బకాయి చెల్లించు..ఓటు అడుగు! | Chandrababu Naidu Cheated Farmers Of Anatapur District | Sakshi
Sakshi News home page

బకాయి చెల్లించు..ఓటు అడుగు!

Published Wed, Apr 3 2019 10:03 AM | Last Updated on Wed, Apr 3 2019 10:03 AM

Chandrababu Naidu Cheated Farmers Of  Anatapur District - Sakshi

చంద్రబాబు మోసానికి పరాకాష్ట 
ఖరీఫ్‌–2013లో జరిగిన పంట నష్టానికి సంబంధించి రూ.643.37 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీ (పెట్టుబడిరాయితీ)ని చెల్లిస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఘనంగా ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన పంట నష్టాలు తనకు సంబంధం లేదంటూ బుకాయించారు. 2013 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 8,98,402 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. అందులో ప్రధాన పంట వేరుశనగ 7,11,145 హెక్టార్లలో వేశారు. ఖరీఫ్‌ పంటల సాగు కోసం రూ.2 వేల కోట్లు వరకు పెట్టుబడి రూపంలో రైతులు ఖర్చు చేశారు. దాదాపు రూ.3,500 కోట్లు విలువ చేసే పంట దిగుబడులపై ఆశలు పెట్టుకున్నారు.

అయితే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరుణుడు మొహం చాటేయడంతో పంటలన్నీ దాదాపు ఎండిపోయాయి. సెప్టెంబర్‌ నెలల్లో మంచి వర్షాలు కురిసినా అప్పటికే నష్టం జరిగిపోయింది. పంట కోత ప్రయోగాలు చూస్తే హెక్టారుకు సగటున కేవలం 350 కిలోలు కూడా రాలేదు.  అందులోనూ పామిడి మండలంలో హెక్టారుకు 76 కిలోలు, శెట్టూరు మండలంలో 77 కిలోలు, రాప్తాడు మండలంలో 86 కిలోలు, కంబదూరులో 87 కిలోలు, తాడిపత్రిలో 95 కిలోలు, పెద్దపప్పూరులో 98 కిలోలు... ఇలా చాలా మండలాల్లో వేరుశనగ, ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 63 మండలాలను కరువు జాబితాలోకి చేర్చడంతో అధికారులు పంట నష్టం అంచనాలు వేశారు.

చివరకు 7.43 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. 6,21,528 మంది రైతులకు రూ.643.37 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే ఆమోదించి రైతులకు పరిహారం చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పంట నష్టం తనకు సంబంధం లేదంటూ రూ.643 కోట్లు ఇవ్వకుండా మోసం చేయడంతో రైతులు కోలుకోలేకపోయారు.   

రుణమాఫీ పరిస్థితి ఇలా...   
ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులు ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నాటికి జిల్లాలో పంట, బంగారు నగలు, ఇతరత్రా అనుబంధ రంగాలకు సంబంధించి 10.24 లక్షల ఖాతాల పరిధిలో రూ.6,817 కోట్ల మేర రుణాలు ఉన్నాయి. చంద్రబాబు చెప్పినట్లుగా ఇవన్నీ మాఫీ చేయాలి...  కోటయ్య కమిటీ, కుటుంబరావు కమిషన్, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్, కుటుంబ సభ్యుల పరిమితి, పంట, బంగారు నగలు అంటూ...  రకరకాల నిబంధనలు, షరతులు పెట్టి ఏడాది పాటు కాలయాపన చేశారు. చివరకు పంట, బంగారు నగలకు సంబం«ధించి రూ.2,744 కోట్లు మాఫీకి అంగీకరించారు. అది కూడా ఒకేసారి కాకుండా విడతల వారీ అంటూ నాన్చేశారు. 2018లోపు ఐదు విడతల్లో ఇస్తామని ప్రకటించి..  ఇప్పటికీ నాలుగు, ఐదు విడతలు పెండింగ్‌లో పెట్టారు. అలాగే మూడో విడత కింద కొంత పెండింగ్‌ ఉంది. మొత్తమ్మీద రుణమాఫీ కింద 5.50 లక్షల మంది రైతులకు రూ.1,165 కోట్లను ఈ ప్రభుత్వం ఎగనామం పెట్టింది.  

పంటల బీమా పరిస్థితి ఇలా..
2017 రబీలో ఫసల్‌బీమా కింద 12 వేల మంది పప్పుశెనగ రైతులు రూ.2 కోట్ల వరకు బీమా ప్రీమియం చెల్లించారు. పంట దారుణంగా దెబ్బతిన్నా... ఇప్పటి వరకూ పరిహారంపై అతీగతి లేదు. 2018 ఖరీఫ్‌లో 5.40 లక్షల మంది వేరుశనగ రైతులు తమ వాటా కింద రూ.83 కోట్ల వరకు బీమా ప్రీమియం కట్టారు. పంట మొత్తం పోయినా పరిహారం ప్రకటించలేదు. అదే ఏడాది రబీలో కూడా 1.05 లక్షల మంది పప్పుశెనగ రైతులు రూ.5 కోట్లకు పైగా బీమా ప్రీమియం చెల్లించారు. ఎకరాకు 50 కిలోలు కూడా దిగుబడులు రాలేదు. ఈ పరిహారాన్ని చెల్లించకుండా మోసం చేశారు. ఇలా బీమా పథకాల కింద ఎంతలేదన్నా... రూ.1,000 నుంచి రూ.1,200 కోట్లు పరిహారాన్ని రైతులకు ఈ ప్రభుత్వం దక్కకుండా చేసింది.

అలాగే రుణమాఫీ ఆలస్యం కావడంతో 2014లో జిల్లా రైతులకు పంట రుణాలు దక్కలేదు. ప్రీమియం చెల్లించే అవకాశం లేకపోవడం కారణంగా పంటలు దెబ్బతిన్నా... పంటల బీమా కింద పరిహారం దక్కకుండా పోయింది. దీని వల్ల దాదాపు రూ.200 కోట్లు మేర జిల్లా రైతులు నష్టపోయారు. ఇలా... చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు అడుగడుగునా నష్టాలను మూటగట్టుకున్నారు. ఇవన్నీ మరిపించే యత్నంగా అన్నదాత సుఖీభవ అంటూ ఒక్కో రైతుకుటుంబం ఖాతాలో కేవలం రూ.1,000 జమ చేస్తున్నారు. దీని కింద ఇప్పటివరకూ జిల్లా రైతుల ఖాతాల్లోకి రూ.50 కోట్ల మేర జమ అయినట్లు చెబుతున్నారు. ఇంకా లక్ష మందికి పైగా రైతులు సుఖీభవ సొమ్ము కోసం తిరుగుతున్నారు.  

జిల్లా రైతులకు అందాల్సిన పరిహారం ఇలా...  

ఇన్‌పుట్‌ సబ్సిడీ 2,460కోట్లు
ఇన్సూరెన్స్‌ 1,200కోట్లు
రుణమాఫీ 1,165కోట్లు
ఇతరాత్ర 175కోట్లు
మొత్తం 5,000కోట్లు

సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రైతులకు రమారమి రూ. 5వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2013 ఇన్‌పుట్‌ మొదలుకుని... వాతావరణ బీమా, ఫసల్‌బీమా, రుణమాఫీ, 2018 ఇన్‌పుట్‌ వరకు... జిల్లా రైతులకు అందజేయాల్సిన ఇంత పెద్ద మొత్తాన్ని ఇవ్వకుండా మభ్య పెడుతూ వచ్చారు. చివరకు అన్నదాత సుఖీభవ అంటూ రూ.50 కోట్లు చిల్లర విదిలించి పండుగ చేసుకోండంటూ రైతులను దగా చేశారు. ఐదేళ్ల పాటు రైతులను కన్నీళ్లు పెట్టించిన చంద్రబాబు సర్కారు..  ఎన్నికల సమయంలో తనదైన శైలి మోసపూరిత వాగ్ధానాలతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అన్నదాతపై వరాలు, వాగ్ధానాలు గుప్పించి గట్టెక్కగానే రైతు సంక్షేమాన్ని విస్మరించడం చంద్రబాబుకు ముందు నుంచి అలవాటు.  

రైతులకు దక్కాల్సిన ఇన్‌పుట్‌ పరిహారం ఇలా..  
2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2013 ఖరీఫ్‌లో జరిగిన పంట నష్టం సొమ్ము రూ.643 కోట్లను రైతులకు చెల్లించకుండా చంద్రబాబు సర్కార్‌ ఎగ్గొట్టింది.  ఈ పంట నష్టం తమ ప్రభుత్వ హయాంలోనిది కాదంటూ బుకాయించి, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మోసానికి తెరలేపారు. దీంతో 6.21 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ పరిహారం దక్కకుండా పోయింది. 2014 ఖరీఫ్‌లో జరిగిన పంట నష్ట పరిహారానికి సంబంధించి రూ.567 కోట్లు ఇవ్వగా అందులో రూ.35 కోట్లు ప్రభుత్వ ఖజానాకు మళ్లించి, ఇతర అవసరాలకు వాడుకున్నారు. 2015లో రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఇన్‌పుట్‌ పరిహారం మంజూరు చేసిన చంద్రబాబు సర్కారు...

పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన ‘అనంత’ రైతులకు మాత్రం పైసా విదల్చలేదు. దీంతో ఎంతలేదన్నా రూ.500 కోట్లు పరిహారం రైతులు కోల్పోయారు. 2015 నవంబర్‌లో సంభవించిన వరుస తుఫాన్లకు వేరుశనగ పంట పొలాల్లోనే కుళ్లిపోయి కనీసం పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా పోయింది. ఇందుకు సంబంధించి జిల్లాలోని 16 వేల మంది రైతులకు రూ.23 కోట్లు ఇన్‌పుట్‌ ఇస్తామని అతీగతి లేకుండా చేశారు. 2016 ఖరీఫ్‌కు సంబంధించి మంజూరు చేసిన ఇన్‌పుట్‌ పరిహారంలో ఇప్పటికీ రూ.65 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. ఇన్‌పుట్‌ జాబితాలో అధికార పార్టీ జోక్యం మితిమీరిపోవడంతో వేలాది రైతులకు పరిహారం రాలేదు. దీంతో అర్జీలు ఇస్తే పరిహారం ఇస్తామంటూ ప్రకటించడంతో 1.15 లక్షల మంది అర్జీలు సమర్పించారు.

అర్జీలు పరిశీలించిన తర్వాత రూ.143 కోట్లు ఇన్‌పుట్‌ అవసరమంటూ అధికారులు నివేదిక ప్రభుత్వానికి పంపినా ఉలుకూ పలుకు లేదు. 2018లో 45 శాతం లోటు వర్షపాతం నమోదుతో ఖరీఫ్, రబీ పంటలు 100 శాతం దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖరీఫ్‌లో జిల్లాలోని 63 మండలాలు, రబీలో 32 మండలాలను కరువు జాబితాలోకి ప్రకటించింది. ఈ క్రమంలో ఖరీఫ్‌ పంట నష్టం కింద రూ.967 కోట్లు, రబీ పంట నష్టం కింద రూ.100 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ సొమ్మునూ ఇవ్వకుండా మోసం చేశారు. ఇవి కాకుండా మధ్య మధ్యలో అకాల వర్షాలు, అధిక వర్షాలు, వడగండ్లు, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి రూ.10 కోట్ల వరకు పరిహారం అందాల్సి ఉంది. ఇలా... కేవలం ఇన్‌పుట్‌ సబ్సిడీ కిందనే రూ.2,460 కోట్లకు పైగా పరిహారాన్ని రైతులకు చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది.  

దగా చేశారు 

నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. బత్తలపల్లిలోని కార్పొరేషన్‌ బ్యాంక్‌లో రూ.80వేలు పంట రుణం తీసుకున్నా. రుణమాఫీ కింద రూ.30 వేలు మాత్రమే మాఫీ చేశారు. మిగిలిన మొత్తం అలాగే ఉంది. పంట నష్ట పరిహారం కానీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ కాని ఒక్క రూపాయి కూడా అందలేదు. పంటలు నష్టపోయినా ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా డబ్బులు పడలేదు.  – బి.లక్ష్మీరెడ్డి, రైతు, ఎం.చెర్లోపల్లి, బత్తలపల్లి మండలం

ఎలాంటి సాయమూ అందలేదు

నాకు 5.15 ఎకరాల భూమి ఉంది. బత్తలపల్లి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో రూ.1.20 లక్ష పంట రుణం తీసుకున్నా. రెండు విడతల్లో రూ.56 వేలు మాఫీ అయింది. మూడో విడత బాండ్‌తో సరిపెట్టారు. 4, 5 విడతలకు నిధులు విడుదల చేయలేదు. పంట నష్ట పరిహారం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు ఏదీ అందలేదు. రైతులకు ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదన్నది పచ్చి నిజం. – పాళ్యం అప్పస్వామి, రైతు, గంటాపురం, బత్తలపల్లి మండలం   

చంద్రబాబు పచ్చి మోసకారి 

నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వర్షాలు రాక పంటలు ఎండిపోయాయి. 2013లో రొళ్ల ఏబీజీబీలో పంట రుణం కింద రూ.90 అప్పు తీసుకున్నా. చంద్రబాబు లెక్క ప్రకారం పూర్తిగా రుణమాఫీ కావాల్సి ఉంది. అయితే రూ.50వేలు పైబడి రుణాలు పొందిన రైతులకు ప్రతి ఏడాది 20 శాతం చొప్పున మాఫీ చేస్తామని చెప్పి మూడు విడతలు మాత్రమే అందించారు. మిగిలిన 4, 5 విడతల మాఫీ సొమ్ము జమ చేయలేదు. దీంతో వడ్డీ, అసలు కలుపుకుని ప్రస్తుతం రూ.లక్షకు అప్పు చేరుకుంది.  ఈ చంద్రబాబు పచ్చి మోసకారి. నమ్మగూడదు. – రైతు సన్నదాసప్ప, ఆర్‌.గొల్లహట్టి గ్రామం, రొళ్ల మం‘‘  

రూపాయి పరిహారం ఇచ్చుంటే ఒట్టు

నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఏటా ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేస్తుంటాను. 2015, 2016లో జరిగిన పంట నష్టాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. పలుమార్లు అధికార కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. నాతో పాటు మా ఊళ్లో మరో పది రైతులకూ పరిహారం అందలేదు. టీడీపీ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి మేలు జరగదు అనేందుకు మేమే ఉదాహారణ. – లెనిన్‌ బాబు, రైతు, బెస్తరపల్లి, కుందుర్పి మం‘‘  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement