సాధారణంగా కనిపించే లెక్కలు అసాధారణమైన అనేక అంశాలను మనకు పట్టి ఇస్తాయి. మన దేశ ప్రజలు దేని మీద ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటి లెక్కలు చూసినప్పుడు సమాజంలో వచ్చిన అనేక మార్పులు కళ్ళకు కడతాయి. అతి విస్తృత స్థాయిలో దాదాపు 2.61 లక్షల గృహాలను సర్వే చేసి సేకరించిన సమాచారంతో గణాంకాలంటే ఇక వేరే చెప్పేది ఏముంది! ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్‌సీఈఎస్) అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2023 ఆగస్ట్ నుంచి 2024 జూలై మధ్య ప్రజల వినియోగాన్ని ఈ తాజా సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి.
సర్వసాధారణంగా అయిదేళ్ళకోసారి జరిపే ఈ సర్వేను వరుసగా గత ఏడాది, ఈ సంవత్సరం కూడా నిర్వహించడం విశేషమే. ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన పథకాలు, అనుసరించాల్సిన విధానాలకు ఇలాంటి సర్వే ఫలితాలు దిక్సూచి. అలాగని వాస్తవాల సమగ్ర స్వరూపాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని అనుకోలేం. అనేక ఇతర అంశాలు ఈ గృహవినియోగ వ్యయం లెక్కలను ప్రభావితం చేస్తాయన్న సంగతి విస్మరించి, వీటిని బట్టి జనజీవన ప్రమాణాల స్థాయిని నిర్ధారిస్తే అది సరికాదు. వేతనాలతో సహా అనేక ఇతర అంశాలపై సమాచారంతోనూ బేరీజు వేసుకోవాలి.
2023–24కి గాను కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన ఈ హెచ్‌సీఈఎస్ సర్వే అనేక అంశాలను విశ్లేషకుల దృష్టికి తెచ్చింది. దేశ ఆర్థిక రంగంలో వినియోగదారుల డిమాండ్ ఏ మేరకుంది, మరీ ముఖ్యంగా మహానగరాల్లో ఎలా ఉంది, దాన్నిబట్టి మన ఆర్థిక వ్యవస్థ ప్రస్థానాన్ని ఎలా అంచనా వేయాలనే దానిపై కొంతకాలంగా అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా హెచ్‌సీఈఎస్ సర్వే ఫలితాల పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది.
నిజానికి, దాదాపు 11 ఏళ్ళ విరామం తర్వాత గడచిన రెండేళ్ళుగా ఈ సర్వేలు వెలువడడం విశేషం. గడచిన ఏడాదితో పోలిస్తే 2023–24లో ఆహారపదార్థాలపై జనం వెచ్చించే మొత్తం పెరిగినట్టుగా తాజా సర్వేలోని గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ కుటుంబాలు చేసే మొత్తం ఖర్చులో సైతం... తిండికి వెచ్చించేది మునుపు 2022–23లో 46.4 శాతం ఉండేది. ఇప్పుడు 2023–24లో అది 47.04కి పెరిగింది. పట్టణప్రాంత నివాసాల్లోనూ ఇలాంటి పరిస్థితే. ఆహారంపై జనం ఎక్కువ వ్యయం చేస్తున్నా, ఇప్పటికీ ఇంటి బడ్జెట్‌లో ఆహారేతర అంశాలదే సింహభాగం.
ఆహారం మీద చేస్తున్న ఖర్చు ఏటేటా పెరుగుతున్నదన్నది మాత్రం స్పష్టం. అంత మాత్రం చేత ప్రజలందరి జీవన ప్రమాణాలు, పౌష్టికాహారం పట్ల శ్రద్ధ, ఆహార భద్రత అధికమయ్యాయని అనుకోలేం. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో తిండిపై జనం చేయాల్సి వస్తున్న ఖర్చు కూడా అనివార్యంగా పెరిగిందన్నది విస్మరించలేం. ఇంకా చెప్పాలంటే, ఈ 2023–24లో గృహవినియోగ వ్యయం 8 – 9 శాతం దాకా పెరిగింది కానీ, అందుకు కూడా ద్రవ్యోల్బణమే ప్రధాన కారణం. దాన్ని గనక తీసేస్తే, అసలు సిసలు లెక్కల్లో వినియోగం ఏ మేరకు పెరిగిందన్నది తేలుతుంది.
ఆ రకంగా చూస్తే, గృహవినియోగ వ్యయం కేవలం 3.5 శాతమే పెరిగిందట. ఆ పెరుగుదల కూడా 2024 ఆర్థిక సంవత్సరంలోని వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 8.2 శాతం కన్నా చాలా తక్కువ. అదీ విశ్లేషకులు తేలుస్తున్న మాట. అంటే, సర్వే గణాంకాలు పైకి ఏమి చెప్పినా, అసలు సిసలు వినియోగ వ్యయ వృద్ధి నత్తనడకనే సాగుతోందని అర్థం. దీనికీ మళ్ళీ కారణం – ద్రవ్యోల్బణం, అందులోనూ ఆహార ద్రవ్యోల్బణమే. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలి.
సర్కారు సైతం ఈ సంగతి గ్రహించకపోలేదు. ఆహార సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నం కూడా చేసింది. ఆహార నిల్వలు, అలాగే కొన్ని ఆహార పదార్థాలు – కూరగాయల ఎగుమతులపై నిషేధం, వంట నూనెల లాంటి వాటిపై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర చర్యలు చేపట్టింది. ఈ చర్యల వల్ల కొంత ఫలితం వచ్చింది. ఆహార ద్రవ్యోల్బణానికి ఒక మేర ముకుతాడు వేయగలిగారు. కానీ, ఇవన్నీ శాశ్వత పరిష్కారం చూపలేవు.
ఇవాళ్టికీ మనం వ్యవసాయాధార దేశం కావడం, అందులోనూ మన వ్యవసాయమంతా ప్రధానంగా వర్షాధారమైనది కావడం ప్రధానమైన అవరోధం. ఇక, తాజా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తలసరి నెలవారీ గృహ వినియోగ వ్యయం నిరుటి రూ. 3,773 నుంచి రూ. 4,122కు పెరిగింది. పట్టణాల్లో అది రూ. 6,459 నుంచి రూ. 6,996కు హెచ్చింది. ఖర్చు విషయంలో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య అంతరం అంత కంతకూ వేగంగా తగ్గుతోందని ఈ సర్వే డేటా చెబుతోంది. పుష్కరకాలం క్రితం 2011–12లో ఆ వ్యత్యాసం 83.9 శాతం. నిరుడు అది 71.2 శాతం. ఇప్పుడు 69.7కు తగ్గాయని సర్వే మాట.
ఖర్చుల్లో అంతరాలు తగ్గినట్టు పైకి కనిపిస్తున్నా, అది వేతనంలో గణనీయమైన పెరుగుదల వల్ల వచ్చినవని చెప్పలేం. ఎందుకంటే, 2023–24తో ముగిసిన అయిదేళ్ళ కాలంలో గ్రామీణ వేతనాలు నామమాత్రంగా 5.2 శాతమే పెరిగాయి. పైగా, వాస్తవ వేతన వృద్ధి మైనస్ 0.4 శాతమే. అంటే, ఇవాళ్టికీ గ్రామీణ – పట్టణ, ధనిక – పేద అంతరాలు గణనీయంగానే ఉన్నాయన్నది నిష్ఠుర సత్యం.
ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారన్నది సర్వేల సారమైనా, చాలీచాలని జీతాలతో, బతుకు బండి ఈడుస్తున్న బడుగుల మాట ఏమిటి? అసలు ఖర్చే పెట్టలేని సగటు ప్రాణుల స్వరాలను ఈ సర్వేలు సరిగ్గా పట్టుకోగలుగుతున్నాయా? ఆ అసమానతలు తొలగించగలిగితేనే ప్రయోజనం. తొలగించడానికి తోడ్పడగలిగితేనే ఈ లెక్కలకు సార్థకత.
అభివృద్ధా? అంతరమా?
Published Wed, Jan 1 2025 12:27 AM | Last Updated on Wed, Jan 1 2025 6:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment