సాగు సందడి
- వరుస వర్షాలతో జిల్లాలో ఊపందుకుంటున్న వరినాట్లు
- 1.80 లక్షల హెక్టార్లకు సాగు పెరుగుతుందని అంచనా!
- పల్లెల్లో ఎక్కడ చూసినా ముమ్మరంగా వ్యవసాయపనులు
- సాధారణ వర్షపాతానికి చేరువలో కరువు మండలాలు
ఇన్నాళ్లూ ఖరీఫ్‌కు ముఖం చాటేసిన వరుణుడు సీజన్ చివర్లో అన్నదాతల్లో ఆనందం నింపుతున్నాడు. కరువు ఛాయలు అలముకున్న దశలో కనికరించి వర్షిస్తుండడంతో జిల్లాలో వ్యవసాయపనులు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కళావిహీనంగా కనిపించిన పంటపొలాలు మళ్లీ ముమ్మర పనులతో సందడిగా మారుతున్నాయి.
సాక్షి, విశాఖపట్నం : గడచిన నాలుగు రోజులుగా జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కాలువలు, నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అన్నదాతలు ధీమాగా వ్యవసాయ పనులకు దిగుతున్నారు. సాధారణ ఖరీఫ్ విస్తీర్ణమైన 2.8 లక్షల హెక్టార్ల సాగు కాస్తా 1.10 లక్షల హెక్టార్లకు తగ్గవచ్చన్న వ్యవసాయశాఖ అధికారుల భయాందోళనలు పటాపంచలైపోయాయి.
ప్రస్తుతం అన్నిచోట్లా సాగునీరు లభ్యమవుతుండడంతో ఖరీఫ్ విస్తీర్ణం 1.80 లక్షల హెక్టార్లకు మించవచ్చని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సెప్టెంబర్ నాటికి చాలాపొలాల్లో వరి పంట పొట్టదశకు చేరుకుంటుంది. కానీ ఈసారి కరువు ఛాయల నేపథ్యంలో కనీసం నాట్లు కూడా పడలేదు. 13 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ శాతం నమోదైంది.
కాని ఇప్పుడు వరుస వర్షాలతో కరవు మండలాల జాబితా 13 నుంచి దాదాపు సగం వరకు పడిపోవచ్చని, తద్వారా ఖరీఫ్‌కు ఢోకా ఉండదని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జూన్ నుంచి ఆగస్టు వరకు సాధారణ వర్షపాతం 407.7 మిల్లీమీటర్లు కాగా మొన్నటి వరకు 295.5 మిల్లీమీటర్లు నమోదైంది. ప్రస్తుత వర్షాలతో అది 350 మిల్లీమీటర్లు దాటిపోనున్నట్టు విశ్లేషిస్తున్నారు. మరోపక్క ఇన్నాళ్లూ నాట్లు పడని నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల సరఫరాపై దృష్టిపెట్టని అధికారులు ప్రస్తుత వర్షాలతో ఆగమేఘాలపై వీటిని రప్పిస్తున్నారు.
మండలాల వారీగా వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల డిమాండ్‌పై ఆరా తీస్తున్నారు. ఈ విధంగా వచ్చిన మొత్తం ఇండెంట్ ఆధారంగా సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇదిలాఉంటే వరితోపాటు మొక్కజొన్న, ఇతర కూరగాయ పంటలకు సైతం ప్రస్తుత వర్షాలు ఊపిరిపోయడంతో దాదాపు అన్ని పంటల సాగు పనులు జోరుగా సాగుతున్నాయి.