సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజల తీర్పును అపహాస్యం చేసేలా ప్రభుత్వ పెద్దలు చేస్తున్న దుష్ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. 2014 ఎన్నికల కంటే పకడ్బందీగా, మెరుగ్గా ఎన్నికలు నిర్వహించినప్పటికీ.. దురుద్దేశపూరితంగా, ఎన్నికల సంఘాన్ని అప్రతిష్ట పాలుచేసేలా పన్నాగం పన్నుతున్నారని నిర్ధారణకు వచ్చింది. ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూనే.. ముందుగా బురదజల్లేందుకు కుయుక్తులకు పాల్పడుతున్నారని భావిస్తోంది. ప్రభుత్వ పెద్దల వైఖరిని తీవ్రంగా పరిగణిస్తూ.. ఈ మేరకు పూర్తి నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రికార్డు స్థాయిలో దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైంది. 2014లో 78.41 శాతం ఓట్లు పోలవగా ఈసారి ఎన్నికల్లో 79.64 శాతం ఓట్లు పోలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు కూడా చాలావరకు తగ్గాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో 284 హింసాత్మక సంఘటనలు నమోదు కాగా.. ఈ ఎన్నికల్లో కేవలం 25 హింసాత్మక ఘటనలే జరగడం గమనార్హం. గత ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఆరుగురు మరణిస్తే.. ఈసారి ఇద్దరు మృతి చెందారు. ఇలా ఏ విధంగా చూసినా 2014 ఎన్నికల కంటే ఈ సారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయనే చెప్పాలి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని, ఈవీఎంల మొరాయింపు అంశంపై కూడా అర్థరహితంగా నానా యాగీ చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. 2014 ఎన్నికల్లో 3 శాతం ఈవీఎంలు మొరాయించగా ఈసారి మాత్రం కేవలం 0.03 శాతం ఈవీఎంలే మొరాయించాయి. అయినా పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లో నిలుచున్న వారందరికీ ఎంత రాత్రి అయినా ఓటింగ్ వేసే అవకాశం కల్పించారు. దివ్యాంగుల కోసం తొలిసారిగా ఈ ఎన్నికల్లో వీల్ చెయిర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించిందనడానికి ఈ అంశాలే నిదర్శనం.
అయినా ఎందుకింత రాద్ధాంతం..
ప్రభుత్వ పెద్దల ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం అసలు విషయం కూపీ లాగింది. అందులో విస్మయకర వాస్తవాలు వెలుగుచూశాయి. టీడీపీకీ అనుకూలురైన అతి కొద్దిమంది అధికారులు.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎన్నికల సంఘానికి చెడ్డపేరు తెచ్చేందుకు ఉద్దేశపూర్వకంగానే సరిగా ఏర్పాట్లు చేయలేదు. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లకు ఎన్నికల సంఘం పూర్తి స్వేచ్ఛను, అధికారాలను ఇచ్చింది. వారు అడిగినన్ని నిధులు కూడా విడుదల చేసింది. ఎండ వేడిని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, నీడనిచ్చే విధంగా టెంట్లు ఏర్పాటు చేయాల్సిందిగా పలుమార్లు సూచించింది. కానీ కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కావాలనే ఈ మేరకు ఏర్పాట్లు చేయలేదన్న విషయం తెలియవచ్చింది. అంతేకాదు ఆ పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ అనుకూల ఎల్లో మీడియా ముందస్తుగానే సన్నద్ధమై.. ఎన్నికల ఏర్పాట్లలో లోపాలను ఎత్తిచూపిస్తూ దుష్ప్రచారం చేసినట్లు తేలింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది విఫలమైనట్లు కథనాలు వండివార్చింది.
వాస్తవానికి పోలింగ్ తేదీకి ముందు టీడీపీకి అనుకూలంగా, ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగి వ్యవహరిస్తున్న సీఎస్ సహా పలువురు అధికారులను ఆ బాధ్యతల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తప్పించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి నివేదికలు తెప్పించుకున్న సీఈసీ ఈ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘంపై తొలినుంచీ ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ పెద్దలు.. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైందని ప్రచారం చేసేందుకు తమ అనుకూల అధికారులను పావులుగా వాడుకున్నట్టుగా ఎన్నికల సంఘం విచారణలో తేలింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న 3.5 లక్షల మంది ఉద్యోగులు, అధికారులందరూ ఎన్నికల సంఘం కిందకే వస్తారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వీరినందరినీ వదిలేసి కేవలం ఎన్నికల సంఘంలోని ఒకరిద్దరు ఉన్నతాధికారులనే లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేయడం గమనార్హం. 11వ తేదీ ఎన్నికలు ప్రారభమైన వెంటనే 30 శాతం ఓటింగ్ యంత్రాలు పనిచేయడం లేదంటూ ముఖ్యమంత్రి ప్రచారం చేశారని, వాటి వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘం బహిరంగంగా సవాల్ విసిరితే స్పందించ లేదని ఈసీ అధికారులు చెబుతున్నారు.
నిబంధనలు పాటిస్తే ఒకరికి కొమ్ము కాయడమా?
నిబద్ధతతో వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదితోపాటు ఎన్నికల సంఘం అధికారులపై చంద్రబాబు, టీడీపీ అసత్య ఆరోపణలు చేయడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏ పార్టీకి కొమ్ము కాయకుండా స్వతంత్రంగా వ్యవహరించిన అధికారులకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదించడాన్ని నిపుణులు, రిటైర్డ్ ఉన్నతాధికారులు తప్పుబడుతున్నారు. ఎన్నికల సంఘంపై అధికార టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం ప్రభావం.. మలిదశ ఎన్నికలపై పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికలు ఎంత సజావుగా నిర్వహించిందీ, అలాగే అధికార టీడీపీ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తోందీ వివరిస్తూ పూర్తి నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం తయారు చేస్తున్నట్లు సమాచారం.
పోలింగ్ సరళిపైనా అవాస్తవాల ప్రచారం
ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రతో టీడీపీ విడుదల చేసిన పోలింగ్ సరళి వివరాలు పూర్తిగా అవాస్తమన్నది బట్టబయలైంది. 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా.. తెల్లవారుజాము వరకు పోలింగ్ నిర్వహించడం ఎన్నికల సంఘం వైఫల్యంగా సీఎం చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా ప్రధానంగా చెబుతోంది. ఈ మేరకు గురువారం రాత్రి 9 గంటల తర్వాత కూడా పోలింగ్ నిర్వహించిన కేంద్రాలు ఇవీ అంటూ టీడీపీ ఓ జాబితాను సోమవారం విడుదల చేసింది. కానీ అందులోని వివరాలన్నీ అవాస్తవమని తేలింది. రాష్ట్రంలో పోలింగ్ సరళికి సంబంధించిన వాస్తవాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గురువారం రాత్రి 9 గంటల తరువాత సాగిన పోలింగ్‌కు సంబంధించి టీడీపీ ఆరోపణలు, అసలు వాస్తవాలు ఇలా ఉన్నాయి...
- గురువారం రాత్రి 9 గంటల తరువాత ఏకంగా 724 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగించారని టీడీపీ ఆరోపించింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 120 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగించారని పేర్కొంది. కానీ అసలు వాస్తవం ఏమిటంటే... రాత్రి 9 గంటల తర్వాత కేవలం 119 కేంద్రాల్లోనే పోలింగ్ కొనసాగింది. ఇక అనంతపురం జిల్లాలో అయితే కేవలం 7 కేంద్రాల్లోనే పోలింగ్ కొనసాగింది.
- గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య 75 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారని టీడీపీ ఆరోపించింది. కానీ వాస్తవం ఏమిటంటే ఆ సమయంలో కేవలం 9 కేంద్రాల్లోనే పోలింగ్ కొనసాగించింది. అది కూడా ఒక్క కృష్ణా జిల్లాలోని 9 కేంద్రాల్లోనే పోలింగ్ నిర్వహించారు. అది కూడా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడి చాలాసేపు గందరగోళం సృష్టించారు. అందుకే పోలింగ్ ఆలస్యమైంది.
- శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల నుంచి 4 గంటల మధ్య 8 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారని టీడీపీ ఆరోపించింది. కానీ ఆ సమయంలో కేవలం 3 పోలింగ్ కేంద్రాల్లోనే ఓటింగ్ నిర్వహించారన్నది అసలు వాస్తవం.
Comments
Please login to add a commentAdd a comment