వనాలతో సహజీవనాలు | Days Kuk New Book The New Wilderness | Sakshi
Sakshi News home page

వనాలతో సహజీవనాలు

Published Mon, Oct 5 2020 12:45 AM | Last Updated on Mon, Oct 5 2020 12:45 AM

Days Kuk New Book The New Wilderness - Sakshi

‘‘ఊళ్లో ఇప్పుడేమీ లేదు. ఇళ్ల మేడలమీద పూలమొక్కలూ, కూరగాయపాదులూ, వాటిమధ్య బాటలూ లేవు. సోలార్‌ గ్రిడ్స్, నీళ్లట్యాంకులూ, సెల్‌టవర్లూ, వాటిచుట్టూ వేసిన ముళ్లకంచెలతో నిండిపోయాయవన్నీ. ఒక బిల్డింగ్‌ నుంచి మరో బిల్డింగ్‌కి వెళ్లే మనుషులు తప్ప బయట మరెవ్వరూ కనిపించరు. వాళ్లుండే ఇంటికి కొంతదూరంలో ఒక చెట్టూ, దాన్నెవరూ ముట్టుకోకుండా బలమైన కంచె ఉండేవి. ప్రతి వసంతానికీ ఆ చెట్టుకు పువ్వులు పూసేవి. అందమైన పూవులను చూడటానికి ఎక్కడెక్కడినుంచో జనాలు వచ్చేవారు. చెట్టు ఆకులను రాల్చినప్పుడు గాలికి ఎగిరే ఆకులను ఏరుకోవటానికి అంతా పోటీ పడేవారు. ఊరిలో మిగిలిన పది చెట్లలో అదొకటి. ఆ చెట్టుకు దగ్గర్లో ఇల్లుండటం వాళ్లు చేసుకున్న అదృష్టం.’’ వాతావరణ కాలుష్యంతో కనుమరుగవుతున్న పచ్చదనానికీ, జాగ్రత్త వహించకపోతే జరగబోయే పరిణామాలకూ సాక్ష్యంగా నిలుస్తుందీ ఊరు ‘ద న్యూ విల్డర్నెస్‌’ నవలలో. ఎందరో ప్రముఖ రచయితల సరసన పోటీలో నిలబడి బుకర్‌ ప్రైజ్‌ 2020కి షార్ట్‌లిస్ట్‌ అయిన ఆరింటిలో డయాన్‌ కుక్‌ తొలినవలే చోటుచేసుకోవటం ఆ నవలకు దక్కిన గౌరవం. 

ప్రకృతితో మనిషి సహజీవనం అనే పరిశోధన కోసం మిగిలివున్న ఏకైక అడవి ‘విల్డర్నెస్‌ స్టేట్‌’లోకి ఇరవైమందిని పంపిస్తారు పరిశోధకులు. పరిశోధన ముగిసేవరకూ కఠినమైన నియమాలను పాటిస్తూ, నిర్ణీత ప్రదేశాల్లోని కేంద్రాలలో తమ అనుభవాలను పొందుపరుస్తూ, ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ అడవిమనుషులలాగా జీవించాలి వారంతా. నగరంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూన్న అయిదేళ్ల ఆగ్నెస్‌కు కాలుష్యం నుంచి గాలిమార్పు అవసరమని డాక్టర్లు చెప్పటంతో పరిశోధనలో భాగస్తులై కూతురుతో అడవికి చేరుకుంటారు గ్లెన్, అతని భార్య బియాట్రిస్‌. అడవిలో ఆగ్నెస్‌కి ఆరోగ్యం, తల్లితో అనుబంధం మెరుగవుతాయి కానీ, పదీపదకొండేళ్ల వయసొచ్చేటప్పటికి ఇద్దరి మధ్యా కొత్తగా వికర్షణల విస్ఫోటనాలు మొదలవుతాయి. తల్లి మరణవార్త విన్న బియాట్రిస్‌ తమకి ఒక్కమాటైనా చెప్పకుండా నగరానికి వెళ్లిపోవడం నచ్చదు ఆగ్నెస్‌కి. తిరిగివచ్చిన బియాట్రిస్‌ తమ బృందంలో కొత్తవారు చేరటం, గ్లెన్‌ అనారోగ్యం పాలై ఉన్నప్పటికీ అతన్నెవరూ పట్టించుకోకపోవటం గమనిస్తుంది. అనారోగ్యంతో గ్లెన్‌ మరణించగా కార్ల్, బియాట్రిస్‌లు బృందాన్ని నడిపిస్తారు.

అడవిలో కనిపించిన ఆడమ్‌ అనే వ్యక్తి అధికారుల కళ్లుగప్పి రహస్యంగా అడవిలోకి చొరబడ్డాననీ, తనలాగా చాలామంది అక్కడున్నారనీ చెప్తాడు. అధికారులు పరిశోధన ముగిసిందనీ, రహస్యంగా అడవిలోకి చొరబడ్డవారిని పట్టుకోడానికి సహకరిస్తే ప్రైవేట్‌లాండ్స్‌కి తీసుకెళ్తామనీ, కాదంటే అందరినీ నగరానికి పంపే ఏర్పాట్లు చేస్తామనీ అంటారు. నగరానికి తిరిగి వెళ్లటంకంటే,  ప్రైవేట్‌లాండ్స్‌లో జీవితం బావుంటుందన్న ఆశతో బియాట్రిస్‌తో సహా ఎక్కువమంది దానికే మొగ్గు చూపుతారు. ప్రైవేట్‌లాండ్స్‌ మీద నమ్మకం లేని ఆగ్నెస్‌ తల్లితో  విభేదించి ఒంటరిగా అడవిలోకి పారిపోతుంది కానీ, కొంతకాలానికి అధికారులకు దొరికిపోతుంది. ఇప్పుడీ ఆఖరి అడవిలో సైతం జరుగుతున్న నిర్మాణాల పర్యావరణ హింసని ఆగ్నెస్‌ గమనిస్తుంది. పర్యావరణంపట్ల మానవుడి నిర్లక్ష్యంతో కలుగుతున్న విపత్తులను స్పృశిస్తూ డిస్టోపియన్‌ లక్షణాలను సంతరించుకున్న నవల, తల్లీకూతుళ్ల మధ్య సంచలించే బాంధవ్యం కథావస్తువుగా  శాఖలువారుతుంది. కూతురికోసం నాగరిక జీవనాన్ని వదిలి వచ్చిన బియాట్రిస్‌కి అప్పుడప్పుడూ ఆ బంధాలు తనని ‘హత్తుకోవటంకంటే, కట్టిపడేస్తున్న భావన’ కలగడం తల్లీకూతుళ్ల ప్రేమలో ఇతర వర్ణచ్ఛాయలుంటాయనడానికి సాక్షీభూతం. 

బహుళ కథకుల ద్వారా భిన్న దృష్టికోణాలు నవలలో పరిచయమవుతాయి. వికసిస్తున్న బుద్ధితో ప్రపంచాన్ని పరిశీలించే ఆగ్నెస్, ప్రతి విషయం పట్లా ముందే ఏర్పరచుకున్న స్థిర దృక్పథం ఉన్న బియాట్రిస్‌ – ప్రధాన కథకులు. నవలంతా పరుచుకునున్న అడవి వాతావరణం, వర్ణనలు కొంత సాగతీత అనిపించినప్పటికీ– ప్రతీకలూ, ఉపమానాలూ, సారళ్యత, తటస్థత, కథనానికి అందమైన ఆలంబనలు. మానవ సంఘర్షణలతో – ప్రత్యేకించి తల్లీకూతుళ్ల ఆకర్ష వికర్షణలతో – పర్యావరణాన్ని కలిపి చిత్రించటం బావుంది. ‘మరణం జీవించడమంత సహజం’ అనుకుని ముందుకుసాగే పరిస్థితులనూ, మనుషుల్లో నిక్షిప్తమైన నిర్దాక్షిణ్యతనూ చూసినపుడు అడవిలోపలి మనిషి, మనిషిలోపలి అడవి ఒకేసారి కనిపిస్తాయి. మనుషులు ఎక్కడున్నా వారి ఘర్షణలు, నైజాలూ మాత్రం అవే– ప్రకృతితో నిమిత్తం లేకుండా! 
 
నవల: ద న్యూ విల్డర్నెస్‌
రచన: డయాన్‌ కుక్‌ 
ప్రచురణ: హార్పర్‌; 2020

- పద్మప్రియ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement