సాహిత్యం హృదయ వ్యాపారం | rachamallu ramachandra reddy birth anniversary | Sakshi
Sakshi News home page

సాహిత్యం హృదయ వ్యాపారం

Published Mon, Feb 22 2016 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా)

రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా)

ఫిబ్రవరి 28న రారా జయంతి

‘‘సాహిత్యం సంపూర్ణంగా హృదయ వ్యాపారం. విమర్శ మేధా వ్యాపారం. అయితే సాహిత్యాన్ని ముందు హృదయంతో ఆస్వాదించి, తరువాత మేధతో పరిశీలించేవాడే ఉత్తమ విమర్శకుడౌతాడు. ఆధ్యాత్మికవాదమూ, ప్రతీకవాదమూ, అస్తిత్వవాదమూ మొదలైన వాదాలెన్నివున్నా అవి సాహిత్య విమర్శకు సమగ్రతను చేకూర్చలేవు. మానవతావాదమొక్కటే నిజమైన సాహిత్యవాదం’’- ఈ వాక్యాలు ఉత్తమ సాహిత్య విమర్శకుడి గురించి, ఉత్తమ సాహిత్య లక్ష్యం గురించి రాచమల్లు రామచంద్రారెడ్డి(రారా) దృక్పథం.
 

 వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడమూ, ఉన్నత జీవనవిధానానికి మార్గం చూపించడమూ, ఉత్తమ హృదయ సంస్కారానికి ప్రేరణ యివ్వడమూ సాహిత్య లక్ష్యాలుగా చలామణి కావడం లేదు. యిట్టి స్థితిలో విస్మరణవాద సాహిత్యానికి అడ్డుకట్ట వేయకపోతే కలిగే ఉపద్రవాన్ని పసిగట్టిన రారా, తెలుగు పాఠకులు, పత్రికలు పనిగట్టుకుని మోసే అనాగరిక, ఆటవిక అథోస్థాయి సాహిత్యాన్ని తన కత్తివాదర లాంటి శైలితోనూ, రాజీలేని మార్క్కిస్ట్ నిబద్ధతతోనూ తుత్తునియలు చేశాడు. ‘సమాజంలోంచి పుట్టే సాహిత్యానికి గమ్యస్థానం కూడా సమాజమే’ కావాలని తపించిన వ్యక్తి రారా.
 

 మంచి సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్యం రావాలి, మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ రావాలి. అందుకే రారా మార్క్స్ సిద్ధాంతాన్ని సాహిత్యానికి అన్వయించి చూపి, సాహిత్యానికి గల సమాజాన్ని మార్చే శక్తిని విశదీకరించినాడు.
 

 రారా కథకుడిగా కన్ను తెరిచినప్పటికీ, విమర్శకుడిగానే సాహితీలోకానికి సుపరిచితుడు. చాలామంది సమీక్ష వేరు, విమర్శ వేరు అనుకొంటుంటారు. ఈ సాంప్రదాయాన్ని మార్చి, పుస్తక సమీక్షల స్థాయిని పెంచి వాటిని గొప్ప విమర్శలుగా చేసిన ఘనత రారాతోనే మొదలైంది. ఒక రచనను విమర్శించేటపుడు ఆ రచయిత సాహిత్య జీవితాన్నంతటినీ ప్రస్తావించవచ్చుగానీ, అతని సాహిత్యేతర జీవితాన్ని ప్రస్తావిస్తే అది అక్రమమైన వ్యక్తిగత విమర్శ అవుతుందని రారా అభిప్రాయం. అలాగే గ్రంథ రచయిత ఎంతటివాడైనా, చివరకు తనతో స్నేహ బంధుత్వాలు కలిగివున్నా ఆ ప్రభావం గ్రంథవిమర్శ మీద పడకూడదనేది కూడా ఆయన అభిప్రాయం. అంతేగాక అకడమిక్‌గా చదువుకొని ఆ సూత్రాల చట్రంలో సాహిత్య విమర్శ చేస్తే, అది ‘అకడమిక్ విమర్శ’ అవుతుందనీ, గాఢమైన సాహిత్యాభిరుచి వున్నపుడే అతడు గొప్ప విమర్శకుడౌతాడనీ రారా వాదన- నిజమే సాహిత్యం హృదయానికి మాత్రమే అర్థమౌతుంది కనుక.
 

 టి.హజరత్తయ్య

 9502547993

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement