
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి విక్రయిస్తానంటూ నమ్మబలికి రూ.2కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎంకేపల్లిలో తనకు 12 ఎకరాల 33 గుంటల వ్యవసాయ భూమి ఉందని.. ఇందులో మామిడి తోట ఉందని బంజారాహిల్స్ రోడ్ నంబర్–10కి చెందిన మీర్జా హుస్సేన్ అలీఖాన్ చెప్పడంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–10లోని వెంకటగిరి భగవతినగర్‌కు చెందిన ఎస్.భక్తప్రియ అనే మహిళ అతడితో చర్చలు జరిపి రూ.9.45 కోట్లకు బేరం కుదుర్చుకుంది. దీని కోసం అడ్వాన్స్‌గా రూ.2 కోట్లు చెల్లించారు.
కాగా నిర్ణీత సమయంలో మిగిలిన డబ్బులు అడ్జెస్ట్ కాకపోవడంతో మరో రెండు నెలలు అదనంగా సమయం ఇవ్వాలని ఆమె కోరింది. అయితే తనకు త్వరగా డబ్బులు కావాలని వేరొకరికి అమ్మేసిన తర్వాత మీరిచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇస్తానంటూ హుస్సేన్ అలీఖాన్ చెప్పాడు. అయితే స్థలం వేరొకరికి అమ్మి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోగా కనీసం ఫోన్‌లు కూడా ఎత్తకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 406 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(చదవండి: వివాహేతర సంబంధం: మహిళ దారుణ హత్య)