బాబు 'పాల్‌' ట్రిక్స్‌ | Chandrababu Naidu Politics With KA Paul Praja Shanti Party | Sakshi
Sakshi News home page

బాబు 'పాల్‌' ట్రిక్స్‌

Published Wed, Mar 27 2019 12:14 PM | Last Updated on Wed, Mar 27 2019 12:14 PM

Chandrababu Naidu Politics With KA Paul Praja Shanti Party - Sakshi

ఎన్నికల సమరంలో టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. ధర్మబద్ధంగా వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనలేక అధర్మ మార్గాలను ఎంచుకుంటోంది. మంగళవారం నామినేషన్ల పరిశీలనలో ఈ తంతు వెలుగుచూసింది. నాలుగు పార్టీలు బరిలో ఉన్నా పోటీ మాత్రం వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యే సాగనుంది. పోలింగ్‌లో ఓటర్లను గందరగోళానికి గురిచేసేందుకు అధికార పార్టీ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ ఓట్లను చీల్చేందుకు కేఏ పాల్‌ పార్టీ అభ్యర్థులను టీడీపీ వారే బరిలోకి దించినట్టు అర్థమవుతోంది.     పలమనేరులో పోటీకి దించిన వ్యక్తి పేరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎన్‌.వెంకటే గౌడ పేరును పోలి ఉంటుంది. శ్రీకాళహస్తిలో టీడీపీ నాయకులే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని ప్రతిపాదించారు. దీన్నిబట్టి     ఇది టీడీపీ కుట్రే అని స్పష్టమవుతోంది.

సాక్షి, తిరుపతి/పలమనేరు/శ్రీకాళహస్తి: ఓటర్లను అయోమయానికి గురిచేసి లబ్ధిపొందాలని భావించిన టీడీపీ నేతలు ప్రజాశాంతి పార్టీ పేరుతో డమ్మీ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించారు. కొన్నిచోట్ల ఆ అభ్యర్థులను బలపరచిన వారు టీడీపీ నాయకులే కావడం విశేషం. కుప్పం, చంద్రగిరి, పలమనేరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు నామినేషన్‌ వేయగా కుప్పం, చంద్రగిరి లో ఆ నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జిల్లాలో టీడీపీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు ప్రాతిని«థ్యం వహిస్తున్న కుప్పం, సొంత నియోజకవర్గం చంద్రగిరిలో కూడా ఇదే పరిస్థితి. కుప్పంలో ఐదేళ్ల కాలంలో చంద్రబాబు సీఎం హోదాలో ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. దీంతో స్థాని క ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చంద్రబాబు చేపట్టిన సొంత సర్వేలో తేటతెల్లం అయ్యింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళి తరఫున ఆయన బంధువులు సోమవారం నామినేషన్‌వేసిన విషయం తెలిసిందే. ఈ నామినేషన్‌ కార్యక్రమానికి భారీ ఎత్తు న జనం తరలిరావడంతో టీడీపీ నేతల్లో గుబులు పుట్టింది. విషయాన్ని అధినేత చంద్రబాబుకు చేరవేశారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు అడ్డదారులు తొక్కడానికి వెనుకాడలేదు. ప్రజాశాంతి పార్టీఅధ్యక్షుడు కేఏ పాల్‌తో తెరచాటు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఫ్యాను.. హెలికాప్టర్‌ గుర్తులకు దగ్గరి పోలిక ఉండడమే
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు ఫ్యాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. కేఏ పాల్‌ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్‌. వైఎస్సార్‌సీపీ పార్టీ గుర్తు ఫ్యానుకి హెలికాప్టర్‌కు దగ్గరి పోలికలు ఉండడంతో ఓటర్లను అయోమయానికి గురిచేసేందుకు అవకాశాలు ఉన్నాయని భావించారు. ప్రజాశాంతి పార్టీకి కనీసం కార్యకర్తలు లేకపోయినా టీడీపీ నాయకులను రంగంలోకి దింపారు. కుప్పంలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా శాంతిపురం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు బాలకుమార్‌తో చివరి నిముషంలో హడావుడిగా వచ్చి కేఏ పాల్‌ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో ఈసారి కూడా టీడీపీ గెలిచే అవకాశాలు లేవు. సొంత నియోజకవర్గంలోనే పార్టీ గెలవలేకపోతే రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ పార్టీల అధ్యక్షుల వద్ద విలువ ఉండదని భావించి చంద్రగిరిలోనూ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని రంగంలోకి దింపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భాస్కరరెడ్డి కావడం.. టీడీపీ కూడా అదే పేరు కలిగిన మరో భాస్కరరెడ్డి చేత నామినేషన్‌ వేయించారు. ప్రజాశాంతి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన భాస్కరరెడ్డి కూడా తుమ్మలగుంటకు చెందిన టీడీపీ నాయకుడు. వీరి ద్వారా వైఎస్సార్‌సీపీ ఓటర్లను అయోమయంలో పడేసి లబ్ధి పొందవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎత్తుగడ.

ఇవిగో సాక్ష్యాలు
పలమనేరు టీడీపీ అభ్యర్థిగా అమరనాథరెడ్డి సోమవారం నామినేషన్‌ వేశారు. ఆయన సమర్పించిన నామినేషన్‌ అఫిడవిట్‌ను పుంగనూరులోని ఓ నోటరీ ద్వారా చేయించారు. అదే నోటరీ వద్ద అదేరోజు పుంగనూరు నియోజకవర్గం వనమలదిన్నెకు చెందిన ఎన్‌.వెంకటరమణ నాయుడు సైతం నామినేషన్‌ అఫిడవిట్‌ చేయించారు. ఆపై స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థితో పాటు తాము నామినేషన్లు వేయించిన అందరు అభ్యర్థుల తరఫున టీడీపీ వారు నియమించుకున్న వ్యక్తులు దగ్గరుండి వాటిని ఓకే చేయించుకున్నారు.

బీ–ఫారమ్‌లో పార్టీ అధ్యక్షుడి సంతకాల్లో తేడా
నామినేషన్‌ ఫారం–ఏలో ఆ పార్టీ అధ్యక్షుడు ఆథరైజ్‌ చేసిన వారి సంతకం ఉండాలి. కానీ ప్రజాశాంతి తరఫున సమర్పించిన పత్రాల్లో సంతకాల్లో తేడాలున్నాయని సమాచారం. దీనిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడి రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి ఆపై చెబుతామని అధికారులు తెలిపారు. ఎన్నికలకు ముందే టీడీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మంత్రి ఓటమి భయంతోనే ఇన్ని అక్రమమార్గాల ద్వారా రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల మద్దతు
శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గానికి వేసిన నామినేషన్లలో ప్రజాశాంతి పార్టీ తరఫున నకిలీ దరఖాస్తులు ఉన్నట్లు స్వతంత్ర అభ్యర్థి దావాల గిరి గుర్తిం చారు. ప్రజాశాంతి పార్టీ రిజిస్టర్‌ పార్టీ కాకపోవడంతో పది మంది మద్దతుదారులు ఉండాల్సి ఉంది. ఫారం–2బిలో ప్రతిపాదకునిగా ఉన్న రామకృష్ణతో పాటు 10 మందిలో ఒకరుగా ఉండాల్సి ఉంది. కానీ వీరి పేరు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకాళహస్తి మిల్క్‌ సొసైటీ చైర్మన్‌ రావిళ్ల మునిరాజనాయుడు, తెలుగుయువత మాజీ పట్టణాధ్యక్షుడు కాసరం రమేష్, పురపాలక సంఘం వైస్‌ చైర్మన్‌ మిన్నల్‌ రవి, రంగినేని చెంచుమోహన్, బాలిశెట్టి వర్మతో తదితరులు ప్రతిపాదనలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బి–ఫాంలో కూడా పాల్‌ శ్రీకాళహస్తిలో రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తప్పుడు రికార్డులు సృష్టించినట్లు తెలుస్తోంది. స్థానిక స్వతం త్ర అభ్యర్థి దావాల గిరి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

రెండుచోట్ల తిరస్కరణ
వైఎస్సార్‌సీపీని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు వేసిన పథకం పారలేదు. ప్రజాశాంతి పార్టీ గుర్తింపు లేనిది కావడం.. నామినేషన్‌ పత్రాల్లో పూర్తి స్థాయిలో సమాచారం లేకపోవడంతో ఎన్నికల అధికారులు కుప్పం, చంద్రగిరి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement