హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయిలో రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా ఏర్పాటు చేస్తామన్న హామీని అమలు చేయడంలో ఇబ్బంది ఉంటే ఆ విషయాన్ని హైకోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని శుక్రవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
హామీని అమలు చేయకపోవడం కోర్టు ధిక్కార చర్యగా ఎందుకు పరిగణించరాదో తెలపాలని పేర్కొంది. రైతు రుణ విమోచన కమిషన్ ఏర్పాటు చేయాలన్న వ్యాజ్యాన్ని దాఖలు చేసిన బీజేపీ సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి తరఫు న్యాయవాది గత హామీని అమలు చేయకపోవడాన్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మరికొంత సమయం ఇస్తే కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ నవంబర్ 21తో ముగిసిందని, ఇంతవరకు కనీస సమాచారం లేకుండా గడువు కోరడంలో ఔచిత్యం ఏమిటో అర్థం కావడం లేదని ధర్మాçనం వ్యాఖ్యానించింది. అనంతరం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment