గుడుల్ని మింగేశారు.. గుడుల్లోని లింగాలనూ.. | The TDP Leaders Occupied The Endowments Land In The State | Sakshi
Sakshi News home page

గుడుల్ని మింగేశారు.. గుడుల్లోని లింగాలనూ..

Published Tue, Apr 9 2019 9:37 AM | Last Updated on Tue, Apr 9 2019 10:12 AM

The TDP Leaders Occupied The Endowments Land In The State - Sakshi

సాక్షి, అమరావతి : గుడుల్ని మింగేశారు. గుడుల్లోని లింగాలనూ మింగేశారు. ఆలయ భూములు ఒక లెక్కా అనుకున్నారు.  అధికారంలోకి రాగానే క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆలయ మాన్యాలను, సత్రం, మఠాల భూములను కాజేశారు. లీజుల పేరిట వేలాది ఎకరాల్ని చెరబట్టారు. కోట్లాది రూపాయల విలువైన భూములను నామమాత్రపు ధరకు అప్పనంగా బొక్కేశారు. ఆదాయం వచ్చే ఆలయాలపై పెత్తనాన్ని తమ వారికి కట్టబెట్టారు. దేవదాయ శాఖ పరిధి నుంచి తప్పించి.. కావాల్సిన వారికి అప్పగించి సర్వాధికారాలు కట్టబెట్టారు. ఐదేళ్లలో అంతా కానిచ్చేసిన టీడీపీ పెద్దలు.. మరోసారి అధికారం కట్టబెడితే 
సర్వమంగళం పాడేందుకు సిద్ధమయ్యారు. 

మెడికల్‌ కాలేజీ పేరిట అప్పనంగా కాజేశారు

విశాఖపట్నం చుట్టపక్కల గల 232 ఎకరాల దేవుడి భూములను అధికారం అడ్డుపెట్టుకుని అంగటి సరుకు చేశారు. విజయనగరంలో మెడికల్‌ కాలేజీ కడతామని నమ్మించి.. అప్పనంగా కాజేశారు. ప్రభుత్వం ఆ భూములను మెడికల్‌ కళాశాలకు విక్రయించగా.. నాలుగేళ్లు పూర్తయినా మెడికల్‌ కళాశాల నిర్మాణం నేటికీ అతీగతీ లేదు. 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే విజయనగరం ఎంపీ పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుటుంబీకులు దేవుడి భూముల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవడం.. మరో మూడు నెలలకే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.

విశాఖ జిల్లా భీమిలి, ఆనందపురం మండలాలతోపాటు విజయనగరం జిల్లా నారాయణపురం మండలం, విజయనగరం పట్టణంలోని 13 సర్వే నంబర్లలో 231.84 ఎకరాల భూమి అమ్మకానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ 2015 జనవరి 27న మెమో 37943 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్‌ కాలేజీ నిర్మాణం పేరుతోనే రెండో విడతలో మరో 400 ఎకరాలు దేవుడి భూమి కూడా అమ్మకానికి సైతం ప్రభుత్వం  సానుకూలత వ్యక్తం చేసింది.  2015లోనే ఈ భూముల అమ్మకం ద్వారా టీడీపీ నేతల సంస్థలకు దాదాపు రూ.550 కోట్లు  దక్కాయి. కానీ.. మెడికల్‌ కాలేజీ పునాదులు కూడా ప్రారంభం కాలేదు. ఆ నిధులు ఏమయ్యాయని అడిగితే చెప్పే నాథుడే లేడు. 

లీజుల పేరిట ఎత్తుగడ

న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయనుకునే దేవుడి భూములను టీడీపీ నేతలు 11 ఏళ్లు, 33 ఏళ్ల లీజుల పేరుతో సొంతం చేసుకున్నారు. దేవదాయ శాఖ ఆధీనంలో 4,53,459.31 ఎకరాలతోపాటు 9 లక్షల చదరపు గజాల వాణిజ్య భూములు ఉండేవి. విశాఖపట్నం సముద్ర తీరంలో ‘ప్రేమ సమాజం’ ధార్మిక సంస్థకు గల రూ.220 కోట్ల విలువైన భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించుకుని టీడీపీ నేతలతో బాగా దగ్గర సంబంధాలున్న వారు పెద్ద స్టార్‌ హోటల్‌ నిర్మించారు.

చంద్రబాబు సీఎం కాగానే స్టార్‌ హోటల్‌ నిర్మించిన భూముల లీజు ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసింది.  విజయవాడ దుర్గగుడి భూముల్లో నడుస్తున్న సిద్ధార్థ కాలేజీ భూముల లీజు విషయంలోనూ ఈవో ప్రతిపాదించిన ధరలో పదో వంతు నిర్ణయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పొన్నూరు పట్టణంలో గల వాణిజ్య భూములను అక్కడి టీడీపీ ఎమ్మెల్యేకి కావాల్సిన వారే దీర్ఘకాలిక లీజుకు కొట్టేశారు. రాష్ట్రమంతటా దాదాపు 4 వేల ఎకరాల దేవుడి భూములను దీర్ఘకాలిక లీజు పేరుతో టీడీపీ నేతలు కాజేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.   

అస్మదీయులకు ఆలయాల్ని రాసిచ్చారు 
విశాఖపట్నంలో సంపత్‌ వినాయక ఆలయం ఉంది. ఈ ఆలయం ఉత్తరాంధ్రలో చాలా ప్రాచుర్యం పొందింది. ఏటా రూ.2.50 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఆలయం పేరిట రూ.100 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. ఆరు నెలల క్రితం వరకు ఈ గుడి దేవదాయ శాఖ అధీనంలోనే ఉండేది. 2018లో ఆ అలయాన్ని దేవదాయ శాఖ పరిధి నుంచి తప్పించి తమకు కావాల్సిన వ్యక్తికి అప్పగించారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి.

కృష్ణా జిల్లాలో రూ.500 కోట్ల విలువైన ఆస్తులున్న వేదాద్రి, ముక్త్యాల ఆలయాలను దేవదాయ శాఖ పరిధి నుంచి తప్పించి కావాల్సిన వారికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆలయాలకు చెందిన భూములను కొట్టేయడానికి టీడీపీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుతం సీఎం వద్ద అన్నీ తానై చక్రం తిప్పే ఎమ్మెల్సీ పెద్ద ప్రయత్నమే చేశారు. భక్తులు తిరగబడటంతో ఆ ప్రయత్నాలు విఫలం కాగా.. తమ పలుకుబడితో ఆ ఆలయాలను దేవదాయ శాఖ పరిధి నుంచి తప్పించి తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. రాష్ట్రంలో బాగా ఆదాయం వచ్చే, విలువైన ఆస్తులున్న ఆలయాలు దాదాపు 60 వరకు ఉన్నాయి. వీటన్నిటినీ దేవదాయ శాఖ పరిధి నుంచి తప్పించి ప్రైవేట్‌ పరం చేశారు. 

సదావర్తి భూములనూ వదల్లేదు

గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రం భూములను టీడీపీ పెద్దలు కారుచౌకగా కొట్టేయడానికి ఏం చేశారనేది ప్రజలందరికీ తెలిసిందే. చెన్నై సమీపంలో సత్రం పేరిట ఉన్న 83.11 ఎకరాల భూమి అక్కడి మార్కెట్‌ ధర ప్రకారం రూ.1,050 కోట్లు ఉంటుందని అంచనా ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఆ భూములు విక్రయించాలంటూ పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్‌ ప్రభుత్వానికి లేఖ రాయడం, అందుకు అనుమతి ఇవ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి.

ఆ భూములను టీడీపీ నేత, ఆయన అనుచరులు కేవలం రూ.22.44 కోట్లకు కొట్టేయడానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఆ భూములకు ప్రభుత్వం మరోసారి వేలం నిర్వహించాల్సి వచ్చింది. రెండో విడత వేలంలోనూ వైఎస్సార్‌ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు రూ.60.30 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో ఆ భూముల అమ్మకం ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.  

ఎన్‌వోసీల పేరిటా లాగించేశారు 
4.53 లక్షల ఎకరాల దేవుడి భూముల సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్‌ శాఖకు తెలియజేసి, ఆ భూములపై క్రయవిక్రయాలు జరగకుండా గతంలో ఆంక్షలు విధించారు. అయితే, పలుచోట్ల టీడీపీ నాయకులు దేవుడి భూములను తమ భూములుగా  చెప్పుకుని.. వాటి విక్రయాలపై ఆంక్షలు తొలగించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా 3,700 ఎకరాలకు సంబంధించి 485 ఎన్‌వోసీ (నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌)లను 
దేవదాయ  శాఖ జారీ చేసింది.  అందులో  దాదాపు వెయ్యి ఎకరాల వరకు టీడీపీ నేతలు అక్రమంగా కొట్టేశారు. 

రాజంపేటలో చౌకగా కొట్టేశారు 

వైఎస్సార్‌ జిల్లా రాజంపేట పట్టణ నడిబొడ్డున రూ.50 కోట్ల విలువ చేసే ఆలయ భూమిపై 2010–11లో టీడీపీ నేతల కన్నుపడింది. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూములను కారుచౌకగా కొనుగోలు చేశారు. ఆలయ సంబంధీకుల నుంచి ఆ టీడీపీ నేత కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌కు అనుమతి కోరుతూ అప్పట్లోనే దేవదాయ శాఖ అనుమతి కోరారు. అప్పటి ప్రభుత్వాలు అందుకు అనుమతి నిరాకరించాయి. సీఎంగా పనిచేసిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు ఆ టీడీపీ నేతతో దగ్గర సంబంధాలు ఉన్నప్పటికీ, దేవుడి భూముల విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన వెంటనే ఆ టీడీపీ నేత నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన ఆ భూముల రిజిస్ట్రేషన్‌కు అభ్యంతరాలు లేకుండా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 

అర్చకులకూ వేధింపులు 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజులవి. 2001లో మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌ వేణుగోపాలస్వామి ఆలయ అర్చకుడు భీమశేనాచారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అకస్మికంగా రిటైర్మెంట్‌ నోటీసులిచ్చి.. మరుసటి రోజు నుంచి ఆయనను ఆలయానికి రావొద్దని హుకుం జారీ చేసింది. జీవనోపాధి తీసివేయడంతో కలత చెందిన ఆ అర్చకుడు స్వామివారికి నివేదిన పూర్తి చేసి.. ఆ రోజే ఆలయంలోని గంటలకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

2008లో అప్పటి ముఖ్యమంత్రి ఆదాయం లేని ఆలయాలన్నిటినీ తెరవాలని.. నిత్యం ధూపదీప నైవేద్య కైంకర్యాలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఆదాయం లేని ఆలయాల్లో పనిచేసే పూజారికి ప్రతినెలా రూ.2,500 గౌరవ వేతనం ప్రభుత్వమే చెల్లించే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించి.. హిందూ మత ప్రముఖుల సూచనల మేరకే దేవదాయ శాఖ పనిచేయాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో చట్టం చేసి ధార్మిక పరిషత్‌లను ఏర్పాటు చేశారు. అర్చకులకు వంశపారంపర్య హక్కును కల్పించారు.  

ఆలయాలు ఎదుర్కొంటున్న సవాళ్లు 
దేవాదాయ చట్టంలో 30–87 అనే దుష్టశాసనం కారణంగా రాష్ట్రంలో వేలాది ఆలయాలు ప్రాభవాన్ని కోల్పోయాయి. వేలాది ఆలయాలు మూతబడ్డాయి. అర్చకులు ఇతర వృత్తులకు మళ్లుతున్నారు. 

చంద్రబాబు పాలనలో చీకటి రోజులు 
వైఎస్‌ హయాంలో రాష్ట్రంలో 23 వేల ఆలయాలు ఉన్నట్టు గుర్తించగా.. 2014లో చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత 20 వేల ఆలయాలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఆలయాల్లో కనీసం నైవేద్యం పెట్టే దిక్కు కూడా లేకుండాపోయింది. రోడ్లపై ఆలయాలు అడ్డంగా ఉన్నాయని కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 39 పురాతన ఆలయాలను ప్రభుత్వమే కూల్చివేయించింది. తిరుమల క్షేత్రంలో పోటు గదులను మూసివేసి.. వాటిలో తవ్వకాలు జరిపారని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తప్పు పడితే, ఆయనను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

ఆలయాలపై చంద్రబాబు ప్రభుత్వం నియమించిన పాలకమండళ్ల పెత్తనం అధికమైంది. టీడీపీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు అర్చకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించాలని అర్చకులు సీఎం చంద్రబాబును అడిగితే గొంతెమ్మ కోర్కెలు కోరవద్దంటూ వారిని అవమానకరంగా మాట్లాడారు. 

అర్చకులను టీడీపీ మోసగించింది 
ఆదినుంచీ టీడీపీ ప్రభుత్వం అర్చకులను మోసగిస్తూనే ఉంది. టీడీపీ 30–87 అనే రాక్షస చట్టాన్ని తెచ్చి ఆలయ వ్యవస్థను, అర్చక వ్యవస్థను నాశనం చేసింది. 2014 ఎన్నికల సందర్భంగా అర్చకులకు, ఆలయాల కోసం ఏవేవో చేస్తానని హామీలిచ్చి, అవేమీ చేయకపోగా, మరింత దుర్మార్గంగా వ్యవహరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వంశపారంపర్యంగా ఆలయాల్లో పనిచేసే అర్చకులకు హక్కులు కల్పిస్తామనే హామీని నిలబెట్టుకోకపోగా, పరమ పవిత్రమైన తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల విషయంలో ఈ ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించింది. 
–అగ్నిహోత్రం ఆత్రేయబాబు, పెద్దింటి రాంబాబు, ఆంధ్రప్రదేశ్‌ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి, కార్యనిర్వాహక కార్యదర్శి  

దేవదాయ భూముల వాస్తవ పరిస్థితి (ఎకరాల్లో)
ఆలయంలో పనిచేసే భజంత్రీ తదితరుల అధీనంలో ఉన్నవి : 9073.79
ఇతరుల చేతుల్లో ఉన్న  ఈనాం భూములు : 24,614.48
వివిధ శాఖల అవసరాలకు తీసుకుని సొమ్ములు చెల్లించనివి : 10,653.01
అర్చకుల అధీనంలో ఉన్నవి : 92,077.43
దేవదాయ శాఖ భూములు : 4,53,459.31
ఆక్రమణల్లో ఉన్న భూములు : 1,26,201
దేవదాయ వాణిజ్య భూములు : 9లక్షల చదరపు గజాలు
మిగిలినవి : 1,91,020
సత్రాలు : 2,033 
మఠాలు :137 
రాష్ట్రంలో ఆలయాలు : 21,665  

– మేడికొండ కోటిరెడ్డి, సాక్షి, అమరావతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement