తాజా పుస్తకం
ఆమె సుప్రభాతం శ్రీ వేంకటేశ్వరునికి మేలుకొలుపు. ఆమె దివ్యగానం ముక్కోటి దేవతలకు పవిత్రార్చన. ఆమె స్వరం గాంధీజీకి ప్రాణం. ఆమె గాత్రం కోట్లాది మందికి హృదయంగమం. ఆ గాన మాధుర్యం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సొంతం.
ఆమె గురించి ఇప్పటి వరకు వేలాది వ్యాసాలు వచ్చాయి. వందలాది కథనాలు వెలువడ్డాయి. పుస్తకాలకు లెక్కేలేదు. కాని ప్రముఖ జర్నలిస్ట్ టి.జె.ఎస్ జార్జ్ రాసిన ఎమ్మెస్ బయోగ్రఫీ– ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి– ది డిఫినిటివ్ బయోగ్రఫీ’ ఎక్కువ మంది పాఠకుల మన్ననను పొందింది. దానిని హైదరాబాద్‌కు చెందిన హెచ్‌బీటీ సంస్థ ‘మనకు తెలియని ఎం.ఎస్’గా తెలుగులో ప్రచురించింది. ప్రముఖ రచయిత్రి ఓల్గా దీనిని తెలుగులోకి అనువదించారు. ఈ రోజు అంటే నవంబర్ 24 శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో ఈ పుస్తకావిష్కరణ జరగనుంది. ముఖ్యవక్తగా కర్ణాటక గాయకుడు, ప్రజామేధావి టి.ఎం. కృష్ణ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రచురణకర్త గీతా రామస్వామి, అనువాదకురాలు ఓల్గా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి– ది డిఫినిటివ్ బయోగ్రఫీ’ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్ట్ టీజేఎస్ జార్జ్ 2004లో ఇంగ్లిష్‌లో రాశారు. 20016 వరకూ ఈ పుస్తకం గురించి నాకు తెలీదు. ఈ పుస్తకం గురించి ఇప్పటిదాకా తెలీకుండా ఎలా ఉన్నానా? అని ఆశ్చర్యపోయా. అంటే కర్ణాటక సంగీతంలోని ఒక వర్గం లాబీ మొత్తం దాన్ని బయటకు రాకుండా చేసింది. ఎందుకంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బ్రాహ్మిణ్ ఐకాన్‌గానే ప్రపంచానికి తెలుసు. కాని ఈ పుస్తకం ఆమెది దేవదాసీ కుటుంబ నేపథ్యం అని చెబుతోంది. ఈ సంగతి నలుగురికీ తెలియకూడదని ఆ లాబీ భావించినట్టుంది. 2016లో ఈ పుస్తకాన్ని రీప్రింట్ చేసినప్పుడు కొన్ని సమీక్షలు వెలువడితే తెప్పించుకొని చదివాను. అరే.. ఇంత మంచి పుస్తకాన్ని తెలుగులోకి ఎందుకు ప్రచురించకూడదు అని అనిపించింది. అదే సమయంలో కొంచెం సంశయం కూడా పొందాను.
నిజానికి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి కళ అంతా దేవదాసీ బ్యాక్‌గ్రౌండ్‌తోనే వచ్చింది. అయినా ఆమె బ్రాహ్మిణ్ ఐకాన్‌గానే గుర్తింపు పొందింది. ఈ వైరుధ్యాన్ని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎలా ఎదుర్కొన్నది, రోజువారి జీవితంలో ఈ ద్వంద్వ అస్తిత్వాన్ని ఎలా సమన్వయం చేసుకుంది... వంటి అనేక విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలియచేయవచ్చు అనిపించింది. అదీగాక ఒక మహా గాయకురాలి గెలుపు ఓటములు రెండూ మనకు అవసరమే. ఎమ్మెస్ ఎందుకు బ్రాహ్మణీకంలో లీనమయ్యింది... ఆమెను స్వీకరించిన బ్రాహ్మణీకం ఎందుకు మరో గాయని రావు బాలసరస్వతిని తిరస్కరించింది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇంకోటి ఏమనిపించిందంటే బ్రాహ్మణ కళాకారుల గురించి రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. ఈ పుస్తకం బయటకు వస్తే దేవదాసీ వంటి కమ్యూనిటీల గురించి రాసేవాళ్లు కూడా వస్తారు అనిపించింది. ఎమ్మెస్ మూలాలు దేవదాసి కుటుంబంతో ఉన్నాయని తెలిస్తే ఆ సమూహం తమ గురించి తాము గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుందనిపించింది.
ఇక ఈ పుస్తక రచయిత జార్జ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు అయుండి కర్ణాటక సంగీతంతో అసలు పరిచయం లేకపోయినా ఇంత అద్భుతంగా రాశాడు అంటే అదే భారతదేశంలోని వైవిధ్యం. బ్రాహ్మణుడు అయి ఉంటే ఈ పుస్తకాన్ని ఇంత సున్నితంగా రాసి ఉండేవాడు కాదేమో. ఒక్కమాటలో చెప్పాలంటే ఇట్సె వండర్‌ఫుల్ బుక్. ఈ పుస్తకాన్ని తెలుగులోకి చేయాలి అనుకోగానే నా మనసులోకి వచ్చిన వ్యక్తి ఓల్గానే. ఎందుకంటే ఇది ప్రాథమికంగా స్త్రీవాదాన్ని సూచించే రచన. వీ ఆర్ రిట్రీవింగ్ ఫెమినిస్ట్ హిస్టరీ. నేను అడగగానే వెంటనే యెస్ అంది. అప్పటిదాకా తాను చేస్తున్న పని పక్కనపెట్టి ఈ అనువాదం తీసుకుంది. ప్రస్తుతం మా సంస్థ జీవిత కథల మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నది. ఈ నెల 29న గౌరీ లంకేష్ పుస్తకం విడుదల కానుంది. తర్వాత రావు బాలసరస్వతి బయోగ్రఫీ ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ పాఠకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచన కూడా రేకెత్తిస్తాయని భావిస్తాను. సుబ్బులక్ష్మి మూలాలను చెప్పే పుస్తకం – గీతా రామస్వామి, ప్రచురణకర్త
గీత అడగ్గానే చాలా సంతోషమేసింది. ఎమ్మెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పాటలు బాగా వింటాను. కొన్ని కొన్ని పాటలను కొన్నాళ్లు పొద్దున్నే వినేదాన్ని. మనసుకు హాయిగా ఉంటుందని. ఆమె పాడిన శ్రీరంగపుర విహార లాంటి పాటలను చాలా ఇష్టంగా వింటుంటాను. ఎమ్మెస్ దేవదాసీ అని అప్పుడెప్పుడో ‘హిందూ’లో చదివాను. అప్పటిదాకా నాకు తెలియదు. తెలియగానే షాక్ అయ్యాను. ఇంతకాలం తెలియకుండా ఎలా దాచారు వీళ్లు అనిపించింది. ఇప్పుడు బయోగ్రఫీ అనగానే అవన్నీ తెలుసుకోవచ్చనిపించింది. గతంలో నేను ‘సరిద మాణిక్యమ్మ’ అని దేవదాసీని 1990లలో కలిసాను. ఆమె ఎంత గొప్పదంటే ‘దావదాసీ రామయాణాన్ని’ నటరాజ రామకృష్ట బృందానికి నేర్పించి దానిని పునర్ముఖం చేసింది. అలాంటి ఆవిడను ఎంతో దయనీయమైన స్థితిలో చూశాను.
‘మా కళలన్నీ ఇతరులు నేర్చుకున్నారమ్మా. కాని మాకు మాత్రం ఇప్పుడు ఏమీ లేదు’ అని ఆమె అనడం నాకు చాలా బాధనిపించింది. అప్పటి నుంచి దేవదాసీల గురించి ఆలోచిస్తూనే ఉన్నా. ముత్తు లక్ష్మీరెడ్డి, బెంగుళూరు నాగరత్నమ్మ, మైసూరు జెట్టి తాయమ్మ వంటి దేవదాసీల పోరాటాలు.. జీవితాలు అధ్యయనం చేశాను. ఈ మధ్య నేను రాసిన ‘గమనమే గమ్యం’ అనే నవల్లో కూడా ఒక దేవదాసీ పాత్ర ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఎం.ఎస్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలనుకున్నా. నిజానికి అప్పటికి నేను పని చేస్తున్న పుస్తకం ఈ విషయానికి పూర్తిగా వ్యతిరేకమైనది. అది ‘నైనా దేవీ’ అనే టుమ్రీ గాయనీ గురించి. ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ చాలా డిఫరెంట్. ఆమె బ్రాహ్మిణ్. రాజా రామమోహన్‌రాయ్ మనవరాలు. అయినా సరే దేవదాసీలాంటి వాళ్లు పాడే పాటలు నేర్చుకొని పాడింది. అదీ చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అయినా దాన్ని పక్కన పెట్టి ఇది చేశాను. కారణం.. ఎమ్మెస్ అంటే ఉన్న ఇష్టమే కాకుండా నేను తెలుసుకోవాలనుకున్న చాలా విషయాలున్నాయనిపించింది. అన్నట్టుగానే ఈ పుస్తకం నాకెంత జ్ఞానం ఇచ్చిందంటే మొత్తం కర్ణాటక సంగీతాన్నే అర్థం చేయించింది. కర్ణాటక సంగీత ప్రాంగణంలో ఎమ్మెస్ ఎక్కడ నిలబడుతుంది అనేది ఈ పుస్తకం చెబుతుంది. అన్ని బయోగ్రఫీల్లాంటి బయోగ్రఫీ కాదు ఇది. చాలా ప్రత్యేకమైంది. జార్జ్ చాలా రీసెర్చ్ చేశాడు.
సంగీత ప్రాంగణంలో ఎమ్మెస్ ఎక్కడ నిలబడుతుందో తెలిపే పుస్తకం – ఓల్గా, రచయిత్రి
Comments
Please login to add a commentAdd a comment