది కూడా నిజమని నమ్మిన రామకృష్ణ అల్లుడి చేతికి డబ్బు అందజేశాడు. ఈ క్రమంలో ఆర్థికంగా చితికి పోయాడు. లెక్కలు చూసుకుంటే అల్లునికి అప్పగించిన సొమ్ము రూ. 35.43 లక్షలుగా తేలింది. అల్లుని వైఖరిలో వచ్చిన మార్పులను గమనించిన ఆయన తాను డిపాజిట్ చేసిన సొమ్మునైనా వాపసు తీసుకుందామని అల్లుడికి తెలియకుండా హైదరాబాదుకు వెళ్లి స్టాండర్డ్ బ్యాంకు మేనేజర్‌ను కలిశాడు. ఆ ఖాతా నకిలీదని అతను చెప్పడంతో, విదేశీయుల పేరుతో తనకు వచ్చిన కాల్స్‌పై ఆరా తీశాడు. అలా నాటకమాడింది తన అల్లుని అసిస్టెంట్ వర్మగా గుర్తించాడు.
ఈ విషయంపై అల్లుడిని నిలదీయగా అతను ఇష్టం వచ్చిన చోట చెప్పుకోమని సమాధానమిచ్చాడు. దీంతో ఆయన తన అల్లుడిపై హైదరాబాదులోని ఓ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అయితే, అక్కడి పోలీసులు ఫిర్యాదుపై చర్య తీసుకోకపోగా, సమాచారాన్ని అల్లుడికి అందించారు. దిక్కుతోచని స్థితిలో అనంతపురం చేరుకున్న ఆయన సోమవారం ఉదయం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.