విత్తు లేదు..రుణం రాదు
- వేరుశెనగ విత్తనాలు అవసరం 2.10 లక్షల క్వింటాళ్లు
- ప్రభుత్వం చెప్పింది 83 వేలు, ఇచ్చింది 55వేల క్వింటాళ్లు
- బ్యాంకుల రుణ పంపిణీ లక్ష్యం రూ.2,808 కోట్లు
- మూడు నెలల్లో ఇచ్చింది రూ.300 కోట్లే
సాక్షి, చిత్తూరు: ప్రభుత్వం మాటమీద నిలబడే పరిస్థితి లేకపోవడంతో జిల్లాలో అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. రైతులకు అవసరమైనన్ని విత్తనాలతో పాటు బ్యాంకు రుణాలను పెద్ద ఎత్తున ఇస్తామన్న ప్రభుత్వం మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.7,493.94 కోట్లు రుణాలు ఇవ్వనున్నట్లు బ్యాంకులు ప్రకటించాయి. ఇందులో ఒక్క పంట రుణాలే రూ 2,808 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపాయి.
ఏప్రిల్ నుంచి రుణ పంపిణీని ప్రారంభించినా మూడు నెలల కాలంలో కేవలం రూ.300 కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.7,100 కోట్లు ఎప్పుడు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సీఎం చంద్రబాబు సృష్టించిన రుణమాఫీ గందరగోళంలో గత ఏడాది రైతులకు 51 శాతం రుణాలు కూడా అందే పరిస్థితి లేకుండా పోయింది. 2014-15కు గాను రూ.3,573.52 కోట్ల పంట రుణాలు ఇవ్వాలన్నది బ్యాంకుల లక్ష్యం కాగా కేవలం రూ.1,831.02 కోట్లు (51.24శాతం) మాత్రమే ఇచ్చినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి కనీసం ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు.
విత్తన పంపిణీదీ అదేదారి..
విత్తన పంపిణీలోనూ ప్రభుత్వం అన్నదాతలను వంచించింది. ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 1.36 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశెనగ పంటను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. అందరికీ తగినన్ని విత్తనాలు సరఫరా చేస్తామని జిల్లా వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఈ లెక్కన 2.10లక్షల క్వింటాళ్ల విత్తన కాయలు అవసరమవుతాయి. 40 శాతం మందికే సబ్సిడీ విత్తనాలు అన్నట్లు వ్యవసాయాధికారులు 1.05 లక్షల క్వింటాళ్ల విత్తనాలకే ప్రతిపాదనలు పంపారు. ఇందులో 83వేల క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే సరఫరా చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జూన్ 1 నుంచి 7వ తేదీ నాటికి 55వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేసి అధికారులు చేతులెత్తేశారు. ఈ విత్తనాలు కేవలం 35వేల హెక్టార్లకు మాత్రమే సరిపోతాయి. మిగిలిన లక్ష హెక్టార్లకు సబ్సిడీ విత్తనాలు లేవు. ప్రయివేటు సంస్థలను ఆశ్రయిస్తున్న రైతన్నలను అవి నిలువుదోపిడీ చేస్తున్నాయి.