sahithyam
-
దివికేగిన కలువకొలను
సీమ సాహితీ రత్నం.. కథల కలువ.. తొలితరం రచయిత.. కథా చక్రవర్తి.. కలువకొలను సదానంద మృతి సాహితీ లోకానికి తీరనిలోటు. ఆయనతో అనుబంధం ఉన్న పలువురు కవులు, రచయితలు సదానందం మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాక్షి, తిరుపతి : కలువకొలను సదానంద పరిచయం అక్కర్లేని పేరు. జిల్లాకు చెందిన తొలితరం రచయితల్లో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. 1939లో చిత్తూరు జిల్లా పాకాలలో నాగమ్మ, కృష్ణయ్య దంపతులకు ఆయన జన్మించారు. బాల్యంలో నిరుపేద జీవితం గడిపిన సదానంద సునిశిత దృష్టితో సమాజాన్ని అధ్యయనం చేశారు. ఆయన రచనల్లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. 1958లో ఆయన తొలి కథానిక “రచన్ఙ ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. తర్వాత కాలంలో తెలుగు స్వతంత్ర, సైనిక సమాచార్, జయంతి, స్రవంతి, ఆనందవాణి, చిత్రగుప్త, భారతి, ఆంధ్రపత్రిక ఆయన రచనలను ప్రచురించాయి. ఆయన కేవలం రచనలకు మాత్రమే పరిమితం కాకుండా కార్టూన్లు కూడా వేసేవారు. నిజాయితీగా, వాస్తవిక ధోరణితో స్వేచ్ఛగా రచనలు చేసేవారు. అవినీతిపై సునిశిత విమర్శలు ఎక్కుపెట్టేవారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేసినా అందులోనూ ప్రతిభ కనబరిచారు. 1992లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సత్కారం సైతం పొందారు. రక్తయజ్ఞం, పైరుగాలి, నవ్వే పెదవులు ఏడ్చే కళ్లు తదితర కథా సంపుటాలను రచించారు. గాడిద బ్రతుకులు, గందరగోళం, బంగారుమామ వంటి నవలలు రాశారు. ఆయన రచించిన అడవితల్లి నవలకు కేంద్రప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డును సైతం అందుకున్నారు. సాహిత్య ప్రపంచానికి విశేష సేవలందించిన సదానంద(81)మంగళవారం పరమపదించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరదని జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు ఆవేదన వెల్లడించారు. రచయిత సదానంద మృతి బాధాకరం తిరుపతి కల్చరల్ : జిల్లా కథా రచయితల్లో మొదటితరం రచయిత అయిన కలువకొలను సదానంద మృతి చెందడం బాధాకరమని, సాహిత్య లోకానికి తీరని లోటని జిల్లా రచయితల సమాఖ్య సమన్వయకర్తలు పలమనేరు బాలాజీ, సాకం నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆధునిక సాహితీ కృషి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అభ్యుదయ రచయితల సంఘం నాయకులు గంటా మోహన్, యువశ్రీ మురళి, నెమిలేటి కిట్టన్న బౌద్ధసంఘం నేత సహదేవ నాయుడు ఎంఆర్ అరుణకుమారి, రచయిత డా క్టర్ మౌని, పలువురు రచయితలు, కవులు, సాహితీవేత్తలు సంతాపం ప్రకటించారు. రాయలసీమ సాహిత్య రత్నం నేను కవితలు, కథలు రాయడం ప్రారంభించిన కొత్తలో(1976 ప్రాంతం) కొంతకాలం పాకాల రైల్వేకాలనీలో ఉన్నాను. అప్పుడే సదానంద నాకు పరిచయం. చాలా సార్లు కలిశాను ఆయన్ని. ఆయన ద్వారా రచనలో మెలకువలు తెలుసుకున్నాను. అంత పెద్ద రచయిత అయి కూడా ఆయన చాలా సాదా సీదాగా ఉండేవారు. అది నాకు గొప్పగా అనిపించేది. ఓ పత్రికకు ఆయన గురించి వ్యాసం రాస్తూ ‘కలువ కొలను కథల కొలను– సదానంద సదా ఆనంద’ అని పేరు పెట్టాను. ఆయన మనల్ని వదలి వెళ్లడం బాధాకరం. రాయలసీమ సాహిత్య రత్నం ఆయన. – డాక్టర్ శైలకుమార్ కథల ‘కలువ‘ రాలిపోయింది కథాప్రక్రియలో తనకంటూ ఒక ముద్ర వేసుకుని కథల కలువలు పూయించిన కథా చక్రవర్తి కలువకొలను సదానంద. చిత్తూరు జిల్లా సాహితీవనంలో ఒక వృక్షం నేలకొరగడం భాషా సాహిత్యాలకు తీరని లోటు. ఆయన వృద్ధాప్యంలో ఉన్నపుడు చూడడానికి కొంతమంది రచయితలు పాకాలకు వెళ్లాం. నేను ఆయన్ని చూడడం ఆ ఒకసారే. అప్పుడు మెట్లెక్కుతున్న నన్ను ‘జాగ్రత్త పేరూరు’ అన్నారు. అప్పటికి పూర్తిగా చూపు కోల్పోయిన సదానంద గారు ఏం ఆ అబ్బాయికి ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆయనతో నేను ‘నాకు పోలియో సార్ దివ్యాంగుడిని’ అంటే అయితే నువ్వు బాగా రాసి మంచిపేరు తెచ్చుకోవాలి నాయనా! అని చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. – పేరూరు బాలసుబ్రమణ్యం -
ఆవిరైపోతున్న అస్తిత్వాలు
మాలర్డ్. అమెరికా దక్షిణాదిలో మాప్లో దొరకని ఒక కాల్పనిక గ్రామం. అక్కడున్న నల్లవాళ్లంతా తెల్లవాళ్లుగా చలామణీ కాగలిగినంత తెల్లగా, తగ్గితే కాస్త చామనఛాయగా ఉంటారు. వీళ్లటు పూర్తిగా నల్లవారూ కాదు, ఇటు తెల్లవాళ్లలో కలిసిపోనూలేరు. స్టెల్లా, డెజిరీ అనే ఇద్దరు అమ్మాయిలూ ఒకే పోలికతో ఉన్న కవలలు. తండ్రి చదువు రానివాడైనప్పటికీ అతను ఒక అమెరికన్ యువతికి అసభ్యకరమైన ఉత్తరం రాసాడన్న నెపం మీద అమెరికన్లు కొంతమంది అతన్ని కొడుతూ బయటకు ఈడ్చుకెళ్లి తుపాకీతో కాల్చేస్తారు. తలుపుచాటు నుండి ఈ లించింగ్ని చూసిన కవలలకి అప్పటిదాకా తమ అస్తిత్వాల గురించి అర్థంకాని విషయమేదో ఆ క్షణంలో అర్థమయినట్టు అనిపిస్తుంది. ఒకరికొకరు అన్నట్టుగా ఉండే ఈ అక్కచెల్లెళ్లు, తండ్రి చనిపోయాక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక అమెరికన్ ఇంట్లో పనిచేయటం మొదలుపెడతారు. ఉన్న ఊరిలో భవిష్యత్తు లేదనుకున్న కవలలు తల్లికి చెప్పకుండా ఊరొదిలి పారిపోతారు. న్యూ ఆర్లీన్స్కి చేరుకున్న కొద్దిరోజుల తరవాత డెజిరీని వదిలేసి వెళ్లిపోతుంది స్టెల్లా. ‘వైట్ ప్రివిలేజెస్’ కోసం స్టెల్లా అమెరికన్ యువతిగా చలామణి అవుతూ ఉన్నత కుటుంబీకుడైన ఒక అమెరికన్‌ని పెళ్లిచేసుకుని తాను కోరుకున్న స్వతంత్రతా, భద్రతా, సమాజంలో గౌరవం సంపాదించుకున్నప్పటికీ ఆమె జీవితం కత్తిమీద సాములా సాగుతుంది. భర్త ప్రేమను పూర్తిగా పొందినా, ఒంటరితనం ఆమెను వేధిస్తూ ఉంటుంది. ఇంకొకరిలా మారడమనే ప్రక్రియ అసంపూర్ణమనీ, తనది కాని ప్రపంచంలో తను ఎప్పుడూ ఒంటరేననీ ఆమె ఊహించలేదు. నిరంతరం చేసే నటనలో ఎప్పుడైనా తాను దొరికిపోతుందేమో, భర్త తనని వదిలేస్తాడేమో అన్న అనుమానం, తనగతాన్ని తనే తృణీకరించుకున్నానన్న నిజం ఆమెను వేధిస్తూనే ఉంటాయి. కూతురు కెన్నెడీకి ఆమె విషయమంతా తెలిసిపోవటంతో, అప్పటికే ఇద్దరి మధ్యా ఉన్న దూరం మరింత పెద్దదవుతుంది. జీవితంలో ఏం చేయాలో, తనకేం కావాలో తెలుసుకునే ప్రయత్నంలో ఉంటుంది కూతురు కెన్నెడీ. ఇటు ఒంటరిగా జీవిస్తున్న డెజిరీ కొంతకాలానికి ఒక నల్ల జాతీయుడిని పెళ్లి చేసుకుంటుంది గానీ, అతను పెడుతున్న బాధల్ని తట్టుకోలేక కూతురు జూడ్ని తీసుకుని తల్లి దగ్గరకు తిరిగి వచ్చేస్తుంది. మాలర్డ్లో తనను ప్రేమించిన, తనకీ ఇష్టమైన వ్యక్తితో సహజీవనం ప్రారంభిస్తుంది. కూతురు జూడ్ మాత్రం తను ఎదుర్కొంటున్న వివక్షకి అతీతంగా అకుంఠిత ధ్యేయంతో మెడికల్ కాలేజ్‌లో చేరుతుంది. ఆడపిల్లగా పుట్టిన ట్రాన్స్ సెక్సువల్రీస్ పట్ల ఆమె ప్రేమా, అతనికి ఆసరానివ్వడం ఆమె స్థిర జీవిత దృక్పథాన్ని తెలియజేస్తాయి. నలభై యేళ్ల కథతో బాటు ఆ కథని జాతి వివక్ష, ఎల్జీబీటీక్యూ చరిత్రలతో అనుసంధానించే స్పష్టమైన కాలరేఖ నవలలో ఉంది. వానిషింగ్ హాఫ్ – అదృశ్యమైపోతున్న సగం అస్తిత్వం – అనేది నవలలోని కీలకాంశం. విడిపోయిన డెజిరీ, స్టెల్లాలు తమలోని చెరి సగాలనీ, గతాన్ని కోల్పోవడం వల్ల స్టెల్లా తనలోని సగాన్నీ, మానసిక దూరాల కారణంగా స్టెల్లా, కెన్నెడీలు తమలో చెరి సగాలనీ కోల్పోయారు. నవలంతా పరుచుకునున్న ఊపిరి సలపని అస్తిత్వాన్వేషణల సమస్యలకి భిన్నంగా జూడ్, రీస్ల మధ్య ప్రవహించే ప్రేమమాత్రం కొంత ఊరట కలిగిస్తుంది. నవలలో తప్పొప్పుల నైతిక బేరీజులు లేవు– జీవిత గతులను పరిచయం చేయటం తప్ప, ఆ జీవితాల గురించి మనకి ఆలోచనలు రేకెత్తించడం తప్ప. మరో టోనీ మారిసన్, జేమ్స్ బాల్డ్విన్ అని విశ్లేషకులచేత అభివర్ణించబడుతున్న అమెరికన్ రచయిత్రి బ్రిట్ బెన్నెట్ రాసిన ద వానిషింగ్ హాఫ్ నవల గత నెల రివర్‌హెడ్ ద్వారా విడుదలై అగ్రస్థానంలో ఉంది. హెచ్‌బివో వారు పెద్దమొత్తానికి సినిమా హక్కులు కొనటం రచయిత్రి సాధించిన మరో విజయం. ‘‘దూరమవడానికి వంద కారణాలుండవచ్చు, చేరువవవ్వటానికి కొన్ని చాలు,’’ అని నవలలోని ఒక పాత్ర అంటుంది. ఆ కారణాలని ఆప్యాయంగా భద్రపరచుకోకపోతే, ఉత్తరోత్తరా వివక్ష సృష్టించే ఉత్పాతాలకి మనమే ఉత్తరవాదులం అవుతాం. (నవల: ద వానిషింగ్ హాఫ్ రచన: బ్రిట్ బెన్నెట్ ప్రచురణ: రివర్ హెడ్, 2020) - పద్మప్రియ -
తిమింగలంతో నా సమరం
మాబీ డిక్ 1851లో ప్రచురితమైనప్పుడు విమర్శకులు పెద్దగా పట్టించుకోలేదు. దీని రచయిత హెర్మన్ మెల్విల్లి (1819–1891) చనిపోయేనాటికి కూడా ఆయనకు పెద్ద పేరు లేదు. కనీసం ఆ సమయంలో నవల పునర్ముద్రణలోనైనా లేదు. కానీ ఆయన శతజయంతి తర్వాత నెమ్మదిగా నవల పాఠకుల్లో కొత్త ఆసక్తి పుట్టించింది; రచయిత మళ్లీ సజీవుడైనాడు. ఇప్పుడు మాబీ డిక్ గొప్ప అమెరికన్ నవలల్లో ఒకటి. హెర్మన్ మెల్విల్లి నావికుడిగా తన జీవితం ప్రారంభించాడు. పంతొమ్మిదవ శతాబ్దంలో తిమింగలాల వేట పెద్ద పరిశ్రమ. ఆ వ్యాపారంలో ఉన్నవాళ్లు మహాసముద్రాలన్నింటినీ కలియదిరిగి, తిమింగలాలను వేటాడి, వాటి నుండి లభించే నూనెను అమ్ముకునేవారు. దీనికోసం నెలలు, సంవత్సరాల పాటు సముద్రాల మీద తిరిగేవారు. ఆ క్రమంలో ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొనేవారు. ఈ నవలలో వర్ణితమైన తిమింగలాల వేట, ఆ జీవితం తాలూకు ఎన్నో విషయాలు రచయిత ప్రత్యక్ష అనుభవం అనుకోవచ్చు. ఈ విశిష్ట నవలను తెలుగులోకి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం అనువదించారు. 1967లో గంగాధర పబ్లికేషన్స్ ప్రచురించింది. అనువాదకుడు క్లుప్తంగా రాసిన పరిచయంలోంచి కొంతభాగం: ‘‘ఇది కేవలం తిమింగలపు వేటలోని కష్టనిష్ఠూరాలను చిత్రించే కథ మాత్రం కాదు. ఈ కథకు ప్రధానపాత్ర అయిన అహబ్, ఒకానొక సన్నివేశంలో, ‘మాబీ డిక్’ అనబడే తిమింగలపు వేటు వల్ల తన కాలుని పోగొట్టుకుంటాడు. ప్రస్తుత కథ అహబ్ యొక్క ప్రతీకార దీక్షకి చెందినది. చతుస్సముద్రాలు గాలించి, మాబీ డిక్‌ని మరల చూచి, ఎలాగైనా దానిని వధించి, తన పగ తీర్చుకొంటానని అహబ్ పట్టుబడతాడు. తన అనుచరులు ఎంత వారించినా లెక్క చేయక, నెగ్గించుకోవడానికి పంతము పూనుకొంటాడు. అది విధి ప్రేరణ. చిట్టచివరకు ఆ తిమింగలాన్ని కనుగొంటాడు, తన శక్తినంతా ఉపయోగించి దానిని ఎదుర్కొంటాడు. కాని ఆ భూతానికి బలి అవుతాడు. ఈ విషాదగాథ ఒక ‘‘ట్రాజెడీ’’ అయింది– విషాదాంత నాయకునకు ఉండే లక్షణములలో ముఖ్యమైనది ఏమనగా, తనను కబళింపనున్న విధికి తనకి తెలియకుండగనే తన చేతుల వల్ల సాయపడుట! తుది నిశ్వాసమును విడుచుచున్నను పరాజయమును ఒప్పుకోకపోవుట. ఈ లక్షణము ఈ కథానాయకుడగు అహబ్ ఎడ సంపూర్ణంగా సమన్వయించుకోవచ్చు.’’ -
తప్పిపోయిన కాలం
బాల్యం ఔతలి ఒడ్డున ఒకరినుంచి ఒకరం తప్పిపొయ్యి మళ్ళ యిక్కడ ఈ బిగ్ బాజారుల కలుసుకున్నం వాషింగు మిషనులు ఫ్రిజ్జులు ఎల్ఈడీ టీవీలపై పడి దొరులుతున్న చూపుల నడుమ ఇద్దరం రోబోలుగ ఎదురుపడ్డం కొంచెం సేపటికి ఎప్పటినుంచో వెతుకుతున్న వస్తువు కంటిముందర ప్రత్యక్షమైన మాదిరిగ ఒకింత ఆశ్చర్యంగనే ఒకరికొకరం దొరికి పోయినం వస్తుజాలంల చిక్కుకున్న మమ్ములని అమాంతం పొంగిన సుద్దవాగు ముంచేసింది సీసీ కెమెరాలు చూస్తున్నయని మరిచి వాగునీళ్ళల్ల ఏసంగిల పారిచ్చిన దోసకాయలు ఇరుగ తిన్నం కాళ్ళకింద చలువరాయి ఉన్నా గుంచీలు తవ్వి గోటీలు, గిల్లి దండలాడినం దిగుడు కాదు కదా పట్నంల మట్టే కరువన్నది మరిచి సలాక ఆడుకుంటు కుంటినం గుట్టలమీద కంపల్ల పడి ఆడినా ఏడ యింత దెబ్బ తగులలె గని ఇంత నొప్పైతె ఎప్పుడు లేదు రాంరాయని వాగు ఖిల్లగుట్ట బత్తీస్ గడి కజాన్ చెరూ బంగల్ చెరూ బొమ్మల కార్ఖాన చిన్న తిరిగితిమా ఇంత తిరిగినా కాళ్ళనొప్పులు లేవు కండ్ల నీళ్ళు తప్ప - మడిపల్లి రాజ్‌కుమార్ -
వివక్ష మీద న్యాయపోరాటం
పదహారు, పదిహేడో శతాబ్దాలలో బానిసలుగా అమెరికాకి తీసుకురాబడ్డ ఆఫ్రికన్లకు అమెరికన్ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉంది. ఎన్నో పోరాటాల తరవాత ఇప్పటికీ వీళ్లు సమానత్వం, అస్తిత్వాల కోసం ‘బ్లాక్ లైవ్స్ మాటర్’ అని పోరాడాల్సి రావటం, శతాబ్దాలు మారినా కరడుగట్టిన జాత్యహంకారం కరగకపోవడం నేటి నిజాలు. అమెరికాలో పొలీసు, న్యాయ వ్యవస్థలు ఆఫ్రో–అమెరికన్లపై చూపిన విద్వేషం, చేసిన హింస ఒక ప్రత్యేక చరిత్ర. ప్రపంచంలోని అన్ని దేశాలలోకన్నా, అమెరికాలోని జైళ్లలోనే అత్యధిక సంఖ్యలో నేరస్తులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. వారిలో సింహభాగం ఎవరన్నది ఊహించడం కష్టం కాదు. ఆఫ్రో–అమెరికన్, లాయర్ అయిన బ్రయాన్ స్టీవెన్సన్ వృత్తిరీత్యా తను వాదించిన కొన్ని కేసుల విశేషాలనూ, న్యాయ వ్యవస్థలో తెచ్చిన, తేవలసిన మార్పులనూ ప్రస్తావిస్తూ, ఆఫ్రో–అమెరికన్ల వ్యథార్త జీవితాలలోని విషాదాలను తన జీవితంతో సమాంతరంగా చెప్పిన ఆత్మకథ ఈ ‘జస్ట్ మెర్సీ’. పేదరికం, అభద్రతల మధ్య గడిచిన బ్రయాన్ బాల్యం, న్యాయశాస్త్రం చదవటానికి కాలేజీలో చేరడంతో మలుపు తిరుగుతుంది. కాలేజీ సెలవులప్పుడు అట్లాంటాలోని ఒక సంస్థలో చేరిన బ్రయాన్ మరణశిక్ష విధించబడిన ఖైదీని చూడటానికి జైలుకి వెళ్తాడు. అక్కడి పరిస్థితులు గమనించిన అతనికి, న్యాయవాదిగా తను చేయాల్సిన పనిపట్ల స్పష్టత ఏర్పడి, ఆ ధ్యేయంతోనే న్యాయశాస్త్ర విద్యను పూర్తిచేస్తాడు. చదువు ముగించిన బ్రయాన్, దక్షిణ అమెరికాలో జాతివివక్ష ఎక్కువగా ఉన్న అలబామా రాష్ట్రంలో, మరణశిక్షలు విధింపబడిన పేద, ఆఫ్రో అమెరికన్స్ కోసం ఉచితంగా పనిచేసే సంస్థను స్థాపించి న్యాయవాద వృత్తిని మొదలుపెడతాడు. చేయని తప్పుకి మరణశిక్ష విధించబడి జైల్లో మగ్గుతున్న వాల్టర్ అనే ఆఫ్రో అమెరికన్ నేపథ్యంగా కథనం సాగినా, మరిన్ని వ్యథాభరిత జీవన వాహినులు పుస్తకమంతా ప్రవహిస్తూనే ఉంటాయి. ఒక హత్య కేసులో వాల్టర్‌ని ఇరికించి, హత్య జరిగిన సమయంలో వాల్టర్ ఇంట్లోనే ఉన్నాడన్న సాక్ష్యాన్ని పట్టించుకోని పోలీసులు, వాల్టరే హత్య చేసినట్టు దొంగసాక్ష్యాలు సృష్టించి కోర్టులో అతనిని దోషిని చేస్తారు. హతురాలు అమెరికన్ యువతి కావటంతో వాల్టర్‌కి మరణశిక్ష పడుతుంది– ‘కాపిటల్ పనిష్మెంట్ అంటే కాపిటల్ లేనివారికి ఇచ్చే పనిష్మెంట్’ అని బ్రయాన్ స్నేహితుడు వ్యంగ్యంగా అన్నట్టు. వాల్టర్ పక్షాన బ్రయాన్ వాదనలు విన్న కోర్టు, కేసును పునఃపరిశీలించి వాల్టర్ శిక్షలన్నింటినీ రద్దుచేస్తుంది. పక్షపాత వైఖరి, ఉదాసీనత, నిర్లక్ష్యాల మూలంగా వెలువడే ఆధార రహిత తీర్పులు, వాటిపట్ల సమాజం ప్రదర్శించే తటస్థత, ఉపేక్ష సరి కావనీ, సరైన న్యాయం అందకపోతే నల్లజాతి మొత్తం నిర్వీర్యం అవుతుందన్న ఆవేదన బ్రయాన్ మాటల్లో ధ్వనిస్తుంది. అమెరికన్ సివిల్ వార్ సమయంలో వచ్చిన బానిసత్వ నిర్మూలన కాగితాల మీద మాత్రమే అందించిన సంపూర్ణ స్వేచ్ఛ, పౌరసత్వం– ఇవేవీ ఆఫ్రో–అమెరికన్లకు భద్రత నివ్వలేదనీ, వారి జీవితాల్లోని విషాదాలనీ, జీవితాల మీద అరాచకాలను ఆపలేదనీ జిమ్క్రో న్యాయసూత్రాల నేపథ్యంలో వివరిస్తాడు రచయిత. వాదించిన కేసులూ, స్టేట్/ఫెడరల్ న్యాయ వ్యవస్థల్లో ఉన్న తేడాలూ, ఆఫ్రో–అమెరికన్లకు వ్యతిరేకంగా వెలువడిన తీర్పులూ, జడ్జీలలోనూ జ్యూరీలలోనూ తక్కువ శాతంలో కనిపించే ఆఫ్రో–అమెరికన్ల గురించీ ప్రస్తావిస్తాడు రచయిత. వ్యాపార ధోరణితో నడిచే ప్రైవేట్ జైళ్లు, ప్రేమించిన నేరానికి జరిగిన లించింగ్‌లు, పిల్లలు కూడా పెద్దల కోర్టులలోనే విచారింపబడి పెరోల్ లేని జీవిత ఖైదులు అనుభవించటం, వాళ్లని కరడుగట్టిన నేరస్తులుండే పెద్దల జైళ్లకే తరలించడం, విచ్ఛిన్నమైన కుటుంబాలు, గృహహింస, పేదరికం, బాల్యమే తెలియని పసిపిల్లల జీవితాలు, జైళ్లలో అత్యాచారాలకి గురవుతున్న స్త్రీలూ– ఈ అణచివేతల్లోని వెతలు మనిషిలో అడుగంటిపోయిన వివేకాన్ని ప్రశ్నిస్తాయి. బ్రయాన్ తన సంస్థ ద్వారా వారికి చేస్తున్న సేవ, చూపిస్తున్న త్రోవ కొంతమేరకు కొత్త వూపిరి. బ్రయాన్ అన్నట్టు ‘‘పరస్పరం అన్న మానవ భావనకి అతీతంగా ఏ సంపూర్ణత్వమూ సిద్ధించదు.’’ ఈ పుస్తకం ఆధారంగా ఇదే పేరుతో 2019లో సినిమా కూడా వచ్చింది. - పద్మప్రియ (నవల: జస్ట్ మెర్సీ, రచన: బ్రయాన్ స్టీవెన్సన్, ప్రచురణ: వన్ వల్డ్; 2015) -
‘ప్రతిభా’వంతుడు
అప్పట్లో భారతి పత్రికలో రచనలు అచ్చవడం కవులకు రచయితలకు గీటురాయిగా వుండేది. అటువంటిదే తెలికచర్ల వెంకటరత్నం సంపాదకత్వంలో వెలువడిన ప్రతిభ మాసపత్రిక కూడా. పొందికగా వస్తున్న ప్రతిభలో తన పేరు చూసుకోవాలని మధునాపంతులకు కోరికగా వుండేది. అయితే ముందు చందాదారునిగా చేరదాం, తరవాత రచనలు పంపిద్దాం అనుకున్నారో ఏమో, పత్రికకు చందా కట్టారు. మరుసటి నెల సంచికలో చందాదారుల జాబితాలో ‘మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి’ పేరు ముద్రించారు. అది చూసిన ఆంధ్రి సహ సంపాదకుడు, విద్వాన్ పాలెపు వెంకటరత్నం ఆయనతో వున్న చనువుతో ‘‘మొత్తానికి ప్రతిభా’వంతుడవయ్యావు’’ అని చమత్కరించారు. అందరినీ చమత్కరించే మధునాపంతుల తన మీది చమత్కారానికి ముసిముసిగా నవ్వుకున్నారు. సేకరణ: శిఖామణి -
రారండోయ్
పట్నాయకుని వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్న వారం వారం తెలుగు హారం 100వ వారం వేడుక మార్చి 1న ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరగనుంది. నందమూరి లక్ష్మీపార్వతి, ఆర్.దిలీప్ రెడ్డి, కేవీ రమణాచారి, మామిడి హరికృష్ణ, వర్ధెళ్లి మురళి, ప్రభాకర రెడ్డి, ఎంవీ రామిరెడ్డి, గౌరీశంకర్, సన్నిధానం నరసింహశర్మ, కాలువ మల్లయ్య, పొట్లూరి హరికృష్ణ పాల్గొంటారు. మాడభూషి రంగాచార్య స్మారక కథా పురస్కా రాన్ని ‘సీమేన్’ కథలకు గాను అద్దేపల్లి ప్రభుకు ఫిబ్రవరి 25 సా.6 గం.లకు రవీంద్ర భారతి మినీ హాల్లో ప్రదానం చేయనున్నారు. శీలా వీర్రాజు, కాలువ మల్లయ్య, నెల్లుట్ల రమాదేవి, నాళేశ్వరం శంకరం పాల్గొంటారు. ధనికొండ హనుమంతరావు శతజయంతి ముగింపు సభ మార్చి 1న ఉ.10 – సా.5గం. వరకు రవీంద్రభారతి మినీ హాల్లో జరగనుంది. వకుళాభరణం రామకృష్ణ, సంగిశెట్టి శ్రీనివాస్, కె.శ్రీనివాస్, కాత్యాయని విద్మహే, జగన్నాథ శర్మపాల్గొంటారు. ధనికొండ ఎంపిక చేసిన 40 కథల మీద 25 మంది యువ రచయితలు మాట్లాడుతారు. జాగృతి కథలు, నవలల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం మార్చి 1న ఉ. 10 గం.కు ఓయూ ప్రాంగణంలోని పీజీఆర్ఆర్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో జరగనుంది. వక్త: సిరివెన్నెల సీతారామశాస్త్రి. విజేతలు: కథలు– ఆర్.దమయంతి, కనుపూరు శ్రీనివాసులు రెడ్డి, పాణ్యం దత్తశర్మ; నవలలు– పుట్టగంటి గోపీకృష్ణ, ఆకెళ్ల శివప్రసాద్. సీఏఏ, రిజర్వేషన్లు, కాశీం, వరవరరావు, సాయిబాబా అరెస్టు, వారి కవిత్వం వంటి అంశాలపై మార్చి 1న మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9గం. వరకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో సదస్సు జరగనుంది. నిర్వహణ: విప్లవ రచయితల సంఘం. ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి సమగ్ర సాహిత్యం ప్రచురించే నిమిత్తం– అలభ్యంగా ఉన్న ఆయన రచనలు గురుక్షేత్ర సంగ్రామము, సంయుక్త, నేత్రావధాన చంద్రిక, మానసబోధ శతకము జాడ తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నారు అనిల్ అట్లూరి. ఫోన్: 8142642638. -
వాతావరణ సూచన : హర్షాభావం
అడవిలో నడుస్తున్న ఇద్దరు కొద్ది దూరంలో ఆకలిమీదున్న ఒక ఎలుగుబంటిని చూశారు. వెంటనే ఒకతను పారిపోవడానికి తయారైపోయాడు. రెండో అతను, ‘‘నువ్వెంత ప్రయత్నించినా ఎలుగుబంటి కంటే వేగంగా పరిగెత్తలేవు,’’ అన్నాడు. మొదటి వ్యక్తి అతన్ని చూసి–‘‘ఫర్లేదు, నీకంటే వేగంగా పరిగెత్తితే చాలు కదా!’’ అన్నాడు. ఆరేళ్ల క్రితం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పెక్యులేషన్ నవలతో సంచలనాన్ని సృష్టించిన అమెరికన్ రచయిత్రి జెన్నీ ఓఫిల్ తన తాజా నవల వెదర్లో ‘లేట్ కాపిటలిజం’ అంటే ఏమిటి అన్న ఒక ప్రశ్నకి ఇచ్చిన చమత్కార సమాధానం అది. అలాగని ఈ నవల లేట్ కాపిటలిజమ్ గురించి కాదు. హాస్య వ్యంగ్యాలు కథనశైలిలో ఒక భాగమే తప్ప, ఇది పూర్తిగా అలాంటి తరహా నవలా కాదు. వీటన్నింటినీ దాటుకుని వాతావరణం, పర్యావరణం, మనిషి మనుగడల మీదుగా నవల విస్తృతి కొనసాగుతుంది. నవలలోని కథకురాలు లిజీ ఒక లైబ్రేరియన్. భర్త, కొడుకు, తమ్ముడి చుట్టూ ఆమె జీవితం అల్లుకుని ఉంటుంది. లిజీకి ఒకప్పటి ప్రొఫెసర్ అయిన సిల్వియా, వాతావరణంలో వస్తున్న పెనుమార్పుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తన ప్రసంగాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తూంటుంది. సిల్వియాకి ఉన్న పని ఒత్తిళ్ల వల్ల ఆమెకొచ్చే రకరకాల మెయిల్స్ చూసి సమాధానాలు ఇవ్వటానికి లిజీని కుదుర్చుకుంటుంది. ఆ మెయిల్స్‌లోని వైవిధ్యం చూసి లిజీ ఆశ్చర్యపోతుంది. పర్యావరణానికి మనిషి కలిగిస్తున్న హాని, తద్వారా వచ్చే వాతావరణ మార్పులు రానున్న ఉపద్రవానికి సూచనలనీ, ఆ ప్రమాదం సుదూర భవిష్యత్తులో కాదనీ, అనుకున్న దానికంటే చాలా వేగంగా సమీపిస్తోందనీ ఎంతోమంది ఆందోళన చెందటం ఆ మెయిల్స్‌లో గమనిస్తుంది. ముంచుకొస్తున్న వినాశనాన్ని ఎవరూ సరిగ్గా అంచనా వేయని అలసత్వాన్ని గుర్తిస్తుంది. రాబోయే తరాల భద్రత గురించి ఎలాంటి అనుమానాలూ లేని లిజీకి ఈ కొత్త ఎరుక ఉలికిపాటుని కలిగిస్తుంది. తన పిల్లవాడి గురించీ, తరువాతి తరాల గురించీ ఆలోచిస్తున్న లిజీతో ‘‘నువ్వు నీ పిల్లల్ని వీటన్నిటినుంచీ రక్షించగలననే అనుకుంటున్నావా?’’ అని ఆమె ఆలోచనా భారాన్ని మరింత పెంచుతుంది సిల్వియా. అందరిలానే జీవన వైరుధ్యాలని లిజీ కూడా ఎదుర్కొంటూనే ఉంటుంది. బొటాబొటి జీతం, తమ్ముడి బాధ్యత, ఆ బాధ్యత వల్ల సంసారంలో ఇబ్బందులూ, పిల్లవాడూ, చదువూ వంటి వైయక్తిక సమస్యలు ఎన్ని ఉన్నా, ఎన్నికల ఫలితాలూ, నిరంకుశ ధోరణులూ, పెరుగుతున్న అసమానతలూ, స్కూల్లో కాల్పులూ, అభద్రతలూ, అలుముకుంటున్న నిరాశ వంటి సామాజిక పరిస్థితులు భయం కలిగిస్తున్నా – వీటన్నిటి మధ్య కూడా పర్యావరణం పట్ల తన బాధ్యత గురించి ఆలోచించే లిజీ కథే ఈ నవల. రకరకాల విషయాల ప్రస్తావనలతో ప్రారంభంలో పాఠకుడికి పట్టు దొరకనివ్వని కథనం, పోనుపోను అల్లిక చిక్కనై అందులోకి లాగేస్తుంది. కథావిస్తరణలో ఏ నవలా సూత్రాలకీ కట్టుబడకుండా, తార్కికమైన మొదలూ తుదీ అంటూ లేకుండా సాగే కథ– లిజీ ఆలోచనల విస్ఫోటనాల చుట్టూ పాదరసంలా సంచలిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు కొంత హాస్యంతో, కొంత తాత్త్వికతతో కలగలిసి ఆమె మేధను తాకి విడిపోతుంటాయి. రోజువారీ జీవితపు పరుగులో మనిషి కొట్టుకుపోతూ, తన మనుగడనే ప్రశ్నార్థకం చేసే ముఖ్యమైన విషయాలను చూసీచూడనట్టు వదిలేయటం సరికాదన్నదే ఈ నవల ఇతివృత్తం. మేధోపరమైన చర్చలకే పరిమితమైపోతున్నవారు, మార్పుకోసం బరిలోకి దిగి అందరితో కలిసి నడవాలన్నది నవలాంతరంగం. పద్మప్రియ -
కావ్యదహనోత్సవం
తన కావ్యాన్ని ఎవరూ చదవడం లేదని నిశ్చయమైన ఒక కవి, ఒక కొత్త సంప్రదాయానికి తెర తీస్తూ కావ్యదహనోత్సవానికి సిద్ధపడ్డాడు. దానికి తగినట్టుగా సభ ఏర్పాటైంది. అధ్యక్షుడు క్లుప్తంగా శ్రోతలకు విషయం వివరించి, కృతికర్తను మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు. అప్పుడు కృతికర్త ప్రసంగం ఇలా సాగింది: ఒకళ్లనొకళ్లు పొగుడుకోవడంతో మొదలై, పార్టీలతో ఆఖరవుతున్న ఈనాటి సాహిత్య సభలని చూస్తున్న నేను; సాహిత్య సమస్యలని నిష్కపటంగా చర్చించే ఉదాత్త సభ చూడగలనా అనుకునేవాడిని. చచ్చిపోతే చచ్చిపోయింది కానీ, నాకింత ఉదాత్త సాహిత్యసభలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నా కావ్యానికి ధన్యవాదాలు అర్పించకుండా ఉండలేను. కాలేజీ పత్రికలకి పద్యాలు, పెళ్లిళ్లకి పంచరత్నాలు రాయడంతో నా సాహిత్యజీవితం మొదలయ్యింది. నా దగ్గిర స్నేహితుడు ఒకడు చనిపోతే, షెల్లీ రాసిన ఎడొనోయిన్ దగ్గర పెట్టుకొని, ‘విలపామి’ అనే ఖండకావ్యాన్ని వ్రాశాను. ఆ పద్యాలు అచ్చవగానే, నా మిత్రులందరూ, ‘నీలో సరికొత్త కంఠం మాకు గంభీరంగా వినపడుతున్నది’ అని ఉబ్బేశారు. అప్పటికి నేను కవిననే భ్రాంతి నన్ను పూర్తిగా ఆవరించింది. నా వేషభాషల్లో కూడా మార్పు వచ్చింది. గ్లాస్గో పంచలు, పెద్ద జరీ పంచెలు, శాండో బనీను లీలగా కనిపిస్తూ వుండే తెల్లటి మల్లెపువ్వుల్లాంటి లాల్చీలు, నగిషీ చెక్కిన చెప్పులు, ఇవి నా ట్రేడుమార్కులు! ఛందోకవిత్వం పేరుతో కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యడం మొదలుపెట్టాను. చిత్రవిచిత్ర బంధనలతో రకరకాల సమాసాలతో, కవితలు వ్రాశాను. దేశంలో ఏ మూల సాహిత్య సభ పెట్టినా వెళ్లేవాడిని. సాహితీ సభలకు వెళ్లడానికి ఏ అర్హతా అక్కరలేదు కదా! అనతికాలంలోనే, దేశంలో హేమాహేమీ సాహిత్యవేత్తలంతా నాకు పరిచయం అయ్యారు. పబ్లిక్ మీటింగుల్లో కూడా నన్ను పొగడటం మొదలుపెట్టారు. ఆరు నెలలు తిరక్కుండా ఒక చిన్న ఖండకావ్యానికి సరిపడే పద్యాలు, గేయాలు తయారుచేశాను. దానితో సర్వ యువకవి బంధువుగా ప్రసిద్ధికెక్కిన ఒక పీఠాధిపతి నన్ను వెన్ను చరిచి, తాను ఉపోద్ఘాతం రాస్తాననీ, అచ్చు వెయ్యమనీ వెంటపడ్డాడు. కావ్యానికి అగ్నిశంఖం అన్న పేరు ఆయనే పెట్టాడు. మా వేలువిడిచిన పినతండ్రి ఒకాయన సెంట ర్లో కాస్త పెద్ద పదవిలో ఉండటం మూలంగా కృతిపతిని వెతుక్కోవలసిన బాధ తప్పింది. ఆయనతో ఏవో లావాదేవీలుండి, మా ఇంటిచుట్టూ తిరిగే ఈ గోపాలరెడ్డి నా స్నేహం కట్టి, తనకి అంకితం ఇమ్మని కూచున్నాడు. పుస్తకం అచ్చుకయ్యే ఖర్చు కాకండా, ఆవిష్కరణ రోజున ఓ వెయ్యి నూటపదహార్లు ఇస్తానని చెప్పాడు. పుస్తకం తెల్లటి పాలవెన్నెల లాంటి ఆర్ట్ కాగితాల మీద అచ్చయ్యింది. అప్పట్లో మత్స్య, అటవీ శాఖకి డిప్యూటీ మంత్రిగా ఉన్న ఒకాయన సభాధ్యక్షుడిగా వచ్చాడు. దినపత్రికల్లో మా బొమ్మలు బ్రహ్మాండంగా అచ్చయ్యాయి. రెండున్నరేళ్లు ఆ కైపులో కొట్టుకుపోయాను. నా వ్రాతప్రతుల్లో ఎవరికయినా ఓపిక వుండి చూడగలిగితే, అసంపూర్తిగా వదిలేసిన ప్రబంధాలు, చంపూకావ్యాలు, వాస్తవిక, అధివాస్తవిక గేయాలు, ‘నిజము అన్నపూర్ణ నీదు మాట’ మకుటంతో వందలకొద్దీ పద్యాలు దొరుకుతాయి. నేను నా గతజీవితంలోలాగా మీరు ఏ మాట చెబితే చప్పట్లు కొడతారో ఆ మాటలే చెప్పి సెభాస్ అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అసలు ప్రపంచ సాహిత్యాలకంటే నా తెలుగు సాహిత్యం గొప్పదని విర్రవీగాను. ఏ భాషలోకి అనువదించినా ఇది కావ్యంగానే నిలబడుతుంది, అన్న కావ్యం ఒక్కటీ మనకు రాలేదు. యునెస్కో వాళ్లు ఫ్రెంచ్‌లోకి అనువదిస్తాం, మీ కావ్యం ఒకటి చెప్పండయ్యా అని అంటే, మనవాళ్లు మీనమేషాలు లెక్కపెట్టి చివరికి వేమన పద్యాలు చూపించారు! ఒకసారి ఆంధ్రాభ్యుదయోత్సవ సభకి ఉపన్యాసం ఇవ్వటానికి వెళ్లాను. సభ అధ్యక్షుడు హైస్కూలు హెడ్మాస్టరు. ‘బాబూ! అన్నన్ని మాటలు వాడావు?’ భ్రసృమర, అఘమర్షణ, నిబర్హణ, వీటికి అర్థం ఏమిటీ, అనడిగాడు. నా పద్యాల్లో నేను ఏ అర్థమూ వుద్దేశించి రాయలేదని నిరూపించాడు. ఏలూరులో నేను నా మిత్రులూ రోజూ దాదాపు అరడజను పకోడీ పొట్లాలు తెప్పించుకునేవాళ్లం. పకోడీలు ఒక్కో షాపులో ఒక్కోరకంగా వుండేవి. కానీ, పొట్లం కటిన కాయితాలు మాత్రం అన్నీ అగ్నిశంఖం కాయితాలే! నిజంగా కవిత్వం అంటే ఏమిటి? ఒక గొప్ప కావ్యం వ్రాయాలంటే సంపాదించుకోవలసిన వ్యుత్పత్తి ఎటువంటిది? ఎలాంటి అనుభవాలు ఒక వ్యక్తిని కవిగా చేస్తాయి? ఈ ప్రశ్నలు నన్ను వేధించటం మొదలెట్టాయి. ఆధునిక ఆంగ్ల కవిత్వ యుగప్రవక్తగా విఖ్యాతుడయిన గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్ తన జీవితకాలంలో ఒక్క పద్యం కూడా అచ్చు వెయ్యలేదు. అతని కవిత్వమంటే ఇష్టమయినవాళ్లు అచ్చువేస్తామని చెప్పినా ఒప్పుకోలేదు. ఒక దశలో అంతకుముందు వ్రాసిన పద్యాలన్నీ చింపేసి, ఇక పద్యాలు రాయకూడదని శపథం కూడా చేయడం జరిగింది. అతను చనిపోయింతర్వాత అక్కడక్కడ అతని స్నేహితుల వద్దా, ఇతరత్రా దొరికిన 50, 60 పద్యాలు మాత్రం అతని మిత్రుడు రాబర్ట్ బ్రెడ్జెస్ ప్రకటించాడు. ఈనాడు హాప్కిన్స్ మీద వచ్చిన విమర్శక గ్రంథాలు ఒక బీరువాకి సరిపోతాయి. క్షమించండి. ఇప్పటికే చాలాసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించాను. మనిషి సుఖంగా బ్రతకాలంటే కవిగా డబ్బా వాయించుకోనక్కరలేదు. ఏ దొరస్వామిలాగానో యూనివర్సిటీ ముందు ఒక కిళ్లీకొట్టు పెట్టుకొని ఆనెస్టుగా బ్రతకచ్చు. తెలుగు సాహిత్యంతో ఇక ఈ జన్మలో సంబంధం పెట్టుకోను. కొంతమందికి అనుమానం రావచ్చు; సినిమాలకి మాటలు పాటలు రాస్తానేమోనని. ఆ పనీ చెయ్యను. ఇక సెలవ్. ఒక చారిత్రక ప్రహసనం ఇటు ఆకలి అటు కాకలి అటు వేకువ ఇటు లోకువ అటు మకుటం ఇటు కటకం అటు సమరం ఇటు భ్రమరం ఇటు కృస్చేవ్ అటు మిస్చీఫ్ ఇటు టర్కీ అటు గోర్కీ నాలో మాత్రం సత్యం నిత్యం నవ్య భవ్య దివ్యాకృతి (‘అగ్నిశంఖం’) కవిని ఎవరో కావ్యం రాయమని అభ్యర్థించటం, కవి కృతిని రాయటం, ఆ కృతికన్యను ఒక కృతిభర్తకి అంకితం ఇవ్వడం– ఇలాంటి కర్మలు మన సంప్రదాయంలో ఉన్నప్పుడు, ఎవరూ చదవని పుస్తకానికి దహనోత్సవం ఎందుకు చెయ్యకూడదు? ఈ సందేహం ఒకమారు వెల్చేరు నారాయణరావుకు వచ్చింది. ‘ఎవరైనా అటువంటి దహనకర్మ చేయటానికి ముందుకొస్తే నా పుస్తకాలు ఇస్తాను’ అన్నారు ఆంధ్రవిశ్వకళా పరిషత్తు ప్రధాన లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న అబ్బూరి రామకృష్ణారావు. అదీ నాంది. ఇదే ఊతంగా ఒక ప్రహసనం రాశారు అప్పటికి నవయువకుడైన వేలూరి వేంకటేశ్వరరావు. ‘కావ్యదహనోత్సవం’ చేయాలంటే ముందు కవి కావాలి. అది వేలూరే. ఆయనో కావ్యం రాయాలి. రాశాడు(?). దాని పేరు అగ్నిశంఖం. 14–12–1960 రోజున ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆవరణలో దహనోత్సవం జరగనుందనీ, ‘అమూల్య హర్షాశ్రుతర్పణము’ వదలడానికి అందరూ రావాలనీ పత్రికలు కొట్టించారు. సభ అంటే దానికో అధ్యక్షుడు (మేడేపల్లి వరాహనరసింహ స్వామి) కావాలి, ప్రధాన వాహకుడు (ఎ.సత్యమూర్తి) ఉండాలి, కృతి భర్త (అనంతరం బంగోరెగా ప్రసిద్ధుడైన బి.గోపాలరెడ్డి) తప్పనిసరి. ఇంకా, శ్రోతల్లోంచి చీటీ పంపి మాట్లాడతాననే ఓ యువకుడు (చేకూరి రామారావు). ‘అచ్చుయంత్రం ఏటేటా వేలు లక్షల పుస్తకాలు ప్రజల మీద పడేస్తున్నది. వీటిల్లో మంచి చెడ్డల ఎన్నిక బహు దుస్తరం అయిపోతున్నది’ అంటూ అధ్యక్షుడు సభ ప్రారంభించాడు. ‘ఒక తుచ్ఛకావ్యం యొక్క తుచ్ఛత్వం లోకానికంతటికీ తెలిసిన చాలా కాలానికిగానీ కవికి’ తెలియదనీ, అలాంటిది ‘అగ్నిశంఖం వ్రాసిన వేంకటేశ్వరరావు మా దగ్గరికొచ్చి, తన కావ్యం క్షుద్రకావ్యం అని’ ఒప్పుకుని దహనోత్సవం జరిపించమన్నాడనీ నిర్వాహకుడు సభను ముందుకు జరుపుతాడు. అనంతరం, ఈ దహనానికి ఎందుకు ఒప్పుకున్నాడో చెబుతూ కవి ప్రసంగిస్తాడు. (ప్రసంగంలోని కొంతభాగం కథాసారంలో చూడండి.) కవి అప్పటికే నన్నయ్య నుంచి నానాసాహెబ్ దాకా ఎన్నో ప్రయోగాలు చేసినవాడు. ఎన్నో బిరుదులు పొందినవాడు. కానీ ప్రచారం వలననే సాహిత్య విలువలు స్థిరపడుతున్నాయని జ్ఞానోదయమైంది. అందుకే, తన ‘సర్వ రచనల మీద మమకారం వదులు’కుంటున్నానని సభాముఖంగా ప్రకటించాడు. దహనం అంటే భౌతికంగా పుస్తకాన్ని తగలబెట్టడం కాదని వీళ్లందరికీ తెలుసు. తెలుగులో సాహిత్యం పేరుతో చలామణీ అవుతున్న చెత్తను గుర్తించాలని అదొక పిలుపు. అరవై ఏళ్ల కింద ఈ ఘటన సహజంగానే సంచలనం కలిగించింది. ‘విష్ క్రెమేషన్ సక్సెస్’ అని తంతి పంపించాడు శ్రీశ్రీ. మా ఊరికి ఎప్పుడు వస్తారని ఉత్తరం రాశాడు ఇస్మాయిల్. ‘ఒక పుస్తకం మరణించిందని మీరెలా చెప్పగలరు?’ అని నిలదీశాడు కొనకళ్ల వెంకటరత్నం. నాటకం, వీధి నాటకం, నిజమైన మనుషులే పాత్రలు కావడం వల్ల ఇంకో వింత రూపం తెచ్చుకున్న ఈ ఘటన– ఇన్నేళ్లూ కేవలం సాహిత్య మరమరాలు కోవలో మౌఖిక ప్రచారంలో ఉండి, అప్పటి విశేషాలు కలుపుకుని వేలూరి 84వ యేట చిరుపుస్తకంగా వచ్చింది. వేలూరి వేంకటేశ్వరరావు అధ్యాపకుడిగానూ, పరిశోధకుడిగానూ పనిచేశారు. ‘మెటమార్ఫసిస్’, ‘ఆనేల, ఆ నీరు, ఆ గాలి’ కథాసంపుటాలు వెలువరించారు. ఒరియా కవి సౌభాగ్యకుమార మిశ్ర కవిత్వం – ‘అవ్యయ’, ‘ద్వాసుపర్ణా’ తెలుగులోకి అనువదించారు. ప్రస్తుత నివాసం అమెరికా. -
అంతా వాళ్లే
ఒకసారి ఒక సినిమాకు మాటలు రాయడానికి చెన్నై వెళ్లి తిరిగి విశాఖ వస్తున్నారు రావిశాస్త్రి. ‘‘గురువు గారూ, సినిమా ప్రపంచం ఎలా వుంది?’’ అని ఒకతను పలకరించాడు. రావిశాస్త్రి నవ్వి ఇలా జవాబిచ్చారట: ‘‘సినిమా వాళ్లతో చాలా సుఖం. మన గదికి మనని అద్దె చెల్లించనివ్వరు, వాళ్లే చెల్లిస్తారు. మన సిగరెట్లు మనం కొనే పనిలేదు, వాళ్లే కొనిస్తారు. మన మందు, మన తిండి మనం కొనక్కర్లేదు, వాళ్లే ఏర్పాటు చేస్తారు. మన డైలాగులు మనల్ని రాయనివ్వరు, వాళ్లే రాసుకుంటారు.’’ -
రారండోయ్
రావి రంగారావు సాహిత్య పీఠం జన రంజక కవి పురస్కారాలను ఫిబ్రవరి 10న సా. 6 గం.కు గుంటూరులోని అన్నమయ్య కళావేదికలో ప్రదానం చేస్తారు. గ్రహీతలు: మెట్టా నాగేశ్వరరావు (మనిషొక పద్యం), కరీముల్లా (ఎదురు మతం), మందరపు హైమవతి (నీలి గోరింట), కన్నెగంటి వెంకటయ్య (మమతల హృదయాలు), ఎరుకలపూడి గోపీనాథరావు (భావనా తరంగాలు). సిరికోన – మహాంధ్రభారతి సాహిత్యోత్సవం ఫిబ్రవరి 13న సాయంత్రం 5:30కు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరగనుంది. ఇందులో బులుసు వేంకటేశ్వర్లు ‘నీలమోహనం’ ఆవిష్కరణ, సిరికోన భారతి వ్యాస సంపుటి (సం. గంగిశెట్టి లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి) ఆవిష్కరణ కానున్నాయి. గంగిశెట్టి స్మారక ఉత్తమ అనువాదక పురస్కారాన్ని డాక్టర్ కోడూరి ప్రభాకర రెడ్డికీ; రుక్మిణమ్మ గంగిశెట్టి స్మారక ఉత్తమ ప్రథమ కవితా సంపుటి పురస్కారాన్ని దేవనపల్లి వీణావాణికీ; చెన్నరాయ కిశోర్ స్మారక తెలుగు తేజో స్ఫూర్తి పురస్కారాన్ని దేశముఖ్ ప్రవీణ్ శర్మకూ ప్రదానం చేయనున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెలా నవలా స్రవంతిలో భాగంగా ఫిబ్రవరి 14న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో పి.వి.నరసింహారావు ‘లోపలి మనిషి’పై పరాంకుశం వేణుగోపాల స్వామి ప్రసంగిస్తారు. అధ్యక్షత: నందిని సిధారెడ్డి. భూతపురి సాహిత్య పురస్కారాన్ని గండ్లూరి దత్తాత్రేయ శర్మకు ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడపలో ప్రదానం చేయనున్నారు. నిర్వహణ: భూతపురి సుబ్రహ్మణ్య శర్మ మెమోరియల్ ట్రస్ట్, అల్లసాని పెద్దన సాహిత్య పీఠం. అనిల్ డ్యానీ కవితా సంపుటి స్పెల్లింగ్ మిస్టేక్ పరిచయ సభ ఫిబ్రవరి 16న సా. 6 గంటలకు సీసీవీఏ, మొఘల్రాజపురం, విజయవాడలో జరగనుంది. అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా గుడిపల్లి నిరంజన్ రాసిన ‘నిట్టాడి’ దీర్ఘ కవిత ఆవిష్కరణ ఫిబ్రవరి 16న ఉదయం 10 గంటలకు నాగర్‌కర్నూల్, సి.యన్.రెడ్డి సేవాసదన్‌లో జరగనుంది. ఆవిష్కర్త గోరటి వెంకన్న. నిర్వహణ: పూలే అంబేడ్కర్ అధ్యయన వేదిక, నాగర్‌కర్నూల్. -
నా నాటకాల మూలసూత్రాలు
‘కావ్యేషు నాటకం రమ్యమ్’ అనే వాక్యం నాకు బాల్యంలోనే జీర్ణమైపోయింది. నేను హైస్కూలు దాటకుండానే రంగు పూసుకున్నాను. బాలరాముడి పాత్రతో 1960లో నాటకరంగానికి శ్రీకారం చుట్టేను. దాదాపు 200 కథలు రాశాను. 20 నవలలు రాశాను. టీవీ సీరియల్స్‌కి దాదాపుగా 800 ఎపిసోడ్స్ రాశాను. దాదాపు 80 సినిమాలకు కథ, మాటలు రాశాను. దినపత్రికలో కాలమ్స్ రాశాను. ఎన్ని రాసినా, నాటక రచన పట్ల నా ఆసక్తి పెరుగుతూనే వచ్చింది– సాంఘిక నాటికలు, పిల్లల నాటికలు, పద్య నాటకాలు, రేడియో నాటకాలు ఇలా అన్ని విభాగాల్లో రచన చేశాను. 1997లో నేను రాసిన మొట్టమొదటి నాటకం ‘కాకి ఎంగిలి’ హైదరాబాదు రసరంజని హాలులో రోజువారీ ప్రదర్శనలు ఇచ్చారు. ఇది రాయటానికి ముందు నాటకం ఎలా రాయాలి? అనే విషయం చాలాకాలం ఆలోచించేను. నాటకంలో వస్తువైవిధ్యం, సన్నివేశాల కూర్పు, పాత్ర చిత్రణ, పాత్ర స్థాయి, స్వభావాన్ని అనుసరించి సంభాషణలు ఉంటే ఆ నాటకం ప్రేక్షకులని ఆకర్షిస్తుందని గ్రహించేను. పద్యనాటకాలు రాసినా ఇవే మూలసూత్రాలు పాటించేను. ‘అల్లసాని పెద్దన’, ‘రాణి రుద్రమ’, ‘రాణాప్రతాప్’ లాంటి చారిత్రక నాటకాలు రాసినా ఇదే మార్గాన్ని అనుసరించేను. ‘క్రాస్ రోడ్స్’ లాంటి స్త్రీవాద ఇతివృత్తం తో ఇంకో నాటకం రాయండి అని అడిగే మహిళామణులున్నారు. ‘ఓం’ లాంటి ధర్మప్రభోదాన్ని చేసే నాటకం రాయండి అని అడిగే ఆర్ష విద్యా సంపన్నులున్నారు. ‘మీ ఇల్లెక్కడ?’ లాంటి తాత్విక చింతనతో నాటకాలు రాయాలి అని ఆశించే తత్త్వవేత్తలున్నారు. ‘కలనేత’ లాంటి నాటకాలు చూసి తెలంగాణ మాండలికంలో రచనలు చేయమని కోరేవాళ్లున్నారు. 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది నాటక పోటీలు మొదలుపెట్టింది. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ దాదాపు ప్రతీ సంవత్సరం నేను రచించిన ఏదో ఒక నాటిక పోటీలో పాల్గొంటూ వచ్చాయి. 13 సార్లు ఉత్తమ రచనకు నంది బహుమతులు అందుకున్నాను. నా నాటకాలకు బహుమతులు రావటానికి, నాకు ఇంత పేరు రావటానికి, ఆయా నాటకాల్లో ఆ పాత్రలు ధరించిన నటీనటులు, టెక్నీషియన్స్– ముఖ్యంగా దుగ్గిరాల సోమేశ్వరరావు, బి.ఎం.రెడ్డి, కె.వెంకటేశ్వరరావు, గంగోత్రి సాయి లాంటి దర్శకులే కారణం. ఆకెళ్లగా ప్రసిద్ధులైన ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ నాటకాలు రెండు సంపుటాలుగా వచ్చాయి. ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి. రచయిత ఫోన్: 9440054477 -
నవ్వుల గజ్జెలు
‘‘వేడిగా ఏ మే ముంది?’’‘‘వడ, దోసె, ఇడ్లీ, పూరీ, బోండా, మైసూర్‌పాక్’’ ఏకబిగిని రాము పాఠం వల్లించాడు. వాడి చూపులు ఫ్యామిలీ రూమ్స్కేసి పదే పదే పరుగులెత్తుతున్నాయి.‘‘రెండు ప్లేట్లు ఇడ్లీ చట్నీ పట్రా!’’రాము వడిగా వంటింటివేపు నడిచాడు. నడుస్తుంటే ఏదో పొరపాటు చేసినట్టు తట్టింది. చప్పున ఆర్డర్ తీసుకున్న టేబుల్ దగ్గరకు వెళ్లి ‘‘ఇడ్లీ లే’’దని సమాధానం చెప్పాడు.ఆర్డర్ యిచ్చిన కుర్రాడు ఆలోచనలో పడ్డాడు. ‘‘అయితే రెండు కప్పుల టీ పట్రా!’’‘‘రెండు టీ’’ అని రాము గట్టిగా అరిచాడు. అరుపు వేగంతో వంటింట్లోకి వెళ్లాడు. కౌంటర్ పైన ‘టీ’ కనపడకపోవడంతో విసుక్కున్నాడు. కౌంటర్ మీద మోచేతులు ఆనించి, వదులుగా నిలబడ్డాడు. కొంతసేపటికి టీ కప్పులు కనపడ్డాయి. వెంటనే అందుకుని దుడుకుగా టేబుల్ దగ్గరకొచ్చాడు. కప్పుల అంచులు ఒరుసుకుని నడకలో టీ సాసర్లలో పడింది. టీ తగిలి, చేతి బొటనవ్రేలు చురుక్కుమంది. చెయ్యి వణికింది. చేతిలోంచి కప్పు జారి ఆర్డరిచ్చిన కుర్రాడి ఒళ్లో పడింది. అతను దిగ్గున లేచి రామును ఫెళ్లున చెంపమీద కొట్టాడు. ఆ దెబ్బకి రెండవకప్పు, ఎడమచేతి సాసర్‌లోంచి దొర్లి టేబుల్‌పైన ముక్కలైంది. రాము శరీరంపైన పడగలు విప్పి, పాములు, జెర్రులు పాకాయి. మనసులో కోపం లేదు. కాని ఒళ్లు తెలియని ఉద్రేకం పొంగి ఆర్డర్ యిచ్చిన కుర్రాడిని ఫెళ్లున కొట్టాడు. హోటలులోని మనుషులు ఈ సంఘటనకు ఏక కంఠంతో గొల్లుమన్నారు. కౌంటర్ మీది యజమాని తిట్ల వర్షంతో లేచాడు. దెబ్బలతో, తన్నులతో రాముని హోటల్నుంచి తరిమాడు. రాము గుడ్డల్ని గిరాటు వేశాడు. రాముకి యజమానిపై తిరగబడదామన్న వాంఛే కలగలేదు. నరాలన్నీ సడలి ఒక విధమైన ఆనందం కమ్మింది. శరీరం తడిబట్టకు మల్లే బిగుసుకు పోయింది. కళ్లముందు నగ్నంగా రోడ్డు పరుచుకొని వుంది. బరువుగా అడుగులు వేస్తూ ముందుకు సాగాడు. కొంతదూరం అనాలోచితంగా నడిచాడు. కాళ్లు ఎందుకో పీక్కుపోతున్నాయి. కొద్దిగా ఆకలనిపించింది. ఆకలిని దులిపేసుకుని, రోడ్డు పక్కనున్న మైదానంలో గుమిగూడిన ఒక గుంపులోకి వెళ్లాడు. వెళ్లడంలో తనకు రెండింతలు పొడుగున్న మనిషి కాలు తొక్కాడు. అతను కస్సున లేచాడు. రాము పిల్లికి మల్లే ముందుకి వెళ్లి మొదటి వరుసలో కూర్చున్నాడు. అక్కడ మగకోతి, ఆడకోతిని బతిమాలుతున్నది. ఆడకోతి తల్లిగారింటికి వెడతానని మగకోతిని భయపెట్టుతున్నది. మగకోతి తల నిమరడానికి చూస్తోంది. ఆడకోతి గుర్రుమంటున్నది. ఆ కోతుల్ని చూస్తే నవ్వు వచ్చింది కాని, వాటి ఆలుమగల బాగోతం ఎందుకో కలత పెట్టింది. ఆడకోతి తల నిమరాలనిపించింది. లేచి ఆడకోతి వేపు వెళ్లాడు. కోతులాడించేవాడు ‘కుర్రాడా, కూర్చో’ అని గద్దించాడు. తనని ‘కుర్రా’డనటం వెగటుగా తోచింది. ఆ మాటతో ఉత్సాహం చచ్చింది. తన చోటుకి వచ్చి కూర్చున్నాడు. ఆడకోతి అంత బతిమిలాడించుకోవడం చూచి కోపం వచ్చింది. ఇంతలో మగ కోతి కర్ర తీసుకుని ఆడకోతి వెంట పడింది. ఆడకోతి కోతులాడించేవాడి చుట్టూ దొరకకుండా పరుగెత్తుతున్నది. మగకోతి వేగం హెచ్చింది. త్వరగా సమీపించి రెండు బాదింది. ఆడకోతి కీచుకీచులాడింది. మగకోతి చెప్పినట్టల్లా వినడం మొదలుపెట్టింది. రాముకు ఎందుకో ఆడకోతి మక్కెలు విరగదన్నాలనీ, ఆ తర్వాత తల నిమరాలనీ అనిపించింది. ఆట ముగిసింది. ఆడించేవాడు డబ్బులు అడుక్కుంటున్నాడు. రాము లేచి, తిరిగి నడక సాగించాడు. రోడ్డుపైన ఒక జంట చిరునవ్వులతో సాగింది. రాము తన కళ్లని ఆ జంటకి వప్పగించాడు. పర్దాతో ఒక రిక్షా ఎదురుగా వచ్చి, దాటేసి వెళ్లింది. రాము కళ్లు ఆ పర్దాని చీల్చడానికి ప్రయత్నించాయి. ఒక అమ్మాయి గాలికి ఎగురుతున్న కొంగుతో, సైకిలు పైన దాటేసి వెళ్లింది. రాము చూపులు చక్రాల వేగంలో యిరుక్కొని పోయినాయి. ఆ సైకిలుని నిలుచున్న పాటున పడగొట్టాలనిపించింది. సైకిలు మళ్లిన సందులోకి వెళ్లాడు. సైకిలు కనపడలేదు. ఏదో పోగొట్టుకున్నవాడికి మల్లే సందును దిగులుగా కలియ జూశాడు. సందులో చీకట్లు అలముకొంటున్నాయి. కళ్లముందు మసక తెరల్ని ముంచుతున్నాయి. చీకట్లోకి వెళ్లడానికి మనస్సు ఒప్పుకోలేదు. తిరిగి హోటలుకు వెడితే బాగుండు ననిపించింది. నిలుచున్న పాటున తరిమివేసిన యజమాని ఆశ్రయమిస్తాడన్న నమ్మకం లేదు. ఎక్కడా తలదాచుకోవడానికి చోటు లేదన్న తలపుతో భయం వేసింది. ఆకలి వేస్తున్నది. తినడానికి ఏమైనా దొరికితే బాగుండు ననిపించింది. పోనీ చొక్కాలు అమ్ముకుంటే? చిరిగిన చొక్కాలు ఎవ్వరూ తీసుకోరనే అధైర్యం వెంటనే తగిలింది. బిచ్చమెత్తుకుంటే? హోటలు ముందు రోజూ బిచ్చమెత్తుకునే బిచ్చగాళ్ల దురవస్థ అతనికి వచ్చింది. వెళ్లగొట్టేముందు పని చేసిన జీతమైనా కట్టిస్తే బాగుండేది. రెండు సంవత్సరాలు చేసిన చాకిరీ అయినా యజమానికి గుర్తురాలేదు. ఎన్నడూ లేనిది ఈ మధ్యనే తిరగబడటం ఎక్కువైంది. కెలికి కయ్యం పెట్టుకోవాలని వుంటుంది. పట్నమంతా ఒకటే పనిగా తిరగాలని వుంటుంది. ఏమీ తోచక వచ్చిన దారి పట్టాడు. తాను తిరిగిన రోడ్డుపై దీపాలు పెట్టివున్నాయి. పైన ఆకాశం మబ్బులతో పచ్చిగర్భిణిలా వుంది. వాన వస్తుందన్న భయమేసి, వడివడిగా నడిచాడు. వంద అడుగులు వేశాడో లేదో చినుకులు ప్రారంభమైనాయి. రాము వెంటనే ఒక కొట్టు చూరు కిందికి చేరుకున్నాడు. కొట్టులోని దీపాల వెలుతురులో రకరకాల చీరెలు జిగేలు మంటున్నాయి. రంగుచీరలన్నింటిని కప్పుకొని, వాటి మెత్తదనాన్ని ఆనందిస్తూ ఆ కొట్టులోనే పడుకోవాలనిపించింది. కాని కొట్టువాడి లావుపాటి శరీరం చూచి భయమేసింది. వర్షం ఎక్కువవుతున్నది. ఆకలి కలవర పెడుతున్నది. కాని వానతెరల్లోంచి వీధి దీపాలు ముచ్చటగా కనబడుతున్నాయి. ఏ హోటల్‌కైనా వెళ్లి తిరిగి సర్వర్‌గా చేరితే? చీరెల కొట్టువాడు కొట్టు కట్టేసే సన్నాహంలో ఉన్నాడు. దూరాన ఎక్కడో ఒక కుక్క ఏడుస్తున్నది. ఆకలి వేసి కాబోలు. కుక్కమోస్తరు ఆకలికి మనిషి ఎందుకు ఏడ్వడు? అయినా ఈ అర్ధరాత్రి ఉద్యోగం ఎవరిస్తారని? తిరిగి తన హోటల్‌కి వెళ్లి ఏ సర్వర్నైనా పట్టెడన్నం కోసం బతిమాలడం మంచిదనిపించింది. యజమాని రాత్రిపూట హోటల్లో ఉండడు. కొట్టువాడు కొట్టు మూశాడు. కొట్టు ముందుభాగం గుడ్డి చీకటిలో మునిగింది. కొట్టువాడు కారెక్కి యింటికి వెళ్లిపోయాడు. వర్షం యింకా కురుస్తూనే వుంది. చలి ఎక్కువవుతున్నది. రాము చంకలోని చొక్కాలు తీసి ఒకదానిపైన ఒకటి తొడుక్కున్నాడు. వర్షం వెలిసే సూచన కనబడలేదు. రెండు గంటలయింది. ఆకలికి పేగులు అరుస్తున్నాయి. హోటల్‌కి వెళ్లటం అసాధ్యమనిపించింది. ఉన్న రెండు బట్టలు తడుపుకోవడానికి మనస్సు ఒప్పుకోలేదు. కొట్టుముందే ఆకలి పడక వేయడానికి నిశ్చయించుకున్నాడు. కప్పుకున్న ధోవతి తీసి కింద పరిచాడు. ఇంతలోకే తడుస్తూ ఒక కుక్కకూన కొట్టు కప్పుకిందికి పరుగెత్తుకొచ్చింది. దాన్ని వెళ్లగొట్టే ఉద్దేశంతో కడుపులో ఒక తన్ను తన్నాడు. కుంయిమని ఒకమాటు వెలుపలకు వెళ్లి, వానకి తిరిగి లోపలికి వచ్చింది. దాని అవస్థ చూచి జాలి వేసింది. తనకు ఎదురుగా వున్న మూలకి నక్కి పడుకుంది. చేసేదేమీ లేక, ధోవతి మీద మేను వాల్చాడు. మిగిలిన యింకొక ధోవతి కప్పుకున్నాడు. కళ్లు పొడుచుకున్నా నిద్ర రావడం లేదు. చలీ, ఆకలీ పోటీలు పడుతున్నాయి. వాటి తాకిడికి రోడ్డు దీపాల వంక చూస్తూ లొంగిపోతున్నాడు. జ్వరంతో శరీరం సలసల కాగుతున్నది. అయిదు, పది, యిరవై నిమిషాలు గడిచాయి. కుక్కకూన లేచి వచ్చి రాము పక్కలో పడుకుంది. రాము కుడి చెయ్యి అనాలోచితంగా కుక్కపైన పడి, దాని తల నిమరడం మొదలుపెట్టింది. కూన మరీ దగ్గరికి జరిగింది. రాము కళ్లు బరువుగా మూతలు పడ్డాయి. ఆడకోతి కిచకిచలు, రిక్షా చక్రాల గజ్జెలు, గాలిలో ఎగురుతున్న పమిటలు, అతని చెవుల్లో గలగలా మోగినై. కొట్లో కనిపించిన రంగురంగుల చీరెలు కప్పుకుంటూ నిద్రలో మునిగాడు. కొంతసేపటికి వాన వెలిసింది. కుక్కపిల్ల అతని చెయ్యి తప్పించుకుని తిరిగి వీధి కెక్కింది. భాస్కరభట్ల కృష్ణారావు (1918– 1966) కథ ‘నవ్వుల గజ్జెలు’కు సంక్షిప్త రూపం ఇది. వయసుకు వస్తున్న ఒక కుర్రాడి మానసిక అవస్థ ఇందులో చిత్రితమైంది. సౌజన్యం: తెలంగాణ సాహిత్య అకాడమీ వెలువరించిన ‘పరిసరాలు’. 1940–50 మధ్య వచ్చిన వివిధ రచయితల కథల్ని వట్టికోట ఆళ్వారుస్వామి రెండు సంపుటాలుగా వెలువరించారు. 1956లో దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించిన వీటిని ఒకే సంపుటంగా తె.సా.అ. గతేడాది తెచ్చింది. కథకుడు, నవలా రచయిత భాస్కరభట్ల ఆలిండియా రేడియోలో పనిచేశారు. కృష్ణారావు కథలు, చంద్రలోకానికి ప్రయాణం, వెన్నెల రాత్రి పేరుతో కథాసంపుటాలు వచ్చాయి. ‘వెల్లువలో పూచిక పుల్లలు’ ఆయనకు పేరుతెచ్చిన నవల. -
దేవుడికేం కావాలో!
జాక్ లండన్ ఆత్మలాలసత గురించి ఒక్క విషయం చెప్పవచ్చు. ‘‘నా యిష్టం’’ అన్నమాటకు తిరుగులేదని అతను ‘‘క్రూయిజ్ ఆఫ్ ద స్నార్క్’’లో రాశాడు. అతని ఆత్మీయులు అతని యిష్టానికి తలవగ్గవలిసి వచ్చేది, లేకపోతే ఆత్మీయులు కాకుండా పోవలసిందే. చాలామందికి అతనిలో ఉన్న ఈ గుణం నచ్చలేదు. అతని కెప్పుడూ బోలెడంతమంది శత్రువులుండేవారు. మన్యూంగీ అనే జపనీయుడొకడు జాక్ లండన్‌కు నౌకరుగా ఉండేవాడు. వాడిలో తన యజమానిపై చాలాకాలంగా కసి పేరుతూ ఉండి ఉండాలి. ఒకనాడు జాక్ లండన్ అనేకమంది అతిథుల మధ్య ఉన్న సమయంలో వాడు పళ్లెంలో పానీయాలు తెచ్చి, తన యజమాని ముందు వంగి, అతి వినయంగా, ‘‘దేవుడికి బీర్ కావాలా?’’ అని అడిగి కసి తీర్చుకున్నాడు. అతిథులు నివ్వెర పోయారు. జాక్ లండన్ జీవితం రచించిన అతని భార్య అతని అహంకారాన్ని ‘‘రాజోచితమైనది’’ అన్నది. (కొడవటిగంటి కుటుంబరావు తెలుగులోకి అనువదించిన జాక్ లండన్ ‘ప్రకృతి పిలుపు’ ముందుమాటలోంచి) - ఫ్రాంక్ లూథర్మాట్ -
తెలుగులో నవ్వే హోవార్డ్ రోర్క్
75 ఏళ్లుగా పాఠకులు చదువుతున్నారు. 20కి పైగా భాషలలోకి మార్చుకున్నారు. 70 లక్షల ప్రతులకు మించి కొన్నారు. కాలాలు దేశాలు దాటివచ్చిన పుస్తకం క్లాసిక్ కాక మరేమిటి? ఇందులో కథ కొన్ని ఏళ్లపాటు జరిగిన కథ. హీరో పాత్రకి 22 ఏళ్లుండగా మొదలౌతుంది. అతనికి సుమారుగా 40 ఏళ్లు వచ్చేదాకా నడుస్తుంది. 1943లో అచ్చయిన ఈ పుస్తకంలో హీరో హోవార్డ్ రోర్క్ పాత్ర 1936 నాటికే పుట్టింది. 1937 నాటికే అయిన్ రాండ్‌కు టూహీ పాత్ర గురించి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఎంత చిన్న పాత్ర అయినా సరే వాళ్లని రూపురేఖలు దుస్తులతో సహా ఊహించింది అయిన్ రాండ్. ఉదాహరణకు టూహీ అర్భకంగా ఉండటం కేవలం వైచిత్రి కోసం చేసిన కల్పన కాదు. అతని మానసిక వైఖరికి కారణాల్లో అర్భకత్వం ఒకటి. నేపథ్య చిత్రణ వాస్తవంగా లేకపోతే నవల సహజంగా పండదు. అందుచేత వాస్తవిక చిత్రణ కోసం ఆర్కిటెక్చర్ రంగం గురించి విస్తృతంగా అధ్యయనం చేసింది. ఒక సంవత్సరం పాటు ఒక ఆర్కిటెక్చర్ ఆఫీసులో ఉద్యోగం చేసింది. ఇది ఆమె శ్రద్ధ. ఇది ఆర్కిటెక్చర్ మీద పుస్తకం కాదు. కానీ చిత్రంగా ఈ నవలలో అయిన్ రాండ్ చేసిన ఊహలతో అమెరికన్ ఆర్కిటెక్చర్ రంగం ప్రభావితం అయిందంటున్నారు విశ్లేషకులు. అదీ ఆమె క్రియేటివిటీలోని లోతు మనిషి అంటే ఏమిటో చూపించడానికి ఇది రాయాలనుకుంది అయిన్ రాండ్. మనిషి ‘అయినవాడు’ ఏం కోరుకుంటాడో, ఏ రకంగా ఆ కోరికను తీర్చుకుంటాడో రాయడానికి పూనుకుంది. ‘మనిషి చైతన్యం సాధించే గెలుపుకి ఒక ఇతిహాసంగా, మనిషిలోని ‘నేను’కు ఒక ‘హిమ్’గా (ప్రశంసా గీతంగా, కీర్తనగా) ఈ నవలను తీర్చిదిద్దాలని ఆవిడ సంకల్పం. స్వార్థపరుడైన గొప్ప వ్యక్తి ఈ నవలలో హీరో. స్వార్థం అనేది తప్పు అని మనకు చెబుతూ వచ్చాయి మతాలు. అనేకమంది తత్వవేత్తలు కూడా స్వార్థ రాహిత్యం గొప్పదని బోధించారు. అయిన్ రాండ్ అదంతా తప్పు అంది. ఇంతవరకూ మనం స్వార్థమని భావిస్తున్నది ఎంత నిస్సా్వర్థమో అందువల్ల ఎంత నిస్సారమో చూపించింది. హోవార్డ్ రోర్క్ నిరుద్వేగి. దేనికీ కుంగిపోడు. దేనికీ ఉప్పొంగిపోడు. పోతపోసిన ఇనుము. అతని నిస్సందిగ్ధత మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఏ నిర్ణయంలోనూ పరాధీనత ఉండదు. అతనికి ప్రపంచంతో నిరంతర ఘర్షణ. కానీ తన లోలోపల పరిపూర్ణ శాంతి. ఘర్షణలో ఉంటూ అంతశ్శాంతిని నిలుపుకున్నవాళ్లు అరుదు. రోర్క్ ఎందరో మేధావులకి ప్రేరణగా నిలిచిన పాత్ర. అయిన్ రాండ్ తన ఫిలాసఫీని ఆబ్జెక్టివిజం పేరుతో ప్రకటించింది. విభేదించడానికి అయినా చదవాల్సిన రచయిత్రి. సోదర భాషల మధ్య ఫరవాలేదుకాని తెలుగు ఇంగ్లీషుల్లాగా రెండు ఏమాత్రం సంబంధం లేని భాషల మధ్య అనువాదం కష్టం. వీటిలో కర్త, కర్మ, క్రియల కూర్పు వేర్వేరు. జాతీయం వేరు. సంస్కృతి వేరు. అలవాట్లు వేరు. మర్యాదలు వేరు. వాళ్ల లివింగు రూములు, డ్రాయింగు రూములు, స్టడీ రూములు మనకు పరాయివి. అన్నింటినీ ‘తెలుగు చెయ్యడం’ కుదరదు. ఇంగ్లీషులో కన్నా తెలుగులో పదజాలం తక్కువ. అనేక అర్థచ్ఛాయల్ని ఇముడ్చుకున్న ఏకపదాలు ఇంగ్లీషులో ఉంటాయి. అంతవరకూ ఎందుకు, ఇంగ్లీషులో కామాలు, సెమీకోలన్లు, కోలన్లు, హైఫెన్లు కూడా అవిభాజ్యాలయిన భాషా భాగాలు. తెలుగులో వాటి వాడుకకు కచ్చితమైన వ్యవస్థ ఏర్పడలేదు. అవి అలా ఉండగా, అయిన్ రాండ్ నిర్దాక్షిణ్యంగా రాస్తుంది. ఎక్కడ ఏ పదం ఉచితం అనుకుంటే అక్కడ ఆ పదాన్ని నిస్సందేహంగా వాడుతుంది. ఆవిడ డిక్షన్ సామాన్యమయింది కాదు. ఆలోచనలో లోతెక్కువ. గాఢత సున్నితత్వం హెచ్చు. మెలికలు ఎక్కువ. పదక్లిష్టతని ఏ డిక్షనరీ సహాయంతోనో అధిగమిస్తాం. భావ క్లిష్టతని? సగటు పాఠకుడికి అర్థమయ్యేలా రాయమని ఒకరిద్దరు సూచించారు. రీ టెల్లింగులో సులభపరిచే స్వేచ్ఛ ఉంటుంది. కానీ లోతు పోతుంది. గొప్ప నవలని వట్టి కథ స్థాయికి దించకూడదు. కాబట్టి అనువాదమే దారి. ఎంత దులుపుదామన్నా ఈ తెలుగు పుస్తకానికి భాషరీత్యా కూడా కొద్దో గొప్పో ఇంగ్లీషు అంటుకునే ఉండిపోయింది. తెలుగు భాషకి ఉన్న పరిమితులే కాక నా భాషాజ్ఞానానికి ఉన్న పరిమితులు కూడా ఉంటాయి. ప్రయత్న లోపం మటుకు లేదు. - రెంటాల శ్రీవెంకటేశ్వరరావు -
పిల్లల పేర్ల కృతజ్ఞత
రావూరి భరద్వాజ (1927–2013) అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, రంపం లాగే పనివాడిగా, కొలిమి దగ్గర తిత్తులూదే కూలీగా, పేపర్ బాయ్‌గా ఎన్నో రకాల పనులు చేశారు. చదివింది ఏడవ తరగతే. పదిహేడో యేట మొదలుపెట్టి, కథానికలు, నవలలు, నవలికలు, కవితలు, వ్యాస సంపుటాలు, నాటికలు, స్మృతి సాహిత్యంతో కలిపి సుమారు 190 పుస్తకాలు రాశారు. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. ఆయన ప్రసిద్ధ నవల పాకుడు రాళ్లు. రావూరి తన ఇంటికి పెట్టుకున్న పేరు కాంతాలయం. ఆయన సహధర్మచారిణి కాంతం. కన్నబిడ్డలా చూసేది కాబట్టి భార్య అయినా ఆమెను ‘కాంతమ్మ’ అనే పిలిచేవారు. కష్ట సమయాల్లో అండగా నిలిచినవారికి రావూరి చూపిన కృతజ్ఞత గొప్పది. ఆయనకు అయిదుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వారికి పేర్లు ఎలా పెట్టారో ఆయన ఇలా చెప్పారు: ‘‘నాకు ప్రూఫ్‌రీడర్‌గా అవకాశం ఇచ్చిన ఆలపాటి రవీంద్రనాథ్ పేరును నా పెద్దకుమారుడికి రవీంద్రనాథ్‌గా పెట్టాను. ఆకాశవాణిలో ఉద్యోగం కల్పించిన త్రిపురనేని గోపీచంద్ పేరుని నా రెండోకొడుక్కి గోపీచంద్‌గా నామకరణం చేశాను. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని సమయంలో నాకూ నా కుటుంబానికీ ఉచితంగా వైద్యం చేసిన వైద్యుని పేరును నా మూడో కొడుక్కు బాలాజీగా పెట్టుకున్నాను. నా చిన్న కొడుక్కేమో మా నాన్న పేరు కలిసేలా కోటీశ్వరరావు అని నామకరణం చేశాను. మా తండ్రి పేరు కోటయ్య, తల్లి పేరు మల్లికాంబ. ఇక నా ఏకైక కుమార్తె పద్మ. ఆ పేరు వెనుక కూడా ఓ సంఘటన ఉంది. 1942–44 ప్రాంతంలో ఓ మూడు రోజుల పాటు అన్నంలేక నీరసించి స్పృహ తప్పి పడిపోయాను. అప్పుడు పద్మక్క అనే ఆవిడ నాకు అన్నం పెట్టింది. ‘బాబూ, మాది మాల కులం మీరు తింటారా?’ అని అడిగింది. ‘అదేం లేదమ్మా తప్పకుండా తింటాను’ అని చెప్పాను. వెంటనే ఇంటికి తీసుకెళ్లి ఓ గిన్నెలో అన్నం వేసి, పులుసు పోసింది. ఆ పులుసులో ఓ చేప కనిపించింది. అప్పుడన్నాను ‘అమ్మా నేను మాంసాహారం తినను’ అని. అప్పుడు తన కొడుక్కు పెట్టిన గిన్నెను నాకు ఇచ్చి, అందులో పాలు పోసి ‘ఇంట్లో కనీసం బెల్లం కూడా లేకపోయెనే’ అని నొచ్చుకుంటూ కొంచెం ఉప్పు వేసి పెట్టింది. ఆమె ఆప్యాయతకు గుర్తుగా నా కూతురికి పద్మ అని పేరు పెట్టుకున్నాను’’. డాక్టర్ పోతిరెడ్డి చెన్నకేశవులు -
ఒకరోజు ఎదురుచూపు
మేమింకా మంచంలోనే ఉన్నాం అప్పటికి. వాడు వస్తూనే గదిలోని కిటికీలన్నీ మూసేశాడు. అనారోగ్యంగా కనిపించాడు. ఒళ్లు వణుకుతోంది, ముఖం పాలిపోయివుంది. నడుస్తుంటే నొప్పిగా ఉన్నప్పటికీ నెమ్మదిగా అడుగులు వేశాడు.‘ఏమైంది షట్స్?’‘నాకు తలనొప్పిగా ఉంది.’‘నువ్వు కాసేపు పడుకుంటే బాగుంటుంది.’‘ఏం ఫర్లేదు.’‘నువ్వెళ్లి పడుకో. నేను డ్రెస్ మార్చుకుని వస్తాను.’కానీ నేను కిందికి దిగేప్పటికి వాడు డ్రెస్ చేసుకుని, మంట పక్కన కూర్చున్నాడు. తొమ్మిదేళ్ల పిల్లాడు జబ్బుతో నీరసంగా ఉన్నాడు. నుదుటి మీద చేయి వేస్తే జ్వరంగా ఉందని తెలుస్తోంది.‘కాసేపు పడుకో, నీకు బాలేదు’ అన్నాను.‘నాకు బానేవుంది’ అన్నాడు వాడు.డాక్టర్ వచ్చాక వాడి ఉష్ణోగ్రత చూశాడు.‘ఎంతుంది?’ అడిగాను.‘నూటా రెండు.’డాక్టర్ మూడు రంగుల్లో ఉన్న మూడు రకాల గోళీలు ఇచ్చి, ఎలా వేయాలో చెప్పాడు. ఒకటి జ్వరం తగ్గడానికి, ఇంకోటి విరేచనం సాఫీగా కావడానికి, మరొకటి కడుపులో మంట ఏమైనా ఉంటే పోవడానికి.కడుపులో ఆమ్లగుణం ఉన్నప్పుడే ఇన్‌ఫ్లూయెంజా క్రిములు బతుకుతాయని చెప్పాడు డాక్టర్. చూస్తుంటే ఆయనకు ఇన్‌ఫ్లూయెంజా గురించి సమస్తం తెలిసినట్టు అనిపించింది. జ్వరం నూటా నాలుగు డిగ్రీలకు మించనంతవరకు భయపడవలసింది ఏమీలేదన్నాడు.కొద్దికొద్దిగా వ్యాపిస్తున్న ఫ్లూ ఫలితం ఇది, నిమోనియా రాకుండా చూసుకుంటే ప్రమాదం ఏమీలేదు అన్నాడు. వాడి ఉష్ణోగ్రత ఎంతుందో నోట్ చేసి, ఏ మందు ఏ టైముకు వేసుకోవాలో రాసిపెట్టాను.‘నీకోసం నన్ను ఏదైనా చదవమంటావా?’ ‘నీ ఇష్టం’ అన్నాడు వాడు. వాడి ముఖం పాలిపోయివుంది, కళ్లకింద నల్లటి చారలు ఏర్పడ్డాయి. మంచం మీద పడుకున్నాడు. చుట్టూ జరుగుతున్నదానికి పట్టనట్టుగా కనబడ్డాడు. హొవార్డ్ పైల్ సముద్రపు దొంగల పుస్తకం గట్టిగా చదివాను. కానీ వాడు దానిమీద మనసు పెట్టి వింటున్నట్టు అనిపించలేదు.‘ఇప్పుడేమనిపిస్తోంది షట్స్’ అని అడిగాను.‘ఇందాకటిలాగే ఉంది’ అన్నాడు.వాడికి తరువాతి మాత్ర వేసే సమయం కోసం వేచి చూస్తూ, వాడి కాళ్ల దగ్గర కూర్చుని కాసేపు పుస్తకం నాది నేను చదువుకున్నాను. ఇట్లాంటి సమయంలో వాడు నిద్ర పోవడం సహజం. కానీ నేను మళ్లీ తలెత్తేప్పటికి వాడు నా వైపే వింతగా చూస్తూవున్నాడు.‘కొద్దిసేపు నిద్రపో నానా, నేను మందు వేసుకోవడానికి లేపుతాన్లే.’‘నేను పోను.’కాసేపుండి అన్నాడు నాతో, ‘నీకు విసుగ్గా వుంటే, నా దగ్గర కూర్చోనక్కర్లేదు నానా.’‘నాకెందుకు విసుగ్గా వుంటుందిరా?’‘అంటే, ఇబ్బందిగా ఉండేట్టయితే కూర్చోనక్కర్లేదు అంటున్నా.’జ్వరం వల్ల ఉండే చపలచిత్తంతో అట్లా మాట్లాడుతున్నాడేమో అనిపించి, వాడికి పదకొండింటికి వేయాల్సిన గోళీ వేసి, కాసేపు బయటికి వెళ్లాను.బయట తేటగా, చల్లగా ఉంది. నేల మీదంతా కురిసి గడ్డ కట్టుకుపోయిన సన్నటి మంచు వల్ల చెట్లు, పొదలు, కుప్పేసిన కలప మెరుపు పూత పూసినట్టుగా కనబడుతున్నాయి. నా ఐరిష్ సెట్టర్‌ను కూడా నడకకు తీసుకెళ్లాను. కాసేపు రోడ్డు మీదా, కాసేపు గడ్డకట్టిన కయ్య పక్కనా నడిచాం. కానీ దాని మీద నిలబడటానికిగానీ నడవడానికీ గానీ కష్టంగా ఉంది. ఎర్ర కుక్క తొట్రుపడింది, జారింది, రెండు సార్లు కింద పడింది, ఓసారి దెబ్బ గట్టిగానే తాకించుకుంది, ఇంకోసారి నా తుపాకీని కింద పడగొట్టి మంచు మీద జారుతూపోయేట్టు చేసింది. పొదల్లోంచి మేము ఓ పూరేళ్ల గుంపును లేవగొట్టి, అవి ఒడ్డు వెంబడి కనబడకుండా పోయేలోపల రెండింటిని వేటాడాం. గుంపులోంచి కొన్ని చెట్లమీదకు ఎక్కాయి, కొన్ని కట్టెల మండెల్లోకి మాయమైనాయి, కొన్ని పొదల్లోకి చెల్లాచెదురైనాయి. స్థిరంగా నిల్చోవడానికి కష్టంగా ఉండటంతో గురి కుదరలేదు. రెండింటిని కాల్చాం, ఐదింటి గురి తప్పాం. కానీ తిరిగి వస్తుండగా ఇంటికి దగ్గరలోనే మరో పూరేళ్ల గుంపు కనబడి సంతోషం వేసింది, మరో రోజు వెతకడానికి కావాల్సినన్ని మిగిలేవున్నాయి.ఇంటికెళ్లేసరికి పిల్లాడు ఎవరినీ గదిలోకి రావద్దు అన్నాడని తెలిసింది. ‘మీరెవరూ రావడానికి వీల్లేదు, నాకున్నది మీకూ అంటుకుంటుంది’ అన్నాడట.నేను పైకి వెళ్లేసరికి వాడిని ఎలా పడుకోబెట్టి వెళ్లానో అలాగే కదలకుండా ఉన్నాడు మంచంలో. అదే పాలిపోయిన ముఖం. చెంపలు మాత్రం జ్వరంతో ఎర్రబారివున్నాయి. రెప్పలు కదల్చకుండా మంచం కాళ్లవైపు చూస్తున్నాడు, ఇందాకటిలాగే. మరోసారి ఉష్ణోగ్రత చూశాను.‘ఎంతుంది?’‘నూటికి దగ్గర’ అన్నాను. నూటా రెండు పాయింట్ నాలుగు ఉంది.‘నూటా రెండు’ అన్నాడు వాడు.‘ఎవరన్నారు?’‘డాక్టర్.’‘మరీ ఎక్కువేమీ లేదు, భయపడనక్కర్లేదు.’‘నేనేం భయపడట్లేదు, కానీ మళ్లీ మళ్లీ అదే గుర్తుకు వస్తోంది’ అన్నాడు.‘ఎక్కువ ఆలోచించొద్దు, తేలిగ్గా తీసుకో’.‘నేను తేలిగ్గానే తీసుకుంటున్నాను’ అని నిటారుగా చూశాడు. దేన్నో నాకు తెలియకుండా వాడు దాస్తున్నాడు.‘ఇది వేసుకుని కొన్ని నీళ్లు తాగు.’‘దీని వల్ల నిజంగా నయం అవుతుందంటావా?’‘తప్పకుండా అవుతుంది.’నేను మళ్లీ మంచం మీద కూర్చుని, ఇందాకటి సముద్రపు దొంగలు పుస్తకం చదువుదామని చూశాను. కానీ వాడు దృష్టిపెట్టడం లేదని మానుకున్నాను.‘నేను ఏ టైము వరకు చచ్చిపోతానంటావ్?’ అడిగాడు వాడు.‘ఏంటి?’‘నేను చచ్చిపోవడానికి ఇంకా ఎంత సేపుంది?’ ‘నీకేమీ కాదు. ఏమైంది నీకు?’‘నాకు తెలుసు, నేను చచ్చిపోతాను. డాక్టర్ నూటా రెండు అని చెప్పడం నేను విన్నాను.’‘నూటా రెండు జ్వరానికి మనుషులు ఎవరూ చచ్చిపోరు. పిచ్చి మాటలు మాట్లాడకు.’‘నాకు తెలుసు, చచ్చిపోతారు. ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు మా స్కూల్లో నా స్నేహితులు అన్నారు, నలభై నాలుగు డిగ్రీలు దాటితే అంతేనట, మరి నాకుందేమో నూటా రెండు.’వాడు ఈ రోజంతా,పొద్దున తొమ్మిదింటినుంచీ ఎప్పుడు చచ్చిపోతానా అని ఎదురుచూస్తున్నాడు.‘ఒరే పిచ్చి కన్నా, నా పిచ్చి బంగారం. అది మైళ్లు, కిలోమీటర్ల లాంటిది. నువ్వు చనిపోవు. ఆ థర్మామీటర్ వేరే. దాన్లో ముప్పై ఏడు సాధారణం. ఇలాంటిదాన్లో తొంభై ఎనిమిది.’‘నిజంగానా?’‘నిజంరా. మైళ్లు, కిలోమీటర్ల లాగే. ఇప్పుడు చెప్పు, మన కార్లో డెబ్బై ప్రయాణించామంటే ఎన్ని కిలోమీటర్లు అవుతుంది?’‘ఓ’ అన్నాడు. నెమ్మదిగా మంచం కాళ్ల వైపు సారించిన వాడి చూపు తీక్షణత తగ్గింది, వాడి శరీరపు బిర్రు తగ్గింది. తెల్లారేసరికి పూర్తిగా మామూలైపోయాడు. ఏ ప్రాధాన్యతా లేని చిన్న చిన్న విషయాలకోసం కూడా మళ్లీ అల్లరి చేయడం మొదలుపెట్టాడు. -
రారండోయ్
తెలంగాణ సాహిత్య అకాడమీ ‘నవలా స్రవంతి’లో భాగంగా జూలై 12న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాలులో బి.ఎన్.శాస్త్రి చారిత్రక నవల ‘వాకాటక మహాదేవి’పై శ్రీరామోజు హరగోపాల్ ప్రసంగిస్తారు. తెలంగాణ చైతన్య సాహితి ఆవిర్భావ సభ జూలై 13న సాయంత్రం 4 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. మూడు వీచికలుగా జరిగే ఈ సభకు ముఖ్య అతిథి: దేశపతి శ్రీనివాస్. వక్తలు: పి.వేణుగోపాల స్వామి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి. కవి సమ్మేళనం ఉంటుంది. బొంత లచ్చారెడ్డి కావ్య కుసుమాలు, బాలబోధ, సులభ వ్యాకరణాల ఆవిష్కరణ జూలై 14న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. నిర్వహణ: పాలపిట్ట బుక్స్ కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత బెలగం భీమేశ్వరరావు అభినందనసభ జూలై 14న సాయంత్రం 6 గంటలకు విజయనగరంలోని గురజాడ గృహంలో జరగనుంది. నిర్వహణ: సహజ. చంద్రశేఖర్ ఇండ్ల కథల సంపుటి రంగుల చీకటి పరిచయ సభ జూలై 14న ఉదయం పదింటికి ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరగనుంది. తెలుగు సొసైటీ ఆఫ్ అమెరికా (తెల్సా) 21వ వార్షికోత్సవ సందర్భంగా కథ, నాటక పోటీ నిర్వహిస్తోంది. కథల మూడు బహుమతులు రూ.30 వేలు, 20 వేలు, 15 వేలు. నాటకాల రెండు బహుమతులు రూ.40 వేలు, 25 వేలు. రచనలను డిజిటల్ రూపంలో జూలై 31లోగా పంపాలి. మెయిల్: telsa.competitions @gmail.com. telsaworld.org జాగృతి వార పత్రిక వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ నిర్వహిస్తోంది. 1500 పదాల లోపు రాసిన కథలను ఆగస్టు 18 లోపు పంపాలి. మూడు బహుమతులు వరుసగా 12 వేలు, 7 వేలు, 5 వేలు. పత్రిక చిరునామాకు పోస్టులోగానీ jagriticometition@ gmail.comగానీ పంపొచ్చు. వివరాలకు: 9959997204 -
ఉనికి సైతం ఉత్త భ్రమే
‘నా ఉనికి సైతం ఉత్త భ్రమే’ అని తెలుసుకున్నాడు మసనోబు ఫుకుఓకా (1913–2008). ‘ఈ జనన మరణ చక్రాలలో పాల్గొని, అనుభూతి పొంది, ఆనందించగలిగితే అంతకు మించి సాధించాల్సిన అవసరం లేదు’ అనుకున్నాడు. తన ఆలోచనను ఆచరణలో రుజువు చేసుకోవడానికిగానూ నగరంలో చేస్తున్న ఉద్యోగం వదిలి సొంతవూరికి వెళ్లిపోయాడు. భూమిని దున్నకుండా, రసాయనిక ఎరువులు వేయకుండా ప్రకృతి వ్యవసాయాన్ని సాధన చేశాడు. ప్రకృతి దానికదే అన్నీ అమర్చి పెట్టిందని నమ్మి, దానిమీద ‘గెలిచి’ ఆ అమరిక చెదరగొట్టకుండా, దానితో సమన్వయంతో బతికేందుకు ప్రయత్నించాడు. ‘నేను కనుగొన్న విషయం చాలా విలువైనదయినంత మాత్రాన నాకేదో ప్రత్యేక విలువ ఉన్నట్లు కాదు’ అని ప్రకటించుకున్నాడు. ఆ ఆలోచనా ప్రయాణాన్ని వివరించే పుస్తకం జపనీస్ నుంచి ఇంగ్లిష్‌లోకి వన్ స్ట్రా రెవల్యూషన్‌గా 1978లో వచ్చింది. అది తెలుగులోకి గడ్డిపరకతో విప్లవంగా అనువాదమైంది. ఆ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఫుకుఓకా విద్యార్థి, సాధకుడు ల్యారీ కార్న్ ఇలా అంటారు: ‘తన సిద్ధాంతం ఏ మతంపైనా ఆధారపడి లేదని ఫుకుఓకా చెపుతారు. కానీ అతని బోధనా పద్ధతిపైనా, ఉపయోగించే పదజాలంపైనా జెన్, బౌద్ధం, టావోయిజమ్ల ప్రభావం బాగా ఉంది. అప్పుడప్పుడు అతను చెపుతున్న దానిని మరింత బాగా వివరించటానికో, చర్చను ప్రేరేపించటానికో బైబిల్ నుంచీ, క్రైస్తవ మతం నుంచీ ఉదాహరణలు ఇస్తుంటాడు. ‘వ్యక్తి ఆధ్యాత్మిక ఆరోగ్యం నుంచి ప్రకృతి సేద్యం పుట్టుకొస్తుందని ఫుకుఓకా నమ్మకం. భూమిని బాగుపరచటం, మానవ ఆత్మను ప్రక్షాళన చేయటం ఒకటేనని అతని అభిప్రాయం. ఆధ్యాత్మికంగా సంతృప్తికరమయిన జీవితానికి దారితీసే రోజువారీ పనులు ప్రపంచాన్ని సుందరంగా, అర్థవంతంగా మారుస్తాయని నిరూపించటమే అతను మనకిచ్చిన కానుక.’ దీనికే రాసిన ముందుమాటలో అమెరికా రచయిత, పర్యావరణ కార్యకర్త వెండెల్ బెర్రీ ఇలా వ్యాఖ్యానిస్తారు: ‘కేవలం వ్యవసాయం గురించే ఈ పుస్తకంలో ఉంటుందనుకొనే పాఠకులు ఆహారం గురించీ, ఆరోగ్యం గురించీ, సాంస్కృతిక విలువల గురించీ, మానవ జ్ఞాన పరిమితుల గురించీ కూడా ఇందులో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఈ పుస్తకంలోని తత్వసిద్ధాంతాల గురించి ఆ నోటా ఈ నోటా విన్న పాఠకులు దీంట్లో వరి, శీతాకాలపు పంటలు, పండ్లు, కూరగాయలు ఎలా పండించాలో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు.’ ‘ప్రగతి, పురోగమనం ఎందుకు సాధించాలి? సాధారణమయిన జీవితం గడుపుతూ అన్నిటినీ తేలికగా తీసుకోగలగటం కంటే మించినది మరేదయినా ఉందా?’ అని ప్రశ్నించే ఫుకుఓకా తత్వం ఈ హడావుడి లోకరీతికి పూర్తి భిన్నమైనది. పూర్తిగా కావాల్సినది కూడానేమో! -
ఉత్తరమే దీపం
వాళ్లిద్దరినీ చిదివి దీపం పెట్టవచ్చు. అంతముద్దు వస్తున్నారు. తలంటు పోసుకుని కొత్త చొక్కాలు తొడుక్కున్నారు. ‘‘నేనే– నేనే’’ ఏదో తమ్ముడు చెప్పబోతున్నాడు. ‘‘ఊ’’ ‘‘ఊ అంటే కాదే. వినవే–’’ ‘‘వింటున్నాగా చెప్పు.’’ ‘‘తలెత్తి వినాలి’’అక్క నవ్వింది. పెద్దాడబడుచు తను ఆ యింటికి. తనకు కోపం రారాదు. అమ్మ చెప్పింది ఆ మాట. అప్పటినుంచీ ‘జానకి’కి కోపం రాదు. కోపం వచ్చినా నవ్వేస్తుంది. ‘‘తలెత్తాను చెప్పు’’ ‘‘మనం మామయ్యగారింటికి వెళ్దామే’’ ‘‘దీనికేనా యింత చేశావ్?’’ నవ్వింది జానకి. తమ్ముడికి కోపం వచ్చింది. తమ్ముడు ఎలాగైనా మగబిడ్డ. మగబిడ్డలు కోపాన్నీ ప్రేమనూ అణుచుకోలేరు. ‘నే చెప్పను ఫో’ అన్నాడు. ‘‘మానాన్నే– చెప్పమ్మా. అల్లాగే వెళదాంలే,’’ అంది జానకి. తమ్ముడి బుగ్గలు పట్టుకు నిమిరింది. అంత కోపం వచ్చిన తమ్ముడూ ఫక్కున నవ్వాడు. ‘‘ఉత్తరమండోయ్’’ అంటూ పోస్టు జవాను వచ్చాడు. జానకి ఉత్తరం పుచ్చుకుంది. ‘నాన్నగారికి నేనే యిస్తా. ఉత్తరమండోయ్ అంటా. నాన్న నవ్వుతాడు’ అనుకుంది. పక్కయింటి పిల్లవాడు టపాకాయలు కాల్చడం మొదలెట్టాడు. జానకి నేరుగా తల్లి దగ్గిరికి వచ్చింది. ‘‘ఏం అమ్మా ఇల్లా వచ్చావు’’ అంది తల్లి. తల్లికి జానకి అంటే ఎంతో ఆపేక్ష. ‘‘టపాకాయలు ఇవ్వవూ’’ అంది జానకి. యింట్లో టపాకాయలు లేవు. దీపావళికి కొన్నవన్నీ జానకీ, తమ్ముడూ కాల్చేశారు. యివాళ అమ్మాయి పుట్టినరోజు. వచ్చేప్పుడు కాసిని పువ్వొత్తులూ టపాకాయలూ తెండని చెప్పింది భర్తతో. ‘‘వచ్చేప్పుడు తెస్తాలే’’ అని వెళ్లాడు ఆయన, ఆఫీసుకు పోతూ. ‘‘అమ్మా, అమ్మా’’ అంటూ వచ్చాడు బాబు. ‘‘టపాకాయలేవీ’’ అన్నాడు. తల్లి క్షణం ఊరుకుంది. బాబు దుడుకువాడు. జానకిలాగా చెప్తే వినడు. ‘‘అప్పచ్చులా?’’ అంది తల్లి. ‘‘కావే. టపాకాయలే. ఏవీ?’’ అన్నాడు బాబు. ‘‘సాయంత్రం కాందే.’’ ‘‘సాయంత్రం కావాలేమిటీ?’’ ‘‘చీకటి పడవద్దూ, కాల్చుకోడానికి?’’ ‘‘అన్నీ అబద్ధాలే–’’ ‘‘కావమ్మా. అక్కయ్య పుట్టినరోజు కదా యివాళ అబద్ధాలు చెప్తామ్మా?’’ ‘‘వాళ్లబ్బాయి కాల్చడంలా మరీ?’’ అన్నాడు బాబు. ‘‘అమ్మా, అమ్మా, ఉత్తరం వచ్చిందే–’’ అంది జానకి. ‘‘ఇలాతే. చూస్తా,’’ అంది తల్లి. ‘‘ఊహూ. నీకివ్వను. నాన్నగారేమన్నారు? ఇంకోళ్ల ఉత్తరాలు చూడకూడదనలా?’’ అంది జానకి. ‘‘మా అమ్మే’’ అని కూతుర్ని ఎత్తుకుని ముద్దెట్టుకుంది తల్లి. జేబులోంచి ఎక్కడ ఉత్తరం లాగుతుందో అని జాగ్రత్తగా జేబు దగ్గర చెయ్యి పెట్టుకుంది జానకి. ‘‘నన్నెత్తుకోమరి’’ అన్నాడు బాబు. తల్లి జానకిని దించింది. యింతలో పక్కయింట్లో టపాకాయల మోత బాగా వినబడటం మొదలెట్టింది. బాబు బిక్కమొహం వేశాడు. తల్లికి ఇదయింది. ‘‘నాన్నా, పరమాన్నం తిందాం...’’ అంది. ‘‘టపాకాయలు’’ అన్నాడు బాబు. ‘‘నాన్నగారు వచ్చాక, అక్కయ్యా, నువ్వూ కొనుక్కుందురు గాని’’ అంది. ‘‘మామయ్యో’’ హఠాత్తుగా మామయ్య ఏమిటో అర్థం కాలేదు ఆమెకు. మామయ్యగారింటికి పోదాం అంటూ తమ్ముడు అన్నమాటను జానకి తల్లికి చెప్పింది. ‘‘వెళ్దాంలే అమ్మా, వెళ్దాంలే’’ అంది తల్లి. ‘‘మామయ్య, మామయ్య’’ అంటూ బాబు కిందికి దిగాడు. టపాకాయల మాట కాస్త మరిచిపోయాడుగదా అని తల్లి సంతోషించింది. పిల్లలిద్దర్నీ పడమటింట్లోకి తీసుకుపోయింది. పరమాన్నం పెట్టింది. సాయంత్రం అయింది. వీధిలో దీపాలు వెలిగించారు. ‘‘నాన్న రాలా?’’ అడిగాడు బాబు. యింతసేపూ ఆగాడు. ఇక ఆగడు. పనిమనిషి చేత కొద్దిగా టపాకాయలూ అవీ తెప్పించింది. ‘‘ఎప్పుడొస్తాడే నాన్న’’ అంటూ మళ్లీ వచ్చాడు బాబు. తల్లి ఆకాశదీపం వెలిగిస్తోంది. ‘‘దణ్ణంపెట్టు బాబూ.’’ఇంతట్లో జానకి చక్కా వచ్చింది. అందరూ దణ్ణం పెట్టాక, దీపాన్ని తాటికి కట్టి ఆకాశానికి ఎత్తింది. దీపారాధన కాంగానే జానకి, తనలో తాననుకున్నట్లు ‘నాన్నా రాలా’ అంది. తల్లి నెమ్మదిగా దీపాలు వెలిగించింది. ఒక్కొక్కటీ వీధి వాకిలి దగ్గిర గూళ్లల్లో పెట్టింది. ఆయన యింకా యింటికి రాలేదు. ‘‘టపాకాయలు కాల్చుకోరూ’’ అంది. టపాకాయలు టపాకాయలు అంటూ బాబు గబగబా వస్తూ పడ్డాడు. దెబ్బ తగల్లేదు. వీపు రాచింది. నేలను కొట్టింది. బాబు ఏడుపు మానాడు. తెప్పించిన టపాకాయలు కాసినీ యిద్దరికీ యిచ్చింది. తనుగూడా గుమ్మంలో నుంచుంది. ఐపోయినై. ‘‘ఇంకా కాసిని’’ అన్నాడు బాబు. ‘‘పోనీ, నావి తీసుకోరా’’ అంది జానకి. జానకి పెద్దాడబడుచు. పెద్దాడబడుచు అంటే తల్లి అంత. ‘‘తే’’ అని, అవీ కాల్చేశాడు. ‘‘అన్నాలు తినరూ’’అంది ఆమె. ‘‘పువ్వొత్తులు కావాలి’’ అన్నాడు బాబు. జానకి తమ్ముణ్ణి సముదాయించింది. పిల్లలు అన్నాలు తిన్నారు. ఆయన యింకా రాలేదు. పిల్లలకు నిద్దరవొస్తోంది. జోగుతున్నారు. ‘‘ఇంతాలిస్యం చేశారేమి చెప్మా’’ అనుకుందామె. ‘‘అక్కడికీ వెళ్లేప్పుడు చెప్పాను గూడానూ’’ అనుకుంది మళ్లీ. వీధిలోకి చూసింది. రావడం లేదు. ‘‘ఎప్పుడొస్తారో ఏమో’’ అనుకుని పిల్లవాడి దగ్గిర పడుకుంది. నాన్నగారికి వుత్తరం యిస్తా అని నిద్ర మానుక్కూర్చున్న జానకి కూడా నిద్రపోయింది. వీధిలో పిల్లల మోత గూడా ఆగిపోయింది. అప్పుడు వచ్చాడు ఆయన. వస్తూనే ఉస్సూరుమన్నాడు. ‘‘పొద్దోయి వచ్చారేం?’’ అంది. అతను మాట్లాడలేదు. ‘‘సినీమాకు పోయారా?’’ అంది. తనూ, పిల్లలూ రాందే ఆయన పోడని తెలుసు. ఐనా అనాలని అంది. ‘‘అబ్బా లేదే’’ అన్నాడు ఆయన. చిరు చలికాలంలో గూడా ఆయనకు గొంతిక పొడి ఆరిపోయింది అప్పుడు. ‘‘మీరొస్తారు వస్తారని చూసి చూసి పిల్లలు యిప్పుడే పడుకున్నారు’’ అంది. ‘‘పాపం’’ అన్నాడు భర్త. ‘‘ఏం అల్లా వున్నారు?’’ ఏదో జరుగుతోందని తెలుసు. యింట్లో చెప్పడం దేనికని చెప్పలేదు. ‘‘నన్ను యివాళ పనిలోనుంచి తీసేశారు’’ అన్నాడు ఆయన. ఆమె ఏమీ మాట్లాడలేదు. ‘‘కాళ్లు కడుక్కోండి, భోజనం చేద్దురుగాని’’ అంది. అతడు కాళ్లు కడుక్కుంటున్నాడు. జానకి చప్పుడు విని లేచింది. ‘‘లెక్కంతా చూచి చెక్కు ఇచ్చారు’’ అన్నాడాయన. ‘‘నీకు ఉత్తరం వచ్చింది నాన్నా’’ అంటూ పక్కమీంచి లేచింది జానకి. ‘‘మీకేదో ఉత్తరం వచ్చిందిట. తనే ఇస్తానని నాకు చూపించనన్నా లేదు అది’’ అంది తల్లి. ‘‘ఏదమ్మా’’ అని తీసుకున్నాడు. దీపం దగ్గిరికి వచ్చి కవరు చింపి ఉత్తరం చదువుకున్నాడు. ‘‘ఎక్కణ్ణుంచండీ’’ అందామె. ‘‘మీ తమ్ముడు వ్రాసేడే, ఇదిగో వినూ’’ ‘‘బావకు నమస్కారాలు. అక్కయ్యను అడిగానని చెప్పండి. జానకికీ బాబుకూ నా ముద్దులు. ఇక్కడ నీకు మంచి ఉద్యోగం చూశాను బావా. అక్కడపడి ఎన్నాళ్లని బాధపడతావు? సెలవు పెట్టిరా. ఓ వేళ సెలవు ఇవ్వకపోతే– ఆ ఉద్యోగాన్ని తన్నేసి మరిరా. అన్నీ ఆలోచించే రాస్తున్నానిది. అందరం కలిసివుందాము. ఎక్కువ జీతం గూడాను. నా మాటవిని, ఒకసారి రా బావా.’’ ‘‘నేననుకుంటూనే ఉన్నా. అమ్మాయి పుట్టినరోజు ఇది. చెడు జరగలేదీరోజున. పోతే పోయిందిలెండి పాడు వుద్యోగం. రాత్రింబవళ్లూ రెక్కలు విరుచుకున్నా మెప్పు లేదు’’ ‘‘మామయ్య దగ్గిరికి పోదాం నాన్నా’’ అంది జానకి. ‘‘మాతల్లే’’ అని జానకిని ముద్దాడాడు తండ్రి. ‘‘మా తల్లి వుండగా చీకటా. నేను, మా అమ్మ, మా యింటికి. శరత్ పూర్ణిమ’’ అన్నాడు తండ్రి. -
నీవే నేను! నీవే నేను!
సాహిత్య మర్మరాలు ఒక రోజున సంస్కృత కవి దిగ్గజాలైన దండి, భవభూతి, కాళిదాసు– ముగ్గురూ రాజవీథిలో నడచి వెళుతూ ఉన్నారు. మాటల మధ్య ‘మన ముగ్గురిలో ఎవరు ఎవరి కంటే ఎంత గొప్పవారు?’ అన్న మాట వచ్చింది. ‘ఈ విషయాన్ని గురించి మనలో మనం మాట్లాడుకోవటమెందుకు? అమ్మవారినే అడుగుదాం రండి!‘ అన్నాడు కాళిదాసు. ముగ్గురూ దగ్గరలోనే ఉన్న సరస్వతీదేవి ఆలయానికి వెళ్లారు. కాళిదాసు అమ్మవారిని స్తుతించాడు. అమ్మ ప్రత్యక్షమైంది. కాళిదాసు భక్తిపురస్సరంగా ఆమెకు నమస్కారం చేసి ‘అమ్మా! మాలో ఎవరు గొప్పవారు?’ అని అడిగాడు. శారదాదేవి చిద్విలాసంగా నవ్వి, ‘కవిర్దండీ కవిర్దండీ, భవభూతిస్తు పండితః– దండి ముమ్మాటికీ మహాకవి. భవభూతి అచ్చమైన పండితుడు’ అన్నది. ఆ తీర్పును విన్న కాళిదాసు అపరిమితమైన ఆగ్రహంతో ‘కోహం రండే?– అట్లా ఐతే మరి నేనెవరినే?’ అని అడిగాడు. భారతీదేవి ప్రశాంతంగా నవ్వి, ‘త్వమేవాహం త్వమేవాహం న సంశయః – నాయనా! వీరిద్దరితో నీకు పోలిక ఎందుకోయీ? అతడు కవి. ఇతడు పండితుడు. నేను అరవై నాలుగు కళలకు అధిష్ఠాన దేవతను. నీవే నేను. నీవే నేను. ఇందులో సందేహ మెంత మాత్రమూ లేదు’ అన్నది. ఆ నిర్ణయాన్ని విన్న ఆ ముగ్గురు మహాకవులు అమ్మకు అంజలి ఘటించారు. దండి, భవభూతి, కాళిదాసులకు సంబంధించి ప్రచారంలో ఉన్న వృత్తాంత మిది. -డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణ మూర్తి -
లెక్కలు రావా?
అతిగా అలంకరించుకొని తన వయసును మరుగు పరచాలని తాపత్రయపడే ఓ వన్నెలాడి బెర్నార్డ్ షాని ఒక విందులో చూసి ఆయన్ని సమీపించింది. ‘‘మిస్టర్ షా! సరదాగా నా వయసు ఎంత ఉంటుందో చెప్పండి చూద్దాం’’ అంది వయ్యారం ఒలకబోస్తూ. షా ఆమెను ఎగాదిగా చూస్తూ, ‘‘మీ పలువరుస చూస్తే మీ వయసు పద్దెనిమిది ఉండొచ్చు. మీ ఉంగరాల ముంగురులు చూస్తే పంతొమ్మిదనిపిస్తోంది. కాని మీ ప్రవర్తన చూస్తుంటే మాత్రం పద్నాలుగు దాటవేమో అనిపిస్తున్నది’’ అని జవాబిచ్చాడు. ఆ మాటలు విని తబ్బిబ్బవుతూ ‘‘మీ ప్రశంసకి ధన్యవాదాలు. ఇంతకీ మీ దృష్టిలో నా వయసెంతో కచ్చితంగా చెప్పలేదు’’ అంది విలాసంగా. ‘‘ఏముంది? నేను చెప్పిన మూడంకెలూ కలుపుకుంటే నా దృష్టిలో నీ వయసెంతో తెలుస్తుంది’’ అన్నాడు కొంటెగా. ఆ వన్నెలాడి ముఖం కందగడ్డయి పోయింది. – ఈదుపల్లి వెంకటేశ్వరరావు -
ఉత్తమ లేఖకుడు
ఆంధ్రమహాభారతంలోని 18 పర్వాలలో 15 పర్వాలను రచించిన ‘కవిబ్రహ్మ’ తిక్కన సోమయాజికి గురునాథుడు లేఖకుడు. తిక్కన ఆశువుగా పద్యాలను చెప్తూవుంటే గురునాథుడు తాటాకుల మీద రాస్తూ ఉంటాడన్నమాట. ఒక సందర్భంలో తొమ్మిదవ పర్వమైన శల్యపర్వ రచన జరుగుతున్నది. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల పక్షాన ఉన్న వీరులు చాలామంది మరణించారు. దుర్యోధనుడు ఒంటరివాడైనాడు. ధృతరాష్ట్రుడికి సంజయుడు ఈ విషయాన్ని చెప్తూ– పలపలని మూకలో కాల్/ నిలువక గుర్రంబు డిగ్గి నీ కొడుకు గదా/ కలిత భుజుండై ఒక్కడు/ తొలగి చనియె’(నీ కుమారుడైన దుర్యోధనుడు పల్చబడిపోయిన సైన్యంలో నిలిచి ఉండలేక తన గుర్రం నుండి దిగి, గదను భుజాన పెట్టుకొని రణరంగం నుండి బయటకు వెళ్లిపోయాడు) అంటాడు. ఇది కంద పద్యం. మూడు పాదాలు ఐపోయినై. నాలుగవ పాదంలో ఉండవలసిన ఐదు గణాలలో ఇంకా మూడు గణాలు రావలసి ఉన్నది. వాక్యం మాత్రం పూర్తి ఐంది కనుక ‘ఏమి చెబుదామా?’ అని ఆలోచిస్తూ– ‘ఏమి చెప్పుదుం గురునాథా’ అన్నాడు తిక్కన పరాకుగా. ‘బాగుంది. తర్వాత పద్యం చెప్పండి’ అన్నాడు గురునాథుడు. ‘పద్యం పూర్తి కాకుండానేనా?’ అన్నాడు తిక్కన. గురునాథుడు విస్తుబోయి ‘కురునాథా (ఓ ధృతరాష్ట్ర మహారాజా)! ఏమి చెప్పుదున్ (ఏమని చెప్పేది?) అని మీరే చెప్పారు కదా! నాలుగవ పాదం పూర్తి ఐంది. యతి కూడా సరిపోయింది’ అన్నాడు. లేఖకోత్తముడైన గురునాథుడి తెలివిని మెచ్చుకొంటూ తర్వాతి వచనాన్ని ప్రారంభించాడు తిక్కన. కురునాథుడు సంధి వలన గురునాథుడు కావటమూ, అది లేఖకుడి పేరు కావటమూ ఈ సందర్భంలోని విశేషం! -డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి -
అన్నంభట్టును ఇవతలకు తెండి!
సాహిత్య మరమరాలు తర్కసంగ్రహం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించిన ‘మహామహోపాధ్యాయ’ అన్నంభట్టు క్రీ.శ. 17వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించాడు. ఆయన గొప్ప శాస్త్రకారుడు మాత్రమే కాదు, ఆచారపరుడు కూడా! ఆయన ఆ గ్రంథం మొత్తాన్నీ మడి కట్టుకొనే రచించాడు. ఒకరోజున గ్రంథరచన పూర్తి ఐంది. కవి వివరాలను తెలిపే ముగింపు శ్లోకాన్ని వ్రాయవలసి ఉన్నది. ఆయనకు ‘విదుషాన్నంభట్టేన’– పండితుడైన అన్నంభట్టుచే రచించబడిన అనే ఆలోచన వచ్చింది. బాగానే ఉన్నది కానీ అది అనుష్టుప్పు శ్లోకం కనుక, ప్రతి పాదంలోనూ ఎనిమిది అక్షరాలు ఉండాలి. అన్నంభట్టు వ్రాయాలనుకొన్న పాదంలో ఏడు అక్షరాలు మాత్రమే ఉన్నై. ఆ ఎనిమిదవ అక్షరం కోసం నానా తంటాలు పడుతున్నాడు. అంతటి మహాకవికి కూడా గంటలు గడుస్తున్నై కానీ సరియైన రీతి దొరకటం లేదు. ఇంట్లో ఆ పని మీద, ఈ పని మీద అటుగా వచ్చి వెళుతున్న అతని భార్య ఈ పరిస్థితిని చూసింది. ‘సంగతేమిటండీ?’ అని అడిగింది. చెప్పాడు. ఆమె చిరునవ్వు నవ్వింది. ‘దీని కింత ఆలోచన ఎందుకండి? ఆ వైపున ఉన్న అన్నంభట్టును ఈ వైపునకు తీసుకొనిరండి!’ అన్నది. అన్నంభట్టు చూశాడు. తను వ్రాయాలనుకొన్న ‘విదుషాన్నంభట్టేన’ ఇప్పుడు ‘అన్నంభట్టేన విదుషా’ ఐంది. ఎనిమిది అక్షరాలూ సరిపోయినై. భార్య వైపు కృతజ్ఞతగా చూశాడు. - డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి -
నవల రాయడం పెళ్లి లాంటిది
గ్రేట్ రైటర్ హీబ్రూ నుంచి అత్యధికంగా అనువాదమైన రచయితల్లో మొదట చెప్పగలిగే పేరు ఏమస్ ఓజ్. ఇజ్రాయెల్‌కు వలస వచ్చిన లేదా మూలాలను వెతుక్కుంటూ తిరిగి వచ్చిన యూదు తల్లిదండ్రులకు 1939లో జన్మించాడు. అతడి పన్నెండో ఏట తల్లి డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మీద ఒక తిరుగుబాటుగా సామూహిక వ్యవసాయ క్షేత్రాలైన కిబుట్స్‌కు వెళ్లిపోయాడు. అక్కడే జీవితంలో చాలాభాగం గడిపాడు. ఓజ్ అంటే స్ట్రెంత్. తన బలం రాయడంలో ఉందని గ్రహించిన తర్వాత రాయడాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. నవలలు, కథలు, వ్యాసాలు విరివిగా రాశాడు. కవిత రాయడమంటే ఎఫైర్– వన్ నైట్ స్టాండ్ లాంటిదనీ, కథ రాయడం రొమాన్స్– ఒక బంధం, కానీ నవల రాయడమంటే పెళ్లి చేసుకోవడం– దానికోసం త్యాగాలు చేయాలి, రాజీ పడాలీ అంటాడు. తనతో తాను నూటికి నూరు శాతం ఏకీభవించే అంశాలైతే, అలా అరుదుగా జరిగినప్పటికీ, వాటిని వ్యాసాలుగా రాస్తాననీ; ఒక అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయదలిచినప్పుడు కథకుగానీ నవలకుగానీ పూనుకుంటాననీ చెబుతాడు. అలాగని రచయితేమీ దేవుడు కాదు, ఎలాగైనా పాత్రల్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ పోవడానికి; ఒకసారంటూ వాటికి ప్రాణం పోశాక వాటిని రచయితైనా నిలువరించలేడని చెబుతాడు. ఇజ్రాయెల్‌లో జన్మించినవాడిగా వాస్తవం నుంచి పారిపోలేననీ, ఒక అన్యాయం పట్ల తిరుగుబాటుగా తాను రాస్తాననీ అంటాడు. తక్కువ విస్తృతి ఉన్నప్పటికీ హీబ్రూలోనే రాయడానికి కారణం, అది తాను నవ్వే, శపించే, కలలుగనే భాష కాబట్టి, అంటాడు. ఒకవేళ దేశం వదిలి పెట్టాల్సివచ్చినా భాషను వదులుకోనని చెబుతాడు. ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణను న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న న్యాయ పోరాటంగా చూస్తాడు. అదే ట్రాజెడీ అనీ, ఇద్దరూ భూమిని పంచుకుని పరస్పరం సహకరించుకోవడం మినహా మార్గం లేదనీ చెబుతాడు. పీస్ నౌ మూవ్మెంట్ ఆద్యుల్లో ఒకడైన ఏమస్ ఓజ్ మొన్న 2018 డిసెంబర్ 28న మరణించాడు.