సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడంలేదు. ఉండవల్లిలో తన అధికారిక నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికను ఆయన పూర్తిస్థాయి పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన లెక్కచేయడంలేదు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో అక్కడే సమావేశం నిర్వహించనున్నారు. పోలింగ్ తర్వాత పరిణామాలు, గెలుపు అవకాశాలపై చర్చించేందుకు సోమవారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునే ప్రజావేదికలో పార్టీ సమావేశం ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రజావేదికను చంద్రబాబు పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు వినియోగించడం మొదలుపెట్టారు. ఎన్నికల నియమావళి ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు తమ అధికారిక నివాసాలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. సీఎంను కలిసేందుకు వచ్చే ప్రజల కోసం మూడేళ్ల క్రితం సీఆర్‌డీఏ ఐదున్నర కోట్లతో ప్రజావేదికను నిర్మించింది.
ప్రజల కోసమే దాన్ని వినియోగించాలి. అయితే.. ఇక్కడ ప్రజల నుంచి చంద్రబాబు విజ్ఞప్తులు స్వీకరించడం చాలా అరుదుగా జరుగుతుండేది. కృష్ణా నది కరకట్టపై తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లిలో ఉన్న లింగమనేని రమేశ్‌కు చెందిన అక్రమ కట్టడాన్ని చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్న విషయం తెలిసిందే. దాని పక్కనే ఈ గ్రీవెన్స్ హాలును నిర్మించారు. మొదటి నుంచి దీన్ని టీడీపీ కార్యక్రమాలకు ఎక్కువగా వినియోగిస్తున్న చంద్రబాబు ఎన్నికల సమయంలో దాన్ని పూర్తిస్థాయి పార్టీ కార్యాలయంలా మార్చివేశారు. పార్టీ కార్యకర్తల సమావేశాలు, జిల్లా, నియోజకవర్గాల సమీక్షలు, చేరికలు వంటి అన్ని కార్యకలాపాలన్నింటినీ ఇందులోనే నిర్వహిస్తున్నారు. పోలింగ్ జరగడానికి ముందు వివిధ జిల్లాల పార్టీ కార్యకర్తల సమావేశాలను వరుసగా ప్రజావేదికలో నిర్వహించారు.
ప్రభుత్వ నిధులతో నెలకొల్పిన కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఇక్కడి నుంచే పార్టీ యథేచ్ఛగా వినియోగిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారానే టెలీకాన్ఫరెన్స్‌లో వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ రాకముందు ప్రజావేదికను పార్టీ అవసరాల కోసం వినియోగించిన చంద్రబాబు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మరింత అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోకుండా దాన్ని పార్టీ కోసం వాడుకున్నారు. ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పార్టీ సమావేశాలు అందులోనే ఏర్పాటు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎన్నికల కోడ్ పట్టింపే లేదు
Published Mon, Apr 22 2019 4:31 AM | Last Updated on Mon, Apr 22 2019 4:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment