యాక్సిస్‌ చేతికి ‘సిటీ ఇండియా’ | Axis Bank acquires Citis India consumer business in a Rs 12325 cr deal | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ చేతికి ‘సిటీ ఇండియా’

Published Wed, Mar 30 2022 6:55 PM | Last Updated on Thu, Mar 31 2022 12:55 AM

Axis Bank acquires Citis India consumer business in a Rs 12325 cr deal - Sakshi

న్యూఢిల్లీ:  అమెరికన్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం సిటీగ్రూప్‌కి చెందిన భారత రిటైల్‌ బ్యాంకింగ్‌ వ్యాపార విభాగాన్ని దేశీ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ రూ. 12,325 కోట్లుగా ఉండనుందని యాక్సిస్‌ బ్యాంక్‌ బుధవారం వెల్లడించింది. 2023 ప్రథమార్ధంలో డీల్‌ పూర్తి కాగలదని పేర్కొంది. దీనికి సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కొనుగోలుతో యాక్సిస్‌ బ్యాంక్‌ పొదుపు ఖాతాల సంఖ్య 2.85 కోట్లకు, బర్గండీ (ప్రీమియం) కస్టమర్లు 2.3 లక్షల పైచిలుకు, కార్డుల సంఖ్య 1.06 కోట్లకు చేరతాయి. డీల్‌ ప్రకారం .. విలీనం పూర్తయ్యేవరకూ కస్టమర్లకు సర్వీసులు అందించినందుకు గాను రూ. 1,500 కోట్ల వరకూ సిటీ బ్యాంక్‌కు యాక్సిస్‌ చెల్లించనుంది.

నియంత్రణ సంస్థ నుంచి తొమ్మిది నెలల్లో అనుమతులు రాగలవని, చెల్లింపులు పూర్తయిన తర్వాత సంక్లిష్టమైన అనుసంధాన ప్రక్రియ మొదలు కాగలదని భావిస్తున్నారు. అనుసంధాన ప్రక్రియ 2024 సెప్టెంబర్‌ నాటికి పూర్తి కావచ్చని అంచనా. సంస్థాగత క్లయింట్ల వ్యాపార విభాగం ఈ డీల్‌లో భాగంగా ఉండదని సిటీగ్రూప్‌ తెలిపింది. ఆయా విభాగాల్లో  మరింతగా విస్తరిస్తామని సిటీ ఇండియా విభాగం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆషు ఖుల్లార్‌ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో దీటుగా పోటీపడేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌కు ఈ కొనుగోలు ఉపయోగపడనుంది. కోటక్‌ మహీంద్రా బ్యాంకులో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ విలీనం (రూ. 12,500 కోట్లు) .. ఈ స్థాయి డీల్స్‌తో చివరిది.  

జీవితకాల అవకాశం..
సిటీ బ్యాంక్‌ డీల్‌ను ‘జీవితకాలంలో ఒకసారి లభించే అవకాశం‘గా యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ అమితాబ్‌ చౌదరి అభివర్ణించారు. వ్యాపార వృద్ధి ప్రయోజనాలు గణనీయంగా ఉండటంతో ఈ డీల్‌వైపు మొగ్గు చూపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కొనుగోలు వల్ల వడ్డీ ఆదాయంతో పాటు ఫీజు, వడ్డీయేతర ఆదాయాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని యాక్సిస్‌ బ్యాంక్‌ సీఎఫ్‌వో పునీత్‌ శర్మ చెప్పారు. సిటీబ్యాంక్‌ ఖాతాదారులకు యథాప్రకారంగా రివార్డులు, ఆఫర్లు మొదలైనవి కొనసాగుతాయని చౌదరి తెలిపారు. సిటీ బ్యాంక్‌ కస్టమర్లంతా యాక్సిస్‌ బ్యాంక్‌కు మారేందుకు తమ సమ్మతి తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు.

కస్టమర్లు యాక్సిస్‌ బ్యాంకుకు మారేందుకు ఇష్టపడితే యథాప్రకారం తమ ఖాతాలు, క్రెడిట్‌ కార్డులు, ఇతర లావాదేవీలు కొనసాగించవచ్చు. లేదా నిష్క్రమించవచ్చు. యాక్సిస్‌ బ్యాంక్‌ విస్తృత నెట్‌వర్క్, ఆఫర్లు సిటీబ్యాంక్‌ కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటాయని చౌదరి పేర్కొన్నారు. ఒకవేళ కస్టమర్ల సంఖ్య తగ్గిపోయిన పక్షంలో ఆ మేరకు యాక్సిస్‌ చెల్లించే మొత్తం కూడా తగ్గే విధంగా ఒప్పందంలో షరతులు ఉన్నాయని, అలాగే ఇరు పక్షాలు కూడా ఏ కారణంతోనైనా వైదొలిగేందుకు కూడా వీలు కల్పించేలా నిబంధనలు ఉన్నాయని వివరించారు. సిటీగ్రూప్‌ ఇకపై భారత్‌లో సంస్థాగత బ్యాంకింగ్‌ వ్యాపారం కొనసాగింపుపై దృష్టి పెట్టనుంది.

కార్డుల్లో టాప్‌ 3లోకి యాక్సిస్‌..
దాదాపు 86 లక్షల కార్డులతో యాక్సిస్‌ బ్యాంక్‌ దేశీయంగా క్రెడిట్‌ కార్డుల జారీలో నాలుగో స్థానంలో ఉంది. సిటీగ్రూప్‌ డీల్‌తో కొత్తగా మరో 25 లక్షల క్రెడిట్‌ కార్డుహోల్డర్లు జతవుతారు. దీంతో కార్డుల వ్యాపార విభాగంలోని టాప్‌ 3 బ్యాంకుల్లో యాక్సిస్‌ బ్యాంక్‌ ఒకటిగా ఎదుగుతుంది. డిపాజిట్ల పరిమాణం మరో రూ. 50,200 కోట్ల మేర పెరుగుతుంది. అలాగే, సిటీ వెల్త్‌.. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సాధనాలకు సంబంధించి రూ. 1,10,900 కోట్ల విలువ చేసే ఆస్తులు (ఏయూఎం) కూడా యాక్సిస్‌కు జతవుతాయి. తద్వారా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో 3వ అతి పెద్ద బ్యాంకుగా యాక్సిస్‌ ఎదగనుంది. సిటీ బ్యాంక్‌కు 18 నగరాల్లో ఉన్న 7 కార్యాలయాలు, 21 శాఖలు, 499 ఏటీఎంలు, దాదాపు 3,600 మంది ఉద్యోగులు యాక్సిస్‌ బ్యాంక్‌ కిందకి చేరతారు. 30 లక్షల మంది కస్టమర్లు జతవుతారు. యాక్సిస్‌ బ్యాంక్‌ రిటైల్‌ వ్యాపార పోర్ట్‌ఫోలియో రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు ఉంది.

శతాబ్దం క్రితం సిటీగ్రూప్‌ ఎంట్రీ..
సిటీగ్రూప్‌ 1902లో భారత్‌లో అడుగుపెట్టింది. 1985లో కన్జూమర్‌ బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని ప్రారంభించింది. సిటీ రిటైల్‌ ఖాతాల పరిమాణం రూ. 68,000 కోట్లుగా ఉంది. ఇందులో రిటైల్‌ రుణాల ఖాతాలు రూ. 28,000 కోట్లుగా ఉన్నాయి.  అంతర్జాతీయంగా సిటీగ్రూప్‌ లాభాల్లో భారత విభాగం వాటా 1.5 శాతం స్థాయిలో ఉంది. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సిటీబ్యాంక్‌ ఇండియా నికర లాభం రూ. 4,918 కోట్ల నుంచి రూ. 4,093 కోట్లకు తగ్గింది. నికర మొండిబాకీలు (ఎన్‌పీఏ) రూ. 143 కోట్లు, స్థూల ఎన్‌పీఏలు రూ. 991 కోట్లుగాను ఉన్నాయి. తొలి మహిళా సీఈవో జేన్‌ ఫ్రేజర్‌ సారథ్యంలోని సిటీబ్యాంక్‌ అధిక రాబడులు అందించే ఆదాయ వనరులపై దృష్టి పెట్టే క్రమంలో 13 మార్కెట్లలో రిటైల్‌ వ్యాపారం నుంచి నిష్క్రమించాలని గతేడాది నిర్ణయించుకుంది. భారత మార్కెట్‌ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే సిటీగ్రూప్‌ తాజా డీల్‌ కుదుర్చుకుంది  

విదేశీ బ్యాంకుల గుడ్‌బై..
ఏఎన్‌జెడ్, ఆర్‌బీఎస్‌ తదితర బ్యాంకుల నిష్క్రమణ
కొన్నాళ్లుగా పలు విదేశీ బ్యాంకులు భారత మార్కెట్‌ నుంచి క్రమంగా తప్పుకుంటున్నాయి. ఏఎన్‌జెడ్‌ గ్రిండ్‌లేస్, ఆర్‌బీఎస్, కామన్వెల్త్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా వంటి దిగ్గజాలు తమ కార్యకలాపాలను గణనీయంగా తగ్గించేసుకున్నాయి. కార్పొరేట్‌ బ్యాంకింగ్‌పై మరింతగా దృష్టి పెట్టే దిశగా 2012లో బ్రిటిష్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం బార్‌క్లేస్‌ భారత్‌లో తమ రిటైల్‌ కార్యకలాపాలను భారీగా తగ్గించేసుకుంది.

చదవండి:  భారత్‌కు గుడ్‌బై చెప్పిన విదేశీ ఈ-కామర్స్‌ కంపెనీ... గట్టి కౌంటర్‌ ఇచ్చిన మీషో..! 

నాన్‌–మెట్రో ప్రాంతాల్లో మూడో వంతు శాఖలను మూసేసింది. 2016లో కామన్వెల్త్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా .. భారత మార్కెట్‌ నుంచి నిష్క్రమించింది. అదే ఏడాది రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌ (ఆర్‌బీఎస్‌) కూడా అంతర్జాతీయంగా తమ కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా భారత్‌లో కార్పొరేట్, రిటైల్, సంస్థాగత బ్యాంకింగ్‌ వ్యాపార విభాగాలను మూసివేయాలని నిర్ణయించుకుంది. గ్రిండ్లేస్‌ బ్యాంకును స్టాండర్డ్‌ చార్టర్డ్‌కు 1.34 బిలియన్‌ డాలర్లకు విక్రయించడం ద్వారా ఆస్ట్రేలియా అండ్‌ న్యూజిలాండ్‌ బ్యాంక్‌ 2000 సంవత్సరంలో భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, 2011లో ముంబైలో కొత్త శాఖను ప్రారంభించడం ద్వారా దేశీ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించింది.  

మరికొన్ని..
ఇక, 2011లో డాయిష్‌ బ్యాంక్‌ తన క్రెడిట్‌ కార్డు వ్యాపారాన్ని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు విక్రయించేసింది. 2013లో యూబీఎస్‌.. భారత్‌ నుంచి నిష్క్రమించింది. మోర్గాన్‌ స్టాన్లీ తన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వ్యాపారాన్ని కొనసాగిస్తూ.. ఇతర బ్యాంకింగ్‌ సేవలకు సంబంధించిన లైసెన్సును అప్పగించేసింది. అదేవిధంగా 2015లో మెరిల్‌ లించ్, బార్‌క్లేస్, స్టాండర్డ్‌ చార్టర్డ్‌ మొదలైనవి తమ కార్యకలాపాలను తగ్గించేసుకున్నాయి. హెచ్‌ఎస్‌బీసీ రెండు డజన్ల పైగా శాఖలను మూసివేసి, కార్యకలాపాలను సగానికి తగ్గించుకుంది. 2020లో బీఎన్‌పీ పారిబా తన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపార విభాగాన్ని మూసివేసింది.    

చదవండి: గూగుల్‌ పే యూజర్లకు గుడ్‌ న్యూస్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement