క్రాప్ హాలిడే!
- బిళ్లపాడు గ్రామంలో సాగు చేయలేమని చేతులెత్తేసిన అన్నదాతలు
- నీళ్లులేక నైస్తున్న పొలాలు
గుడివాడ : ఓవైపు వర్షాభారం.. మరోవైపు సాగునీటి విడుదలలో జాప్యం వల్ల విసిగిపోయిన గుడివాడ మండలం బిళ్లపాడు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. తమది రైతురాజ్యం, ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్.. అంటూ ఊదరగొట్టిన టీడీపీ ప్రభుత్వం రైతుకిచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయకపోగా, కనీసం సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయించలేకపోయిందని ఆ గ్రామ రైతులు విమర్శిస్తున్నారు. సాగుతో పచ్చగా కళకళలాడాల్సిన పంట చేలు ప్రతికూల పరిస్థితుల వల్ల బీటలు వారడంతో వారు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
బిళ్లపాడులో కన్నుల కోడు ఆయకట్టు కింద దాదాపు 1,500 ఎకరాలు సాగవుతుంది. ఈ ఏడాది మాత్రం పంటబోదె పూర్తిగా పూడుకుపోవడంతో నాట్లు పడే పరిస్థితి లేకుండాపోయింది. అసలే సాగునీరు విడుదల కాలేదని.. ఒకవేళ ఆలస్యంగా అయినా నీరు విడుదల చేస్తే ఆ కాస్త నీరూ పూడుకుపోయిన పంటబోదె నుంచి చేలకు అందడం గగనమే అవుతుందని రైతులు చెబుతున్నారు. ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో నష్టాల బారిన పడలేక క్రాప్ హాలీడేకు నిర్ణయించుకున్నట్లు రైతులు చెబుతున్నారు.
నెర్రెలిస్తున్న పంట చేలు
కొంతమంది రైతులు మోటార్ల సహాయంతో నాట్లు వేసినప్పటికీ అనంతరం సాగునీరు అందకపోవడంతో ఆకుమడులు ఎండిపోతున్నాయి. పచ్చగా ఉండాల్సిన చేలు, గోధుమ రంగులోకి మారిపోతున్నాయి. చుక్కనీరు అందక నేల నెర్రెలిస్తోంది. ఎంతకాలమని మోటార్ల సహాయంతో పంటచేలు తడుపుతామని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే... ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడంలేదని, సాగునీరందక పంటలు కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను ఎవరూ పట్టించుకోవడంలేదని రైతు అవ్వారు రాంపండు ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతకాలం అష్టకష్టాలు పడి సాగు చేశాం.. కానీ ఇక ఆ పని చేయడానికి ధైర్యం చాలడంలేదని ఆయన సాగుపై తన నిస్సహాయత వ్యక్తంచేశారు. ఒకప్పుడు తెగుళ్లు, ప్రకతి వైపరీత్యాలు మాత్రమే బాధించేవని... ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ చేతకాని తనంతో అనేక సమస్యలతో సతమతమవుతున్నామని గొరిపర్తి నాగేశ్వరరావు అనే కౌలురైతు వ్యాఖ్యలు జిల్లాలో పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నాయి.