రాజ్‌ గోండు కథాగాయకుడి ధారణ శక్తి | Michael York Book on the History of Raj Gonds | Sakshi
Sakshi News home page

రాజ్‌ గోండు కథాగాయకుడి ధారణ శక్తి

Published Mon, Aug 19 2019 1:31 AM | Last Updated on Mon, Aug 19 2019 1:32 AM

Michael York Book on the History of Raj Gonds - Sakshi

మానవ విజ్ఞానవేత్త క్రిస్టొఫ్‌ హైమెండార్ఫ్‌ 1976లో రాజ్‌ గోండుల మీద తన రెండో విడత (తొలి విడత శోధన 1940ల్లో జరిగింది) పరిశోధన కోసం ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన శిష్యుడిగా, సహపరిశోధకుడిగా వచ్చారు మైకల్‌ యార్క్‌. హైమెండార్ఫ్‌ జిల్లా పశ్చిమ భాగంలో ఉన్న రాజ్‌ గోండులనూ, యార్క్‌ తూర్పు ప్రాంతపు రాజ్‌ గోండులనూ అధ్యయనం చేశారు. ఇప్పటి కుమ్రం భీం – ఆసిఫాబాద్‌ జిల్లాలో గిన్నెధరి గ్రామంలో ఉంటూ ముఖ్యంగా తిర్యాని లోయలోని గోండు, కొలాం గూడేల్లో ఏడాదిన్నర పాటు శోధించారు మైకల్‌. అనంతరం ఇరువురూ కలిసి ‘ట్రైబ్స్‌ ఆఫ్‌ ఇండియా: ద స్ట్రగుల్‌ ఫర్‌ సర్వైవల్‌’ పుస్తకాన్ని 1982లో వెలువరించారు. ‘రాజ్‌ గోండ్స్‌: రిఫ్లెక్షన్స్‌ ఇన్‌ ఎ పీకాక్‌ క్రౌన్‌’ పేరిట ఓ డాక్యుమెంటరీతో పాటు 1,500 ఫొటోలు కూడా తీశారు మైకల్‌. అప్పుడు మైకల్‌ యార్క్‌ రాసిన రెండు పరిశోధనాత్మక వ్యాసాల తెలుగు అనువాదమే ఈ ‘వేలిత పాట’. అనువాదం: ల.లి.త. సంపాదకుడు: సుమనస్పతి రెడ్డి. పేజీలు: 142; వెల: 90. ప్రచురణ: తెలంగాణ గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణా సంస్థ, మాసాబ్‌ ట్యాంక్, హైదరాబాద్‌. గోండుల్లో అప్పుడే పుట్టిన పిల్లల్ని సమాజంలోకి ఆహ్వానిస్తున్నందుకు ప్రతీకగా పాడేది ఈ వేలిత(తీగ) పాట. కుటుంబాన్ని ప్రతీకాత్మకంగా ఇంటి పైకప్పు నిండా పరుచుకోవటం కోసం గుమ్మడి మొక్క పంపే నులితీగలుగా (వేలిత వేలి) చెప్పుకుంటారు. పుస్తకంలోని కొంత భాగం ఇక్కడ:

గిన్నెధరికి సంబంధించిన నా జీవితపు అతి ప్రియమైన జ్ఞాపకాలలో ఒకటి, నేను రాజ్‌ గోండుల సంప్రదాయ సృష్టి పురాణాలను రికార్డు చేయాలనుకుంటున్నానని కబురు పంపిన ఫలితంగా కలిగిన అనుభవం. కబురు పంపిన కొన్ని వారాల తరువాత వెడ్మ రాము అనే తోటి పెద్దమనిషి నా ఇంటికి ఒక కింగ్రీతో (కీక్రి అని కూడా అంటారు. వయోలిన్‌ వంటి సంప్రదాయ గోండి వాయిద్యం) వచ్చాడు. పాట పాడటానికి అంగీకరించాడు. ఆ పాట అయిదు రోజులు సాగటం నాకెంతో ఆశ్చర్యంగా అనిపించింది. అతడు పాడుతూ ఉంటే రాజ్‌ గోండుల పెద్ద గుంపు మా ఇంటి దగ్గర పోగయింది. అతని పాట విన్న తరువాత, రాజ్‌ గోండుల వద్ద బాగా అభివృద్ధి చెందిన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం లేకపోవచ్చుగానీ, భారతదేశపు ఆదివాసీల్లో ఉన్న అతి సమృద్ధమైన మౌఖిక సంప్రదాయాలూ, సంస్కృతుల్లో రాజ్‌ గోండులది కూడా ముఖ్యమైనదని నాకు తెలిసివచ్చింది. ఆ పాటనంతటినీ అనువదించి విశ్లేషించటానికి నాకు నెల రోజులు పట్టింది. రాజ్‌ గోండులు ఈ విశ్వాన్ని ఎలా ఊహించారనే విషయం మీద నాకు ప్రగాఢమైన అవగాహన వచ్చింది. అంత సుదీర్ఘమైన, ఉత్కృష్టమైన రచనను ఎలా గుర్తుపెట్టుకుంటారని వెడ్మ రామును నేనడిగితే, ఆయన దాదాపు 125 గులకరాళ్లను నేల మీద మూడు ఆయామాల్లో (ఒక ఘనరూపంలో) అనిపించేలా పేర్చి వర్ణిస్తూ అదే తన జ్ఞాపన సహాయకారి అని వివరించాడు. ఒక సంప్రదాయ కథాగాయకుడి వద్ద ధారణకు తోడ్పడే ఇంత నిశితమైన పద్ధతి ఉండటం నా శాస్త్రీయ పాశ్చాత్య అవగాహనను దిగ్భ్రమకు గురి చేసింది.

గోండుల నమ్మకం ప్రకారం మానవ జన్మ పుట్టుకతో మొదలవుతుంది. ఇది పురిటి నొప్పులతో మొదలై దాదాపు ఒక వారం తరువాత జరిపే శుద్ధి çసంస్కారంతో ముగుస్తుంది. మగ, ఆడ పిల్లల పుట్టుక మధ్య పెద్ద తేడా చూపరు రాజ్‌ గోండులు. మానవ జన్మ అంటే భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశమనే పంచభూతాలు కూడటం, ఇంకా దానికి భగవంతుడు జీవ అంటే ప్రాణాన్ని ఇవ్వటం. ఈ పదార్థాలూ, ఈ ప్రాణశక్తీ కలిస్తే ఒక మౌలిక ఆధారం ఏర్పడుతుంది. ఆ విత్తనమే పెండ్లి సమయానికి యౌవన దశకు చేరి, పునరుత్పత్తికి కారకమై వృద్ధి చెందుతుంది. ఆ విత్తనమే మృత్యు సమయంలో భగవంతుడు ప్రాణశక్తిని వెనక్కు తీసుకున్నప్పుడు నశించి ధూళిలో కలిసిపోతుంది. మనిషి అస్తిత్వమే ఒక అభివృద్ధి క్రమం. జీవన పరిభ్రమణంలో దాటవలసిన అన్ని దశలూ దాటి వెళితేనే మానవ జన్మ సంపూర్ణమౌతుంది. దీనిని గోండులు ప్రతీకాత్మకంగా అయిదు జొన్న విత్తనాలుగా చెప్పుకుంటారు. జొన్న వాళ్ల ముఖ్య ఆహార ధాన్యం. పెండ్లప్పుడు ఆ అయిదు విత్తనాలు అయిదు కొలతల విత్తనాలవుతాయి. చనిపోయినప్పుడు అవి అయిదు కొలతల పిండిగా మారతాయి. అయితే ఎవరైనా పెండ్లికి ముందే చనిపోతే ఆ మనిషి అభివృద్ధి క్రమం మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు చావు తంతు చాలా చిన్నదైపోతుంది. అయిదు గింజల ప్రతీక ప్రాధాన్యం కోల్పోతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement