రైతు కుటుంబాలకు బీమా ధీమా   | Rs. 80 crore is compensated for 1,602 people So far | Sakshi
Sakshi News home page

రైతు కుటుంబాలకు బీమా ధీమా  

Published Wed, Oct 10 2018 2:39 AM | Last Updated on Wed, Oct 10 2018 2:39 AM

Rs. 80 crore is compensated for 1,602 people So far - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబీమా 90 శాతం సన్నచిన్నకారు రైతు కుటుంబాల్లో వెలుగు నింపిందని వ్యవసాయ శాఖ తెలిపింది. రైతుబీమా పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాభై రోజుల్లో రైతుబీమా ద్వారా ఎంతమంది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలిగిందో వ్యవసాయశాఖ సమగ్ర నివేదిక తయారు చేసి మంగళవారం ప్రభుత్వానికి పం పింది. ఇప్పటివరకు మొత్తం 1,910 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు. అందులో 1,739 మందికి క్లెయిమ్స్‌ కోసం ఎల్‌ఐసీకి సమాచారం పంపారు. వాటిల్లో 1,602 మంది రైతుల క్లెయిమ్స్‌ను పరిష్కరించారు.

ఆయా కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.80.01 కోట్ల పరిహారం అందజేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఇంకా 137 క్లెయిమ్స్‌ ప్రక్రియలో ఉన్నట్లు తెలిపింది. పరిహారం పొందిన రైతుల్లో 90 శాతం మంది ఐదెకరాలలోపువారే ఉన్నారని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఆ నివేదికలో వెల్లడించారు. రైతుబీమా పరిహారం పొందిన 1,602 మంది రైతుల్లో ఎకరాలోపున్న రైతులు 401 మంది, ఎకరా నుంచి రెండున్నర ఎకరాలున్న రైతులు 748 మంది, రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల వరకున్న రైతులు 294 మంది ఉన్నారు. ఐదు నుంచి పదెకరాల వర కున్న రైతులు 146 మంది, పది, అంతకుమించి భూమి కలిగిన రైతులు 13 మంది ఉన్నారు.  

ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు 85 శాతం 
సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే పరిహారం అందుకున్న 1,602 మంది రైతుల్లో బీసీలు 816 మంది (51%) ఉండటం గమనార్హం. ఎస్సీ రైతులు 236 మంది (15%), ఎస్టీ రైతులు 329 మంది (21%), మైనారిటీలు 11 మంది (1%), ఇ తరులు 210 మంది (13%) ఉన్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే 85 శాతం రైతుబీమా పరిహారం పొందారు. వ్యవసాయశాఖ ఆయా రైతుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే వారి ఆర్థిక స్తోమత విస్మయం కలిగించేలా ఉంది. సన్న, చిన్నకారు రైతుల్లో చాలామంది బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.34 నుంచి వెయ్యి వరకే ఉండటం గమనార్హం. ఆయా కుటుంబాల్లో తమ కుటుంబ పెద్ద చనిపోయిన వెంటనే బజారున పడే పరిస్థితి ఏర్పడుతుంది.

అటువంటి పరిస్థితుల్లో రైతుబీమా కింద ఒకేసారి రూ.5 లక్షలు జమ చేయడం వల్ల ఆయా కుటుంబాలు కుదుట పడటానికి వీలు కలుగుతుందని వ్యవసాయశాఖ తెలిపింది. అంతేకాదు సన్న, చిన్నకారు రైతులే 90 శాతం మంది ఉన్నారంటే వారి ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందనే అంశం కూడా తెలుస్తోంది. సరైన పోషకాహారం లేకపోవడం, వైద్య సదుపాయాలు లేకపోవడం తదితర కారణాలతో అనేకమంది సన్న, చిన్నకారు రైతులు చనిపోతున్నారనేది వాస్తవం. రైతుబీమా కింద చనిపోయిన రైతు కుటుంబానికి ఒకేసారి రూ.5 లక్షలు వస్తుండటంతో బీమాలో చేరని రైతులు ఇప్పుడు ముందుకు వస్తున్నారని వ్యవసాయశాఖ తన నివేదికలో ప్రస్తావించింది. కొత్తగా మరో లక్ష మంది రైతులు తమ పేర్లను రైతుబీమాలో నమోదు చేసుకున్నారు. మొదట్లో అనేకమంది రైతుబీమాలో చేరడానికి ముందుకు రాని సంగతి విదితమే.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement