టీజేఏసీది హింసాత్మక చరిత్ర
- నిరుద్యోగ ర్యాలీకి అనుమతివ్వడం కుదరదు..హైకోర్టుకు నివేదించిన పోలీసులు
- వారి సభకు వామపక్ష ఉగ్రవాద గ్రూపుల మద్దతు ఉంది
- మేం సూచించిన ప్రదేశాల్లో సభ పెట్టుకుంటే అభ్యంతరం లేదు
- విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ బుధవారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి, బహిరంగ సభకు అనుమ తినివ్వడం సాధ్యం కాదని పోలీసులు తేల్చి చెప్పారు. శాంతిభద్రతల సమస్య సృష్టించే ఉద్దేశంతోనే అనుమతి కోరుతున్నారని, అందుకు తాము ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. తాము సూచించిన ప్రత్యామ్నాయ ప్రదేశాల్లో బహిరంగ సభ నిర్వహించుకుంటా మంటే మాత్రం అందుకు అనుమతినిస్తామన్నారు.
ఈ మేరకు పోలీసుల తరఫున అడ్వొ కేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి సోమవారం హైకోర్టుకు తెలిపారు. టీజేఏసీ గతాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. గతంలో కూడా టీజేఏసీ ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని, అప్పుడు జంట నగరాల్లో విధ్వంసానికి, హింసకు, ఆస్తి నష్టానికి పాల్పడిందని, ఆ ఘటనల్లో పలువురు ప్రజలు, పోలీసులు గాయపడ్డారని కోర్టుకు వివరించారు. జనాలను పోగుచేసి నగరంలో జనజీవనాన్ని స్తంభింప చేసేందుకు వ్యూహరచన చేశారని, ఇందుకు వామపక్ష ఉగ్రవాద గ్రూపులు కూడా మద్దతు పలికినట్టు తమకు అత్యంత విశ్వస నీయ సమాచారం ఉందని కోర్టుకు నివేదిం చారు. శాంతిభద్రతలను పరిగణనలోకి తీసుకునే.. టీజేఏసీకి నగరంలో ర్యాలీ, బహిరంగ సభకు అనుమతినివ్వడం లేదన్నారు.
అంతేకాక సభ నిర్వహిస్తున్నది పనిదినాన అని, దీంతో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ ఆదివారం రోజున సభ నిర్వహిం చుకునేందుకు ఇబ్బంది ఏంటని టీజేఏసీ తరఫు న్యాయవాది రచనారెడ్డిని ప్రశ్నించారు. దీనిపై జేఏసీ చైర్మన్‌తో మాట్లాడి చెప్పాల్సి ఉందని ఆమె చెప్పడంతో, అయితే మంగళవా రం ఉదయం 10.30 గంటలకు కేసు విచారణ చేపడతామని, అప్పటికల్లా ఆదివారం సభ నిర్వహణపై స్పష్టతనివ్వాలని చెప్పారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వ రరావు ఉత్తర్వులు జారీ చేశారు.
సభలో తీవ్రవాద సంఘాలు పాల్గొనే అవకాశం?: ఏజీ
నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో అనుమతిని ఎం దుకు ఇవ్వకూడదని న్యాయమూర్తి ఏజీని ప్రశ్నించగా సదరు కాలేజీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదని ఏజీ అన్నారు. ఇక్కడ సభ నిర్వహణ వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రం గా ఉంటుందన్నారు. ‘‘అసలు ఇవన్నీ కాదు.. సభలో తీవ్రవాద సంఘాలు కూడా పాల్గొనే అవకాశం ఉందని మాకు విశ్వస నీయ సమాచారం ఉంది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది’’ అని ఏజీ చెప్పారు. సభలో పాల్గొన్న వారు పక్కనున్న భవనాలపై రాళ్లేయవచ్చని, పరిస్థితులు అదుపు తప్పడానికి అదొక్కటి చాలన్నారు. 5 వేల మంది అని వారు చెబు తున్నారని, అయితే, 15 వేల నుంచి 20 వేల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తాము సూచించిన ప్రత్యామ్నాయ ప్రదే శాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయని వివరించారు.
ఈ సమయంలో రచనారెడ్డి జోక్యం చేసుకుంటూ తాము రోజంతా సభ నిర్వహించబోమని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలకల్లా సభను పూర్తి చేస్తామన్నారు. కోర్టు ఎలాంటి షరతులు విధించినా పాటిస్తామన్నారు. స్వామీజీలకు ఎల్‌బీ స్టేడియం ఇచ్చిన సర్కారు.. తమ సభకు మాత్రం అనుమతినివ్వకుండా రాజ్యాంగ హక్కులను హరిస్తోందని రచనారెడ్డి పేర్కొన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ... ఇలాంటి రెచ్చగొట్టే వాదనలు చేయవద్దని సున్నితంగా ఆమెకు సూచించారు. ఉగ్రవాద సంఘాలు పాల్గొంటాయన్నది కేవలం ఆరో పణ మాత్రమేనని, అందుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. తమ గత చరిత్ర ఎన్నడూ హిం సాత్మకం కాదన్నారు. అయితే ఈ వాదనలను ఏజీ తోసిపుచ్చారు. గతంలో టీజేఏసీ హింసాత్మక ఘటనలకు పాల్ప డిందని, దీనికి సంబంధించి వారిపై 31 కేసులు నమోదయ్యాయని తెలిపారు. తమ వద్ద ఉన్న ఆధారాల ఆధారంగానే వారికి అనుమతినివ్వడం లేదన్నారు. ఈ సమ యంలో న్యాయమూర్తి పనిదినం రోజున కాకుండా ఆదివారం సభ నిర్వహిం చుకునేందుకు ఇబ్బంది ఏమిటని రచనా రెడ్డిని ప్రశ్నించారు. దీనిపై స్పష్టతనివ్వాలం టూ తదుపరి విచారణను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు.
ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది: జేఏసీ న్యాయవాది
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఈ నెల 22న తాము తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి పోలీసులు అనుమతినివ్వడం లేదంటూ టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, అధికార ప్రతినిధి వెంకటరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ... దరఖాస్తుపై నిర్ణయం వెలువరించడానికి ఇబ్బందేమిటని హోంశాఖ తరఫు న్యాయవాది హెచ్.వేణు గోపాల్‌ను ప్రశ్నించారు. నిర్ణయం వెలు వరిస్తామని ఆయన చెప్పడంతో.. విచార ణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు. సాయంత్రం 4 గంటలకు విచారణ మొదలు కాగానే.. ఇందిరా పార్క్ వద్ద ర్యాలీ, బహిరంగ సభకు అనుమతినివ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాతపూర్వక నిర్ణయం వెలువరించా మంటూ, దానికి సంబంధించిన కాపీని పోలీసుల తరఫున హాజరైన ఏజీ రామకృ ష్ణారెడ్డి న్యాయమూర్తి ముందుంచారు.
ఈ సమయంలో రచనారెడ్డి స్పందిస్తూ.. ఇందిరాపార్క్ ధర్నాలు, ర్యాలీలు, సభలకు ఉద్దేశించిన ప్రదేశమని అన్నారు. ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరగ కుండా అన్ని జాగ్రత్త లు తీసుకుంటామని స్పష్టమైన హామీనిచ్చినట్లు తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘‘ఎందరిని ఆహ్వానించారు? చలో హైదరాబాద్ పేరుతో పిలుపునిచ్చినప్పుడు ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది కదా..? సంఖ్యపై ఏమైనా స్పష్టత ఉందా..?’’ అని రచనారెడ్డిని ప్రశ్నించారు. సంఖ్యపై నిర్దిష్టంగా చెప్పలేమని, అయితే 5 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని రచనారెడ్డి తెలిపారు. పోలీసులు చూపిన ప్రత్యామ్నాయ ప్రదేశాలు వేరే జిల్లాల్లో ఉన్నాయన్నారు. అవి తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. తమ సభకు అనుమతినిచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందో అర్థం కావడం లేదన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్, ఎల్‌బీ స్టేడియం, ఎన్‌టీఆర్ స్టేడియం, నెక్లెస్ రోడ్‌లలో ఎక్కడ సభ నిర్వహణకు అనుమతినిచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు.
ర్యాలీ వెనుక రాజకీయ ఎజెండా: ఎంపీ బాల్క సుమన్ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ ర్యాలీ వెనుక టీజేఏసీ చైర్మన్ కోదండరాం రాజకీయ ఎజెండా దాగి ఉందని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. అందుకే ఆయన అన్ని రాజకీయపార్టీల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. కోదండరాం ర్యాలీ వెనక తెలంగాణ వ్యతిరేకశక్తుల హస్తం కూడా ఉందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. కొత్తరాష్ట్రంలో ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారని, హైదరా బాద్, తెలంగాణ ప్రశాంతంగా ఉండడం ఆయనకు ఇష్టం లేదని ఆరోపించారు.