‘హలో.. 1100 అండీ.. నాపేరు మల్లేశ్వరరావు, మాది చీరాల. అన్నదాతా సుఖీభవ పధకం కింద తొలిసారి వేసిన వెయ్యి రూపాయలు వచ్చాయి గానీ రెండోసారి రూ.3 వేలు రాలేదండి. లైన్లో ఉంటా, ఒక్కసారి కనుక్కుంటారా?’
‘మీ ఆధార్ నెంబర్ చెప్పండి.. మీకు అన్నదాతా సుఖీభవ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా పంపిన నిబంధనల ప్రకారం మీరు అర్హులు కారు. ఒకసారి పీఎం కిసాన్ నిబంధనలు చదువుకోండి..’ (ఫోన్ కట్)
..మల్లేశ్వరరావు మళ్లీ ఫోన్ చేసి.. ‘ఒక్క నిమిషం నామాట వినండి.. తొలి విడత వెయ్యి రూపాయలు వచ్చాయండి. అందువల్ల నేను అర్హుడినే. రెండో విడత డబ్బులు మాత్రం రాలేదండీ..’
‘అప్పుడు ఎన్నికలు అని అందరికీ వేసినట్టున్నారు. ఇప్పుడు మాత్రం మీరు అర్హులు కాదని రికార్డులు చెబుతున్నాయి. ఇంతకు మించి మాకు ఏమీ తెలియదు...’
సాక్షి, అమరావతి : అన్నదాతా సుఖీభవ పథకానికి సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే 1100 నెంబర్‌లో సంప్రదించాలని సూచించిన టీడీపీ సర్కారు ఇప్పుడు ఆ పేరు చెబితేనే ఫోన్ కట్ చేస్తున్నారని రైతన్నలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతా సుఖీభవ డబ్బులు తమ ఖాతాలకు జమ కాలేదంటూ 1100 కాల్ సెంటర్‌కు నిత్యం వందల సంఖ్యలో కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందుతున్నా అటువైపు నుంచి మాత్రం ఒకే సమాధానం వస్తోంది. ‘ఆ పథకం మీకు వర్తించదు... కావాలంటే నిబంధనలు చదువుకోండి’ అంటూ ఫోన్ కట్ చేస్తున్నారు. నది దాటే వరకు ఓడ మల్లయ్య.. దాటాక బోడి మల్లయ్య అంటే ఇదేనంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే రైతులందరికీ ఈ పథకం కింద డబ్బులు జమ కావాల్సి ఉండగా ప్రభుత్వం చేతులెత్తేసింది.
అంతా ఆయనే ఇస్తున్నట్లు ప్రచారం
ఐదు ఎకరాల లోపు పొలం ఉండే రైతు కుటుంబాలకు ఏటా రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రకటించింది. ఇది చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకూ ఈ పథకం వర్తించదు. రాష్ట్రంలో 85 లక్షల మందికిపైగా రైతులుండగా 37,97,234 మంది పీఎం కిసాన్ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు హడావుడిగా అన్నదాతా సుఖీభవ పథకాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు రైతు కుటుంబాలకు రూ.9 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. ఈ లెక్కన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఇచ్చే మొత్తం రూ.15 వేలు అవుతుంది. అయితే ఇదంతా తానొక్కడినే ఇస్తున్నాననే తరహాలో చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు.
అనుకూల మీడియాలో ప్రచారం
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.2 వేలను జమ చేసిన అనంతరం అన్నదాతా సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా తొలి విడతగా రూ.వెయ్యి జమ చేస్తున్నట్లు ప్రకటించుకుంది. అయితే ఐదు ఎకరాలకుపైగా ఉన్న వారి నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుండడంతో ఓట్ల కోసం పీఎం కిసాన్ పథకం పరిధిలోకి రాని రైతులకు కూడా ఏడాదికి రూ.10 వేలు ఇస్తామంటూ చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు రూ.వందల కోట్లలో నిధులు విడుదలైనట్లు తన అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. ఎన్నికలు ముగియడంతో అసలు బండారం బయట పడుతోంది. రుణమాఫీ తరహాలోనే ఈ పథకం కూడా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓట్ల కోసం ఆకర్షణీయమైన హామీలిచ్చి తరువాత గాలికి వదిలేయడం ఆయనకు అలవాటేనని మండిపడుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత కోటయ్య కమిటీ, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో వడ్డీలకు కూడా చాలని విధంగా దగా చేయడంతో డిఫాల్టర్లుగా మిగలడం తెలిసిందే. ఇప్పుడు అన్నదాతా సుఖీభవ పథకం కూడా అదే కోవలోకి చేరింది. ఎన్నికలకు ముందు తొలి విడతగా రూ.వెయ్యి అందుకున్న వారు మలివిడత రూ.3 వేలు పొందేందుకు ఎందుకు అర్హులు కారో బోధపడటం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment