‘మేబి సమ్‌డే’ నవల కొల్లీన్ హూవర్
‘ఇప్పుడే ఒకమ్మాయి మొహం మీద గుద్దాను’ అని సిడ్నీ బ్లైక్ అనడంతో ప్రారంభం అయ్యే ‘మేబి సమ్‌డే’ నవల కొల్లీన్ హూవర్ రాసినది. సిడ్నీ తన ఆప్తమిత్రురాలైన టోరీతో కలిసి ఒక అపార్టుమెంట్లో ఉంటుంది. స్థిరమైన ఉద్యోగం చేసుకుంటూ, సంగీతం నేర్చుకుంటుంటుంది.పెరటి బాల్కనీ నుండి రిజ్ గిటార్ వాయిస్తుండగా వింటూ –అతని సంగీతం పట్ల ఆకర్షణ పెంచుకుంటుంది. అతను పాటలు రాస్తాడు. రాత్రివేళలు తను వాయిస్తున్నప్పుడు ఆమె వింటూ, దానికనుగుణంగా పాడుతోందని రిజ్ గమనించి, తన మ్యూజిక్ బ్యాండ్ కోసమని, ఆమె బాణీ కట్టిన మాటలు తెలుసుకోవాలనుకుంటాడు. ఇద్దరూ ఒకరికొకరు టెక్స్ మెసేజిలు పంపుకోవడం మొదలెడతారు.
సిడ్నీ 22వ పుట్టినరోజునే, ఆమె బోయ్‌ఫ్రెండ్ హంటర్, టోరీతో వారి బాల్కనీలో శృంగారం జరుపుతుండగా రిజ్ చూసి, సిడ్నీకి చెప్తాడు. ఆమె హంటర్‌తో వాదన పెట్టుకుని, టోరీని చెంపదెబ్బ కొట్టి, అపార్టుమెంట్ వదిలి ఇద్దరు ఫ్లాట్‌మేట్లతో కలిసున్న రిజ్ ఇంటికి చేరుకుంటుంది. 24 ఏళ్ళ రిజ్, చెవిటివాడని సిడ్నీకి తెలుస్తుంది. అతనికి మ్యాగీ అన్న అందమైన గర్ల్ ఫ్రెండు ఉందని తెలిసినప్పుడు, దిగులు పడుతుంది. రిజ్, సిడ్నీ కలిసి లిరిక్స్ రాయడం ప్రారంభిస్తారు. ఇద్దరి మధ్యా, నోటిమాటల్లేని చమత్కారమైన సంభాషణలు జరుగుతుంటాయి.
సిడ్నీ: నీవు వినలేవని ఎందుకు చెప్పలేదు?
రిజ్: నీవు వినగలవని ఎందుకు చెప్పలేదు?
సిడ్నీ పాడుతున్నప్పుడు ఆమెని పొదివి పట్టుకుని, ఆమె శారీరక కదలికలని బట్టి పాటని గ్రహించడం ప్రారంభిస్తాడు రిజ్. అలా ఇద్దరి మధ్యా శారీరక సాన్నిహిత్యం ఎక్కువవుతుంది. రిజ్ సిడ్నీకి మెసేజ్ చేస్తాడు: ‘మ్యాగీ కోసం నేను వంగగలను. నీకోసం విరగగలను’.
తన బోయ్‌ఫ్రెండ్ తనను మోసం చేసినట్టే మ్యాగీకీ అవకూడదనుకుంటుంది సిడ్నీ. గర్ల్ ఫ్రెండుకి గుండెజబ్బుందని తెలిసినప్పుడు, సిడ్నీని తనింట్లోంచి వెళ్ళిపొమ్మని రిజ్ కోరతాడు. అయితే, మ్యాగీ అతన్ని స్వీకరించదు. కొంత గడువు తరువాత రిజ్– సిడ్నీ ఫ్లాటుకి మారతాడు.
రచయిత్రి– సిడ్నీ, రిజ్ ఇద్దరి కోణాలనీ మార్చి మార్చి రాయడం వల్ల ఒకే పరిస్థితిలో ఇద్దరూ ఎలా ప్రతిస్పందించారో పాఠకులకి తెలుస్తుంది. వారి సంబంధంలో గౌరవం, నిజాయితీ, మెప్పుకోలూ ఉండటం చూస్తాం. ఎవరికీ అన్యాయం చేయకుండా ఇద్దరూ చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ‘ఇద్దర్ని ఒకే సమయంలో ప్రేమించడం సాధ్యమేనా? మనం ప్రేమిస్తున్న మనిషి అవసరాలు మన అవసరాలు కాకపోతే!’ అన్న ఎన్నో ప్రశ్నలు కనబడతాయి నవల్లో. కథలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. నవల్లో కొన్ని సన్నివేశాలకి తగిన పాటలున్నాయి.
ఈ–బుక్‌లో అయితే, ఒక పాట ‘లింక్’ మీద నొక్కితే అది వింటూ, పుస్తకం కూడా చదివే వీలుంటుంది. పేపర్ బ్యాక్ అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పాట వినవచ్చు. లేకపోతే, ‘మేబి సమ్ డే’ సైట్లో కూడా వినే అవకాశం ఉంది. 2014 మార్చిలో వచ్చిన ఈ నవల ఏప్రిల్లో, ‘న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్’ లిస్టులో ఉండి, మళ్ళీ తిరిగి సెప్టెంబర్లో కూడా అదే లిస్టులో అగ్రస్థానం సంపాదించుకుంది. దీని ఆధారంగా వచ్చిన సినిమా ఉంది.
సిడ్నీ, రిజ్ ఇద్దరి కోణాలనీ మార్చి మార్చి రాయడం వల్ల ఒకే పరిస్థితిలో ఇద్దరూ ఎలా ప్రతిస్పందించారో పాఠకులకి తెలుస్తుంది.
- కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment