- అన్నదాతలపై ప్రకృతి కోపం
- మూడేళ్లుగా ముంచెత్తుతున్న వరుస తుపాన్లు
- ఇప్పుడు దూసుకొస్తున్న హుదూద్
అన్నదాతలపై ప్రకృతి పగబడుతోంది. అతివృష్టి, అనావృష్టిలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు కలవరపెట్టగా.. గత మూడేళ్లుగా లైలా నీలం, హెలెన్, రూపాల్లో తుపాన్లు పంటలను ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు హుదూద్ రూపంలో తుపాను విరుచుకుపడుతోంది. వందల కిలోమీటర్లు దూరంలో ఉన్న ఇది ఈ నెల 12న విశాఖకు సమీపంలో తీరం దాటనుంది. ఈ సమయంలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏటా నష్టాలను చవిచూస్తున్న అన్నదాతలు ఈ ఉపద్రవం ఎంత నష్టాన్ని మోసుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
విశాఖ రూరల్: ఖరీఫ్ ప్రారంభం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతుల పరిస్థితి దినదిన గండంగా ఉంటోంది. అతివృష్టి, అనావృష్టి జమిలీగా వెంటాడుతున్నాయి. రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి. ఏటా కరవు ఛాయలు నెలకొనడం, అష్టకష్టాలు పడి నాట్లు వేస్తే పంట చేతికొచ్చే సమయంలో తుపాన్లు విరుచుకు పడడం పరిపాటి అవుతోంది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 1,99,813 హెక్టార్లు. ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం వరుణుని కరుణతో అష్టకష్టాకోర్చి అన్నదాతలు 1,78,743 హెక్టార్లలో పంటలు చేపట్టారు.
ఇందులో ప్రధానంగా వరి 88,893 హెక్టార్లలోను, చెరకు 37,459 హెక్టార్లలోను, రాగి 20,324 హెక్టార్లలోను సాగవుతోంది. కొద్ది రోజులుగా మళ్లీ వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు మండిపోవడంతో కొన్ని పంటలు వడలిపోతుండగా, ముఖ్యంగా వరికి తెగుళ్ల బెడద ఎక్కువైంది. గత 15 రోజులుగా అన్నదాతలు ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్ని చినుకులు రాలినా అనుకూలమే అనుకుంటున్నారు. అయితే ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో మాదిరి హుదూద్ తుపాను రూపంలో రైతులను కలవరానికి గురిచేస్తోంది.
2010లో ఝల్, 2011లో లైలా, 2012లో నీలం, 2013లో ఏకంగా లెహర్, హెలెన్, పైలిన్ తుపానుల్లా ఎక్కడ పంటలు ముంపునకు గురవుతాయోనన్న భయం రైతాంగంలో నెలకొంది. గతేడాది భారీ వర్షాలకు పడిన నదులు, చెరువులు, రిజర్వాయర్లు, కాలువ ల గండ్లు నేటికీ పూడ్చలేదు. దీంతో ఇసుక బస్తాలేసి గండ్లు పూడ్చి పంటలు కాపాడుకునేందుకు రైతులు అప్పుడే సిద్ధమవుతున్నారు.