ఓ కుటుంబానికి ఇరవై ఏళ్ల కిందట 20 ఎకరాల భూమి ఉండేది. ఆ భూమిని నలుగురు అన్నదమ్ములు సమష్టిగా సాగుచేసుకునే వారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్నాయి. ఆ క్రమంలోనే నలుగురు అన్నదమ్ములు విడిపోయారు. ఒక్కొక్కరికి ఐదెకరాల పొలమే వచ్చింది. ఆ నలుగురు అన్నదమ్ముల పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు.
వారు విడిపోయి పొలాలను పంచుకున్నారు. చివరకు వారి పిల్లలు ఒక్కొక్కరికి వచ్చింది సగటున ఎకరన్నర పొలమే. సమష్టిగా వ్యవసాయం చేసుకున్న సమయంలో పెట్టుబడి వ్యయం కలిసి వచ్చేది. ఇంటి వారందరూ కలిసి పనులు చేసుకునేవారు. కానీ ఇప్పుడు విడిపోవడంతో ఎవరి పెట్టుబడి వారు పెట్టుకోవడంతో అనవసర వ్యయం కొంత పెరిగింది. మరోవైపు అందరికీ ఆశించిన మేరకు ఆదాయం అందడం లేదు. ఇది ఈ ఒక్క కుటుంబం పరిస్థితే కాదు.. దాదాపుగా చిన్న కమతాలు చేస్తున్న అందరి పరిస్థితీ ఇదే.
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్
దేశంలో భూ కమతాల విస్తీర్ణం తగ్గుతోంది. వ్యవసాయ పెట్టుబడి వ్యయం పెరుగుతోంది. దీనితో రైతులు అప్పుల పాలవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర సరిగా రాక పోవడం, మధ్య దళారీల దోపిడీతో సాగు భారంగా మారుతోంది. ప్రభుత్వాలు చేస్తున్న సాయం ఆశించిన మేరకు రైతులను ఆదుకోవడం లేదు. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ చిన్న, సన్నకారు రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితులు తలెత్తుతున్నాయి.
ఇదే సమయంలో చిన్న కమతాల వల్ల ఉత్పత్తి తగ్గుతోందన్న ప్రచారంలో వాస్తవం లేదనే విషయం స్పష్టమవుతోంది. గడిచిన ఎనిమిదేళ్లుగా దేశ వ్యాప్తంగా కానీ, రాష్ట్రంలో కానీ పంటల దిగుబడి చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. చిన్న కమతాల వల్ల పెట్టుబడి వ్యయం పెరుగుతోందని, దిగుబడికి సంబంధించి ఇబ్బంది లేకపోయినా.. ఆదాయం విషయంలోనే ఇబ్బందులు వస్తున్నాయని వ్యవసాయ రంగ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. ఈ కారణంగానే కొందరు వ్యవసాయం వదిలిపెట్టి చిన్నచిన్న ఉద్యోగాల కోసం పట్టణాలకు తరలివెళ్తున్నారని చెబుతున్నారు.
చాలావరకు హెక్టార్ కంటే తక్కువే..
దేశంలో చిన్న, సన్నకారు రైతులే దాదాపు 98 శాతం మేరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చాలావరకు భూ కమతాలు ఒక హెక్టార్ (రెండున్నర ఎకరాలు) కంటే తక్కువగానే ఉన్నాయి. రెండు మూడు ఎకరాలున్న కుటుంబం విడిపోతే..ఆ భూమిని పంచుకోవడం వల్ల భూ కమతం మరీ తగ్గుతోంది. దీనితో కొందరు ఇతరుల పొలాలను కూడా కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు.
రెండు హెక్టార్ల కంటే తక్కువ పొలాలు ఉన్న వారు దేశ రైతాంగంలో 86.2 శాతం ఉంటే, నాలుగు హెక్టార్ల కంటే తక్కువ తక్కువ భూ కమతాలున్న వారి శాతం 13.2 శాతంగా ఉంది. ఇక నాలుగు హెక్టార్ల కంటే అధికంగా భూ కమతం ఉన్నవారు కేవలం 0.96 శాతం మాత్రమే. రెండు హెక్టార్ల కంటే తక్కువ కమతాలున్న వారు 86.2 శాతం ఉన్నప్పటికీ.. వారి ఆధీనంలో సాగు అవుతున్న పొలం కేవలం 47.3 శాతం మాత్రమే కావడం గమనార్హం. మధ్యతరహా రైతులు 43.6 శాతం పొలాలు సాగు చేస్తుంటే.. అదే ఎక్కువ విస్తీర్ణంలో (4 హెక్టార్ల కంటే ఎక్కువ) కమతాలున్న రైతులు సాగు చేస్తున్న భూమి తొమ్మిది శాతం ఉండడం గమనార్హం.
గణనీయంగా పెరిగిన చిన్నకారు రైతులు
కేంద్రం ఐదేళ్లకోసారి నిర్వహించే వ్యవసాయ గణన ప్రకారం 2010–11లో ఒక హెక్టార్ కంటే తక్కువ పొలం ఉన్న చిన్నకారు రైతులు 117.25 మిలియన్‌లు ఉండగా, 2015–16 నాటికి 125.38 మిలియన్‌లకు పెరిగారు. అదే సమయంలో 1–4 హెక్టార్లలోపు కమతాలున్న వారు 19.72 మిలియన్ల నుంచి 19.30 మిలియన్లకు పడిపోగా, నాలుగు హెక్టార్ల కంటే అధికంగా ఉన్నవారు 0.98 లక్షల నుంచి 0.83 లక్షలకు తగ్గినట్లు వ్యవసాయ గణన వెల్లడించింది.
దిగుబడులు పైపైకే..
భూ కమతాలు తగ్గితే దిగుబడులు తగ్గుతాయన్న దానిపై భిన్నమైన వాదనలు ఉన్నా.. గత పదేళ్ల లెక్కలు చూస్తే మాత్రం దేశంలో దిగుబడులు పెరుగుతూనే ఉన్నాయి. వాతావరణం సరిగా లేకపోవడం, అతివృష్టి, అనావృష్టి, తుపానులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే దిగుబడులు తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పొలంలో ఒకే రకమైన పంటలు వేయడం వల్ల కూడా ఆశించిన ఆదాయం రావడం లేదని చెబుతున్నారు. పంటను మారుస్తూ ఉండడంతోపాటు, పొలం సారవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటే దిగుబడులు మరింత పెరుగుతాయంటున్నారు...
ఏ పంటలు సాగు చేస్తున్నామనేదే ముఖ్యం
చిన్న కమతాలతో దిగుబడి తగ్గుతుందన్నది వాస్తవం కాదు. అసలు చిన్న కమతాల్లోనే ఎక్కువ సామర్థ్యంతో పంట పండించవచ్చు. అయితే ఏయే పంటలు వేస్తున్నామన్నది ముఖ్యం. ఓ కుటుంబానికి పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా వ్యవసాయంపై ఆదాయం రాకపోవడంతో అప్పులపాలు అవుతున్నారు.
ఒక ఎకరా పొలం ఉన్న రైతుకు వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోని పరిస్థితి. దీనితో అప్పులు పెరుగుతున్నాయి. అయితే అంతర పంటలు వేయడం ద్వారా అదనపు ఆదాయం కోసం ప్రయత్నించడం మంచిది. విదేశాల్లో మనకంటే ఎక్కువ సబ్సిడీ అక్కడి రైతులు పొందుతున్నా.. వారు కూడా వ్యవసాయం చేయలేని పరిస్థితి అమెరికా, యూకే లాంటి దేశాల్లో ఉంది.
– దొంతి నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయరంగ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment