ఉత్తరమే దీపం | Janaki Birthday On Diwali Festival | Sakshi
Sakshi News home page

ఉత్తరమే దీపం

Published Mon, Jul 8 2019 2:50 AM | Last Updated on Mon, Jul 8 2019 2:50 AM

Janaki Birthday On Diwali Festival - Sakshi

వాళ్లిద్దరినీ చిదివి దీపం పెట్టవచ్చు. అంతముద్దు వస్తున్నారు. తలంటు పోసుకుని కొత్త చొక్కాలు తొడుక్కున్నారు.  ‘‘నేనే– నేనే’’ ఏదో తమ్ముడు చెప్పబోతున్నాడు. ‘‘ఊ’’ ‘‘ఊ అంటే కాదే. వినవే–’’ ‘‘వింటున్నాగా చెప్పు.’’ ‘‘తలెత్తి వినాలి’’అక్క నవ్వింది. పెద్దాడబడుచు తను ఆ యింటికి. తనకు కోపం రారాదు. అమ్మ చెప్పింది ఆ మాట. అప్పటినుంచీ ‘జానకి’కి కోపం రాదు. కోపం వచ్చినా నవ్వేస్తుంది.
‘‘తలెత్తాను చెప్పు’’ ‘‘మనం మామయ్యగారింటికి వెళ్దామే’’ ‘‘దీనికేనా యింత చేశావ్‌?’’ నవ్వింది జానకి. తమ్ముడికి కోపం వచ్చింది. తమ్ముడు ఎలాగైనా మగబిడ్డ. మగబిడ్డలు కోపాన్నీ ప్రేమనూ అణుచుకోలేరు. ‘నే చెప్పను ఫో’ అన్నాడు. ‘‘మానాన్నే– చెప్పమ్మా. అల్లాగే వెళదాంలే,’’ అంది జానకి. తమ్ముడి బుగ్గలు పట్టుకు నిమిరింది. అంత కోపం వచ్చిన తమ్ముడూ ఫక్కున నవ్వాడు. ‘‘ఉత్తరమండోయ్‌’’ అంటూ పోస్టు జవాను వచ్చాడు. జానకి ఉత్తరం పుచ్చుకుంది. ‘నాన్నగారికి నేనే యిస్తా. ఉత్తరమండోయ్‌ అంటా. నాన్న నవ్వుతాడు’ అనుకుంది. పక్కయింటి పిల్లవాడు టపాకాయలు కాల్చడం మొదలెట్టాడు. జానకి నేరుగా తల్లి దగ్గిరికి వచ్చింది. ‘‘ఏం అమ్మా ఇల్లా వచ్చావు’’ అంది తల్లి. తల్లికి జానకి అంటే ఎంతో ఆపేక్ష. ‘‘టపాకాయలు ఇవ్వవూ’’ అంది జానకి. యింట్లో టపాకాయలు లేవు. దీపావళికి కొన్నవన్నీ జానకీ, తమ్ముడూ కాల్చేశారు. యివాళ అమ్మాయి పుట్టినరోజు. వచ్చేప్పుడు కాసిని పువ్వొత్తులూ టపాకాయలూ తెండని చెప్పింది భర్తతో.

‘‘వచ్చేప్పుడు తెస్తాలే’’ అని వెళ్లాడు ఆయన, ఆఫీసుకు పోతూ. ‘‘అమ్మా, అమ్మా’’ అంటూ వచ్చాడు బాబు. ‘‘టపాకాయలేవీ’’ అన్నాడు. తల్లి క్షణం ఊరుకుంది. బాబు దుడుకువాడు. జానకిలాగా చెప్తే వినడు. ‘‘అప్పచ్చులా?’’ అంది తల్లి. ‘‘కావే. టపాకాయలే. ఏవీ?’’ అన్నాడు బాబు. ‘‘సాయంత్రం కాందే.’’ ‘‘సాయంత్రం కావాలేమిటీ?’’ ‘‘చీకటి పడవద్దూ, కాల్చుకోడానికి?’’ ‘‘అన్నీ అబద్ధాలే–’’ ‘‘కావమ్మా. అక్కయ్య పుట్టినరోజు కదా యివాళ అబద్ధాలు చెప్తామ్మా?’’  ‘‘వాళ్లబ్బాయి కాల్చడంలా మరీ?’’ అన్నాడు బాబు. ‘‘అమ్మా, అమ్మా, ఉత్తరం వచ్చిందే–’’ అంది జానకి. ‘‘ఇలాతే. చూస్తా,’’ అంది తల్లి. ‘‘ఊహూ. నీకివ్వను. నాన్నగారేమన్నారు? ఇంకోళ్ల ఉత్తరాలు చూడకూడదనలా?’’ అంది జానకి. ‘‘మా అమ్మే’’ అని కూతుర్ని ఎత్తుకుని ముద్దెట్టుకుంది తల్లి. జేబులోంచి ఎక్కడ ఉత్తరం లాగుతుందో అని జాగ్రత్తగా జేబు దగ్గర చెయ్యి పెట్టుకుంది జానకి. ‘‘నన్నెత్తుకోమరి’’ అన్నాడు బాబు. తల్లి జానకిని దించింది. యింతలో పక్కయింట్లో టపాకాయల మోత బాగా వినబడటం మొదలెట్టింది. బాబు బిక్కమొహం వేశాడు. తల్లికి ఇదయింది. ‘‘నాన్నా, పరమాన్నం తిందాం...’’ అంది. ‘‘టపాకాయలు’’ అన్నాడు బాబు. ‘‘నాన్నగారు వచ్చాక, అక్కయ్యా, నువ్వూ కొనుక్కుందురు గాని’’ అంది. ‘‘మామయ్యో’’ హఠాత్తుగా మామయ్య ఏమిటో అర్థం కాలేదు ఆమెకు. మామయ్యగారింటికి పోదాం అంటూ తమ్ముడు అన్నమాటను జానకి తల్లికి చెప్పింది. ‘‘వెళ్దాంలే అమ్మా, వెళ్దాంలే’’ అంది తల్లి. ‘‘మామయ్య, మామయ్య’’ అంటూ బాబు కిందికి దిగాడు.

టపాకాయల మాట కాస్త మరిచిపోయాడుగదా అని తల్లి సంతోషించింది. పిల్లలిద్దర్నీ పడమటింట్లోకి తీసుకుపోయింది. పరమాన్నం పెట్టింది. సాయంత్రం అయింది. వీధిలో దీపాలు వెలిగించారు. ‘‘నాన్న రాలా?’’ అడిగాడు బాబు. యింతసేపూ ఆగాడు. ఇక ఆగడు. పనిమనిషి చేత కొద్దిగా టపాకాయలూ అవీ తెప్పించింది. ‘‘ఎప్పుడొస్తాడే నాన్న’’ అంటూ మళ్లీ వచ్చాడు బాబు. తల్లి ఆకాశదీపం వెలిగిస్తోంది. ‘‘దణ్ణంపెట్టు బాబూ.’’ఇంతట్లో జానకి చక్కా వచ్చింది. అందరూ దణ్ణం పెట్టాక, దీపాన్ని తాటికి కట్టి ఆకాశానికి ఎత్తింది. దీపారాధన కాంగానే జానకి, తనలో తాననుకున్నట్లు ‘నాన్నా రాలా’ అంది. తల్లి నెమ్మదిగా దీపాలు వెలిగించింది. ఒక్కొక్కటీ వీధి వాకిలి దగ్గిర గూళ్లల్లో పెట్టింది. ఆయన యింకా యింటికి రాలేదు. ‘‘టపాకాయలు కాల్చుకోరూ’’ అంది. టపాకాయలు టపాకాయలు అంటూ బాబు గబగబా వస్తూ పడ్డాడు. దెబ్బ తగల్లేదు. వీపు రాచింది. నేలను కొట్టింది. బాబు ఏడుపు మానాడు. తెప్పించిన టపాకాయలు కాసినీ యిద్దరికీ యిచ్చింది. తనుగూడా గుమ్మంలో నుంచుంది. ఐపోయినై. ‘‘ఇంకా కాసిని’’ అన్నాడు బాబు. ‘‘పోనీ, నావి తీసుకోరా’’ అంది జానకి. జానకి పెద్దాడబడుచు. పెద్దాడబడుచు అంటే తల్లి అంత.

‘‘తే’’ అని, అవీ కాల్చేశాడు. ‘‘అన్నాలు తినరూ’’అంది ఆమె. ‘‘పువ్వొత్తులు కావాలి’’ అన్నాడు బాబు. జానకి తమ్ముణ్ణి సముదాయించింది. పిల్లలు అన్నాలు తిన్నారు. ఆయన యింకా రాలేదు. పిల్లలకు నిద్దరవొస్తోంది. జోగుతున్నారు. ‘‘ఇంతాలిస్యం చేశారేమి చెప్మా’’ అనుకుందామె. ‘‘అక్కడికీ వెళ్లేప్పుడు చెప్పాను గూడానూ’’ అనుకుంది మళ్లీ. వీధిలోకి చూసింది. రావడం లేదు. ‘‘ఎప్పుడొస్తారో ఏమో’’ అనుకుని పిల్లవాడి దగ్గిర పడుకుంది. నాన్నగారికి వుత్తరం యిస్తా అని నిద్ర మానుక్కూర్చున్న జానకి కూడా నిద్రపోయింది. వీధిలో పిల్లల మోత గూడా ఆగిపోయింది. అప్పుడు వచ్చాడు ఆయన. వస్తూనే ఉస్సూరుమన్నాడు. ‘‘పొద్దోయి వచ్చారేం?’’ అంది. అతను మాట్లాడలేదు. ‘‘సినీమాకు పోయారా?’’ అంది. తనూ, పిల్లలూ రాందే ఆయన పోడని తెలుసు. ఐనా అనాలని అంది. ‘‘అబ్బా లేదే’’ అన్నాడు ఆయన. చిరు చలికాలంలో గూడా ఆయనకు గొంతిక పొడి ఆరిపోయింది అప్పుడు. ‘‘మీరొస్తారు వస్తారని చూసి చూసి పిల్లలు యిప్పుడే పడుకున్నారు’’ అంది. ‘‘పాపం’’ అన్నాడు భర్త. ‘‘ఏం అల్లా వున్నారు?’’ ఏదో జరుగుతోందని తెలుసు. యింట్లో చెప్పడం దేనికని చెప్పలేదు. ‘‘నన్ను యివాళ పనిలోనుంచి తీసేశారు’’ అన్నాడు ఆయన. ఆమె ఏమీ మాట్లాడలేదు. ‘‘కాళ్లు కడుక్కోండి, భోజనం చేద్దురుగాని’’ అంది. అతడు కాళ్లు కడుక్కుంటున్నాడు. జానకి చప్పుడు విని లేచింది. ‘‘లెక్కంతా చూచి చెక్కు ఇచ్చారు’’ అన్నాడాయన. ‘‘నీకు ఉత్తరం వచ్చింది నాన్నా’’ అంటూ పక్కమీంచి లేచింది జానకి. ‘‘మీకేదో ఉత్తరం వచ్చిందిట. తనే ఇస్తానని నాకు చూపించనన్నా లేదు అది’’ అంది తల్లి. ‘‘ఏదమ్మా’’ అని తీసుకున్నాడు. దీపం దగ్గిరికి వచ్చి కవరు చింపి ఉత్తరం చదువుకున్నాడు.

‘‘ఎక్కణ్ణుంచండీ’’ అందామె. ‘‘మీ తమ్ముడు వ్రాసేడే, ఇదిగో వినూ’’ ‘‘బావకు నమస్కారాలు. అక్కయ్యను అడిగానని చెప్పండి. జానకికీ బాబుకూ నా ముద్దులు. ఇక్కడ నీకు మంచి ఉద్యోగం చూశాను బావా. అక్కడపడి ఎన్నాళ్లని బాధపడతావు? సెలవు పెట్టిరా. ఓ వేళ సెలవు ఇవ్వకపోతే– ఆ ఉద్యోగాన్ని తన్నేసి మరిరా. అన్నీ ఆలోచించే రాస్తున్నానిది. అందరం కలిసివుందాము. ఎక్కువ జీతం గూడాను. నా మాటవిని, ఒకసారి రా బావా.’’ ‘‘నేననుకుంటూనే ఉన్నా. అమ్మాయి పుట్టినరోజు ఇది. చెడు జరగలేదీరోజున. పోతే పోయిందిలెండి పాడు వుద్యోగం. రాత్రింబవళ్లూ రెక్కలు విరుచుకున్నా మెప్పు లేదు’’ ‘‘మామయ్య దగ్గిరికి పోదాం నాన్నా’’ అంది జానకి. ‘‘మాతల్లే’’ అని జానకిని ముద్దాడాడు తండ్రి. ‘‘మా తల్లి వుండగా చీకటా. నేను, మా అమ్మ, మా యింటికి. శరత్‌ పూర్ణిమ’’ అన్నాడు తండ్రి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement