రెండు ద్వేషాలు | Frank o'Connor, New Story | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 23 2018 12:31 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

Frank o'Connor, New Story - Sakshi

సాయంత్రం అవుతూనే బెల్చర్‌ పొడుగ్గా కాళ్లు చాపి, ‘ఊమ్, నేస్తుడా, దాని సంగతేమిటి?’ అంటాడు. 

వెంటనే నోబెల్‌ గానీ బోనపార్ట్‌గానీ గానీ, ‘నువ్వంటే సరే, నేస్తుడా’ అని నవ్వుతూ బదులిస్తారు. ఈ నేస్తుడా అనే మాట వాళ్లిద్దరికీ బెల్చర్‌ వల్లే అలవాటైంది. వెంటనే అందరిలోకీ పొట్టివాడైన హాకిన్స్‌(వాళ్లు ఆకిన్స్‌ అంటారు) దీపం వెలిగిస్తాడు, కార్డ్సు బయటకు తీస్తాడు. ఇక ఆట మొదలవుతుంది.

ఒక్కోసారి వీళ్లను పర్యవేక్షిస్తున్న జెరమాయా డానవన్‌ వీళ్లున్న ఇంటికి వస్తుంటాడు. వాళ్ల వెనకాల నిలబడి, ‘ఆకిన్స్, నువ్వేం ఆడుతున్నావో చూసుకో’ అని అరుస్తాడు. హాకిన్స్‌కు ఆడటం రాదు. కానీ డాన్స్‌ బాగా చేస్తాడు.

బెల్చర్, హాకిన్స్‌ ఇంగ్లీషు సైనికులు. ఇంగ్లీషువాళ్ల కోసం (ఐరిష్‌) సెకెండ్‌ బెటాలియన్‌ తీవ్రంగా గాలిస్తున్నప్పుడు పట్టుబడ్డారు. ఇద్దరినీ నోబెల్, బోనపార్ట్‌ బాధ్యత కింద ఈ ఇంట్లో ఉంచారు. కొన్ని రోజులు గడిచేప్పటికి, వాళ్లమీద ఓ కన్ను వేసి ఉంచాలనే ఆలోచనే వీళ్లు మరిచారు. వాళ్లు ఎందుకు పారిపోతారు!

వీళ్లున్న ఇల్లు ఒక ముసలావిడది. ఈమెకు నోటి కొసనే శాపనార్థాలుంటాయి. అట్లాంటిది ఈ ముసలమ్మా బెల్చర్‌  ఎలా అలవాడుపడ్డారో చూడటం కళ్లకు వినోదం. బెల్చర్‌ భారీ మనిషి. ఐదడుగుల పది అంగుళాలున్న బోనపార్ట్‌ కూడా పైకి చూడాల్సి ఉంటుంది. అంత భారీకాయుడు నిశ్శబ్దంగా దయ్యంలా తిరుగుతుంటాడు. అసలు మాట్లాడడు. ఎప్పుడన్నా మాట్లాడాడంటే ఆ కార్డ్సు ఆడుదామనే. ఆటంటే బాగా ఇష్టం. ముసలమ్మ ఏ బకెటో, ట్రేనో పట్టుకొస్తుంటే అతడు సాయం వెళ్తాడు. వంటచెరుకు కోసం తిప్పలు పడుతుంటే ఆమె దగ్గరి చిన్న గొడ్డలి లాక్కుని కట్టెలు కొట్టిస్తాడు. బెల్చర్‌కు పూర్తి విరుద్ధం హాకిన్స్‌. బెటాలియన్‌కు సరిపడా అతడే వాగుతాడు. ఎంత చిన్న టాపిక్‌గానీ ఎదుటివారిని తిట్టకుండా వదలడు. హాకిన్స్, నోబెల్‌ తరచూ మతం గురించి వాదులాడుకుంటారు. నోబెల్‌ సోదరుడు ప్రీస్ట్‌ అని తెలియడం దీనికి కారణం. ఎవరూ మాట్లాడ్డానికి లేకపోతే ముసలమ్మ మీద ప్రతాపం చూపిస్తాడు హాకిన్స్‌.

ఒక సాయంత్రం వాళ్లందరూ టీ తాగారు. హాకిన్స్‌ దీపం వెలిగించాడు. పెట్టుబడిదారులు, స్వర్గం, పూజారులు... ఇలా మాటలు దొర్లుతున్నాయి. అప్పుడు జెరమాయా డానవన్‌ వచ్చాడు. అందరినీ చూసి నెమ్మదిగా బయటికి నడిచాడు. చర్చ తెగేది కాదని బోనపార్ట్‌ ఆయన్ని అనుసరించాడు. ఇద్దరూ గ్రామం వైపు నడుస్తున్నారు. ఆగి, ‘వాళ్లకు కాపలాగా ఉండాల్సింది నువ్వు’ అన్నాడు డానవన్‌. ‘ఇంకెంతకాలం? వాళ్లను మనతో ఉంచుకుని ఏం ప్రయోజనం?’ అడిగాడు బోనపార్ట్‌. ‘వాళ్లను బందీలుగా పట్టుకున్నామని నీకు తెలుసనుకుంటున్నా.’ ఖైదీలు అనకుండా బందీలు అనడం అర్థంకాలేదు. ‘శత్రువుల దగ్గర మనవాళ్లు ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లను కాల్చేస్తామని చెబుతున్నారు.

వాళ్లు మనవాళ్లని కాల్చేస్తే మనమూ వాళ్లవాళ్లను కాల్చేసి దీటైన జవాబిద్దాం’ తీవ్రంగా బదులిచ్చాడు డానవన్‌. ‘కాల్చేయడమా?’ అసలు అట్లాంటిదొకటి సాధ్యమనే ఆలోచనే బోనపార్ట్‌కు ఉదయించలేదు. ‘అంతే, కాల్చేయడమే’ స్థిరంగా బదులిచ్చాడు డానవన్‌. ‘కానీ నాకూ నోబెల్‌కూ ఈమాట ముందే చెప్పివుండాల్సింది’ పీలగా అన్నాడు బోనపార్ట్‌. ‘ఎందుకు చెప్పాలి?’ ‘ఎందుకంటే వాళ్లను మేము కావలి కాస్తున్నాం కాబట్టి.’ ‘మిమ్మల్ని కాపలాగా ఉంచినప్పుడు ఆ మాత్రం ఊహించలేరా?’ తప్పుపట్టాడు డానవన్‌. ఇప్పుడు చెబుతున్నాగదా, ఎప్పుడు చెబితే తేడా ఏముంది? అన్నాడు. ‘చాలా పెద్ద తేడా ఉంది’ గొణిగాడు బోనపార్ట్‌. కానీ ఆ తేడా ఏమిటో వివరించలేకపోయాడు.

బోనపార్ట్‌ తిరిగి వెళ్లేసరికి చర్చ తీవ్రంగా నడుస్తోంది. మరణానంతర జీవితం ఏమీ ఉండదని మాట్లాడుతున్నాడు హాకిన్స్‌. మతగ్రంథాలను అనుసరించి కచ్చితంగా ఉంటుందని చెబుతున్నాడు నోబెల్‌. ‘నీకు స్వర్గం ఏమిటో తెలియదు, అదెక్కడుందో తెలియదు? అందులో ఎవరుంటారో తెలియదు, వాళ్లకు ఏమైనా రెక్కలుంటాయా’ అన్నాడు హాకిన్స్‌. ‘అవును, ఉంటాయి, చాలా’ చెప్పాడు నోబెల్‌. ‘అవి ఎక్కడ్నుంచి వస్తాయి? ఎవరు చేస్తారు? అక్కడేమైనా రెక్కల ఫ్యాక్టరీ ఉందా?’ వ్యంగ్యంగా అన్నాడు హాకిన్స్‌.

చర్చ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. నీతో వాదించడం నా వల్ల కాదని నోబెల్‌ చేతులెత్తేశాడు. ఆ ఇంగ్లీషు వాళ్లిద్దరినీ వేరే గదిలోకి పంపి, తాళం పెట్టి, బోనపార్ట్, నోబెల్‌ పడుకున్నారు. దీపం ఆర్పేశాక డానవన్‌ చెప్పింది నోబెల్‌ చెవుల్లో వేశాడు బోనపార్ట్‌. నోబెల్‌ మౌనంగా ఉండిపోయాడు.

తెల్లారి సాయంత్రం వాళ్లు టీ తాగారు. బెల్చర్‌ తన ధోరణిలో ‘ఊమ్, నేస్తుడా, దాని సంగతేమిటి?’ అన్నాడు. అందరూ టేబుల్‌ చుట్టూ గుండ్రంగా కూర్చున్నారు. హాకిన్స్‌ కార్డ్స్‌ పంచాడు. బయట డానవన్‌ వస్తున్న బూట్ల చప్పుడు. నెమ్మదిగా బయటికి నడిచాడు బోనపార్ట్‌. ‘ఏం కావాలి?’ ‘నీ సైనిక స్నేహితులిద్దరు.’ డానవన్‌ ముఖం కోపంగా ఉంది. ‘మరో దారిలేదా?’ ‘శత్రువులు మనవాళ్లను నలుగురిని చంపేశారు. తెలుసా, అందులో ఒకతను పదహారేళ్ల కుర్రాడు.’

ఇంతలో నోబెల్‌ అక్కడికి వచ్చాడు. గేటు దగ్గరున్న ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ఫీనీ కూడా కలిశాడు. ‘ఆ ఇద్దరినీ బయటికి తెండి, ఇక్కడినుంచి షిఫ్ట్‌ చేస్తున్నామని చెప్పండి’ ఆదేశించాడు డానవన్‌. ‘నన్ను ఇందులోంచి మినహాయించండి’ ప్రాధేయపడ్డాడు నోబెల్‌. ‘అయితే సరే, నువ్వూ ఫీనీ షెడ్లోంచి పార, పలుగు పట్టుకెళ్లి దూరంగా గొయ్యి తియ్య’మన్నాడు డానవన్‌. ‘ఇరవై నిమిషాల్లో మేము వచ్చేస్తాం. ఎవరికీ తెలియకూడదు’. ఫీనీ, నోబెల్‌ బయటికి నడిచారు.

డానవన్, బోనపార్ట్‌ ఇంట్లోంచి ఇంగ్లీష్‌ వాళ్లను బయటికి పిలుచుకొచ్చారు. నడుస్తుండగా, ‘పొద్దున మావాళ్లు నలుగురిని మీవాళ్లు కాల్చేశారు, ఇప్పుడు మీ వంతు’ చెప్పేశాడు డానవన్‌. హాకిన్స్‌ నమ్మలేదు. కావాలంటే బోనపార్ట్‌ను అడగమన్నాడు. ‘ఆ అవసరం లేదు, నేనూ బోనపార్ట్‌ నేస్తులం, కాదా?’ అడిగాడు హాకిన్స్‌. నిజమేనని బాధగా చెప్పాడు బోనపార్ట్‌. అయినా నమ్మలేదు హాకిన్స్‌. ‘నువ్వు నిజం చెప్పట్లేదు, నన్నెందుకు కాల్చేస్తారు? నోబెల్‌ కూడా ఇందులో ఉన్నాడా?’ అవునని తెలియగానే హాకిన్స్‌ నవ్వాడు. ‘హాకిన్స్, నీ చివరి కోరిక ఏమిటి?’ అడిగాడు డానవన్‌. ‘నోబెల్‌ నన్నెందుకు కాల్చేస్తాడు? నేను అతడినెందుకు కాల్చేస్తాను? మేము నేస్తులం కదా!’

దూరంగా దీపపు వెలుతురులో నోబెల్, ఫీనీ నిలబడివున్నారు. గొయ్యి సిద్ధంగా ఉంది. ‘హలో, నేస్తుడా’ నోబెల్‌ను పలకరించాడు బెల్చర్‌. బోనపార్ట్‌ గుండెలో మృత్యుబాధ వచ్చి కూర్చుంది. నోబెల్‌ బదులివ్వలేదు.

‘హాకిన్స్, నీ చివరి సందేశం ఏమిటి?’ అతడికి ఇలాంటివాటి మీద నమ్మకం లేదు. మరేదో మాట్లాడబోయాడు. ‘ఇక చాలిద్దాం.’ రివాల్వర్‌ను చేతిలోకి తీసుకున్నాడు డానవన్‌. హాకిన్స్‌ మెడ వెనుక గురిపెట్టాడు. బోనపార్ట్‌ కళ్లు మూసుకున్నాడు. బ్యాంగ్‌! నోబెల్‌ కాళ్ల దగ్గర పడిపోయాడు హాకిన్స్‌. బెల్చర్‌ జేబులోంచి కర్చీఫ్‌ తీసుకుని కళ్లకు కట్టుకోబోయాడు. పెద్ద తలకు ఆ చిన్న కర్చీఫ్‌ సరిపోలేదు. బోనపార్ట్‌ను ఇవ్వమని అడిగాడు. గంతలు కట్టుకునేముందు హాకిన్స్‌ కదులుతూ కనబడ్డాడు.

అతడి ఎడమ మోకాలు పైకి లేవడం దీపం వెలుగులో కనబడింది. ముందు అతడిని ఇంకోసారి కాల్చేయండి, అన్నాడు బెల్చర్‌. శాశ్వతంగా ఆ నొప్పి నుంచి విముక్తం చేయడానికి మరొక బ్యాంగ్‌! బెల్చర్‌ నవ్వాడు. ‘రాత్రే వాడు ఈ మరణానంతర జీవితం గురించి తెగ కుతూహలపడ్డాడు.’ బోనపార్ట్‌ వెన్ను వణికింది. బెల్చర్, నీ చివరి ప్రార్థన చేస్తావా? ‘ఉపయోగం లేదు, నేను సిద్ధంగా ఉన్నాను’. బ్యాంగ్‌! రెండోసారి కాల్చే అవసరం కూడా రాలేదు.

ఆ గుడ్డి వెలుతురులోనే శవాలను మోసుకెళ్లి, గోతిలో వేసి పూడ్చారు. పనిముట్లు పట్టుకుని నోబెల్, బోనపార్ట్‌  తిరిగి ఇంటికి వెళ్లారు. వెళ్లేసరికి ముసలమ్మ జపమాలతో కూర్చునివుంది. ‘వాళ్లను ఏం చేశారు?’ అనుమానంగా అడిగింది ముసలమ్మ. బదులు రాలేదు. మళ్లీ అడిగినా బదులు లేదు. అయ్యో! ముసలమ్మ మోకాళ్ల మీద దేవుడి ముందు కూలబడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement