new book
-
గ్రీన్విచ్ కంటే ముందే మనకో కాలమానం!
న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆరో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానం కంటే ముందే మన దేశానికి సొంత కాలమానం ఉందని, దీనిని ‘మధ్య రేఖ’ అని పిలుస్తారని పేర్కొంది. బీఆర్ అంబేద్కర్ అనుభవాలను, ఎదుర్కొన్న కుల వివక్ష పాఠాన్ని కూడా కుదించింది. హరప్పా నాగరికతను కొత్త పాఠ్య పుస్తకంలో ‘సింధు–సరస్వతి’గా పేర్కొంది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పాఠశాల విద్య కోసం కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్–2023కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ కొత్త సిలబస్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పలు మార్పులు చేసింది. గ్రీన్విచ్ కాలమానమే ప్రధాన కాలమానం కాదని, దానికంటే శతాబ్దాల ముందు యూరప్, భారత్‌లకు సొంత కాలమానాలున్నాయని పేర్కొంది. దానిని మధ్య రేఖ (మిడిల్ లైన్) అని పిలిచేవారని, అది ఖగోళ శాస్త్రానికి ప్రసిద్ధి చెందిన ఉజ్జయినీ నగరం (ఉజ్జయిన్) గుండా వెళ్లిందని వివరించింది. అలాగే కొత్త పాఠ్యపుస్తకంలో ‘భారత నాగరికత ప్రారంభం’ అనే అధ్యాయంలో సరస్వతి నదికి ప్రముఖ స్థానం ఉందని, ప్రజలను వర్ణాలుగా విభజించారని, శూద్రులను, స్త్రీలను వేదాలను అధ్యయనం చేయనీయలేదని పాత పాఠ్య పుస్తకంలో ఉండగా.. వ్యవసాయదారుడు, నేత, కుమ్మరి, బిల్డర్, వడ్రంగి, వైద్యుడు, నర్తకి, మంగలి, పూజారివంటి వృత్తులను వేదాల్లో పేర్కొన్నట్లు కొత్త పుస్తకాల్లో పేర్కొంది. పాత పుస్తకంలోని నాలుగు అధ్యాయాల్లో ఉన్న చాణక్యుడి అర్థశాస్త్రం, గుప్తులు, పల్లవులు, చాళుక్యుల రాజవంశాలు, అశోకుడు చంద్రగుప్త మౌర్యుల రాజ్యాల కథనాలను కొత్త పుస్తకంలో తొలగించింది. -
పిల్లల కోసం నటి ఆలియా భట్ డ్రీమ్ ప్రాజెక్ట్ లాంచ్ (ఫొటోలు)
-
Welcome to Paradise: స్వాగతం.. సుస్వాగతం
రచయిత్రిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది నటి ట్వింకిల్ ఖన్నా.‘మిసెస్ ఫన్నీబోన్స్: ‘పైజామాస్ ఆర్ ఫర్ గివింగ్’ ‘ది లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్’ పుస్తకాలతో పాఠకులను అలరించింది. తాజాగా తన కొత్త పుస్తకం ‘వెల్కమ్ టూ ప్యారడైజ్’ను ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ట్వింకిల్ ఖన్నా లండన్‌లో ఫిక్షన్ రైటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత వస్తున్న పుస్తకం ఇది. ‘ఈ పుస్తకంలోని క్యారెక్టర్లు గత అయిదు సంవత్సరాలుగా నా మనసులో తిరుగుతున్నాయి. నాకు మాత్రమే పరిచయమైన ఈ క్యారెక్టర్లు ఇప్పుడు మీకు కూడా పరిచయం కాబోతున్నాయి’ అంటూ రాసింది ఖన్నా. మానవ సంబంధాలు, ఎడబాట్లు, అనుబంధాలు, ఆప్యాయతలను ఆధారంగా చేసుకొని రాసిన ఈ పుస్తకం వచ్చే నెలలో విడుదల కానుంది. సామాన్య పాఠకుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో ఈ పుస్తకంపై కామెంట్స్ పెడుతున్నారు. -
జనాదరణ పథకాలకు ఆర్బీఐ డబ్బు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ వి. ఆచార్య తన పుస్తకం కొత్త ఎడిషన్ ‘ముందు మాట’గా రాసిన కొన్ని అంశాలు తాజాగా ఆసక్తికరంగా మారాయి. ‘‘ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2018లో ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి జనాదరణ పథకాల వ్యయాలకు రూ. 2 నుంచి 3 లక్షల కోట్లను పొందాలని కేంద్ర ప్రభుత్వంలోకి కొందరు చేసిన ప్లాన్ (రైడ్)ను సెంట్రల్ బ్యాంక్ ప్రతిఘటించింది. ఇది స్పష్టంగా ప్రభుత్వం– ఆర్బీఐ మధ్య విభేదాలకు దారితీసింది. సెంట్రల్ బ్యాంక్‌కు సంబంధిత ఆదేశాలు జారీ చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని ఎన్నడూ ఉపయోగించని సెక్షన్ 7ను అమలు చేయాలని ఆలోచించే స్థాయికి పరిస్థితి వెళ్లింది’’ అని రాసిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.‘క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా’ శీర్షికతో ప్రజల ముందు ఉంచిన తన పుస్తకం తాజా ఎడిషన్ ముందు మాటలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర ఆర్థిక లోటు భర్తీకి బ్యాక్‌డోర్ మానిటైజేషన్’’ అని ఆయన ఈ వ్యవహారాన్ని అభివరి్ణంచడం గమనార్హం. 2017 జనవరి 20వ తేదీ నుంచి 2019 జూన్ వరకూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు విరాల్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన డిప్యూటీ గవర్నర్‌గా మానిటరీ పాలసీ, ఫైనాన్షియల్ మార్కెట్లు, ఫైనాన్షియల్ స్థిరత్వం–రిసెర్చ్ విభాగం ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆరు నెలల ముందుగానే ఆయన అప్పట్లో రాజీనామా చేశారు. విరాల్ రాసిన అంశాల్లో కొన్ని... ► ఆర్బీఐ ప్రతి సంవత్సరం తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. 2016 డిమోనిటైజేషన్‌కు ముందు మూడేళ్లలో ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసింది. ► నోట్ల రద్దు సంవత్సరంలో కరెన్సీ ముద్రణకు అయ్యే ఖర్చును కేంద్రానికి చేసిన బదిలీల నుంచి మినహాయించింది. ఫలితంగా 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వ నిధుల అవసరాలు మరింత పెరిగాయి. ఈ మొత్తాలను ఆర్బీఐ నుంచి పొందాలని బ్యూరోక్రాట్లు కొందరు ప్రయతి్నంచారు. ► స్వల్పకాలిక ప్రజాకర్షక వ్యయాల కోసం సెంట్రల్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌పై దాడి చేసే ప్రణాళికలను పదేపదే ప్రతిపాదించినప్పుడు.. సహేతుకమైన సంస్థలతో కూడిన ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను కలిగి ఉన్న దేశంలోని ఏ ప్రభుత్వమైనా బలీయమైన ప్రతిఘటనను ఎదుర్కొనకుండా ముందుకు సాగలేదు. ఇలాంటి సందర్భాలే ఒక సహేతుక వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయి. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ల నుండి ప్రభుత్వానికి భవిష్యత్తులో బదిలీల కోసం సహేతుకమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు కావడం ఇలాంటిదే. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నుంచి భారీ నిధులు పొందాలని భావించిన వ్యక్తుల్లో పలువురిని ప్రభుత్వం పక్కన బెట్టడం కూడా జరిగింది. 2018లోనే ‘విరాల్’ వెల్లడి.. నిజానికి 2018 అక్టోబర్ 26న ఏడీ ష్రాఫ్ స్మారక ఉపన్యాసం సందర్భంగానే విరాల్ ‘కేంద్రం– ఆర్బీఐ మధ్య విభేదాల విభేదాల అంశాన్ని మొదటిసారి సూచనప్రాయంగా ప్రస్తావించారు. తాజాగా అందుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించారు. ‘‘కేంద్ర బ్యాంకు స్వాతం్రత్యాన్ని గౌరవించని ప్రభుత్వాలు తక్షణం లేదా అటు తరువాత ఆర్థిక మార్కెట్ల ఆగ్రహానికి గురవడం ఖాయం. ఆయా పరిణామాలు ఆర్థిక అనిశి్చతికి, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ దెబ్బతినే ప్రమాదానికి దారితీస్తాయి’’ అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఉర్జిత్ పటేల్ రాజీనామా ఇందుకేనా..? తాజా అంశాలను విశ్లేíÙస్తే...సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా 2018 డిసెంబర్లో ఉర్జిత్ పటేల్ రాజీనామాకు.. తాజాగా విరాల్ లేవనెత్తిన అంశానికీ ఏదైనా సంబంధం ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అప్పట్లో ఉర్జిత్ పటేల్ ‘‘వ్యక్తిగత కారణాలతో’’ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ బాధ్యతలకు రాజీనామా చేశారు. అప్పట్లో కేంద్రం–ఆర్బీఐ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలు గుప్పుమన్నప్పటికీ దీనికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. మూడేళ్ల పదవీ కాలం ముగిసేలోగా తన బాధ్యతలను మధ్యలోనే వదిలేసిన గవర్నర్‌గా పనిచేసిన అరుదైన సందర్భం ఆయనది. -
సాహితీ ప్రయాణం వెనక కథ
నా మొదటి కథ 1970 ఆగస్టులో చందమామ మాసపత్రికలో ప్రచురించారు. దాని పేరు ఉపాయశీలి. 2020 ఆగస్టుకి నా మొదటి కథ ప్రచురించబడి యాభై ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా నా సాహితీ ప్రయాణం గురించి వివరించిన పుస్తకమే నవల వెనక కథ. ఇందులో నేను రాసిన 106 నవలల కథలు పరిచయం చేస్తూ, ప్రతీ నవలకి నాకు క్రియేటివ్ ఫ్లాష్, అంటే ఆ ఆలోచన ఎలా వచ్చింది? దాన్ని ఎలా డెవలప్ చేసుకున్నాను? ఎంత కాలానికి అది నవలగా రాశాను? ఏ పత్రికలో సీరియలైజ్ అయింది, లేక డైరెక్ట్ నవలా? సినిమా లేదా టీవీ సీరియల్ లేదా వెబ్ సిరీస్‌గా తీస్తే ఆ అనుభవాలు, అమ్మకాలు, కోర్టు కేసులు మొదలైన వివరాలన్నీ ఇందులో ఇచ్చాను. అలాగే ప్రతి నవలకి వేసిన తెలుగు, కన్నడ కవర్ పేజీల బొమ్మలని కూడా చూడొచ్చు. పాఠకులకి ఇవి పాత జ్ఞాపకాలను ఇస్తాయి. ‘ముక్తాయింపు’లో రచయితగా నా గురించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను రాశాను. ‘అనుబంధం’ అనే రెండో భాగంలో 1960లో నేను చదివిన మొదటి నవల నుంచి 2020 దాకా– ఈ అరవై ఏళ్లలో తెలుగు నవలకి పాఠకులిచ్చిన ఆదరణ, అమ్మకాల వివరాలని ‘లేచి పడ్డ తెలుగు నవల’ అనే పెద్ద వ్యాసంలో పాఠకులు విహంగవీక్షణం చేయొచ్చు. ఇంకా ఇందులో 1972 నుంచి నేటి దాకా నేను వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, నా ప్రచురణకర్తల మీద పెన్ స్కెచ్‌లు, (నా సంపాదకులతో నా అనుభవాల గురించి ‘జరిగిన కథ’ అనే పుస్తకంలో రాశాను) నేను రాసిన దిన వార పక్ష మాస పత్రికల జాబితా, సినిమాల పేర్లు, విడుదల వివరాలు, టీవీ సీరియల్స్ వివరాలు, నేను రాసిన వందకు పైగా నవలేతర పుస్తకాల క్లుప్త పరిచయం, వాటి కవర్ పేజీలు, స్రవంతి వారపత్రిక ఎడిటర్‌గా నా అనుభవాలు, తమాషా స్టాటిస్టిక్స్, చివరగా మే 2020లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ మిస్టరీ మేగజైన్కి పంపిన ఓ ఇంగ్లిష్ క్రైమ్ కథని చదవొచ్చు . 760 పేజీల ఈ హార్డ్‌బౌండ్ పుస్తకం, తెలుగు నవలా పాఠకులకి, సాహిత్య అభిమానులకు చాలా కొత్త విషయాలను తెలియజేస్తుంది. ఈ యాభై ఏళ్లలో నేను చేసిన రచనా వ్యాసంగాన్ని నవల వెనక కథలో పరిపూర్ణంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. సెప్టెంబర్ 2020 దాకా రోజూ మరే పని పెట్టుకోకుండా, రోజుకి ఎనిమిది నుంచి పది గంటలు రాస్తూ, ప్రూఫ్ రీడింగ్ చేస్తూ, గడిపాను. మర్చిపోయినవి కొందరు మిత్రులకి ఫోన్ చేసి తెలుసుకున్నాను. ఈ వారమే పుస్తకం విడుదల అవుతోంది. -మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల వెనక కథ రచన: మల్లాది వెంకట కృష్ణమూర్తి; పేజీలు: 760; వెల: 600; ప్రతులకు: గోదావరి ప్రచురణలు, ఫోన్: 9553084268 -
జీవరసాయనం
మిడ్‌వెస్టర్న్ అమెరికాలోని ఒక యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాలెస్ ఆ విభాగంలోకి మూడు దశాబ్దాల వ్యవధి తరువాత చేర్చుకోబడ్డ తొలి నల్లజాతీయుడు. అతను తప్ప సహవిద్యార్థులందరూ తెల్లవారే. ఆ వేసవికాలపు ఆఖరి వారాంతంలో అతను చేస్తున్న ప్రయోగాలలోని సూక్ష్మక్రిములను ఎవరో నాశనం చేసినట్టు గమనించిన వాలెస్, దాన్ని పక్కనబెట్టి మిత్రులని కలవడానికి బయలుదేరడంతో మొదలయ్యే ఈ కాలేజ్ క్యాంపస్ నవల, అటుతర్వాత మూడురోజులపాటు ల్యాబ్ లోపలా, బయటా సాగి ముగుస్తుంది. స్వతహాగా నల్లజాతీయుడు, పైగా లైంగికంగా గే అయిన వాలెస్ పట్ల మిత్రులు ప్రవర్తించే తీరు భిన్నంగా ఉంటుంది. ఆ తెల్ల స్నేహితుల్లోనూ గేలు చాలామందే ఉన్నా అదెవరికీ అభ్యంతరకరంగా ఉండకపోవడం వాలెస్ గమనిస్తాడు. స్నేహాలు పైకి మామూలుగానే ఉన్నట్టనిపించినా దాని అడుగున అదృశ్యంగా ఉండే ఆధిపత్యపు భావనలు వాలెస్కి తెలుస్తూనే ఉంటాయి. వాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు వాలెసే తీసుకోవాలి. ఆ స్నేహాలు ఎంత పలచగా ఉంటాయంటే, అంతకుమునుపే కొన్నివారాల క్రితం వాలెస్ తండ్రి మరణించాడన్న విషయం తెలుసుకున్న మిత్రులు అంత్యక్రియలకి వాలెస్ వెళ్లలేదన్న వాస్తవాన్ని గుర్తిస్తారే తప్ప, చిన్నతనంలోనే వాలెస్ మీద జరిగిన లైంగిక దాడులని చూస్తూకూడా ఆ తండ్రి మిన్నకుండిపోయాడన్న విషయాన్ని తెలుసుకునే ఆసక్తి వారికుండదు. ఆ వారాంతంలోనే మిల్లర్ అనే శ్వేతజాతీయుడి ప్రేమలో పడిన వాలెస్ తరువాతి రెండుమూడు రోజులపాటు క్లిష్టమైన మానసిక సంక్షోభాలకి గురవుతాడు. మిల్లర్ ప్రేమలో కూడా విడమరిచి వివరించడానికి వీలుకాని గందరగోళాంశాలు కనిపించడం అసలే అంతర్ముఖుడైన వాలెస్ని మరింత ఆత్మావలోకనంలోకి తోసేస్తుంది. రెండుమూడు రోజులపాటు స్నేహితులతో గడిపిన క్షణాలూ, వారి స్పందనలూ, మిల్లర్‌తో సన్నిహితంగా గడిపిన సన్నివేశాలూ వాలెస్ని తన జీవితాన్ని పునస్సమీక్షించుకోమంటాయి. భవిష్యత్తేమిటో నిర్ణయించుకోమంటాయి. నిజమైన జీవితం అంటే ఏమిటో బలమైన ఎరుకని ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని వాలెస్ గుర్తిస్తుండగా నవల ఓపెన్–ఎండెడ్గానే ముగుస్తుంది. సమాజం తనని స్వీకరించకపోవడం తన ఒంటరితనానికి కారణమనీ, తను కోరుకున్నదేదీ తనని కోరుకోలేదనీ అనుకుంటూ వస్తున్న వాలెస్, సమాజాన్ని తానూ అంగీకరించాలనే సానుకూలాంశంతో నవల ముగియడం– అది ఆశావహమైన ముగింపే కావొచ్చన్న సూచననిస్తుంది. ‘జ్ఞాపకాలనేవి వాస్తవాలతో నిమిత్తం లేని గతకాలపు విషాదాల ఉరామరికమైన తూకమే’ అయివుండవచ్చు. అయినప్పటికీ గతాన్ని విస్మరించి ముందుకు సాగడమే అవసరం; ఎందుకంటే, గతానికేమీ భవిష్యత్తు అక్కర్లేదు! సమాజం తన హోమోఫోబియా(స్వలింగ సంపర్కాల పట్ల విముఖత)ని పరోక్షంగా ఏదో రూపంలో చూపిస్తుంటుంది. వాలెస్ జీవితం ఒక సంక్లిష్టమైన చిత్రం. అతని ప్రయోగాన్ని నాశనం చేసిన సహవిద్యార్థిని జాతివివక్ష గురించి చెప్పితీరాల్సివచ్చిన సందర్భంలో అంతా విన్న ప్రొఫెసర్ అతన్ని స్త్రీద్వేషి అని ప్రత్యారోపణ చేస్తుంది. వివక్షని తమదైన పద్ధతిలో విశ్లేషించి అసలది వివక్షే కాదన్న తీర్పూ ఇచ్చి దాన్నే బలంగా నమ్మడం శ్వేతసమాజపు సహజలక్షణం. జాతి, మతం, కులం, జెండర్, లైంగికత, శరీరవర్ణం లాంటి విశేషాలన్నీ వివిధ పరిమాణాలలో కలగలిపి, ఇరుకైన ఒక ఇంటర్సెక్షనల్ అస్తిత్వాన్ని సమాజం మనిషికి అంటగట్టి, దానిమీదే తేరుకోలేని దాడి చేస్తుంది. బుకర్ ప్రైజ్, 2020 షార్ట్‌లిస్ట్‌లోని ఈ మూడవ నవల రచయిత బ్రాండన్ టేలర్ తొలినవల. కథాంశం కొత్తది కాకపోయినా, లైంగికతాంశపు దృష్టికోణం నుంచి సమస్యని చూపడం రియల్ లైఫ్ ముఖ్యాంశం కాగా, స్వయంగా నల్లజాతీయుడైన రచయిత వల్ల నవలకి సాధికారత లభించినట్టయింది. వాలెస్ ఆంతరంగికత మీదనే ఎక్కువగా నడిచే కథ కొన్నిచోట్ల అవసరాన్ని మించి విస్తరిస్తూంటుంది. పాత్ర భావోద్వేగాలని ఆయా భాగాల్లో వేరుచేసుకుని జాగ్రత్తగా గమనించవలసి వస్తుంది. అనుభవాల నుంచి చేసే సూత్రీకరణలు ఆకట్టుకుంటూనే, కొన్నిభాగాల్లోని ప్రేమలూ, విరహాలూ, కోపతాపాలూ, ఈసునసూయలూ సగటు శృంగార ప్రేమకథని చదువుతున్న భ్రాంతిని కలగజేస్తాయి. అయినప్పటికీ, ఇది ప్రస్తుత సందర్భాలలోని అసమంజసతలని సున్నితంగా విమర్శించిన వాణి. - ఎ.వి.రమణమూర్తి నవల: రియల్ లైఫ్ రచన: బ్రాండన్ టేలర్ ప్రచురణ: రివర్‌హెడ్ బుక్స్; 2020 -
వనాలతో సహజీవనాలు
‘‘ఊళ్లో ఇప్పుడేమీ లేదు. ఇళ్ల మేడలమీద పూలమొక్కలూ, కూరగాయపాదులూ, వాటిమధ్య బాటలూ లేవు. సోలార్ గ్రిడ్స్, నీళ్లట్యాంకులూ, సెల్టవర్లూ, వాటిచుట్టూ వేసిన ముళ్లకంచెలతో నిండిపోయాయవన్నీ. ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌కి వెళ్లే మనుషులు తప్ప బయట మరెవ్వరూ కనిపించరు. వాళ్లుండే ఇంటికి కొంతదూరంలో ఒక చెట్టూ, దాన్నెవరూ ముట్టుకోకుండా బలమైన కంచె ఉండేవి. ప్రతి వసంతానికీ ఆ చెట్టుకు పువ్వులు పూసేవి. అందమైన పూవులను చూడటానికి ఎక్కడెక్కడినుంచో జనాలు వచ్చేవారు. చెట్టు ఆకులను రాల్చినప్పుడు గాలికి ఎగిరే ఆకులను ఏరుకోవటానికి అంతా పోటీ పడేవారు. ఊరిలో మిగిలిన పది చెట్లలో అదొకటి. ఆ చెట్టుకు దగ్గర్లో ఇల్లుండటం వాళ్లు చేసుకున్న అదృష్టం.’’ వాతావరణ కాలుష్యంతో కనుమరుగవుతున్న పచ్చదనానికీ, జాగ్రత్త వహించకపోతే జరగబోయే పరిణామాలకూ సాక్ష్యంగా నిలుస్తుందీ ఊరు ‘ద న్యూ విల్డర్నెస్’ నవలలో. ఎందరో ప్రముఖ రచయితల సరసన పోటీలో నిలబడి బుకర్ ప్రైజ్ 2020కి షార్ట్‌లిస్ట్ అయిన ఆరింటిలో డయాన్ కుక్ తొలినవలే చోటుచేసుకోవటం ఆ నవలకు దక్కిన గౌరవం. ప్రకృతితో మనిషి సహజీవనం అనే పరిశోధన కోసం మిగిలివున్న ఏకైక అడవి ‘విల్డర్నెస్ స్టేట్’లోకి ఇరవైమందిని పంపిస్తారు పరిశోధకులు. పరిశోధన ముగిసేవరకూ కఠినమైన నియమాలను పాటిస్తూ, నిర్ణీత ప్రదేశాల్లోని కేంద్రాలలో తమ అనుభవాలను పొందుపరుస్తూ, ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ అడవిమనుషులలాగా జీవించాలి వారంతా. నగరంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూన్న అయిదేళ్ల ఆగ్నెస్కు కాలుష్యం నుంచి గాలిమార్పు అవసరమని డాక్టర్లు చెప్పటంతో పరిశోధనలో భాగస్తులై కూతురుతో అడవికి చేరుకుంటారు గ్లెన్, అతని భార్య బియాట్రిస్. అడవిలో ఆగ్నెస్‌కి ఆరోగ్యం, తల్లితో అనుబంధం మెరుగవుతాయి కానీ, పదీపదకొండేళ్ల వయసొచ్చేటప్పటికి ఇద్దరి మధ్యా కొత్తగా వికర్షణల విస్ఫోటనాలు మొదలవుతాయి. తల్లి మరణవార్త విన్న బియాట్రిస్ తమకి ఒక్కమాటైనా చెప్పకుండా నగరానికి వెళ్లిపోవడం నచ్చదు ఆగ్నెస్‌కి. తిరిగివచ్చిన బియాట్రిస్ తమ బృందంలో కొత్తవారు చేరటం, గ్లెన్ అనారోగ్యం పాలై ఉన్నప్పటికీ అతన్నెవరూ పట్టించుకోకపోవటం గమనిస్తుంది. అనారోగ్యంతో గ్లెన్ మరణించగా కార్ల్, బియాట్రిస్లు బృందాన్ని నడిపిస్తారు. అడవిలో కనిపించిన ఆడమ్ అనే వ్యక్తి అధికారుల కళ్లుగప్పి రహస్యంగా అడవిలోకి చొరబడ్డాననీ, తనలాగా చాలామంది అక్కడున్నారనీ చెప్తాడు. అధికారులు పరిశోధన ముగిసిందనీ, రహస్యంగా అడవిలోకి చొరబడ్డవారిని పట్టుకోడానికి సహకరిస్తే ప్రైవేట్లాండ్స్కి తీసుకెళ్తామనీ, కాదంటే అందరినీ నగరానికి పంపే ఏర్పాట్లు చేస్తామనీ అంటారు. నగరానికి తిరిగి వెళ్లటంకంటే, ప్రైవేట్లాండ్స్లో జీవితం బావుంటుందన్న ఆశతో బియాట్రిస్‌తో సహా ఎక్కువమంది దానికే మొగ్గు చూపుతారు. ప్రైవేట్లాండ్స్ మీద నమ్మకం లేని ఆగ్నెస్ తల్లితో విభేదించి ఒంటరిగా అడవిలోకి పారిపోతుంది కానీ, కొంతకాలానికి అధికారులకు దొరికిపోతుంది. ఇప్పుడీ ఆఖరి అడవిలో సైతం జరుగుతున్న నిర్మాణాల పర్యావరణ హింసని ఆగ్నెస్ గమనిస్తుంది. పర్యావరణంపట్ల మానవుడి నిర్లక్ష్యంతో కలుగుతున్న విపత్తులను స్పృశిస్తూ డిస్టోపియన్ లక్షణాలను సంతరించుకున్న నవల, తల్లీకూతుళ్ల మధ్య సంచలించే బాంధవ్యం కథావస్తువుగా శాఖలువారుతుంది. కూతురికోసం నాగరిక జీవనాన్ని వదిలి వచ్చిన బియాట్రిస్కి అప్పుడప్పుడూ ఆ బంధాలు తనని ‘హత్తుకోవటంకంటే, కట్టిపడేస్తున్న భావన’ కలగడం తల్లీకూతుళ్ల ప్రేమలో ఇతర వర్ణచ్ఛాయలుంటాయనడానికి సాక్షీభూతం. బహుళ కథకుల ద్వారా భిన్న దృష్టికోణాలు నవలలో పరిచయమవుతాయి. వికసిస్తున్న బుద్ధితో ప్రపంచాన్ని పరిశీలించే ఆగ్నెస్, ప్రతి విషయం పట్లా ముందే ఏర్పరచుకున్న స్థిర దృక్పథం ఉన్న బియాట్రిస్ – ప్రధాన కథకులు. నవలంతా పరుచుకునున్న అడవి వాతావరణం, వర్ణనలు కొంత సాగతీత అనిపించినప్పటికీ– ప్రతీకలూ, ఉపమానాలూ, సారళ్యత, తటస్థత, కథనానికి అందమైన ఆలంబనలు. మానవ సంఘర్షణలతో – ప్రత్యేకించి తల్లీకూతుళ్ల ఆకర్ష వికర్షణలతో – పర్యావరణాన్ని కలిపి చిత్రించటం బావుంది. ‘మరణం జీవించడమంత సహజం’ అనుకుని ముందుకుసాగే పరిస్థితులనూ, మనుషుల్లో నిక్షిప్తమైన నిర్దాక్షిణ్యతనూ చూసినపుడు అడవిలోపలి మనిషి, మనిషిలోపలి అడవి ఒకేసారి కనిపిస్తాయి. మనుషులు ఎక్కడున్నా వారి ఘర్షణలు, నైజాలూ మాత్రం అవే– ప్రకృతితో నిమిత్తం లేకుండా! నవల: ద న్యూ విల్డర్నెస్ రచన: డయాన్ కుక్ ప్రచురణ: హార్పర్; 2020 - పద్మప్రియ -
దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య భారత నిర్మాణంలో భాగంగా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం అత్యంత కీలకమైన అంశమని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం ద్వారానే దేశాభివృద్ధికి పునాది పడుతుందని గుర్తుచేశారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలకు తోడుగా స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఆన్లైన్ వేదికగా ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పౌష్టికాహార లోపం ఓ సవాల్‌గా మారిందని, దీన్ని అధిగమించడం ద్వారానే దేశ భవిష్యత్ అయిన చిన్నారులను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని తెలిపారు. దేశ యువశక్తిని సద్వినియోగం చేసుకోవాలంటే చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, వ్యూహాత్మక, సమష్టి కార్యాచరణ అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఉన్న 15.9 కోట్ల ఆరేళ్లలోపు చిన్నారుల్లో 21 శాతం మందిలో పోషకాహార లోపం, 36 శాతం మంది తక్కువ బరువుతో ఉండడం, 38 శాతం మందికి టీకాలు అందడం లేదని పుస్తకంలో ఉన్న అంశాలు ప్రస్తావించారు. సమాజంలో అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్షించారు. -
నాలో.. నాతో.. వైయస్సార్
వైయస్సార్ సతీమణి శ్రీమతి వైయస్ విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైయస్సార్’’ పుస్తకాన్ని, మహానేత 71వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలో నిన్న ఆవిష్కరించారు. డాక్టర్ వైయస్సార్‌గారి సహధర్మచారిణిగా శ్రీమతి విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారమే ఈ పుస్తకం. 2009 సెప్టెంబరు 2న ఆనూహ్యంగా డాక్టర్ వైయస్సార్ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారమే ఈ పుస్తకం. జీవితంలో తాను అనుభవించిన, తన గుండెల్లోనే దాచుకున్న భావోద్వేగాలను – ‘వైయస్సార్ తన కుటుంబంగా భావించిన’ అభిమానులందరితో పంచుకోవాలని శ్రీమతి వై.ఎస్. విజయ రాజశేఖరరెడ్డి చేసిన రచనే ‘నాలో.. నాతో.. వైఎస్ఆర్.’’ మహానేత గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజల నుంచి తెలుసుకున్నానని; ఆయన గురించి ప్రజలకు తెలియని మరికొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని శ్రీమతి విజయమ్మ తన తొలి పలుకుల్లో తెలిపారు. డాక్టర్ వైయస్సార్ ఒక కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో ఉన్నది ఉన్నట్టుగా శ్రీమతి విజయమ్మ వివరించారు. తమ వివాహం, ఆ నాటి పరిస్థితులు, పేదల డాక్టర్‌గా వైయస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటినుంచి వైయస్సార్ నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, చారిత్రక ప్రజా ప్రస్థానం, జగన్; షర్మిలలతో.. వారి కుటుంబాలతో మహానేత అనుబంధాలు; మహానేత మరణంతో ఎదురైన పెను సవాళ్ళు, శ్రీ వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవరకు పరిణామాలు... ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా కొన్ని, వివరంగా మరి కొన్ని తెలిపారు. మరణం లేని మహానేత గురించి, తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న మహానేత గురించి, తెలుగువారంతా తమ కుటుంబమే అనుకున్న మహానేత గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని శ్రీమతి విజయమ్మ అన్నారు. ఆయç¯ జీవితం తెరిచిన పుస్తకమని; ఆయన ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని శ్రీమతి విజయమ్మ వివరించారు. ఒక ముఖ్యమంత్రి భార్య నుంచి ఇలాంటి రచన రావడం ఇదే ప్రథమం. ఎమెస్కో పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించిన ఈ పుస్తకం ఆమెజాన్లో లభ్యం. పుస్తకం తొలి పుటల్లో... ‘‘జీపులో వెనక సీట్లో కూర్చోబోతుండగా, ‘అక్కడ కూర్చోడమేంటి, వచ్చి ముందు కూర్చో విజయా’ అన్నారు ఆ వ్యక్తి. దాంతో చాలా ఇబ్బందిగా, బిడియంగా, దించిన తల ఎత్తకుండా ముందుసీట్లో ఈయన పక్కనే కూర్చున్నాను. బిగుసుకుపోయి కూర్చున్నానని గమనించినట్టున్నారు ఈయన. కాసేపాగి – ‘ఎందుకు టెన్షన్ పడుతున్నావు... ఫ్రీగా కూర్చోవచ్చు కదా’ అన్నారు. అయినా నేను అలాగే బిగుసుకుని ఉండడంతో, లాభం లేదనుకున్నారో ఏమో, మాటల్లోకి దించారు. అప్పుడు కాస్త భయం తగ్గిందనుకుంటా, నేను కూడా మెల్లమెల్లగా ఓ రెండు మాటలు మాట్లాడడం మొదలెట్టాను. ఎందుకో మాటల మధ్యలో ధైర్యం చేసి, ఈయనను మొదటిసారి కళ్ళు ఎత్తి చూశాను... ఆ కోరమీసాలు, చందమామ లాంటి ముఖం, కాంతివంతమైన చిరునవ్వు, ఆ ముఖవర్చస్సు, ఉట్టిపడుతున్న రాజసం... నా గుండె దడ పెరిగింది. ఎప్పుడూ లేని కొత్త ఆలోచనలు కలిగాయి. ఇలాంటి వ్యక్తితో జీవితం అంతే అందంగా ఉంటుందేమో అనిపించింది. ఈయన్ని అలా చూడగానే, నాన్న ఎన్నోసార్లు అమ్మతో అన్న మాటలు గుర్తొచ్చాయి – ‘జాతకం ప్రకారం నా కూతురు రాణి అవుతుంది... వచ్చేవాడు రాజు అవుతాడు’ అని! -
రాజ్ గోండు కథాగాయకుడి ధారణ శక్తి
మానవ విజ్ఞానవేత్త క్రిస్టొఫ్ హైమెండార్ఫ్ 1976లో రాజ్ గోండుల మీద తన రెండో విడత (తొలి విడత శోధన 1940ల్లో జరిగింది) పరిశోధన కోసం ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన శిష్యుడిగా, సహపరిశోధకుడిగా వచ్చారు మైకల్ యార్క్. హైమెండార్ఫ్ జిల్లా పశ్చిమ భాగంలో ఉన్న రాజ్ గోండులనూ, యార్క్ తూర్పు ప్రాంతపు రాజ్ గోండులనూ అధ్యయనం చేశారు. ఇప్పటి కుమ్రం భీం – ఆసిఫాబాద్ జిల్లాలో గిన్నెధరి గ్రామంలో ఉంటూ ముఖ్యంగా తిర్యాని లోయలోని గోండు, కొలాం గూడేల్లో ఏడాదిన్నర పాటు శోధించారు మైకల్. అనంతరం ఇరువురూ కలిసి ‘ట్రైబ్స్ ఆఫ్ ఇండియా: ద స్ట్రగుల్ ఫర్ సర్వైవల్’ పుస్తకాన్ని 1982లో వెలువరించారు. ‘రాజ్ గోండ్స్: రిఫ్లెక్షన్స్ ఇన్ ఎ పీకాక్ క్రౌన్’ పేరిట ఓ డాక్యుమెంటరీతో పాటు 1,500 ఫొటోలు కూడా తీశారు మైకల్. అప్పుడు మైకల్ యార్క్ రాసిన రెండు పరిశోధనాత్మక వ్యాసాల తెలుగు అనువాదమే ఈ ‘వేలిత పాట’. అనువాదం: ల.లి.త. సంపాదకుడు: సుమనస్పతి రెడ్డి. పేజీలు: 142; వెల: 90. ప్రచురణ: తెలంగాణ గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణా సంస్థ, మాసాబ్ ట్యాంక్, హైదరాబాద్. గోండుల్లో అప్పుడే పుట్టిన పిల్లల్ని సమాజంలోకి ఆహ్వానిస్తున్నందుకు ప్రతీకగా పాడేది ఈ వేలిత(తీగ) పాట. కుటుంబాన్ని ప్రతీకాత్మకంగా ఇంటి పైకప్పు నిండా పరుచుకోవటం కోసం గుమ్మడి మొక్క పంపే నులితీగలుగా (వేలిత వేలి) చెప్పుకుంటారు. పుస్తకంలోని కొంత భాగం ఇక్కడ: గిన్నెధరికి సంబంధించిన నా జీవితపు అతి ప్రియమైన జ్ఞాపకాలలో ఒకటి, నేను రాజ్ గోండుల సంప్రదాయ సృష్టి పురాణాలను రికార్డు చేయాలనుకుంటున్నానని కబురు పంపిన ఫలితంగా కలిగిన అనుభవం. కబురు పంపిన కొన్ని వారాల తరువాత వెడ్మ రాము అనే తోటి పెద్దమనిషి నా ఇంటికి ఒక కింగ్రీతో (కీక్రి అని కూడా అంటారు. వయోలిన్ వంటి సంప్రదాయ గోండి వాయిద్యం) వచ్చాడు. పాట పాడటానికి అంగీకరించాడు. ఆ పాట అయిదు రోజులు సాగటం నాకెంతో ఆశ్చర్యంగా అనిపించింది. అతడు పాడుతూ ఉంటే రాజ్ గోండుల పెద్ద గుంపు మా ఇంటి దగ్గర పోగయింది. అతని పాట విన్న తరువాత, రాజ్ గోండుల వద్ద బాగా అభివృద్ధి చెందిన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం లేకపోవచ్చుగానీ, భారతదేశపు ఆదివాసీల్లో ఉన్న అతి సమృద్ధమైన మౌఖిక సంప్రదాయాలూ, సంస్కృతుల్లో రాజ్ గోండులది కూడా ముఖ్యమైనదని నాకు తెలిసివచ్చింది. ఆ పాటనంతటినీ అనువదించి విశ్లేషించటానికి నాకు నెల రోజులు పట్టింది. రాజ్ గోండులు ఈ విశ్వాన్ని ఎలా ఊహించారనే విషయం మీద నాకు ప్రగాఢమైన అవగాహన వచ్చింది. అంత సుదీర్ఘమైన, ఉత్కృష్టమైన రచనను ఎలా గుర్తుపెట్టుకుంటారని వెడ్మ రామును నేనడిగితే, ఆయన దాదాపు 125 గులకరాళ్లను నేల మీద మూడు ఆయామాల్లో (ఒక ఘనరూపంలో) అనిపించేలా పేర్చి వర్ణిస్తూ అదే తన జ్ఞాపన సహాయకారి అని వివరించాడు. ఒక సంప్రదాయ కథాగాయకుడి వద్ద ధారణకు తోడ్పడే ఇంత నిశితమైన పద్ధతి ఉండటం నా శాస్త్రీయ పాశ్చాత్య అవగాహనను దిగ్భ్రమకు గురి చేసింది. గోండుల నమ్మకం ప్రకారం మానవ జన్మ పుట్టుకతో మొదలవుతుంది. ఇది పురిటి నొప్పులతో మొదలై దాదాపు ఒక వారం తరువాత జరిపే శుద్ధి çసంస్కారంతో ముగుస్తుంది. మగ, ఆడ పిల్లల పుట్టుక మధ్య పెద్ద తేడా చూపరు రాజ్ గోండులు. మానవ జన్మ అంటే భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశమనే పంచభూతాలు కూడటం, ఇంకా దానికి భగవంతుడు జీవ అంటే ప్రాణాన్ని ఇవ్వటం. ఈ పదార్థాలూ, ఈ ప్రాణశక్తీ కలిస్తే ఒక మౌలిక ఆధారం ఏర్పడుతుంది. ఆ విత్తనమే పెండ్లి సమయానికి యౌవన దశకు చేరి, పునరుత్పత్తికి కారకమై వృద్ధి చెందుతుంది. ఆ విత్తనమే మృత్యు సమయంలో భగవంతుడు ప్రాణశక్తిని వెనక్కు తీసుకున్నప్పుడు నశించి ధూళిలో కలిసిపోతుంది. మనిషి అస్తిత్వమే ఒక అభివృద్ధి క్రమం. జీవన పరిభ్రమణంలో దాటవలసిన అన్ని దశలూ దాటి వెళితేనే మానవ జన్మ సంపూర్ణమౌతుంది. దీనిని గోండులు ప్రతీకాత్మకంగా అయిదు జొన్న విత్తనాలుగా చెప్పుకుంటారు. జొన్న వాళ్ల ముఖ్య ఆహార ధాన్యం. పెండ్లప్పుడు ఆ అయిదు విత్తనాలు అయిదు కొలతల విత్తనాలవుతాయి. చనిపోయినప్పుడు అవి అయిదు కొలతల పిండిగా మారతాయి. అయితే ఎవరైనా పెండ్లికి ముందే చనిపోతే ఆ మనిషి అభివృద్ధి క్రమం మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు చావు తంతు చాలా చిన్నదైపోతుంది. అయిదు గింజల ప్రతీక ప్రాధాన్యం కోల్పోతుంది. -
జీవితానికి పట్టిన జైలు వాసన
పేరుండని 14 ఏళ్ళ ‘అతను’ ఉత్తర పాకిస్తాన్లో ఒక రోజు ‘జల్దారు పళ్ళ ట్రే పక్కన నిలుచున్న సబాను’ చూస్తాడు. ‘పళ్ళ రంగు ఆమె తెల్ల సిల్కు దుపట్టాపైన ప్రతిఫలితమయింది’ అంటాడు. సబా స్థానిక రాజకీయవేత్త కూతురు. తమ ఆర్థిక తారతమ్యాలని నిర్లక్ష్యపెట్టి ఇద్దరూ కలిసి దానిమ్మ తోటకి వెళ్తారు. ఆ సాయంత్రం అమాయకంగా గడుస్తుంది. పిల్లలూ చిన్నవారే. కానీ, ‘శిక్షించబడ్డానికి కాక మరచిపోబడ్డానికి’ అతన్ని జైల్లో పెట్టిస్తాడు సబా తండ్రి. ఉత్తమ పురుష కథనంతో ఉండే ‘ఇన్ ద ఓర్చర్డ్, ద స్వాలోస్’ నవల ఇది. ఖైదుకి ఒక నగ్నత్వం ఉంది. మనలో ఏ భాగం దాచబడదు’ అనుకున్న అతను– తన బాల్యాన్నీ కౌమారదశనీ కోల్పోయి, ఆ నిర్బంధంలో లైంగిక దాడులను భరిస్తూ, పోషకాహారం లేకుండా 15 ఏళ్ళుంటాడు. తాజా గాలి లేని ఆ జైలు కిక్కిరిసి ఉంటుంది. ‘దీని వాసన నా ఎండిన గొంతుకు పట్టేసింది. నా శరీర భాగాలన్నిటిలోకీ చొచ్చుకుపోయింది. సమయం గడిచేగొద్దీ అలవాటైపోయింది తప్ప యీ వాసనను మరవడం అసాధ్యం’ అంటాడు. ‘సబా, అప్పటికి మనమింకా పిల్లలమే. పెద్దవారి లోకానికుండే ఎల్లలు మనకి తెలియవు. లోకానికి గోడలూ ఊచలూ ఉన్నాయనీ, మనుష్యులు విభజింపబడి ఉన్నారనీ ఎరుక లేదు... ప్రేమని పంచుకోవాలి. లేకపోతే అది పిచ్చితనం అవుతుంది’ అన్నవంటి ఉత్తరాలు రాస్తూ గడుపుతాడు. తను ఆ అమ్మాయిని నిజంగా ప్రేమించాడో లేదో కూడా తెలియదతనికి. సబాకూడా తనని మరిచిపోయి ఉంటుందని అనుకుంటాడు. అయితే, పాకిస్తాన్ జైళ్ళ క్రూరత్వాన్ని భరించేందుకు ఆ జ్ఞాపకాలనే సజీవంగా ఉంచుకుంటాడు. మానసికంగా, భౌతికంగా విరిగి, వంగిపోయి, నడవటం కూడా కష్టమయే స్థితిలో– సగం చచ్చి ఉన్న అతనికి 29 ఏళ్ళు వచ్చినప్పుడు, జైలు నుండి రోడ్డుమీదకి గెంటేస్తారు. అతన్ని బతికించడానికి దోహదపడినది ‘రాసేందుకు నా వద్ద ఇంక పద్యాలేవీ లేవు’ అనే రిటైర్ అయిన ‘ప్రభుత్వ కవి’ అబ్బాస్ నిస్వార్థసేవే. అతను తన పల్లె చేరుతాడు. రూపురేఖలు మారిపోయిన తన్ని ఎవరూ గుర్తించక పోయినప్పుడు, ‘ఒకానొకప్పుడు కుర్రాడినైన నేను ఇప్పుడు నాకే అపరిచితుడిని. ఒక మనిషిని మార్చేయడానికి ఘోరమైన పరిస్థుతులు చాలేమో!’ అనుకుంటాడు. కథకుని కుటుంబ సభ్యులూ, సబా అక్కడ ఉండరు. తండ్రి తోట ఇప్పుడింకెవరిదో అయి, పాడుబడి ఉంటుంది. రోజూ ఆ తోటలవైపు నడిచి సీమ పక్షుల కోసం ఎదురు చూస్తూ, ‘గాలిలో చిట్టి అద్భుతాలలా అవెంత చురుకైనవో! ఎంత అద్భుతంగా వరుసలు కడ్తాయో!’ అనుకుంటాడు. వంచించబడిన జీవితాలు గుర్తించబడకుండానే ఎలా గడిచిపోతాయోనన్న చక్కటి వర్ణనలుండే యీ నవలిక మానవ çహృదయానికుండే అపారమైన తాళిమి గురించి చెప్తుంది. ఏ నిర్దిష్టమైన ముగింపూ లేని పుస్తకపు చివర్న, పాకిస్తానీ సమాజంలో హెచ్చవుతున్న ఇస్లామిక్ సనాతన వాదాన్ని– బ్రిటిష్ రచయిత పీటర్ హాబ్స్ ఎంతో నిగ్రహంతో చిత్రిస్తారు. రెండు పేజీల్లో ఉండే తాలిబాన్, 9/11 గురించిన ఉదహరింపులు తప్ప, తన యీ కల్పిత ప్రపంచంలో రాజకీయ వివరాలు చొప్పించరు. రచయితకు ఎన్నో ఏళ్ళ కిందట పాకిస్తాన్లో ఉన్న బ్రిటిష్ ఫారిన్ ఆఫీసులో ఉద్యోగం వచ్చినప్పుడు, అక్కడ చేరకుండా ఆయన ఉత్తర పాకిస్తానంతా తిరిగారు. పాకిస్తాన్లో జరిగిన సంఘటనల నిజానిజాలని సరిచూడమని ఆయన తన పాకిస్తానీ స్నేహితుడిని అడిగిన తరువాతే పుస్తకాన్ని అచ్చుకిచ్చారు. ‘ఉత్తర పాకిస్తాన్ శిథిలమవుతున్న కఠోరమైన ప్రాంతం’ అంటారు హాబ్స్. స్పష్టమైన వచనం ఉన్న యీ పుస్తకాన్ని 2012లో ప్రచురించినది, అనాన్సీ ప్రెస్. కృష్ణ వేణి -
ఒక ఒంటరి జీవితగంధం
‘ఫ్రెంచ్ స్త్రీ రాబోయే ముందు, నేను సాధించవలసిన పనులు ఎన్నో ఉన్నాయి,’ అంటూ ప్రారంభమయ్యే ‘ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్’ నవల్లో, అలీ జర్జర్ ఏనాటి నుండో తన మూత్రకోశాన్ని అదుపులో ఉంచుకుని, తన్ని తాను దృఢపరచుకున్న వ్యక్తి. దగ్గు రాకుండా, తన ఊపిరితిత్తులని నిరోధించగలుగుతాడు. తన జ్ఞాపకాల చిత్తభ్రమని నిర్దేశించగలిగేవాడు. అతని ఉనికే స్వీయ నియంత్రణతో ముడిపడి ఉంటుంది. పేదవారికి టీ అమ్మే స్థానిక స్త్రీల, పనికత్తెల, వలసదారులైన స్త్రీల ముందే అస్తమానం వేళ్ళాడుతుంటాడు. అతను విడిచిపెట్టిన ఆడవాళ్ళు, ‘ఒక వెచ్చని కలని చుట్టుకొని, సంతోషకరమైన జీవితం గురించి కలలు కనే వారు’. ‘ఘాలిబ్’ (ఉనికిలో లేనిది) అన్న తన ‘ఊరి గోడల మీదుండే బీటల్లా వారు ఉపేక్షింపదగ్గవారు’ అన్నది అతని అభిప్రాయం. ‘నిశ్శబ్దంగా, మృదువుగా తెరుచుకునే తలుపులని ఎవరూ గౌరవించరు’ అంటాడు. అందమైన ఫ్రెంచ్ యువతైన కాతియా, జింబాబ్వేలో నర్స్‌గా పని చేస్తుంటుంది. ఒక విదేశీ మందుల కంపనీ, నకిలీ మందులను ఆఫ్రికా ఎగుమతి చేస్తోందని యాదృచ్ఛికంగా కనుక్కుంటుంది. ఆ తరువాత, అంతర్జాతీయ కీర్తి పొంది, ఆఫ్రికా ఖండం యొక్క ప్రచార పర్యటన మొదలుపెడుతుంది. ఆమె సూడాన్‌లో ఉన్న ఘాయిబ్కు రావలసి ఉన్నప్పుడు, ఆమెకు తగిన వసతి అవీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రిటైర్ అయిన అలీ జర్జర్ మీద పడుతుంది. అలీ– పుష్టిగా ఉంటాడు. బట్టతల ఉన్న బ్రహ్మచారి. నెట్లో చూసిన పట్ల వ్యామోహం పెంచుకుని, ఆమెను ట్రాల్ చేయడం ప్రారంభిస్తాడు. ఆమెని కలుసుకుని, పెళ్ళి చేసుకుంటానన్న భ్రమలో మునిగి ఉంటాడు. కాతియా రాక ఆలస్యం అవుతూ ఉండగా, ఆమెకి ఇష్టమైన నీలం రంగు తన ఇంటి లోపలా, బయటా వేయిస్తాడు. ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న ఆమె ఫొటోలను ప్రింట్ చేసి, ఆమె స్వాగతం కోసం అందిన డబ్బుని తన పెళ్ళికొడుకు వేషం కోసం ఖర్చు పెట్టి, కాతియా ఫొటోలతో పెళ్ళి చేసుకుంటాడు. ఫొటోషాప్ చేసిన ఆ ఫొటోలను ఊళ్ళో తిప్పి, ఆమెను తన భార్యగా అందరికీ పరిచయం చేస్తాడు. ఆమె గర్భిణి అయిందన్న చాటింపు వేస్తాడు. ఒంటరితనం అతన్ని పూర్తిగా పిచ్చివాడిని చేసినప్పుడు– కాతియా వ్యభిచరించి తన్ని మోసం చేసిందని నిరూపించడానికి, తన యవ్వనంలో చూసిన సినిమా సీన్ అభినయించి అందరికీ చూపుతాడు. అసూయతో, వీధిలో ఒక ‘మగ భూతాన్ని’ వంటింటి కత్తితో హత్య చేస్తాడు. కాతియా ఫొటోని అదే కత్తితో పొడిచి, అరెస్ట్ అవతాడు. అతన్ని జైలుకి తీసుకు వెళ్తుండగా కాతియా కారు దిగుతుంది. ‘ఎవరినీ పెళ్ళి చేసుకోకపోవడం కన్నా ఒక ఆడ భూతంతో సహవాసం పెంచుకోవడం నయమే’ అని అలీ అన్నప్పుడు– ఒంటరితనం అతన్ని తినేస్తున్నప్పటికీ, అతను స్పష్టంగానే మాట్లాడుతున్నాడని తెలుస్తుంది. కానీ, చివరి వరకూ కాతియా పాత్ర నిజమైనదో, అలీ ఊహించుకున్నదో అర్థం కాదు. సూడాన్ రచయిత అమీర్ తాగ్ ఎల్సిర్, అరబిక్‌లో రాసిన యీ పుస్తకాన్ని, విలియమ్ మేనార్డ్ హచిన్స్ అనువదించారు. మూల పుస్తకంనుండి ‘అసంబద్ధత’ అన్న భావాన్ని రాబడతారు హచిన్స్. అలీ ప్రత్యక్ష వ్యాఖ్యానం – సాంకేతికతకూ, సాంకేతిక పరికరాలకూ బానిసైన మన సమాజాన్ని వ్యంగ్యంగా విమర్శిస్తుంది. డార్క్ కామెడీ. ప్రతినాయకుడైన అలీ ద్వారా నవల– అనేకమైన ఇతర సామాజిక రుగ్మతలను ఎత్తి చూపుతుంది. దీన్ని 2015లో ప్రచురించింది ఏంటీ బుక్ క్లబ్. కృష్ణ వేణి -
సంక్లిష్ట సమాజంలో మనిషి ఉనికి
1981లో ‘అమెరికన్ డెర్విష్’ కథ మొదలయేటప్పటికి హయాత్ షా వయసు పది సంవత్సరాలు. తల్లిదండ్రులు పాకిస్తాన్ నుండి వచ్చి, మిల్వాకీ (అమెరికా) లో స్థిరపడినవారు. డాక్టర్ అయిన తండ్రి నావీద్, మతం మీద నమ్మకం లేని వ్యక్తి. తల్లి మునీర్ ముస్లిమ్ అయినప్పటికీ మొహమ్మదీయ పురుషులు వంచకులన్న నమ్మకం నాటుకుపోయి ఉన్న స్త్రీ. ‘నేను నిన్ను యూదునిగానే పెంచుతున్నాను. వారికే స్త్రీలను గౌరవించడం తెలుసు,’ అని కొడుక్కి బోధిస్తుంటుంది. నావీద్కి ఆడ పిచ్చి. నవలంతటా తాగుతూ, భార్యని మోసం చేస్తూనే కనిపిస్తాడు. ఒకరోజు క్లినిక్‌లో తండ్రి నర్స్‌తో ఉండగా హయాత్ చూసి, ‘ఆమె మాట్లాడుతుంటే, యీయన డ్రింక్ సిప్ చేస్తూ తన శరీరాన్ని నర్సుకి తాకిస్తూ, ఆమెను ముద్దు పెట్టుకున్నాడు’ అంటాడు. నావీద్ స్నేహితుడైన నాథన్, తన భార్యని మోసగిస్తుండటం గురించి తల్లి, హయాత్‌కు చిన్నప్పటినుండీ నూరిపోస్తూ, నావీద్ని కూడా తిడుతుంటుంది. తన తల్లిదండ్రుల సంబంధాన్ని హయాత్ వర్ణిస్తాడు. ‘ఇప్పుడు వాళ్ళు ముందటికన్నా ఎక్కువ పోట్లాడుకుంటున్నారు. తిట్టుకుంటూ, తలుపులు బాదుకుంటూ, ఒకరినొకరు విడిచిపెడతామంటూ బెదిరించుకుంటున్నారు. నాన్న ఎన్నోసార్లు రాత్రుళ్ళు ఇంటికే రాడు.’ మీనా, మునీర్ స్నేహితురాలు. తన కొడుకు ఇమ్రాన్‌తో పాటు పాకిస్తాన్లో అయిన తన విడాకుల విషాదాన్ని తప్పించుకోడానికి ‘షా’ ల ఇంటికి వస్తుంది. ఆమె తెలివైనదీ, అందమైనదీ. హయాత్‌కు ఖురాన్‌ను పరిచయం చేస్తుంది. ఆమె పక్కన కూర్చుని చదువుతూ, పిల్లవాడు మీనాతో ప్రేమలో పడతాడు. ‘ఆమె గొంతంటే నాకు పిచ్చి. ఆమెకి సమీపంలో కూర్చోవడం నాకిష్టం. రాత్రిపూట ఆమె చెప్పే కథల చుట్టూనే నా రోజులు తిరుగుతాయి’ అంటాడు. కొడుక్కు ఇష్టమైన ఆ గ్రంథాన్ని తగలబెట్టి, మతంపైన కొడుక్కు ఉన్న నమ్మకాన్ని దూరం చేయాలనుకుంటాడు నావీద్. మీనా, నాథన్తో ప్రేమలో పడుతుంది. హయాత్ ఈర్ష్యతో రగిలిపోయి, మీనా మాజీ భర్తకి వివరాలు తెలుపుతూ, టెలిగ్రామ్ ఇస్తాడు. అప్పుడు ఆమె కుటుంబం స్పందించిన తీరు చూసిన నాథన్, బోస్టన్ వెళ్ళిపోతాడు. తను చేసిన తప్పుకి, తన్ని తాను క్షమించుకోలేకపోయి శేషజీవితమంతా అపరాధభావంతో గడుపుతాడు హయాత్. ఆ తరువాత మీనా పాకిస్తానీ అయిన సునిల్‌ను పెళ్ళి చేసుకుంటుంది. అతని చేతుల్లో దెబ్బలు తింటూ, అల్లా మీద నమ్మకంతో భరిస్తుంది. ఎనిమిదేళ్ళ తరువాత మీనా క్యాన్సర్‌తో చనిపోబోతున్నప్పుడు, తను పంపిన టెలిగ్రామ్ గురించి హయాత్ ఆమెకి చెప్తాడు. మీనా అతడిని క్షమిస్తుంది. ఆమె మరణం తరువాత నాథన్, ‘నేను మీ ‘ఆంటీ’ని ఎప్పుడూ మరచిపోలేదు. జీవితంలో నేను ప్రేమించినది ఆమెని మాత్రమే’ అని హయాత్‌తో అంటాడు. పుస్తకంలో ప్రధాన భాగం ముస్లిమ్ సమాజంలో స్త్రీలకుండే స్థానం గురించినది. కథనం సాఫీగా ఉంటుంది. ‘నావీద్ వంటి వ్యక్తులు తమ సంస్కృతిని వదిలించుకుని అమెరికన్లలా ఉందామనుకుంటారు. మీనా వంటి వ్యక్తులు రెండు సంస్కృతులనీ తమవే చేసుకుంటారు. ఏ ఒక్క దారి కూడా సంతోషానికి దారి తీయదు’ అని అంటారు రచయిత అయాద్ అఖ్తర్. కుటుంబ సంఘర్షణ గురించిన సంప్రదాయక కథలో, కిషోర ప్రాయపు ఆరాటం గురించి ఉన్న వివరాలు విశదమైనవి. ఇస్లామ్కున్న సంక్లిష్టతనీ, అమెరికన్ సమాజంలో తనకున్న ఉనికినీ అర్థం చేసుకునే ప్రయత్నం చేసే పిల్లవాడి మనోభావాలని చక్కగా వర్ణిస్తారు అఖ్తర్. 9/11కి ముందు, అమెరికాలో– యూదులకూ, ముస్లిమ్సుకూ మధ్యన ఉండిన ఉద్రిక్తతలను సూక్ష్మంగా వివరిస్తారు. 2012లో పబ్లిష్ అయిన రచయిత యీ తొలి నవలలో– చమత్కారం, వ్యంగ్యం, ఆధ్యాత్మికత కూడా పుష్కలంగా కనబడతాయి. -కృష్ణ వేణి -
పేదరికమే నీ రహస్య కవల
1984. పల్లెటూరైన ధనౌలో పేదరికంలో మగ్గే కవిత, జసూ దంపతులకు మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది. ‘జసూ పిల్లని పారేస్తాడు’ అని అనుభవపూర్వకంగా తెలిసిన కవిత, పుట్టిన బిడ్డకు ‘ఉష’ అన్న పేరు పెడుతుంది. ‘తన తల్లిదండ్రులెవరో తెలియకపోయినా ఇబ్బంది లేదు. కనీసం, పిల్ల బతికే అవకాశం ఉంటుంది’ అనుకుని, భర్తకు తెలియనీయకుండా దూరాన్న ఉండే అనాథాశ్రమానికి కూతుర్ని అప్పగిస్తుంది. క్రిష్ణన్ (క్రిస్) బొంబాయి ధనిక కుటుంబానికి చెందిన న్యూరో సర్జన్. భార్య సోమర్, 30లలో ఉన్న అమెరికన్ డాక్టర్. వైద్యపరమైన సమస్య వల్ల పిల్లల్ని కనలేకపోతుంది. క్రిస్ తల్లి సలహాతో– దంపతులు, అనా«థాశ్రమంవారు ‘ఆశ’ అని పిలిచే, సంవత్సరం వయస్సున్న ఉషను దత్తత తీసుకుని, కాలిఫోర్నియా తీసుకు వెళ్తారు. భారతీయుడిని పెళ్ళి చేసుకున్నప్పుడు కనిపించకపోయిన సాంస్కృతిక తేడా ఆశను పెంచడంలో ఎదురవుతుంది సోమర్‌కు. ఆశాను స్కూలు నుండి తెస్తున్నప్పుడు, ఇతర తల్లులు ఆమెను కేవలం ‘ఆశా తల్లి’ గా మాత్రమే గుర్తిస్తారు. స్కూల్ మీటింగులకు సోమర్ వద్ద సమయం ఉండదు. ‘తల్లి అవడం, నా వృత్తి కూడా నన్ను నిర్వచించలేకపోతున్నాయి. రెండూ నాలో భాగమే. కానీ కలవలేకపోయాయి’ అంటుంది. తల్లి నిర్లక్ష్యం నడుమ పెరిగిన ఆశ జర్నలిస్టు అయి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందడానికి మొట్టమొదటిసారి బోంబే వచ్చి, క్రిస్ తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. మురికివాడల గురించి పత్రికకు రిపోర్ట్ చేస్తున్నప్పుడు, మొదట తన జీవసంబంధమైన తల్లిదండ్రుల ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. వారు తనని అనాథాశ్రమంలో పెట్టి, మెరుగైన జీవితాన్ని అందించకపోయుంటే, తను ఇప్పటికీ ఆ వాడల్లోనే ఉండేదని అర్థం చేసుకున్నప్పుడు తన ప్రయత్నం విరమించుకుంటుంది. అయితే, వారింకా తన గురించి బెంగ పడుతున్నారేమో అన్న అక్కరతో వారికోసం ఒక ఉత్తరం వదులుతుంది ‘సీక్రెట్ డాటర్’ నవల్లో. యీ లోపల ‘క్రిస్, నేనూ– సరస్సుకి రెండు వైపులా ఉన్న ఒడ్డుల మీద నిలుచున్నాం. మధ్యనున్న దూరాన్ని తగ్గించే శక్తి ఇద్దరికీ లేదు’ అనుకునే సోమర్, క్రిస్ విడాకులు పుచ్చుకుంటారు. దీనికి సమాంతరంగా నడిచే జసూ దంపతుల కథలో, కవితకు విజయ్ పుట్టాక వారు బోంబేకి మారుతారు. కవిత తన ‘రహస్య కూతురు’ గురించి మరచిపోదు. జసూ కూతురి గురించి తెలుకున్నప్పుడు, భార్యతో: ‘తన పేరిప్పుడు ఆశ. అమెరికాలో పెరిగింది. పత్రికలకు రాస్తుంటుంది. ఇది రాసినది తనే. మనతో ఉంటే తనిలా ఎదగగలిగేదా!’ అంటూ, పత్రికలో ఉన్న కాలమ్ చూపిస్తాడు. ‘నా పేరు ఆశ’ అని మొదలుపెట్టిన ఉత్తరాన్ని కవితకు అందిస్తాడు. తాత మరణించినప్పుడు, ‘మనం సృష్టించుకున్న కుటుంబమే మనల్ని కన్నదానికన్నా ఎక్కువ ముఖ్యమవుతుంది’ అని క్రిస్ ముందు ఆశ ఒప్పుకుంటుంది. ‘ఒక డాక్టరుగా, నా వృత్తి వల్ల నేను గర్వపడలేదు. ఒక భార్యగా, నేనేమీ చేయలేదు. తల్లిని అసలే కాను. నా లోకాన్ని ఎవరో తలకిందులా తిప్పేశారు’ అనుకున్న సోమర్– భర్తా, కూతురితో రాజీ పడుతుంది. కవిత, జసూ కూడా ఒకరికి మరొకరి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచుకుంటారు. ఆడపిల్లలు గుదిబండలు అనుకునే భారతదేశపు ఆలోచనా ధోరణిని చక్కగా చిత్రిస్తారు రచయిత్రి శిల్పి సోమయ గౌడ. ఇండియాను విమర్శించరు కానీ ఆధునిక భారతదేశంలో ఉండే లింగ అసమానతలను చూపుతారు. దత్తతకు ఉన్న సాంస్కృతిక గుర్తింపునూ, స్త్రీల పాత్రనూ విడమరచి చెప్తారు. ముప్పై భాషల్లోకి అనువదించబడిన రచయిత్రి యీ తొలి నవలను మోరో/హార్పర్ కాలిన్స్, 2010లో పబ్లిష్ చేసింది. కృష్ణ వేణి -
చంఘిజ్‌ఖాన్
‘చంఘిజ్‌ఖాన్’ నవల రాస్తున్నప్పుడు తెన్నేటి సూరిని ఒక మిత్రుడు అడిగాడట: ‘‘నువ్వు వ్రాస్తున్నది చంఘిజ్‌ఖాన్ జీవితమా లేక వారం వారం వెలువడుతున్న వర్తమాన రాజకీయాల సమీక్షా?’’ ఈ నవల వెలువడిన కాలం 1950. నవలలో చిత్రించిన ఆసియా కుళ్లు రాజకీయాలు 12, 13 శతాబ్దాల నాటివి. కాలం తప్ప ఏమీ మారలేదు. ‘చరిత్ర పుటలు వెనక్కు తిరగబడుతున్నాయా?’ అదీ ఈ నవల ప్రాసంగికత. చరిత్రలో రాక్షసుడిగా, పరమ క్రూరుడైన హంతక నియంతగా చిత్రించబడిన చంఘిజ్‌ఖాన్ కాలంనాటి సామాజిక రాజకీయ పరిస్థితులను చిత్రిస్తూ, చంఘిజ్ఖాన్లోని ‘మహోన్నత మానవవాది’ని అర్థం చేయించడానికి సూరి ఈ నవలను సంకల్పించారు. ఎవడు ఎప్పుడు మీద పడి, ఆడవాళ్లనూ సంపదనూ దోచుకెళ్తాడో తెలియని అరాచక కాలంలో మంగోలియాలో జన్మించాడు చంఘిజ్‌ఖాన్. అసలు పేరు టెముజిన్. అంటే ఉక్కుమనిషి అని అర్థం. మన చేతిలోని ఆయుధాన్ని నిర్ణయించేది శత్రువు చేతిలోని ఆయుధమే, అని నమ్మాడు టెముజిన్. మహత్తరమైన సైనిక శక్తిని సిద్ధం చేశాడు. ‘123 గుడిసెలు, లేక డేరాలు గల ఒక బంజారీ తండా నాయకుడు ప్రపంచంలో ముప్పాతిక వంతు వరకూ జయించి మూడు శతాబ్దాల పర్యంతం స్వర్ణయుగాన్ని అనుభవించిన ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగాడు?’ మానవుడిగా అతను ఎలాంటి స్వభావం కలవాడు? అతనిలో వున్న బలీయమైన గుణసంపత్తి ఏమిటి? ‘నీకున్నది మాత్రమే బలం కాదు శత్రువు నీకుందని నమ్మేది కూడా నీ బలమే!’ అన్న యుద్ధసూక్తిని అనుసరించి ఎలా శత్రువులను బోల్తా కొట్టించాడు? ఎలాంటి అనితరసాధ్యమైన యుద్ధవ్యూహాలను రచించాడు? చివరకు ప్రపంచాన్ని జయించే చంఘిజ్‌ఖాన్(జగజ్జేత) ఎలా కాగలిగాడు? అన్న ప్రశ్నలకు నవల సమాధానం చెబుతుంది. తెన్నేటి సూరి వివిధ గ్రంథాలను, ముఖ్యంగా హెన్రీ హెచ్, హౌవర్త్ రాసిన మంగోల్ హిస్టరీని అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా టెముజిన్తోపాటు, చమూగా, కరాచర్, తుఘ్రల్‌ఖాన్, భగత్తూర్, ‘షామాన్’, యూలన్, కూలన్ లాంటి పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన నవల ఇది. తెన్నేటి సూరి -
ఇందిర ఆత్మ, జాతి వాణి హక్సర్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ రచించిన ‘ఇంటర్‌ట్వైన్డ్ లివ్స్: పీఎన్ హక్సర్ అండ్ ఇందిరాగాంధీ, ఎ బయాగ్రఫీ ఆఫ్ హక్సర్‘ పుస్తకాన్ని జూన్ 19న ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధి కృష్ణమోహన్రావుకి ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతీయ దౌత్యం, విదేశీ విధానాలపై విస్తృతానుభవం కలిగిన పీఎన్ హక్సర్‌ని 1950లో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎంపిక చేసుకున్నారని, పదిహేనేళ్లపాటు నెహ్రూ ఆధ్వర్యంలో పనిచేసిన హక్సర్‌ని 1967లో ఇందిరాగాంధీ మళ్లీ ఎంపిక చేసుకున్నారని జైరాం చెబుతున్నారు. హక్సర్.. భారతీయ రాజకీయ చరిత్రలోని సంక్లిష్ట దశలో, అత్యంత సంక్షుభిత సంవత్సరాల్లో చాణక్యుడి పాత్రను పోషించారు. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శిగా.. జాతి వాస్తవ చైతన్య ప్రదాతగా, ఇందిరాగాంధీకి విశ్వసనీయ వ్యక్తిగా చరి త్రకెక్కారు. సంజయ్ గాంధీ కలల ప్రాజెక్టు అయిన మారుతి కారు తయారీపై విభేదించిన హక్సర్, ఇంది రకు దూరం జరిగారు. జైరాం రమేష్ ఇంటర్వ్యూ సంక్షిప్తపాఠం సాక్షి పాఠకులకు అందిస్తున్నాం. హక్సర్‌పై పుస్తకం రాయడానికి కారణం? ఇందిరాగాంధీ హయాంలో 1967–73 మధ్యకాలంలో పీఎన్ హక్సర్ అత్యంత ప్రభావశీలుడైన, శక్తిమంతుడైన ప్రభుత్వ ఉన్నతాధికారిగా వ్యవహరించారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్‌పై విజయం, 1971 లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు, 1972లో సిమ్లా ఒప్పందం, పాకిస్తాన్, న్యూ ఢిల్లీ మధ్య 1973 నాటి ఒప్పందం వంటి ఇందిర సాటిలేని విజయాలన్నింటికీ సూత్రధారి హక్సర్. ఈ అన్నింటిలో హక్సర్దే ప్రధాన పాత్రా? ఇందిరాగాంధీ రాజకీయనేత. కానీ ఈ పరిణామాలన్నింటిలో కీలకపాత్ర వహించింది మాత్రం పీఎన్ హక్సర్. ఇద్దరి భాగస్వామ్యమే ఈ విజయాలకు మూలం. సుదీర్ఘకాలంగా నెహ్రూ, ఇందిర కుటుం బంతో హక్సర్ సన్నిహిత సంబంధాలు నెరిపారు. జీవితాంతం మార్క్సిస్టుగానే ఉండిన హక్సర్ 1970లలో భారత ఆర్థిక వ్యవస్థ వామపక్షవిధానాల వైపు మొగ్గు చూపడానికి తానే బాధ్యుడు. 1969లో బెంగళూరులో జరిగిన జాతీయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోవడం, తదుపరి పరి ణామాలన్నింట్లో హక్సర్ ఇందిర వెన్నంటే ఉన్నారు. ఇందిరకు భావజాలపరంగా, నైతికంగా మూలస్తంభంగా హక్సర్ వ్యవహరించారు. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీతో విభేదాల కారణంగా 1973 జనవరి 15న హక్సర్ ఇందిరకు దూరం జరిగారు. ఇందిరకు హక్సర్ పంపిన చివరి సూచన పీవీ నరసింహారావుకు సంబంధించింది కావడం విశేషం. మొదట జై తెలంగాణ ఉద్యమాన్ని, తర్వాత జై ఆంధ్రా ఉద్యమాన్ని బలపర్చిన పీవీ తన్ను తాను పూర్తి అసమర్థుడిగా నిరూపించుకున్నారని, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృఢవైఖరి అవలంబించాలని ఇందిరకు హక్సర్ సలహా ఇచ్చారు. హక్సర్ అంత శక్తివంతుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధునిక భారత చరిత్రలో కానరారు. ఇందిర నియంతృత్వానికి హక్సరే కారణమా? లేదు.. లేదు. 1973 జనవరిలో ఇందిరకు హక్సర్ దూరం జరిగారు. కానీ ఆమె ఆయన్ని మళ్లీ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు. ఈ స్థానంలో హక్సర్ 1975 మార్చి వరకు ఇందిరతో పనిచేశారు. 1975లో ఇందిర విధించిన ఆంతరంగిక అత్యయిక పరిస్థితిని హక్సర్ వ్యతిరేకించారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన సంజయ్ గాంధీ బాధితుడైనప్పటికీ, ఇందిరకు విధేయుడిగానే ఉండేవారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ బహిరంగంగా దాని గురించి వ్యాఖ్యానించలేదు. జరుగుతున్న పరిణామాల గురించి హక్సర్ ఇందిరను వ్యక్తిగతంగా కలిసి చెప్పేవారు. బ్యూరోక్రాట్‌గా హక్సర్ ఔన్నత్యం ఏమిటి? పాలనా వ్యవహారాల్లో హక్సర్ అత్యంత నిజాయితీపరుడు. అందుకే 1987లో రాజీవ్ గాంధీ చైనాతో సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడం కోసం హక్సర్‌ను చైనాకు పంపారు. ఆ తర్వాతే రాజీవ్ 1988లో చైనా పర్యటించారు. పాలనపై హక్సర్ ప్రభావం స్థాయి ఏమిటి? పాలనలో సరైన వ్యక్తులను ఎంచుకోవడమే హక్సర్ గొప్పదనం. ఆయన ఎంపిక చేసినవారే ఆధునిక భారత వ్యవస్థ నిర్మాతలయ్యారు. ఆయన తీసుకొచ్చిన ఎంఎస్ స్వామినాథన్ అత్యున్నత వ్యవసాయ శాస్త్రజ్ఞుడై హరిత విప్లవానికి ఆద్యుడయ్యారు. ఇక ఆయన ఎంపిక చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 1970లో ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అయ్యారు. ఇస్రో చైర్మన్‌గా హక్సర్ ఎంపిక చేసిన సతీష్ ధావన్ భారత అంతరిక్ష కార్యక్రమాలకు పితామహుడయ్యారు. ఇక హోమీ సేత్నా పొఖ్రాన్ అణుపరీక్షల్లో కీలక పాత్ర పోషించారు. హక్సర్ సలహమేరకే సోనియా గాంధీ పీవీ నరసింహారావును కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. అలా పీవీ ప్రధాని కావడానికి కూడా హక్సరే ఆద్యుడు. 1973లో పీవీ అసమర్థుడని పేర్కొన్న హక్సర్ 1991లో కాంగ్రెస్‌లో లుకలుకలు లేకుండా వీవీ చేయగలడని నిర్ధారించుకోవడం విశేషం. సంజయ్‌గాంధీతో విభేదాలకు కారణం? భారత్‌కు ప్రజా రవాణా ముఖ్యం కానీ కార్లు కావని హక్సర్ అభిప్రాయం. రెండోది ప్రధానమంత్రి నివాసంలో ఉంటూ ఆమె కుమారుడు కారు తయారీలో పాలుపంచుకోవడంతో హక్సర్ విభేదించారు. అయితే మారుతి కార్ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చనుందని గుర్తించగానే హక్సర్ ప్రధాని కార్యాలయం నుంచి బయటకు వచ్చేశారు. జైరాం రమేష్ -
ప్రేమ రంగు పులుముకున్న రెండు జీవితాలు
సచిన్ కుందల్కర్ రాసిన ‘కోబాల్ట్ బ్లూ’ నవలలో– పూణేలో ఉండే జోషీల మధ్య తరగతి కుటుంబం– పేరుండని ఆర్టిస్ట్ అయిన ‘అతడి’కి పేయింగ్ గెస్టుగా తమింట్లో చోటిస్తుంది. అతనికి భవిష్యత్తంటే పట్టింపుండదు. స్నేహితులుండరు. తన కుటుంబం/గతం గురించి మాట్లాడడు. కోబాల్ట్ నీలం రంగంటే ఇష్టం. శ్రీమతి జోషీ మాటలు వింటూ, ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. ఆమె పిల్లల్లో, కాలేజీలో చదువుకునే తనయ్కి స్వలింగ సంపర్క ధోరణి ఉంటుంది. అనూజా సాంప్రదాయాలని నమ్మని స్కూలు పిల్ల. తనయ్ అతని గదికి తరచూ వెళ్ళడం పట్ల కుటుంబానికి ఏ అభ్యంతరం ఉండదు కానీ కూతురు మాత్రం మగ పేయింగ్ గెస్టుకు దూరంగా ఉండాలనుకుంటారు తల్లిదండ్రులు. ‘అతను’ అన్నాచెల్లెళ్ళనిద్దరినీ ఆకర్షించి, ఇద్దరితోనూ లైంగిక సంబంధం పెట్టుకుంటాడు. ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు అతనితో ప్రేమలో పడతారు. ‘నేను గడిపే సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితం ఎంత సామాన్యమైనదో తెలుసుకున్నాను’ అంటాడు తనయ్ అతణ్ని కలుసుకున్న తరువాత.అనూజా పేయింగ్ గెస్టుతో ఆర్నెల్లపాటు పారిపోతుంది. వెనక్కొచ్చాక, ఒకరోజు అతను చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు. పుస్తకపు మొదటి భాగానికి కథకుడు తనయ్. పేయింగ్ గెస్టుని సంబోధిస్తూ తన భావాలని వ్యక్తపరుస్తూ, చెల్లెలితో అతను పెట్టుకున్న సంబంధం పట్ల ఆశ్చర్యం, వేదనా వ్యక్తపరుస్తాడు. రెండవ భాగం అనూజా తన దృష్టికోణంతో అతని గురించి డైరీలో రాసుకున్నది. ఈ జ్ఞాపకాలతో కుటుంబ సభ్యులందరూ ఎలా రాజీపడ్డారన్నదే కథ. అనూజాని తల్లీదండ్రీ సైకియాట్రిస్ట్ వద్దకి తీసుకెళ్ళిన తరువాత, తన పరిస్థితితో రాజీ పడ్డం నేర్చుకుని, చెప్తుంది: ‘అతని గురించి నాకున్న మంచి జ్ఞాపకాలన్నీ అతనితోపాటు పారిపోక ముందటివే. మేము కలిసి గడిపిన సమయం ఎక్కడికి పోయిందో!... ఇంక అతని గురించి ఏడవాలని లేదు గానీ, ‘‘ఎందుకిలా చేశావు!’’ అని మాత్రం ఒకసారి అడగాలనుంది.’ తన ప్రేమికుడితో పారిపోయిన చెల్లెల్ని రోజూ ఎదుర్కోవాల్సిన ఇబ్బంది ఏర్పడినప్పుడు, తనయ్ ముడుచుకు పోయి తన బాధలో ఒంటరివాడవుతాడు. తల్లికీ తండ్రికీ కొడుకు పెట్టుకున్న సంబంధం తెలుసో లేక తెలియనట్టు నటిస్తారో నవల స్పష్టంగా చెప్పదు. ఒకే ఒక వాక్యంలో ఉన్న అస్పష్టమైన సూచన తప్ప. అనూజాకి– అన్నకి అతనితో ఉన్న సంబంధం గురించిన ఎరుక ఉందో లేదో అన్న వివరాలు కూడా ఉండవు. అనూజా గతాన్ని వెనక్కి నెట్టి, ఉద్యోగం వెతుక్కుని తనదైన లోకం సృష్టించుకోగలిగి విముక్తురాలవుతుంది. తనయ్ ముంబై వెళ్ళిపోతాడు. నవలకి ఒక నిర్దిష్టమైన ముగింపేదీ లేదు. ఎన్నో విషయాలు సమాధానం లేకుండానే మిగిలిపోతాయి. 2006లో పబ్లిష్ అయిన మరాఠీ నవల ఇదే పేరుతో వచ్చింది. తర్వాత సినిమా దర్శకుడిగా మారిన కుందల్కర్ ఈ నవల రాసినప్పటికి అతని వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. కవీ, రచయితా, జర్నలిస్టూ అయిన జెరీ పింటో దీన్ని 2013లో ఇంగ్లిష్‌లోకి అనువదించారు. అయితే, అది అనువాదం అనిపించదు. ‘పుస్తకంలో ఉన్న కొన్ని భాగాలకి ఇంగ్లిష్ ప్రత్యామ్నాయాలని వెతికే ప్రయత్నాన్ని విడిచిపెట్టవలిసి వచ్చింది. కొన్ని సంగతులని విడమరిచి చెప్పలేమంతే’ అని అనువాదకుని నోట్లో రాసిన మాటలు వెంటాడతాయి. పేయింగ్ గెస్ట్, అన్నాచెల్లెళ్ళిద్దరికీ ప్రేమికుడవడం అన్నది ఇండియన్ సాహిత్యంలో అరుదైన టాపిక్కే. అంతకన్నా ముఖ్యమైనది ఒకే కథని రెండు కంఠాలతో, రెండు దృష్టికోణాలతో నడిపిన అరుదైన ప్రయోగం. u కృష్ణ వేణి -
ఇరువురు సోదరుల వేరు దారుల కథ
పుస్తక శీర్షిక ‘ద లోలాండ్’ రెండు చెరువుల మధ్యనున్న చిత్తడి నేలని ఉటంకిస్తుంది. దృష్టికోణాలని మారుస్తూ, ఫ్లాష్‌బ్యాకులని ఉపయోగించిన కథనం మూడు తరాల మిత్రాల కుటుంబాన్ని చూపిస్తుంది. ఈ నవల ‘మాన్ బుకర్ ప్రైజు’కి షార్ట్‌లిస్ట్ అయింది. ఝుంపా లాహిరి రాసిన ‘ద లోలాండ్‘, కలకత్తా పొలిమేరల్లో రెండు చెరువులు మధ్యనున్న, రెండెకరాల చిత్తడినేల వర్ణనతో ప్రారంభం అవుతుంది. మిత్రాల కుటుంబంలో ఇద్దరన్నదమ్ములు పెరుగుతుంటారు. సుభాష్ 13 ఏళ్ళవాడు. తమ్ముడు ఉదయన్ 15 నెలలు చిన్నవాడు. ఇద్దరికీ మధ్య సాన్నిహిత్యంతో పాటు పోలికలూ బాగానే ఉన్నప్పటికీ, స్వభావాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకం. సుభాష్ జాగ్రత్త పాటించేవాడు. అమెరికా వెళ్ళి చదువుకుంటాడు. ఉదయన్ నిర్లక్ష్య ధోరణి కనపరిచేవాడు. పగటిపూట ఉపాధ్యాయుడిగా పని చేస్తూ, రాత్రుళ్ళు నక్సలైటు ఉద్యమాల్లో పాల్గొంటాడు. ఫిలొసొఫీ విద్యార్థిని అయిన గౌరితో ప్రేమలో పడి, పెళ్ళి చేసుకుంటాడు. ఆ చిత్తడి నేలమీదే ఉదయన్‌ను ఒక రోజు పోలీసులు కాల్చి చంపేస్తారు. సుభాష్ ఇంటికి తిరిగి వచ్చి, తల్లీ తండ్రీ ఇష్టపడని గౌరిని పెళ్ళి చేసుకుని, ‘మధ్యలో ఆగిపోయిన నీ చదువు కొనసాగించవచ్చు’ అని ప్రలోభపెట్టి, అమెరికా తీసుకెళ్తాడు. అప్పటికే ఆమె గర్భవతి. బేలా పుడుతుంది. ప్రసవం తరువాత సుభాష్, గౌరి మొట్టమొదటిసారి లైంగిక సంబంధంలో పాల్గొన్నప్పుడు– ఇద్దరికీ సంతృప్తి కలగదు. వారి వివాహం కేవలం పరస్పర తాత్కాలిక ఆకర్షణ మీదా, ఇద్దరికీ దగ్గర అయిన ఉదయన్ జ్ఞాపకాల మీదా ఆధార పడినది అయి ఉండటం వల్ల, కొత్త భర్తనే కాక తను కోల్పోయిన ఉదయన్ జ్ఞాపకాలతో ముడిపడిన బేలాని కూడా ప్రేమించలేకపోతుంది గౌరి. ‘ఉదయన్ చోటు సుభాష్ భర్తీ చేయడం అన్నది దుద్దుల జతలో ఒకటి పోతే, రెండోదాన్ని జాగ్రత్తగా దాచుకోవడం వంటిదే’ అనుకుంటూ, జీవితంతో రాజీపడలేకుండా ఇద్దరినీ వదిలి కాలిఫోర్నియా వెళ్ళి, తన రంగంలో మంచి పేరు తెచ్చుకుంటుంది. లోర్నా అన్న స్త్రీతో సమలైంగిక సంబంధాన్ని ఏళ్ళకొద్దీ సాగిస్తుంది. సుభాష్ బేలాని పెంచుతాడు. వీటన్నిటినీ చూసిన బేలా పెద్దయి, ఏ నిబద్ధతకీ కట్టుబడి ఉండక, ఊరూరూ తిరుగుతుంది. తన బిడ్డ మేఘనాని తానే పెంచుతుంది.విడాకులు కావాలని సుభాష్ గౌరికి మెయిల్ పంపినప్పుడు, గౌరి ఒప్పుకుంటుంది. సుభాష్– బేలా టీచర్ ఎలీజ్‌ను పెళ్ళి చేసుకుంటాడు.ఆఖరి అధ్యాయం ఉదయన్ మరణించిన దినాన్ని గుర్తు చేసుకున్నది. అందరి దృష్టిలో దేవుడైన ఉదయన్, గతంలో జరిగిన ఒక హత్యలో పాలు పంచుకుంటాడు. ఇది తెలిసిన సుభాష్– ‘తనకి గౌరి ముందే అర్థం అయి ఉంటే, తన జీవితం వేరేగా గడిచేది’ అని గ్రహిస్తాడు. నవల– యువతకుండే తెగువ, మొండిధైర్యం, వ్యామోహం గురించినది. పశ్చాత్తాపం, తమని తాము క్షమించుకోలేకపోవడం, ఒక వ్యక్తి మరణం ఎంతమంది జీవితాలమీద ఎంత ప్రభావం చూపిందో అన్న అంశాలు నిండి ఉన్నది. ప్రధానపాత్ర చనిపోయిన తరువాత కూడా, కథనం ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కథాకాలం 1960లలో.పుస్తక శీర్షిక రెండు చెరువుల మధ్యనున్న చిత్తడి నేలని ఉటంకిస్తుంది. దృష్టికోణాలని మారుస్తూ, ఫ్లాష్‌బ్యాకులని ఉపయోగించిన కథనం మూడు తరాల మిత్రాల కుటుంబాన్ని చూపిస్తుంది. 2013లో వచ్చిన నవల అదే సంవత్సరం, ‘మాన్ బుకర్ ప్రైజుకీ’కీ, ‘బెయిలీ వుమన్స్ ప్రైజు’కీ షార్ట్‌లిస్ట్ అయింది. పులిట్జర్ గ్రహీత అయిన రచయిత్రి రాసిన ఈ రెండవ నవల కూడా ఆమె ఇతర పుస్తకాల్లాగే అమెరికా, ఇండియాలని నేపథ్యంగా తీసుకుని రాసినది. ఆడియో పుస్తకం ఉంది. ...కృష్ణ వేణి ఝంపా లాహిరి -
రాయలసీ కన్నీటి పాట పెన్నేటి పాట
‘వినిపింతునింక రాయలసీమ కన్నీటి పాటకోటి గొంతుల కిన్నెర మీటుకొనుచు, కోటి గుండెల కంజెరి కొట్టుకొనుచు’ అంటూ విద్వాన్ విశ్వం గానం చేసిన ‘పెన్నేటి పాట’ రాయలసీమ కరువు నేపథ్యంగా (1954లో) వచ్చిన తొలి కావ్యం. నదిలా ప్రవహించినప్పుడు పరిపూర్ణమైనట్టే, ఎండిపోయినప్పుడు జీవితం స్తంభించిపోతుంది. ఎండిపోయిన పెన్నానది ఇసుకతో నిండిపోయి ఆ ప్రాంతపు జీవన వాస్తవికతను ఈ కావ్యంలో విశ్వం కళ్లకు కట్టినట్టు చూపించారు. ‘ఇదే పెన్న! ఇదే పెన్న! నిదానించి నడు విదారించు నెదన్, వట్టి ఎడారి తమ్ముడు! ఎదీ నీరు? ఎదీ హోరు? ఎదీ నీటి చాలు? ఇదే నీరు! ఇదే హోరు! ఇదే ఇసుక వాలు!’ అంటూ సాగే పంక్తులతో రాగయుక్తంగా కావ్యగానం చేసే వారు ఈ సీమలో ఇప్పటికీ ఉన్నారు.ఈ కావ్య కథానాయకుడు రంగడు ఒక పెద్ద రైతుకు పుట్టిన ఏకైక సంతానం. ఆస్తినంతా తండ్రి పోగొట్టగా రంగడికి మిగిలింది శారీరక శ్రమ మాత్రమే. అతను అడవినుంచి కట్టెలు కొట్టితెచ్చి అమ్ముకునే కూలి. అతని భార్య గంగమ్మ ఇరుగుపొరుగు ఇళ్లలో ఒడ్లో, అటుకులో దంచి నూకలు, తవుడు తెచ్చుకుంటుంది. ఇద్దరి పరస్పర ప్రేమ, పరోపకార బుద్ధి, అంతులేని దారిద్య్రం, గంగమ్మ గర్భవతి కావడం, విశ్రాంతి లేకపోవడం, రంగడు నిస్సహాయుడై పోవడం ఇందులోని కథాంశం. ‘దైవమా; ఉంటివా? చచ్చినావ నీవు? హృదయమా; మానవుడు నిన్ బహిష్కరించె! చచ్చె నీలోకమున నాత్మసాక్షి యనుచు నెత్తినోరిడు కొట్టుకోనిండు నన్ను’ అంటూ నిర్వేదంతో కావ్యం ముగుస్తుంది. ఈ కావ్యంలో కథ రేఖామ్రాతమే కానీ, పేదరికం వల్ల కలిగే విధ్వంసానికి ప్రాధాన్యమిచ్చిన తొలి సంపూర్ణ కావ్యం. రాయలసీమలో ప్రవహించే ప్రధానమైన పెన్నానది, ఇక్కడి ప్రకృతి, గ్రామాలు, జీవన సరళి, శ్రమ వంటి వన్నీ ఈ కావ్యంలో ప్రతిబింబిస్తాయి. ఈ కావ్యం ప్రాచీన ఆధునిక రీతుల మేలు కలయిక. ఇందులో సీస పద్యాలున్నాయి, గేయాలున్నాయి, వృత్తాలున్నాయి, వచనంలా భాసించే పంక్తులున్నాయి. ఇందులో దస్త్రము, జీవాలు, సందకాడ, ఎనుము వంటి మాండలికాలున్నాయి. గంపంత దిగులు, అంబటిపొద్దు వంటి తెలుగు నుడికారాలూ ఉన్నాయి. రాఘవశర్మ -
పున్నాగ పూలు
డాక్టర్ జి.కె., డాక్టర్ క్రిష్ణ, షీలా మేడమ్ పాత్రల ద్వారా ‘జలంధర’ విభిన్న మనస్తత్వాలపై జరిపిన సైకో అనలిటికల్ పరిశోధన ఈ నవల. డాక్టర్ జి.కె. ఇచ్చిన స్ఫూర్తితో, మానవతా దృష్టితో ఆయన ప్రియ శిష్యుడు డాక్టర్ క్రిష్ణ స్థాపించిన జి.కె. హీలింగ్ సెంటర్ ఎందరికో శారీరక, మానసిక స్వాంతన కలిగిస్తూ ఉంటుంది.ఈ నవల జి.కె.కు స్వయానా తమ్ముడి కూతురైన ‘రాధ’ పాత్ర చుట్టూ ప్రధానంగా అల్లారు. రాధ సగటు ఆడపిల్లల ఆలోచనా సరళి కలిగి ఉంటుంది. తనకేం కావాలో తెలియని రాధ ‘మంచి అమ్మాయి’ అన్న ముద్ర ఉంటే చాలనుకుంటుంది. డాక్టర్ క్రిష్ణ రాధకు చిన్నతనంలో తెలిసిన వ్యక్తే. క్రిష్ణ రాధను ఎంతో ప్రేమిస్తాడు. కానీ రాధ తల్లి, క్రిష్ణ తల్లి వారి వారి ‘కచ్చలు’ తీర్చుకోవటానికి ఆడిన ఆటలో రాధ పావుగా మారి అనూహ్యంగా చెడు అలవాట్లు కలిగిన రాజారావ్‌కు భార్య అవుతుంది. క్రిష్ణ తనను ప్రేమించిన విషయం చివరి వరకూ రాధకు తెలియదు. రాజారావ్‌కు బాగా జబ్బు చేస్తే జి.కె. హీలింగ్ సెంటర్లో చేర్పిస్తారు. అక్కడి డాక్టర్స్ డివోషన్, షీలా మేడమ్ కౌన్సిలింగ్, లైబ్రరీలోని పుస్తకాలు ఇవన్నీ రాధలో గొప్ప మార్పు తీసుకొస్తాయ్. అప్పుడనిపిస్తుంది రాధకు, ‘తను ఇన్ని రోజులూ ఒక అనారోగ్యకరమైన సాంఘిక వాతావరణంలో బందీనైపోయాననీ, అందులోంచి బయటపడాలీ’ అని. ఇంతలోనే రాజారావ్‌కు ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉన్నట్లూ వారికో బాబు కూడా ఉన్నట్లు తెలుస్తుంది రాధకు. హీలింగ్ సెంటర్లో ఎంతో మెచ్యూర్డ్‌గా తయారైన రాధ ఆమెను కలిసి ఆమె రాజారావ్‌ను పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. విడాకులు తీసుకుని రాజారావ్ జీవితం నుంచి హుందాగా తప్పుకుంటుంది. ఆస్ట్రేలియాలో పైచదువులు చదవడానికి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి స్కైప్‌లో ఛాట్ చేస్తున్నప్పుడు, పెదనాన్న ఫొటో, క్రిష్ణ ఉత్తరాలతో పాటు రాజారావ్ ఇచ్చిన డెబిట్ కార్డ్‌ని చూసి తల్లి అడుగుతుంది. ‘‘అవన్నీ సరే కానీ రాజారావ్ జ్ఞాపకాలెందుకు ఇంకా’’ అని. ‘‘అన్నీ జీవితంలో భాగాలే కదమ్మా’’ అంటూ చిరునవ్వుతో రాధ చెప్పే ముగింపు వాక్యాలతో నవల ముగుస్తుంది. -డాక్టర్ సి.ఎం. అనూరాధ -
శరీరంతో వినే సంగీతం
‘ఇప్పుడే ఒకమ్మాయి మొహం మీద గుద్దాను’ అని సిడ్నీ బ్లైక్ అనడంతో ప్రారంభం అయ్యే ‘మేబి సమ్‌డే’ నవల కొల్లీన్ హూవర్ రాసినది. సిడ్నీ తన ఆప్తమిత్రురాలైన టోరీతో కలిసి ఒక అపార్టుమెంట్లో ఉంటుంది. స్థిరమైన ఉద్యోగం చేసుకుంటూ, సంగీతం నేర్చుకుంటుంటుంది.పెరటి బాల్కనీ నుండి రిజ్ గిటార్ వాయిస్తుండగా వింటూ –అతని సంగీతం పట్ల ఆకర్షణ పెంచుకుంటుంది. అతను పాటలు రాస్తాడు. రాత్రివేళలు తను వాయిస్తున్నప్పుడు ఆమె వింటూ, దానికనుగుణంగా పాడుతోందని రిజ్ గమనించి, తన మ్యూజిక్ బ్యాండ్ కోసమని, ఆమె బాణీ కట్టిన మాటలు తెలుసుకోవాలనుకుంటాడు. ఇద్దరూ ఒకరికొకరు టెక్స్ మెసేజిలు పంపుకోవడం మొదలెడతారు. సిడ్నీ 22వ పుట్టినరోజునే, ఆమె బోయ్‌ఫ్రెండ్ హంటర్, టోరీతో వారి బాల్కనీలో శృంగారం జరుపుతుండగా రిజ్ చూసి, సిడ్నీకి చెప్తాడు. ఆమె హంటర్‌తో వాదన పెట్టుకుని, టోరీని చెంపదెబ్బ కొట్టి, అపార్టుమెంట్ వదిలి ఇద్దరు ఫ్లాట్మేట్లతో కలిసున్న రిజ్ ఇంటికి చేరుకుంటుంది. 24 ఏళ్ళ రిజ్, చెవిటివాడని సిడ్నీకి తెలుస్తుంది. అతనికి మ్యాగీ అన్న అందమైన గర్ల్ ఫ్రెండు ఉందని తెలిసినప్పుడు, దిగులు పడుతుంది. రిజ్, సిడ్నీ కలిసి లిరిక్స్ రాయడం ప్రారంభిస్తారు. ఇద్దరి మధ్యా, నోటిమాటల్లేని చమత్కారమైన సంభాషణలు జరుగుతుంటాయి. సిడ్నీ: నీవు వినలేవని ఎందుకు చెప్పలేదు? రిజ్: నీవు వినగలవని ఎందుకు చెప్పలేదు? సిడ్నీ పాడుతున్నప్పుడు ఆమెని పొదివి పట్టుకుని, ఆమె శారీరక కదలికలని బట్టి పాటని గ్రహించడం ప్రారంభిస్తాడు రిజ్. అలా ఇద్దరి మధ్యా శారీరక సాన్నిహిత్యం ఎక్కువవుతుంది. రిజ్ సిడ్నీకి మెసేజ్ చేస్తాడు: ‘మ్యాగీ కోసం నేను వంగగలను. నీకోసం విరగగలను’. తన బోయ్‌ఫ్రెండ్ తనను మోసం చేసినట్టే మ్యాగీకీ అవకూడదనుకుంటుంది సిడ్నీ. గర్ల్ ఫ్రెండుకి గుండెజబ్బుందని తెలిసినప్పుడు, సిడ్నీని తనింట్లోంచి వెళ్ళిపొమ్మని రిజ్ కోరతాడు. అయితే, మ్యాగీ అతన్ని స్వీకరించదు. కొంత గడువు తరువాత రిజ్– సిడ్నీ ఫ్లాటుకి మారతాడు. రచయిత్రి– సిడ్నీ, రిజ్ ఇద్దరి కోణాలనీ మార్చి మార్చి రాయడం వల్ల ఒకే పరిస్థితిలో ఇద్దరూ ఎలా ప్రతిస్పందించారో పాఠకులకి తెలుస్తుంది. వారి సంబంధంలో గౌరవం, నిజాయితీ, మెప్పుకోలూ ఉండటం చూస్తాం. ఎవరికీ అన్యాయం చేయకుండా ఇద్దరూ చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ‘ఇద్దర్ని ఒకే సమయంలో ప్రేమించడం సాధ్యమేనా? మనం ప్రేమిస్తున్న మనిషి అవసరాలు మన అవసరాలు కాకపోతే!’ అన్న ఎన్నో ప్రశ్నలు కనబడతాయి నవల్లో. కథలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. నవల్లో కొన్ని సన్నివేశాలకి తగిన పాటలున్నాయి. ఈ–బుక్‌లో అయితే, ఒక పాట ‘లింక్’ మీద నొక్కితే అది వింటూ, పుస్తకం కూడా చదివే వీలుంటుంది. పేపర్ బ్యాక్ అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పాట వినవచ్చు. లేకపోతే, ‘మేబి సమ్ డే’ సైట్లో కూడా వినే అవకాశం ఉంది. 2014 మార్చిలో వచ్చిన ఈ నవల ఏప్రిల్‌లో, ‘న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్’ లిస్టులో ఉండి, మళ్ళీ తిరిగి సెప్టెంబర్‌లో కూడా అదే లిస్టులో అగ్రస్థానం సంపాదించుకుంది. దీని ఆధారంగా వచ్చిన సినిమా ఉంది. సిడ్నీ, రిజ్ ఇద్దరి కోణాలనీ మార్చి మార్చి రాయడం వల్ల ఒకే పరిస్థితిలో ఇద్దరూ ఎలా ప్రతిస్పందించారో పాఠకులకి తెలుస్తుంది. - కృష్ణ వేణి -
కొత్త బంగారం
నవల– ఇద్దరు వ్యక్తులు యాదృచ్ఛికంగా కలుసుకుని చేసిన ఆకస్మిక ప్రయాణం గురించీ, ఒకమ్మాయి తనని తాను అర్థం చేసుకోవడం గురించినదీ. గేయిల్ ఫోర్మన్ రాసిన ‘జస్ట్ వన్ డే’ అమెరికన్ అమ్మాయి ఏలిసన్ హీలీ, హైస్కూల్ గ్రాడ్యుయేషన్ తరువాత స్నేహితురాలైన మెలనీతోపాటు యూరప్ ట్రిప్‌కు వెళ్ళడంతో మొదలవుతుంది. ఒక రోజు లండన్‌లో తన టూర్ గుంపుని వదిలిపెట్టి, షేక్స్పియర్ ‘ట్వెల్థ్ నైట్’ నాటకం చూడ్డానికి వెళ్ళినప్పుడు, దేశదిమ్మరైన అందమైన డచ్ యువకుడైన విలెమ్ డు రైటర్‌ను కలుసుకుంటుంది. మామూలు రూపురేఖలున్న ఏలిసన్ను చాలా ఆకర్షణీయంగా ఉంటుందని నమ్మించి, ఆమెని ‘లూలూ’ అని పిలుస్తూ, తనతోపాటు పారిస్ రమ్మంటాడతను. ఏలిసన్ చదువులో ముందుండే పిల్ల. క్రమబద్ధమైన జీవితం గడిపే అమ్మాయికి పరాయి యువకుడితో అప్పటికప్పుడే పారిస్‌కు వెళ్ళాలనుకునే మనస్తత్వం లేనప్పటికీ, తిరిగి అమెరికా వెళ్ళి ‘ఏలిసన్’గా తన సామాన్యమైన జీవితం గడపడానికి మారుగా మెలనీని వదిలి, ట్రిప్ ఆఖరి రోజున విలెమ్తో పాటు యూరో రైలెక్కుతుంది. ఇద్దరూ కలిసి పారిస్‌లో గుర్తుంచుకోతగ్గ రోజు గడుపుతారు. అపరిచితుడైన విలెమ్తో తనకి ఏదో విశేషమైన సంబంధం ఉందనుకుంటుంది ఆ అమ్మాయి. అతను ఆమె చిరునామా, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడి– ఏవీ అడగడు, తనవీ చెప్పడు. ఉదయం నిద్ర లేవగానే విలెమ్ జాడ కూడా కనబడదామెకి. ‘మరొక అదనపు రోజు అతనితో గడిపినప్పటికీ, నా నిరాశ వాయిదా పడ్డం తప్ప ఇంకేమీ జరగదని నా మనస్సుకి తెలుసు’ అని సర్దిచెప్పుకుని, అతనితో తన సంబంధం తన భ్రమే అని అనునయించుకుని, ఆ దినపు జ్ఞాపకాలని తప్పించుకుని ఇంటికి తిరిగి వెళ్తుంది. ఏలిసన్ కాలేజీలో చేరుతుంది కానీ విలెమ్ గురించి ఆలోచించడం మానక, అతనితో పాటు ఉన్నప్పుడు తనెంత తెగించి ప్రవర్తించిందో అన్న సంగతి కూడా మరవలేకపోతుంది. తనకి ఆసక్తి లేకపోవడంతో తన తల్లి ఎంపిక చేసిన సబ్జెక్టు మీద మనస్సు పెట్టి చదవలేకపోతుంది. ‘తన వెనక వదిలిన ఖాళీ జాగాల బట్టి, ఏదో లేకపోయినప్పుడే, అది ఉండేదని మనం గుర్తిస్తాం’ అనుకుంటూ, విలెమ్ను వెతకడానికి తిరిగి పారిస్ వెళ్తుంది. అతని జీవితానికి భాగం అయినవారిని కలుసుకున్నప్పుడు, ‘కేవలం ఒక్క రోజు’ తనతో గడిపిన వ్యక్తి, నిజ జీవితంలో ఎటువంటివాడో అర్థం చేసుకుంటుంది. చివర్న అతన్ని కలుసుకుంటుంది. నవల– ఇద్దరు వ్యక్తులు యాదృచ్ఛికంగా కలుసుకుని చేసిన ఆకస్మిక ప్రయాణం గురించీ, ఒకమ్మాయి తనని తాను అర్థం చేసుకోవడం గురించినదీ. ‘విలెమ్ ఆమెని ఎందుకు వదిలేసి వెళ్ళాడు!’ అన్న కుతూహలమే పుస్తకాన్ని చదివించేది. తన వాదనని సరిగ్గా వినిపించలేకపోయే నిస్సహాయురాలైన ‘మంచి పిల్ల’, జీవితంలో తనకి కావలిసినదేదో తెలుసుకున్న సమర్థురాలిగా మారడం గురించిన ఈ పుస్తకం, ఏలిసన్ సుఖాంతం వైపు చేసిన ప్రయాణం మీద కేంద్రీకరిస్తుంది. 2013లో విడుదలయిన నవలకి, ఆడియో పుస్తకం ఉంది. విలెమ్ దృష్టికోణంతో వచ్చినది దీనికి ఉత్తర కథ అయిన ‘జస్ట్ వన్ యియర్.’ ఈ రెండింటినీ కలిపి ఒక సినిమాగా తీశారు. కేవలం 50 పేజీలున్న– ఏలిసన్, విలెమ్ల ఆఖరి కథ అయిన ‘జస్ట్ వన్ నైట్’ నవలిక ఈ–బుక్‌గా 2014లో వచ్చింది. కృష్ణ వేణి -
రెండు ద్వేషాలు
సాయంత్రం అవుతూనే బెల్చర్ పొడుగ్గా కాళ్లు చాపి, ‘ఊమ్, నేస్తుడా, దాని సంగతేమిటి?’ అంటాడు. వెంటనే నోబెల్ గానీ బోనపార్ట్గానీ గానీ, ‘నువ్వంటే సరే, నేస్తుడా’ అని నవ్వుతూ బదులిస్తారు. ఈ నేస్తుడా అనే మాట వాళ్లిద్దరికీ బెల్చర్ వల్లే అలవాటైంది. వెంటనే అందరిలోకీ పొట్టివాడైన హాకిన్స్(వాళ్లు ఆకిన్స్ అంటారు) దీపం వెలిగిస్తాడు, కార్డ్సు బయటకు తీస్తాడు. ఇక ఆట మొదలవుతుంది. ఒక్కోసారి వీళ్లను పర్యవేక్షిస్తున్న జెరమాయా డానవన్ వీళ్లున్న ఇంటికి వస్తుంటాడు. వాళ్ల వెనకాల నిలబడి, ‘ఆకిన్స్, నువ్వేం ఆడుతున్నావో చూసుకో’ అని అరుస్తాడు. హాకిన్స్‌కు ఆడటం రాదు. కానీ డాన్స్ బాగా చేస్తాడు. బెల్చర్, హాకిన్స్ ఇంగ్లీషు సైనికులు. ఇంగ్లీషువాళ్ల కోసం (ఐరిష్) సెకెండ్ బెటాలియన్ తీవ్రంగా గాలిస్తున్నప్పుడు పట్టుబడ్డారు. ఇద్దరినీ నోబెల్, బోనపార్ట్ బాధ్యత కింద ఈ ఇంట్లో ఉంచారు. కొన్ని రోజులు గడిచేప్పటికి, వాళ్లమీద ఓ కన్ను వేసి ఉంచాలనే ఆలోచనే వీళ్లు మరిచారు. వాళ్లు ఎందుకు పారిపోతారు! వీళ్లున్న ఇల్లు ఒక ముసలావిడది. ఈమెకు నోటి కొసనే శాపనార్థాలుంటాయి. అట్లాంటిది ఈ ముసలమ్మా బెల్చర్ ఎలా అలవాడుపడ్డారో చూడటం కళ్లకు వినోదం. బెల్చర్ భారీ మనిషి. ఐదడుగుల పది అంగుళాలున్న బోనపార్ట్ కూడా పైకి చూడాల్సి ఉంటుంది. అంత భారీకాయుడు నిశ్శబ్దంగా దయ్యంలా తిరుగుతుంటాడు. అసలు మాట్లాడడు. ఎప్పుడన్నా మాట్లాడాడంటే ఆ కార్డ్సు ఆడుదామనే. ఆటంటే బాగా ఇష్టం. ముసలమ్మ ఏ బకెటో, ట్రేనో పట్టుకొస్తుంటే అతడు సాయం వెళ్తాడు. వంటచెరుకు కోసం తిప్పలు పడుతుంటే ఆమె దగ్గరి చిన్న గొడ్డలి లాక్కుని కట్టెలు కొట్టిస్తాడు. బెల్చర్కు పూర్తి విరుద్ధం హాకిన్స్. బెటాలియన్‌కు సరిపడా అతడే వాగుతాడు. ఎంత చిన్న టాపిక్గానీ ఎదుటివారిని తిట్టకుండా వదలడు. హాకిన్స్, నోబెల్ తరచూ మతం గురించి వాదులాడుకుంటారు. నోబెల్ సోదరుడు ప్రీస్ట్ అని తెలియడం దీనికి కారణం. ఎవరూ మాట్లాడ్డానికి లేకపోతే ముసలమ్మ మీద ప్రతాపం చూపిస్తాడు హాకిన్స్. ఒక సాయంత్రం వాళ్లందరూ టీ తాగారు. హాకిన్స్ దీపం వెలిగించాడు. పెట్టుబడిదారులు, స్వర్గం, పూజారులు... ఇలా మాటలు దొర్లుతున్నాయి. అప్పుడు జెరమాయా డానవన్ వచ్చాడు. అందరినీ చూసి నెమ్మదిగా బయటికి నడిచాడు. చర్చ తెగేది కాదని బోనపార్ట్ ఆయన్ని అనుసరించాడు. ఇద్దరూ గ్రామం వైపు నడుస్తున్నారు. ఆగి, ‘వాళ్లకు కాపలాగా ఉండాల్సింది నువ్వు’ అన్నాడు డానవన్. ‘ఇంకెంతకాలం? వాళ్లను మనతో ఉంచుకుని ఏం ప్రయోజనం?’ అడిగాడు బోనపార్ట్. ‘వాళ్లను బందీలుగా పట్టుకున్నామని నీకు తెలుసనుకుంటున్నా.’ ఖైదీలు అనకుండా బందీలు అనడం అర్థంకాలేదు. ‘శత్రువుల దగ్గర మనవాళ్లు ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లను కాల్చేస్తామని చెబుతున్నారు. వాళ్లు మనవాళ్లని కాల్చేస్తే మనమూ వాళ్లవాళ్లను కాల్చేసి దీటైన జవాబిద్దాం’ తీవ్రంగా బదులిచ్చాడు డానవన్. ‘కాల్చేయడమా?’ అసలు అట్లాంటిదొకటి సాధ్యమనే ఆలోచనే బోనపార్ట్కు ఉదయించలేదు. ‘అంతే, కాల్చేయడమే’ స్థిరంగా బదులిచ్చాడు డానవన్. ‘కానీ నాకూ నోబెల్కూ ఈమాట ముందే చెప్పివుండాల్సింది’ పీలగా అన్నాడు బోనపార్ట్. ‘ఎందుకు చెప్పాలి?’ ‘ఎందుకంటే వాళ్లను మేము కావలి కాస్తున్నాం కాబట్టి.’ ‘మిమ్మల్ని కాపలాగా ఉంచినప్పుడు ఆ మాత్రం ఊహించలేరా?’ తప్పుపట్టాడు డానవన్. ఇప్పుడు చెబుతున్నాగదా, ఎప్పుడు చెబితే తేడా ఏముంది? అన్నాడు. ‘చాలా పెద్ద తేడా ఉంది’ గొణిగాడు బోనపార్ట్. కానీ ఆ తేడా ఏమిటో వివరించలేకపోయాడు. బోనపార్ట్ తిరిగి వెళ్లేసరికి చర్చ తీవ్రంగా నడుస్తోంది. మరణానంతర జీవితం ఏమీ ఉండదని మాట్లాడుతున్నాడు హాకిన్స్. మతగ్రంథాలను అనుసరించి కచ్చితంగా ఉంటుందని చెబుతున్నాడు నోబెల్. ‘నీకు స్వర్గం ఏమిటో తెలియదు, అదెక్కడుందో తెలియదు? అందులో ఎవరుంటారో తెలియదు, వాళ్లకు ఏమైనా రెక్కలుంటాయా’ అన్నాడు హాకిన్స్. ‘అవును, ఉంటాయి, చాలా’ చెప్పాడు నోబెల్. ‘అవి ఎక్కడ్నుంచి వస్తాయి? ఎవరు చేస్తారు? అక్కడేమైనా రెక్కల ఫ్యాక్టరీ ఉందా?’ వ్యంగ్యంగా అన్నాడు హాకిన్స్. చర్చ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. నీతో వాదించడం నా వల్ల కాదని నోబెల్ చేతులెత్తేశాడు. ఆ ఇంగ్లీషు వాళ్లిద్దరినీ వేరే గదిలోకి పంపి, తాళం పెట్టి, బోనపార్ట్, నోబెల్ పడుకున్నారు. దీపం ఆర్పేశాక డానవన్ చెప్పింది నోబెల్ చెవుల్లో వేశాడు బోనపార్ట్. నోబెల్ మౌనంగా ఉండిపోయాడు. తెల్లారి సాయంత్రం వాళ్లు టీ తాగారు. బెల్చర్ తన ధోరణిలో ‘ఊమ్, నేస్తుడా, దాని సంగతేమిటి?’ అన్నాడు. అందరూ టేబుల్ చుట్టూ గుండ్రంగా కూర్చున్నారు. హాకిన్స్ కార్డ్స్ పంచాడు. బయట డానవన్ వస్తున్న బూట్ల చప్పుడు. నెమ్మదిగా బయటికి నడిచాడు బోనపార్ట్. ‘ఏం కావాలి?’ ‘నీ సైనిక స్నేహితులిద్దరు.’ డానవన్ ముఖం కోపంగా ఉంది. ‘మరో దారిలేదా?’ ‘శత్రువులు మనవాళ్లను నలుగురిని చంపేశారు. తెలుసా, అందులో ఒకతను పదహారేళ్ల కుర్రాడు.’ ఇంతలో నోబెల్ అక్కడికి వచ్చాడు. గేటు దగ్గరున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఫీనీ కూడా కలిశాడు. ‘ఆ ఇద్దరినీ బయటికి తెండి, ఇక్కడినుంచి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పండి’ ఆదేశించాడు డానవన్. ‘నన్ను ఇందులోంచి మినహాయించండి’ ప్రాధేయపడ్డాడు నోబెల్. ‘అయితే సరే, నువ్వూ ఫీనీ షెడ్లోంచి పార, పలుగు పట్టుకెళ్లి దూరంగా గొయ్యి తియ్య’మన్నాడు డానవన్. ‘ఇరవై నిమిషాల్లో మేము వచ్చేస్తాం. ఎవరికీ తెలియకూడదు’. ఫీనీ, నోబెల్ బయటికి నడిచారు. డానవన్, బోనపార్ట్ ఇంట్లోంచి ఇంగ్లీష్ వాళ్లను బయటికి పిలుచుకొచ్చారు. నడుస్తుండగా, ‘పొద్దున మావాళ్లు నలుగురిని మీవాళ్లు కాల్చేశారు, ఇప్పుడు మీ వంతు’ చెప్పేశాడు డానవన్. హాకిన్స్ నమ్మలేదు. కావాలంటే బోనపార్ట్‌ను అడగమన్నాడు. ‘ఆ అవసరం లేదు, నేనూ బోనపార్ట్ నేస్తులం, కాదా?’ అడిగాడు హాకిన్స్. నిజమేనని బాధగా చెప్పాడు బోనపార్ట్. అయినా నమ్మలేదు హాకిన్స్. ‘నువ్వు నిజం చెప్పట్లేదు, నన్నెందుకు కాల్చేస్తారు? నోబెల్ కూడా ఇందులో ఉన్నాడా?’ అవునని తెలియగానే హాకిన్స్ నవ్వాడు. ‘హాకిన్స్, నీ చివరి కోరిక ఏమిటి?’ అడిగాడు డానవన్. ‘నోబెల్ నన్నెందుకు కాల్చేస్తాడు? నేను అతడినెందుకు కాల్చేస్తాను? మేము నేస్తులం కదా!’ దూరంగా దీపపు వెలుతురులో నోబెల్, ఫీనీ నిలబడివున్నారు. గొయ్యి సిద్ధంగా ఉంది. ‘హలో, నేస్తుడా’ నోబెల్‌ను పలకరించాడు బెల్చర్. బోనపార్ట్ గుండెలో మృత్యుబాధ వచ్చి కూర్చుంది. నోబెల్ బదులివ్వలేదు. ‘హాకిన్స్, నీ చివరి సందేశం ఏమిటి?’ అతడికి ఇలాంటివాటి మీద నమ్మకం లేదు. మరేదో మాట్లాడబోయాడు. ‘ఇక చాలిద్దాం.’ రివాల్వర్‌ను చేతిలోకి తీసుకున్నాడు డానవన్. హాకిన్స్ మెడ వెనుక గురిపెట్టాడు. బోనపార్ట్ కళ్లు మూసుకున్నాడు. బ్యాంగ్! నోబెల్ కాళ్ల దగ్గర పడిపోయాడు హాకిన్స్. బెల్చర్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని కళ్లకు కట్టుకోబోయాడు. పెద్ద తలకు ఆ చిన్న కర్చీఫ్ సరిపోలేదు. బోనపార్ట్‌ను ఇవ్వమని అడిగాడు. గంతలు కట్టుకునేముందు హాకిన్స్ కదులుతూ కనబడ్డాడు. అతడి ఎడమ మోకాలు పైకి లేవడం దీపం వెలుగులో కనబడింది. ముందు అతడిని ఇంకోసారి కాల్చేయండి, అన్నాడు బెల్చర్. శాశ్వతంగా ఆ నొప్పి నుంచి విముక్తం చేయడానికి మరొక బ్యాంగ్! బెల్చర్ నవ్వాడు. ‘రాత్రే వాడు ఈ మరణానంతర జీవితం గురించి తెగ కుతూహలపడ్డాడు.’ బోనపార్ట్ వెన్ను వణికింది. బెల్చర్, నీ చివరి ప్రార్థన చేస్తావా? ‘ఉపయోగం లేదు, నేను సిద్ధంగా ఉన్నాను’. బ్యాంగ్! రెండోసారి కాల్చే అవసరం కూడా రాలేదు. ఆ గుడ్డి వెలుతురులోనే శవాలను మోసుకెళ్లి, గోతిలో వేసి పూడ్చారు. పనిముట్లు పట్టుకుని నోబెల్, బోనపార్ట్ తిరిగి ఇంటికి వెళ్లారు. వెళ్లేసరికి ముసలమ్మ జపమాలతో కూర్చునివుంది. ‘వాళ్లను ఏం చేశారు?’ అనుమానంగా అడిగింది ముసలమ్మ. బదులు రాలేదు. మళ్లీ అడిగినా బదులు లేదు. అయ్యో! ముసలమ్మ మోకాళ్ల మీద దేవుడి ముందు కూలబడింది. -
మనకు తెలియని యం.ఎస్
తాజా పుస్తకం ఆమె సుప్రభాతం శ్రీ వేంకటేశ్వరునికి మేలుకొలుపు. ఆమె దివ్యగానం ముక్కోటి దేవతలకు పవిత్రార్చన. ఆమె స్వరం గాంధీజీకి ప్రాణం. ఆమె గాత్రం కోట్లాది మందికి హృదయంగమం. ఆ గాన మాధుర్యం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సొంతం. ఆమె గురించి ఇప్పటి వరకు వేలాది వ్యాసాలు వచ్చాయి. వందలాది కథనాలు వెలువడ్డాయి. పుస్తకాలకు లెక్కేలేదు. కాని ప్రముఖ జర్నలిస్ట్ టి.జె.ఎస్ జార్జ్ రాసిన ఎమ్మెస్ బయోగ్రఫీ– ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి– ది డిఫినిటివ్ బయోగ్రఫీ’ ఎక్కువ మంది పాఠకుల మన్ననను పొందింది. దానిని హైదరాబాద్‌కు చెందిన హెచ్‌బీటీ సంస్థ ‘మనకు తెలియని ఎం.ఎస్’గా తెలుగులో ప్రచురించింది. ప్రముఖ రచయిత్రి ఓల్గా దీనిని తెలుగులోకి అనువదించారు. ఈ రోజు అంటే నవంబర్ 24 శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో ఈ పుస్తకావిష్కరణ జరగనుంది. ముఖ్యవక్తగా కర్ణాటక గాయకుడు, ప్రజామేధావి టి.ఎం. కృష్ణ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రచురణకర్త గీతా రామస్వామి, అనువాదకురాలు ఓల్గా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఎం.ఎస్.సుబ్బులక్ష్మి– ది డిఫినిటివ్ బయోగ్రఫీ’ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్ట్ టీజేఎస్ జార్జ్ 2004లో ఇంగ్లిష్‌లో రాశారు. 20016 వరకూ ఈ పుస్తకం గురించి నాకు తెలీదు. ఈ పుస్తకం గురించి ఇప్పటిదాకా తెలీకుండా ఎలా ఉన్నానా? అని ఆశ్చర్యపోయా. అంటే కర్ణాటక సంగీతంలోని ఒక వర్గం లాబీ మొత్తం దాన్ని బయటకు రాకుండా చేసింది. ఎందుకంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బ్రాహ్మిణ్ ఐకాన్‌గానే ప్రపంచానికి తెలుసు. కాని ఈ పుస్తకం ఆమెది దేవదాసీ కుటుంబ నేపథ్యం అని చెబుతోంది. ఈ సంగతి నలుగురికీ తెలియకూడదని ఆ లాబీ భావించినట్టుంది. 2016లో ఈ పుస్తకాన్ని రీప్రింట్ చేసినప్పుడు కొన్ని సమీక్షలు వెలువడితే తెప్పించుకొని చదివాను. అరే.. ఇంత మంచి పుస్తకాన్ని తెలుగులోకి ఎందుకు ప్రచురించకూడదు అని అనిపించింది. అదే సమయంలో కొంచెం సంశయం కూడా పొందాను. నిజానికి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి కళ అంతా దేవదాసీ బ్యాక్‌గ్రౌండ్‌తోనే వచ్చింది. అయినా ఆమె బ్రాహ్మిణ్ ఐకాన్‌గానే గుర్తింపు పొందింది. ఈ వైరుధ్యాన్ని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఎలా ఎదుర్కొన్నది, రోజువారి జీవితంలో ఈ ద్వంద్వ అస్తిత్వాన్ని ఎలా సమన్వయం చేసుకుంది... వంటి అనేక విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలియచేయవచ్చు అనిపించింది. అదీగాక ఒక మహా గాయకురాలి గెలుపు ఓటములు రెండూ మనకు అవసరమే. ఎమ్మెస్ ఎందుకు బ్రాహ్మణీకంలో లీనమయ్యింది... ఆమెను స్వీకరించిన బ్రాహ్మణీకం ఎందుకు మరో గాయని రావు బాలసరస్వతిని తిరస్కరించింది మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇంకోటి ఏమనిపించిందంటే బ్రాహ్మణ కళాకారుల గురించి రాసేవాళ్లు చాలామంది ఉన్నారు. ఈ పుస్తకం బయటకు వస్తే దేవదాసీ వంటి కమ్యూనిటీల గురించి రాసేవాళ్లు కూడా వస్తారు అనిపించింది. ఎమ్మెస్ మూలాలు దేవదాసి కుటుంబంతో ఉన్నాయని తెలిస్తే ఆ సమూహం తమ గురించి తాము గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుందనిపించింది. ఇక ఈ పుస్తక రచయిత జార్జ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక క్రైస్తవుడు అయుండి కర్ణాటక సంగీతంతో అసలు పరిచయం లేకపోయినా ఇంత అద్భుతంగా రాశాడు అంటే అదే భారతదేశంలోని వైవిధ్యం. బ్రాహ్మణుడు అయి ఉంటే ఈ పుస్తకాన్ని ఇంత సున్నితంగా రాసి ఉండేవాడు కాదేమో. ఒక్కమాటలో చెప్పాలంటే ఇట్సె వండర్ఫుల్ బుక్. ఈ పుస్తకాన్ని తెలుగులోకి చేయాలి అనుకోగానే నా మనసులోకి వచ్చిన వ్యక్తి ఓల్గానే. ఎందుకంటే ఇది ప్రాథమికంగా స్త్రీవాదాన్ని సూచించే రచన. వీ ఆర్ రిట్రీవింగ్ ఫెమినిస్ట్ హిస్టరీ. నేను అడగగానే వెంటనే యెస్ అంది. అప్పటిదాకా తాను చేస్తున్న పని పక్కనపెట్టి ఈ అనువాదం తీసుకుంది. ప్రస్తుతం మా సంస్థ జీవిత కథల మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నది. ఈ నెల 29న గౌరీ లంకేష్ పుస్తకం విడుదల కానుంది. తర్వాత రావు బాలసరస్వతి బయోగ్రఫీ ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ పాఠకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచన కూడా రేకెత్తిస్తాయని భావిస్తాను. సుబ్బులక్ష్మి మూలాలను చెప్పే పుస్తకం – గీతా రామస్వామి, ప్రచురణకర్త గీత అడగ్గానే చాలా సంతోషమేసింది. ఎమ్మెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పాటలు బాగా వింటాను. కొన్ని కొన్ని పాటలను కొన్నాళ్లు పొద్దున్నే వినేదాన్ని. మనసుకు హాయిగా ఉంటుందని. ఆమె పాడిన శ్రీరంగపుర విహార లాంటి పాటలను చాలా ఇష్టంగా వింటుంటాను. ఎమ్మెస్ దేవదాసీ అని అప్పుడెప్పుడో ‘హిందూ’లో చదివాను. అప్పటిదాకా నాకు తెలియదు. తెలియగానే షాక్ అయ్యాను. ఇంతకాలం తెలియకుండా ఎలా దాచారు వీళ్లు అనిపించింది. ఇప్పుడు బయోగ్రఫీ అనగానే అవన్నీ తెలుసుకోవచ్చనిపించింది. గతంలో నేను ‘సరిద మాణిక్యమ్మ’ అని దేవదాసీని 1990లలో కలిసాను. ఆమె ఎంత గొప్పదంటే ‘దావదాసీ రామయాణాన్ని’ నటరాజ రామకృష్ట బృందానికి నేర్పించి దానిని పునర్ముఖం చేసింది. అలాంటి ఆవిడను ఎంతో దయనీయమైన స్థితిలో చూశాను. ‘మా కళలన్నీ ఇతరులు నేర్చుకున్నారమ్మా. కాని మాకు మాత్రం ఇప్పుడు ఏమీ లేదు’ అని ఆమె అనడం నాకు చాలా బాధనిపించింది. అప్పటి నుంచి దేవదాసీల గురించి ఆలోచిస్తూనే ఉన్నా. ముత్తు లక్ష్మీరెడ్డి, బెంగుళూరు నాగరత్నమ్మ, మైసూరు జెట్టి తాయమ్మ వంటి దేవదాసీల పోరాటాలు.. జీవితాలు అధ్యయనం చేశాను. ఈ మధ్య నేను రాసిన ‘గమనమే గమ్యం’ అనే నవల్లో కూడా ఒక దేవదాసీ పాత్ర ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ఎం.ఎస్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలనుకున్నా. నిజానికి అప్పటికి నేను పని చేస్తున్న పుస్తకం ఈ విషయానికి పూర్తిగా వ్యతిరేకమైనది. అది ‘నైనా దేవీ’ అనే టుమ్రీ గాయనీ గురించి. ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ చాలా డిఫరెంట్. ఆమె బ్రాహ్మిణ్. రాజా రామమోహన్‌రాయ్ మనవరాలు. అయినా సరే దేవదాసీలాంటి వాళ్లు పాడే పాటలు నేర్చుకొని పాడింది. అదీ చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అయినా దాన్ని పక్కన పెట్టి ఇది చేశాను. కారణం.. ఎమ్మెస్ అంటే ఉన్న ఇష్టమే కాకుండా నేను తెలుసుకోవాలనుకున్న చాలా విషయాలున్నాయనిపించింది. అన్నట్టుగానే ఈ పుస్తకం నాకెంత జ్ఞానం ఇచ్చిందంటే మొత్తం కర్ణాటక సంగీతాన్నే అర్థం చేయించింది. కర్ణాటక సంగీత ప్రాంగణంలో ఎమ్మెస్ ఎక్కడ నిలబడుతుంది అనేది ఈ పుస్తకం చెబుతుంది. అన్ని బయోగ్రఫీల్లాంటి బయోగ్రఫీ కాదు ఇది. చాలా ప్రత్యేకమైంది. జార్జ్ చాలా రీసెర్చ్ చేశాడు. సంగీత ప్రాంగణంలో ఎమ్మెస్ ఎక్కడ నిలబడుతుందో తెలిపే పుస్తకం – ఓల్గా, రచయిత్రి -
తెలుగు భాషకు చిరునామాలు గ్రామాలు
రాబోవు పుస్తకం ఒక భాషకు సంబంధించిన స్వీయ అస్తిత్వం ఆ భాషకు చెందిన దేశి పదాల్లో వ్యక్తమవుతూ వుంటుంది. తెలుగులోనికి వచ్చి చేరిన సంస్కృతాంగ్ల ఉర్దూ మొదలైన భాషా పదాలతో తెలుగు సుసంపన్నం అయితే కావచ్చుగాక కానీ ఆ పదాల్లో తెలుగుదనం వుండదు. తల్లి, తండ్రి, ఊరు, పేరు, రాయి, రప్ప వంటి దేశి శబ్దాలు తెలుగు భాషా స్వరూప స్వభావాన్ని వెల్లడించే పదాలు. ఈ అసలు సిసలు తెలుగు పదాలు తెలంగాణ గ్రామీణ ప్రాంత భాషా వ్యవహారంతో అత్యంత సహజంగా అల్లుకుపోయాయి. ఎక్కడో నిఘంటువుల్లో చోటుచేసుకొని వున్న ఈ తెలుగు మాటలు నిసర్గ సుందరంగా పల్లీయుల నాల్కలపై నర్తిస్తాయి. అలాంటి కొన్ని మాటలు ఇక్కడ ‘మెయి’ పదమ్మీద ముందు దృష్టి పెడితే, దానికి దేహమనే అర్థం వుందని తెలుస్తుంది, ఇతర అర్థాలు సరేసరి. ఇది తెలంగాణలో పెయి అయింది. పెయికాక అంటే జ్వరం. పెయిసబ్బు అంటే టాయిలెట్ సోప్. స్నానం చేయడాన్ని పెయి కడుక్కునుడు అంటారు. ‘‘ఒళ్ళూ పై తెలియకుండా మాట్లాడుతున్నాడు’’ వంటి జాతీయంలోని పై తెలంగాణ పెయే! ‘‘వాన్ని ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్లకు చూపిచ్చినా మెరమెర పోతలేదు’’ వాక్యంలోని మెరమెర ఏమిటి? రోగం తాలూకు భయసందేహాదులు మెరమెర. ‘‘మనసుల ఊకే అదే విషయం మెరమెర వుంటే ఎవడు బాగుపడ్తడు’’ వంటి మాటల్లోని మెరమెర అంటే కూడా మనోవ్యధ, సంశయాదులే! శబ్దరత్నాకరం పై అర్థాల్ని ఖరారు చేసింది మరి! వర్షాకాలంలో ఉరుములు మెరుపులు సహజం. తెలంగాణ మారుమూల పల్లెల్లో మెరుపును మెరుము అంటారు. ‘‘ఉరుములు మెరుములు పాడుగాను! పిడుగులు మీదనే పడేటట్లు వున్నయి’’లోని మెరుము మెరుపే! నిఘంటువుల్లో మెరుపు, మెరుము రెండు పదాలూ చోటు చేసుకున్నాయి. ‘మెల్ల’ అంటే చూపు కంటి కడకు ఒరిగినది అని నైఘంటికార్థం. మెల్ల కన్ను ఉన్నవాణ్ణి మెంటకన్నోడు అంటారు. ఈ మెంటకన్ను ఎలా వచ్చింది? అది ముందు మెల్లట కన్ను. పుల్లటి కూర పుంటికూర (గోంగూర) అయినట్లు, తొల్లిటి చేయి తొంట చేయి (ఎడమ చేయి) అయినట్లు, మెల్లట కన్ను మెంట కన్నుగా మారింది. కన్నుచూపు కంటిచూపుగానూ, చన్ను పిల్లగాడు చంటి పిల్లగాడుగానూ, పన్ను నొప్పి పంటినొప్పి గానూ మారినట్లే మెల్లకన్ను మెంటగా అవతరించింది. వెనుకట వేసవి వచ్చిందంటే చాలు వీధి బాగోతాలు వేసేవారు. ‘‘అండ్ల నీది ఏమేషంరా? ఉత్తేషమా మేటేషమా?’’ అని అడిగేవారు. మేటేషం అంటే మేటి వేషం. మేటి ఎంత చక్కటి తెలుగు మాట. ప్రధాన పాత్రధారుణ్ణి మేటేషకాడు అనేవారు. పిల్లలు ఒకచోట చేరి ఆడుకుంటూ వుంటే ‘‘ఎంత సేపాయెరా ఈడ మాల్లెం బెట్టి. మీ అమ్మలు పిలుస్తున్నరు పోండ్రి’’ అంటారు పెద్దలు. ఇందులోని మాల్లెం మేళం నుండి వచ్చింది. దీన్ని ఉభయపదంగానూ, దేశ్య శబ్దంగానూ శబ్దరత్నాకరం పేర్కొంది. ఈ ప్రత్యేక సందర్భంలో మేళం అంటే సమ్మేళనం వంటి కలయిక. ‘మొక్కరము’ అనే పదానికి అర్థం స్తంభము అని. మరో అర్థం గడెమ్రాను. తెలంగాణలో ఈ మొక్కరాన్ని మొగురం అంటారు. ఇంటినిర్మాణంలో మొగురాలూ, వాటి మీద దూలాలూ, వాసాలూ, పెండెకట్టెలూ, సట్టమూ చాలా ముఖ్యమైనవి. ఈనాటి పిల్లర్సు చేసే పనిని ఈ మొగురాలు చేస్తాయి. మొగురము నిఘంటువుల్లో మొక్కరము, మొకరము రూపాల్లో కనిపిస్తుంది. ‘మొగులు’ ఎంత మంచి తెలుగు! తెలంగాణలో మేఘాలు కమ్ముకుంటున్న సందర్భాన్ని ‘మొగులైంది’ అంటారు. మొగులు అంటే మేఘం అని. ఇక ‘మొత్తు’ అనే దేశ్య సకర్మక క్రియ గురించి. దీనికి అర్థం కొట్టు అని. మొహం మొత్తడం తెలుసు మనకు. ఇది తెలంగాణలో ‘మొకం గొట్టుడు’. ఒకే ఆహార పదార్థాన్ని అదే పనిగా తిన్నప్పుడు మొకం గొడుతుంది మరి! తెలంగాణలో మూర్ఖుణ్ణి, మొండివాణ్ణి, పెడసరం మాటలు మాట్లాడేవాణ్ణి ‘మోర్దోపు మనిషి’ అంటారు. మోర్దోపు పదానికి యింకా ఎక్కువ అర్థ ఛాయలున్నాయి. కొన్ని పదాలకు పూర్తి వివరణ యివ్వలేని అర్థ స్ఫురణ వుంటుంది. శబ్దరత్నాకరంలో ‘మోర త్రోపు’ అని వుంది. మోర అంటే పశ్యాదుల దీర్ఘముఖమే గాక మనిషి ముఖం కూడాను. త్రోపు అంటే అటూ యిటూ ఊపడం. ఏ పని చెప్పినా నకారాత్మకంగా తన ముఖాన్ని ప్రక్కకు త్రోపడమే మోరత్రోపు. మనుషుల్నే గాక పశువుల్ని వుద్దేశించి కూడా ‘‘దీని పాడుగాని. ఇది మోర్దోపు ఎద్దు’’ అంటుంటారు. బోనాలు పండుగ సందర్భంలో ‘రంగం’ చెప్పడం ఒక ఘట్టం. మరి ఈ పదార్థం ఏమిటి! సోదె అని. భవిష్యత్తులో ఏం జరగనుందో రంగం ద్వారా బహిరంగం అవుతుంది. ‘‘బస్సు మస్తు రువ్వడి మీద పోతున్నది.’’ ఈ రువ్వడి ఏమిటి? వేగమే రువ్వడి. రువ్వు, వడి అనే రెండు పొడి పదాలు కలిసి రువ్వడి అయ్యింది. వడి అంటే వేగమే. రువ్వు అంటే విసిరేయడం–రువ్వడం. రువ్వితే ఎంత వడితో పోతుందో అంత వేగం అన్నమాట రువ్వడి. కలహశీలుర్ని ‘‘అరేయ్ రేగుతున్నాదిరా నీకు?’’ అని ప్రశ్నిస్తుంటారు. రేగు అంటే చెలరేగడం, ప్రకోపించడం. కోపతాపాదులు చెలరేగుతున్నాయా అని అడగడం! ‘రొప్పు’ క్రియకు నిఘంటువులు కూయు, తరుము మొదలైన అర్థాలిచ్చాయి. తెలంగాణలో రొప్పడం అంటే బండి నడపడం. నిఘంటువు చెప్పిన ‘తరుము’ అర్థానికి కొంత దగ్గరి అర్థము ఈ నడపడం. ‘‘వీడా! లండు పోరడు’’ వాక్యంలోని లండు మెండు తెలుగు దేశ్య పదమే! వాడెవడో సరిగా మాటవినడని అర్థం. నిఘంటువులు మాత్రం కుత్సితుడు అని అర్థం చెప్పాయి. ‘‘వానికి లత్త కొట్టింది’’ లోని లత్తకు దరిద్రం అని అర్థం. నిఘంటువుల్లో దెబ్బ, ఆపద అని రెండు అర్థాలున్నాయి. లత్త అంటే నష్టం అని కూడా కావచ్చును. ‘‘ఏమో లావు మాట్లాడుతున్నవేంది?’’ అన్న ప్రశ్నలోని లావుకు అర్థం అ«ధికంగా మాట్లాడ్డం అనే! ‘‘నా దగ్గర లిబ్బి ఉన్నదా ఏంది? ఏమో ఊకూకె పైసలు అడుగుతున్నవ్’’లో లిబ్బి అంటే ధనము, రాశి, నిధి అని! ఎండు చేపల్ని తెలంగాణలో ‘వట్టిచాపలు’గా వ్యవహరిస్తారు. యివి ‘వట్టు’ చేపలు. వట్టు అంటే ఇంకు, కృశించు అని. అంటే ఎండిపోయిన అని కదా! ‘‘ఈ పువ్వులు వల్లి పోయినై’’ లోని వల్లి పోవుడు ఏంది? అది వడలిపోవుడు. ‘వడలు’ క్రియ నుండి వర్ణ సమీకరణంలో వల్లు ఏర్పడుతుంది. పుష్పాదులు వాడిపోవడమే వడలడం– వల్లడం. కొన్ని సామాజిక వర్గాల్లో ‘వడుక లగ్గం’ అని అసలు లగ్గానికి ముందు చేస్తారు. ఈ వడుక వడుగు నుండి అడుగులు వేసింది. వడుగు అంటే బ్రహ్మచారి అని అర్థం. అతనికి చేసే ఉపనయనమే వడుక లగ్గం. ‘‘ఈ అంగిలాగులు ఒదలొదలు అయినై. సరింగ కుట్టలేదు’’ అనే వాక్యంలోని ఒదలు తెలుగులోని వదులు పదం నుండి వదలకుండా వచ్చింది. వదులు అంటే బిగువు తప్పడం, సడలడం, ఆంగ్లభాషలోని లూజ్‌గా వుండడం. ‘వరకు’ అనే దేశ్యపదానికి శబ్దరత్నాకరం ‘బంగారము లోనగువాని రేకు’ అని ఓ అర్థాన్ని వివరించింది. తెలంగాణలో మాత్రం పాలిథీన్ పేపర్ని వరకు కాయిదం అంటారు. వర్షానికి తడవకుండా వుండాలంటే అటువంటి వరకు కాగితాల్లో చుట్టచుట్టుకొని పెట్టుకునేవారు పూర్వం. బంగారు మొదలగువాని రేకులలో పాలిథీన్ పేపర్ రేకు కూడా ఒకటి అన్నమాట! పుస్తకాన్ని పూర్వం తెలంగాణలో ‘వయ్యి’ అనే వాళ్ళు. నిఘంటువులు ఈ ఉభయమూ దేశ్యమూ అయిన పదానికి లెక్క పుస్తకము, పుస్తకము, విధము మొదలైన అర్థాల్ని అందించాయి. ఈ వయ్యినే బెంగాలీలో ‘బయి’ అంటారు. ‘వహీ’ అంటారు మరాఠీలో. ఒరియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో బయి అంటారు. తెలంగాణలో మాత్రం ‘పుస్తకము’ అనే పదం వయ్యిని మొత్తంగా మింగిపారేసింది. డాక్టర్ నలిమెల భాస్కర్ 9704374081