రైతుకు రొక్కం! | Rs 6000 financial aid to the farmers | Sakshi
Sakshi News home page

రైతుకు రొక్కం!

Published Sat, Feb 2 2019 3:57 AM | Last Updated on Sat, Feb 2 2019 3:57 AM

Rs 6000 financial aid to the farmers - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్‌  రైతులపై వరాల జల్లు కురిపించింది. పెట్టుబడి సాయంగా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల నగదు సాయం ప్రకటించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) పేరిట ప్రకటించిన ఈ పథకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు వెళుతుందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఈ పథకం కోసం ఏటా 75 వేల కోట్లు కేటాయించనున్నట్టు మంత్రి వెల్లడించారు. మూడు వాయిదాల్లో డబ్బు లబ్ధిదారులకు చేరుతుందన్నారు. తొలి విడతగా రూ.2వేల ఆర్థిక సాయం ఈ ఏడాది మార్చి లోగా రైతులకు అందజేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తామని గోయల్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలలో ఈ పథకం కోసం రూ. 20 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు ఉత్తరాది కీలక రాష్ట్రాలలో బీజేపీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశముందని గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలలో పెరిగిన అసంతృప్తే కారణమని విశ్లేషణలు వినిపించాయి. అందువల్లే రైతుల కోసం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని కేంద్రం ప్రకటించిందని విశ్లేషకులంటున్నారు.

రైతులకు 2 శాతం వడ్డీ రాయితీ
ప్రకృతి వైపరీత్యాలు, అననుకూల వాతావరణ పరిస్థితులతో నష్టపోయే రైతులకు 2 శాతం వడ్డీ రాయితీని కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించింది. రుణాలను సకాలంలో చెల్లించేవారికి 3 శాతం అధికంగా అందిస్తామని ఆర్థిక మంత్రి  తెలిపారు. చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా 2 శాతం వడ్డీ రాయితీని ప్రకటించారు. చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతుల కోసం రూ.750 కోట్లను కేటాయించారు.  గత బడ్జెట్‌ సందర్భంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను  చేపల పెంపకం, పశువుల పెంపకంపై ఆధారపడ్డ రైతులకు కూడా అందించాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే.. ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులందరికీ పంటరుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ వర్తింపజేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ రైతులకు జాతీయ వైపరీత్యాల సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) నుంచి అందించే సహాయంతో పాటు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు ఇచ్చే 3 శాతం ప్రోత్సాహాన్ని వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగానికి కూడా వర్తింపజేస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రోత్సాహాన్ని రుణాలు రీషెడ్యూల్‌ చేసిన కాలం మొత్తానికి అందించనున్నట్లు గోయల్‌ వివరించారు. ‘‘ప్రకృతి వైపరీత్యాలు వాటిల్లినపుడు రైతులు సహజంగానే తమ రుణాలను తిరిగి చెల్లించలేరు. అలాంటి రైతులకు రుణాలను రీషెడ్యూల్‌ చేస్తున్నారు. వారికి రీషెడ్యూల్‌ చేసిన తొలి సంవత్సరం మాత్రమే 2 శాతం వడ్డీ రాయితీ వర్తింపజేస్తున్నారు.’’ అని గోయల్‌ పేర్కొన్నారు. రాయితీతో కూడిన రుణాలను సులభంగా అందజేయడానికి, రైతులందరికీ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించడానికి గాను ఒక పరిపూర్ణమైన ప్రక్రియను ప్రారంభించనున్నామని,ఇందుకోసం సులభంగా పూర్తిచేసే దరఖాస్తు ఫారాలను అందించనున్నామని తెలిపారు.

పేద, భూమిలేని రైతులు ఉత్పాదక
వ్యయాలను ఎదుర్కోవడానికి వారికి నిర్మాణాత్మక ఆదాయం అవసరమని తెలిపారు. సంచార తెగలను పైకి తీసుకురావడానికి ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తామన్నారు. 

పెరిగిన కేటాయింపులు..
రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు 2019–20 మధ్యంతర బడ్జెట్‌లో పాడి రైతులకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు కూడా ఉపశమన చర్యలను ప్రతిపాదించారు. పశుసంవర్థక, మత్స్యకార రుణాలకు కూడా వడ్డీ రాయితీ వర్తిస్తుందని ప్రకటించారు.  2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రూ. 1,49,981 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలు రూ. 86,602 కోట్లతో పోలిస్తే రానున్న ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఎరువుల సబ్సిడీ రూ. 70,075 కోట్లు కాగా రానున్న ఆర్థిక సంవత్సరం రూ.74,986 కోట్లు. పేద రైతాంగానికి నిర్దిష్ట ఆదాయ సహాయాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి.. సాగులో ఆదాయం తగ్గిపోవడానికి చిన్న కమతాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం వంటి పలు కారణాలున్నాయని పేర్కొన్నారు.

12 కోట్లమందికి లబ్ధి..
విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సామగ్రి, కూలీలు ఇంకా ఇతర అవసరాలు తీర్చడం కోసం రైతులకు పీఎం కిసాన్‌ పథకం ఉపకరిస్తుందని గోయల్‌ తెలిపారు. రైతు అప్పుల ఊబిలో చిక్కకుండా ఈ పథకం కాపాడుతుందని, ముఖ్యంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి రక్షిస్తుందని మంత్రి వివరించారు. ఈ పథకానికి నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని, దాదాపు 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని గోయల్‌ పేర్కొన్నారు. రైతులు సంపాదించడానికి, గౌరవప్రదమైన జీవనం సాగించడానికి ఈ పథకం దారి చూపుతుందని ఆయన వివరించారు. దీనివల్ల అత్యంత నిరుపేద రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరడమే కాక, సాగు సీజన్‌కు ముందు అవసరమయ్యే అత్యవసర ఖర్చులకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి తెలిపారు.

గోకుల్‌ మిషన్‌కు నిధుల పెంపు..
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రుణ లక్ష్యం ఎంత అనేది ఆర్థిక మంత్రి వివరించలేదు. 2018–19లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.11 లక్షల కోట్లను దాటి రూ. 11.68 లక్షల కోట్లకు చేరుకుందని మంత్రి గోయల్‌ తెలిపారు. రైతులకు రుణాలను అందుబాటులో ఉంచడం కోసం గత ఐదేళ్లలో వడ్డీ రాయితీని రెట్టింపు చేసినట్లు ఆర్థికమంత్రి వివరించారు. అందువల్లే 2018–19లో పంట రుణాలు రూ.11.68 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. రైతుల కష్టాలు తొలగించడానికి మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి వివరిస్తూ.. మట్టి నాణ్యతా కార్డులు, నాణ్యమైన విత్తనాలు, నీటి పారుదల పథకాలు, ఎరువుల కొరత లేకుండా చూడడం వంటివాటి గురించి వివరించారు. పశుసంవర్థక శాఖ, మత్స్యకార రంగాలకు కూడా గణనీయమైన మద్దతు అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఆ రంగాల ప్రాధాన్యతను గుర్తించినందునే ఈ ఆర్థిక సంవత్సరంలో ‘రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌’కు నిధులను రూ.750 కోట్లకు పెంచినట్లు గోయల్‌ తెలిపారు.

కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌’
కొత్తగా ‘రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌’ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఆవుల ఉత్పాదకతను పెంచడం, గో వనరుల వృద్ధికి అవసరమైన జన్యుపరమైన ప్రయోగాలను విస్తరించడం వంటి పనులను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. గో సంరక్షణ కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయించడం కూడా ఈ వ్యవస్థ విధుల్లో భాగమే. మత్స్యకారుల అభివృద్ధిపై ప్రత్యేకంగా కేంద్రీకరించడం కోసం ఫిషరీస్‌కి ప్రత్యేకంగా ఒక డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు గోయల్‌ వెల్లడించారు. అత్యధికంగా మత్స్య సంపదను ఉత్పత్తి చేసే దేశాలలో రెండో అతి పెద్ద దేశం భారతదేశమేనని, ప్రపంచ ఉత్పత్తిలో భారత్‌ వాటా 6.3శాతమని మంత్రి వివరించారు. ఇటీవలి సంవత్సరాలలో చేపల ఉత్పత్తిలో సగటున 7శాతం వృద్ధి రేటు కూడా నమోదు చేశామని ఆయన తెలిపారు. 1.45 కోట్ల మందికి ఇది ప్రధాన జీవనాధారంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో ఉత్పాదక వ్యయం కన్నా కనీసం 50 శాతం ఎక్కువ ఉండేలా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నామని గోయల్‌ వివరించారు. చరిత్రలోనే తొలిసారిగా ఈ ప్రభుత్వం 22 పంటల కనీస మద్దతు ధరలు 50 శాతం పెంచిందని ఆయన తెలిపారు.

ఆహార ధాన్యాలు, నూనెగింజలు, చెరకు,పత్తి, ఇతర ఉద్యానవన పంటల ఉత్పత్తి భారీగా జరగడం వల్ల ధరలు పడిపోతున్నాయని,దాంతో సరైన ఆదాయం రాక దేశంలోని అనేక ప్రాంతాల రైతులు పూర్తి నిస్పృహలో ఉన్నారని ఆర్ధికమంత్రి వివరించారు. 

తెలంగాణ, ఒడిశా పథకాలతో పోల్చలేం
రైతులకు నేరుగా నగదు బదిలీ చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పీఎం కిసాన్‌’ పథకాన్ని వ్యవసాయ రంగ నిపుణులు స్వాగతించారు. అయితే ఈ పథకాన్ని ప్రస్తుతం తెలంగాణలోనూ, ఒడిశాలోనూ కొనసా గుతున్న పథకాలతో పోల్చలేమని వారు వ్యాఖ్యా నించారు. ఆ రాష్ట్రాలలో రైతులకు ఇస్తున్న మొత్తం కన్నా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం కింద ఇచ్చే మొత్తం చాలా తక్కువని పేర్కొంటున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు పథకం లేదా ఒడిశాలో అమలు చేస్తున్న కాలియా పథకం కన్నా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం మొత్తం చాలా తక్కువని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ చైర్మన్‌ ఎంజేఖాన్‌ వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్‌ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తేనే రైతులకు ఆ ఫలాలు అందుతాయని ఇన్‌సెక్టిసైడ్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ అగర్వాల్‌ వ్యాఖ్యానిం చారు. ధరల పతనం, పెరుగుతుండే ఖర్చులు వంటి ఇబ్బందుల నుంచి రైతులను కాపాడడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని పీడబ్లు్యసీ ఇండియాకు చెందిన అజయ్‌ వ్యాఖ్యానించారు. 

రైతన్నల కష్టాలు తీరాలంటే వారు ఎదుర్కొన్న సమస్యలన్నిం టినీ కలిపి చూడాల్సిన అవసరం ఉంది. ధరలు, పంట సేకరణ, పంపిణీల్లో సమస్యలకు సమష్టిగానే పరిష్కార మార్గాలు కనుగొనాలి.
– ఎంఎస్‌ స్వామినాథన్, వ్యవసాయ శాస్త్రవేత్త

రైతులకు ప్రయోజనం కలిగించే బడ్జెట్‌: నాబార్డ్‌
ముంబై: కేంద్ర బడ్జెట్‌ను జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) స్వాగతిం చింది. వ్యవసాయ రంగంపై దృష్టి సారించిందని, బడ్జెట్‌ ప్రతిపాదనలతో చిన్న రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం తన పూర్తి స్థాయి బడ్జెట్‌ను రైతులకు మార్కెట్‌ అనుసంధాన వసతులు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, వాటి తయారీపై పెట్టొచ్చని నాబార్డ్‌ చైర్మన్‌ హెచ్‌కె భన్వాలా  పీటీఐతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో వడ్డీ రాయితీతోపాటు అనేక స్వాగత చర్యలున్నాయని అన్నారు. ప్రాథమిక ఆదాయ మద్దతుతో చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. ఫిషరీస్, యానిమల్‌ హజ్బెండరీ రంగాలకు 5 శాతం వరకు వడ్డీ రాయితీని కల్పించడం వల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, వీటి అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రైతులకు ఏడాదికి  ఇచ్చే రూ.6,000 నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారని దీంతో విత్తనాలు, ఎరువులు, తదితరాల కొనుగోలుకు వినియోగించవచ్చన్నారు. 

అన్నదాత కరుణిస్తాడా?
ఓట్ల కోసమైతేనేం.. చిన్న రైతుల ఖాతాల్లోకి నాలుగు నెలలకోసారి 2వేల రూపాయలు వచ్చిపడతాయి. అందరి ఆకలీ తీర్చే అన్నదాతకు.. ఇదేమీ కడుపు నింపేసేది కాకపోయినా.. విత్తనాలకోసం వడ్డీ వ్యాపారిని ఆశ్రయించాల్సిన దుస్థితి తప్పుతుంది. ఐదెకరాల లోపు కమతాలున్న 12 కోట్ల మంది రైతులపై
నరేంద్ర మోదీ విసిరిన అస్త్రమిది. వీరికి తొలివిడత మొత్తం కూడా ఈ ఏడాది మార్చి 31లోగా.. అంటే ఎన్నికల్లోగానే చేతికందుతుంది. దీంతో పాటు వైపరీత్యాల బారినపడ్డ రైతుల రుణాలకు వడ్డీ
రాయితీని కూడా పెంచారు. మోదీ తీసుకున్న ఈ ‘జై కిసాన్‌’ నినాదం ఏ తీరానికి చేరుస్తుందో!

దేశంలో 5 ఎకరాలలోపు భూములున్న రైతులు 12 కోట్ల మంది
మార్చి 31లోగా ఇవ్వటానికి కేటాయించింది రూ.20వేల కోట్లు
2019–20 బడ్జెట్‌లో పూర్తి కేటాయింపులు రూ.75వేల కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement