‘చంఘిజ్‌ఖాన్’ నవల రాస్తున్నప్పుడు తెన్నేటి సూరిని ఒక మిత్రుడు అడిగాడట: ‘‘నువ్వు వ్రాస్తున్నది చంఘిజ్‌ఖాన్ జీవితమా లేక వారం వారం వెలువడుతున్న వర్తమాన రాజకీయాల సమీక్షా?’’ ఈ నవల వెలువడిన కాలం 1950. నవలలో చిత్రించిన ఆసియా కుళ్లు రాజకీయాలు 12, 13 శతాబ్దాల నాటివి. కాలం తప్ప ఏమీ మారలేదు. ‘చరిత్ర పుటలు వెనక్కు తిరగబడుతున్నాయా?’ అదీ ఈ నవల ప్రాసంగికత. చరిత్రలో రాక్షసుడిగా, పరమ క్రూరుడైన హంతక నియంతగా చిత్రించబడిన చంఘిజ్‌ఖాన్ కాలంనాటి సామాజిక రాజకీయ పరిస్థితులను చిత్రిస్తూ, చంఘిజ్‌ఖాన్‌లోని ‘మహోన్నత మానవవాది’ని అర్థం చేయించడానికి సూరి ఈ నవలను సంకల్పించారు.
ఎవడు ఎప్పుడు మీద పడి, ఆడవాళ్లనూ సంపదనూ దోచుకెళ్తాడో తెలియని అరాచక కాలంలో మంగోలియాలో జన్మించాడు చంఘిజ్‌ఖాన్. అసలు పేరు టెముజిన్. అంటే ఉక్కుమనిషి అని అర్థం. మన చేతిలోని ఆయుధాన్ని నిర్ణయించేది శత్రువు చేతిలోని ఆయుధమే, అని నమ్మాడు టెముజిన్. మహత్తరమైన సైనిక శక్తిని సిద్ధం చేశాడు. ‘123 గుడిసెలు, లేక డేరాలు గల ఒక బంజారీ తండా నాయకుడు ప్రపంచంలో ముప్పాతిక వంతు వరకూ జయించి మూడు శతాబ్దాల పర్యంతం స్వర్ణయుగాన్ని అనుభవించిన ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగాడు?’ మానవుడిగా అతను ఎలాంటి స్వభావం కలవాడు? అతనిలో వున్న బలీయమైన గుణసంపత్తి ఏమిటి? ‘నీకున్నది మాత్రమే బలం కాదు శత్రువు నీకుందని నమ్మేది కూడా నీ బలమే!’ అన్న యుద్ధసూక్తిని అనుసరించి ఎలా శత్రువులను బోల్తా కొట్టించాడు? ఎలాంటి అనితరసాధ్యమైన యుద్ధవ్యూహాలను రచించాడు? చివరకు ప్రపంచాన్ని జయించే చంఘిజ్‌ఖాన్(జగజ్జేత) ఎలా కాగలిగాడు? అన్న ప్రశ్నలకు నవల సమాధానం చెబుతుంది.
తెన్నేటి సూరి వివిధ గ్రంథాలను, ముఖ్యంగా హెన్రీ హెచ్, హౌవర్త్ రాసిన మంగోల్ హిస్టరీని అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా టెముజిన్‌తోపాటు, చమూగా, కరాచర్, తుఘ్రల్‌ఖాన్, భగత్తూర్, ‘షామాన్’, యూలన్, కూలన్ లాంటి పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన నవల ఇది.
తెన్నేటి సూరి
Comments
Please login to add a commentAdd a comment