Rachamallu Ramachandra Reddy
-
రా.రా. దృష్టిలో సాహిత్య ప్రయోజనం
40 వసంతాల సారస్వత వివేచన సర్వ సాహిత్యానికి హృదయమే కేంద్రం, హృదయమే యితివృత్తం, హృదయాన్ని దాటి సాహిత్యమంటూ ఉండజాలదు. పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్రలు వేయడం ద్వారా అతనిలో ఉత్తమ హృదయ సంస్కారాన్నీ, తద్వారా ఉత్తమ సమాజాన్నీ ఆవిష్కరించడం సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం అంటాడు రారా. ‘‘వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడమూ, ఉన్నత జీవిత విధానాలకు మార్గం చూపించడమూ, ఉత్తమ హృదయ సంస్కారానికి ప్రేరణ ఇవ్వడమూ సాహిత్య లక్ష్యాలుగా చలామణి కావడం లేదు. నిస్సారమూ, తరచూ బాధాకరమూ అయిన జీవిత వాస్తవాన్ని విస్మరించడానికి మద్యం లాగే ఒక సాధనమైంది సాహిత్యం’’. ఈ చేదు నిజాన్ని రాచమల్లు రామచంద్రారెడ్డి(రారా) వెల్లడించి నలబై ఏళ్లు. అంటే రారా ‘సారస్వత వివేచన’ వెలువడి ఈ జూలైకి నలబై ఏళ్లు. 1976లో వెలువడిన ఈ ‘సారస్వత వివేచన’ విమర్శా గ్రంథంలో 3 సంపాదకీయాలు (‘సంవేదన’ పత్రిక లోనివి), 13 సమీక్షలు, 2 స్వతంత్ర వ్యాసాలు ఉన్నాయి. ఇందులోని ‘లక్ష్య నిర్వచనం’ అన్న తొలి వ్యాసం ‘సంవేదన’ పత్రిక తొలి సంచిక కోసం రాసిన సంపాదకీయం. ఇందులో సాహిత్యం ముసుగులో కృత్రిమ మనోవికారాలు, అధోలోకపు నీచాభిరుచులు రాజ్యమేలడాన్ని రారా నిరసించాడు. ఉత్తమ సాహిత్యమనేది మానవ మానసిక వికాసంలో ఒక భాగమని తెలిపాడు. అంతేగాక ఉత్తమ సాహిత్యానికి జన్మస్థానం సమాజ జీవితమైనట్లే, దానికి గమ్యస్థానం కూడా సమాజ జీవితమే కావాలని ఆకాంక్షించాడు. రారా దృష్టిలో ‘సాహిత్యం సంపూర్ణంగా హృదయ వ్యాపారం. విమర్శ మేథా వ్యాపారం’. ‘‘సర్వ సాహిత్యానికి హృదయమే కేంద్రం, హృదయమే యితివృత్తం, హృదయమే హద్దు, హృదయాన్ని దాటి సాహిత్యమంటూ ఉండజాలదు.’’ పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్రలు వేయడం ద్వారా అతనిలో ఉత్తమ హృదయ సంస్కారాన్నీ, తద్వారా ఉత్తమ సమాజాన్నీ ఆవిష్కరించడం సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం అంటాడు. - రాచమల్లు రామచంద్రారెడ్డి చలం సాహిత్యం మీద తీర్పునిస్తూ- చలం తన రచనలలోని విప్లవాత్మక భావాల ద్వారా సకల కళానియమాలు భగ్నం చేసినందువల్లా, తన హృదయంలోని భావుకత వలనా, తన మనస్సులోని నిస్సంకోచం వలనా, తన విశ్వాసాల్లోని అంతశ్శుద్ధి వల్లా, తన వ్యక్తిత్వంలోని ఔన్నత్యం వల్లా, తన రచనల్లోని విప్లవ భావజాలం గల పాత్రల వల్లా, తన చుట్టూ ఉన్న సమాజాన్నీ, తన సమకాలీన సాహిత్యాన్నీ, తను బ్రతికిన యుగాన్నీ తన విప్లవ దీధితులతో దేదీప్యమానం చేసిన మహానుభావుడు, అంటాడు రారా. అయితే, సాహిత్యకారుడిగా కంటే చలాన్ని ప్రచారకుడిగానే ఎత్తిచూపుతాడు. చలానికి కళానియమాల మీద ధ్యాస లేకున్నా, కళాత్మకతతో నిండడం వల్లే ఆ రచనలకు ప్రాముఖ్యం దక్కిందన్నాడు. చలమే లేకపోతే తెలుగు సాహిత్యంలో వాస్తవికావాదం ఇంత బలంగా ఉండేది కాదనీ, తెలుగు సాహిత్యానికి చలం ఇచ్చిన వరం అన్ని దుర్గుణాలలోనూ జీవితాన్ని వాస్తవికంగా చూడగల్గడమనీ రారా మూల్యాంకనం చేస్తాడు. అయితే చలాన్ని హెడోనిస్ట్(స్వసుఖవాది) అనీ, చివరి దశలోని ‘పురూరవ’లోనూ, ‘సుధ’లోనూ కనపడేది సాహిత్యజీవిత మరణదశే అనీ విమర్శించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. తిలక్ కవిత్వానికి ముగ్ధులయి నేటికీ ఆయన్ను అభ్యుదయ కవిగా పొరబడుతుంటారు (శ్రీశ్రీ సైతం ఆయన్ను అభ్యుదయ కవి అన్నారు). ‘‘దుఃఖితుల పట్లా, బాధితుల పట్లా తిలక్ అపారమైన కరుణతో కరిగిపోయిన మాట యెవరూ కాదనరు... ఆ కరుణ దుఃఖితులనూ, బాధితులనూ, క్రియాశీలురనూ కర్తవ్యోన్ముఖులనూ చేసేది కాదు’’. ‘‘తిలక్ కవిత్వంలో ప్రధానమైనది భావుకత’’. ఇక్కడ కారుణ్య తత్వానికీ, క్రియాత్మకతకీ మధ్య ఉన్న భేదాన్ని వివరించి, తిలక్ యొక్క భావకవితా పునాదిని ఎత్తి చూపడమేగాక, ఆధునిక ఆచ్ఛాదన ముసుగులో తిలక్‌లో దాగివున్న ప్రబంధకాలపు అవలక్షణాలను సైతం విమర్శించాడు రారా. ‘కన్యాశుల్కం’ని సమీక్షిస్తూ- సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో గురజాడ ముందుచూపును గూర్చి ఉన్నతంగా తీర్పునిస్తాడు రారా. ‘‘నాటి సంస్కర్తల అసంపూర్ణ జ్ఞానమూ, అవాస్తవిక దృక్పథమూ, అరకొర ఆలోచనలూ ఆయన భరించలేకపోయాడు’’. ‘‘సాంఘిక దృక్పథంలో, హృదయ సంస్కారంలో ఆనాటి సంస్కర్తలు, సంస్కరణోద్యమాల కంటే కొన్ని మైళ్ల ముందుచూపు కలిగి వుండినాడు.’’ ‘‘ఎంత ముందుచూపు అంటే, తన సమకాలిక ప్రగతి ఉద్యమాల పట్ల సానుభూతి చూపలేనంత ముందుచూపు; తన సమకాలిక మేధావుల బుద్ధికి అందనంత ముందుచూపు; తన సమకాలిక ప్రగతిశీలురలోని లోటుపాట్లను బహిర్గతం చేయడమే తన నాటకాలలోనూ, కథలలోనూ ఇతివృత్తంగా పెట్టుకునేటంత ముందుచూపు.’’ కాబట్టే, తెలుగు జాతికి ఒక షేక్స్పియర్ లేని లోటునూ, ఒక ఇబ్సెన్ లేని లోటునూ, ఒక చెహోవ్ లేని లోటునూ ఏకముఖంగా తీర్చిన మహానుభావుడు గురజాడ అని కీర్తిస్తాడు. కె.వి.రమణారెడ్డి ‘మహోదయం’ను గురజాడపై వచ్చిన విజ్ఞాన సర్వస్వం అంటాడు రారా. గురజాడ మీద సమగ్రమైన జీవితకథ లేని లోటు యీ ‘మహోదయం’తో తీరుతుందనీ, సాహిత్యాభిరుచి మరియు చారిత్రక అభినివేశమూ వుంటే తప్ప ఇలాంటి గ్రంథం రాయలేరనీ అంటాడు. అయితే, కె.వి.ఆర్. గురజాడ రచనల్లో ‘భాష, భావం, ఇతివృత్తం, ఛందస్సు’ అని అన్నింటా గల ఆధునికతను ప్రశంసిస్తూనే, ఈ అభిప్రాయాన్ని బలపర్చడానికి ఛాందసుల అభిప్రాయాలను ఉటంకించేసరికి, కె.వి.ఆర్.కు కొసవెర్రిలాంటిదేదో వున్నదని విమర్శిస్తాడు. దాన్తో పాటు రమణారెడ్డి శైలి బరువుగా వుంటుందనీ, వాక్య నిర్మాణం వ్యవహార భాషకు అనుగుణంగా లేదనీ అంటాడు. అద్దేపల్లి తన ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ గ్రంథంలో శ్రీశ్రీ అభిప్రాయాలను కానీ విశ్వాసాలను కానీ పట్టించుకోక, కేవలం శిల్పసంపద వల్లే శ్రీశ్రీ మహాకవి అయినాడని చెప్తాడు. అంతేగాక భారతీయ అలంకారిక శాస్త్ర సిద్ధాంతాల్ని శ్రీశ్రీ రచనల కన్వయించి శ్రీశ్రీ గొప్పకవి అని అద్దేపల్లి ప్రశంసించడాన్ని రారా క్షమించలేకపోయాడు. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ లోని కవితల్ని మూల్యాంకనం చేయాలంటే ఆధునిక యుగ సంవేదన అవసరమనీ, శ్రీశ్రీ ప్రవచించిన విప్లవ భావజాలంతో పరిచయం, కనీసం స్థూలంగానైనా అవసరమనీ రారా భావిస్తాడు. ‘‘అద్దేపల్లి రామమోహనరావు గారికి మన ఆలంకారికులు రాసిన లక్షణ గ్రంథాలు సరిగ్గా అర్థం కాలేదు. ఇక శ్రీశ్రీ కవిత్వం అర్థం చేసుకునే శక్తి ఈయనకీ జన్మలో కలిగేటట్లు లేదు. ఈ రెంటిలో ఏది సక్రమంగా అర్థమైవుండినా ఈయన ఈ వ్యాసాలు రాసేవాడు కాదు’’ అని తీవ్రంగా నిరసిస్తాడు. కొడవటిగంటి కుటుంబరావును అభినందిస్తూ- ‘‘ఆధునికత, వాస్తవికత, శాస్త్రీయత,అభ్యుదయ దృక్పథం మొదలైన పదాలన్నీ కొన్ని కొన్ని కోణాల నుండి మాత్రమే ఆయన్ను తెలియజేయగలవు’’. వీటి సమాహారమే కొ.కు. వ్యక్తిత్వ మంటాడు రారా. గురజాడ తర్వాత సాహిత్య ప్రయోజనం గురించి స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి కొకు అని చెబుతాడు. అయితే, దిగంబర కవుల్ని మాత్రం రారా సరిగ్గా అంచనా వేయలేకపోయారనిపిస్తుంది. ‘‘ఆ తిట్లూ, ఆ బూతులూ, ఆ ఆటవిక ఆవేశమూ, ఆ ఒళ్లెరుగని కుసంస్కారమూ, ఆ నోటితీటా జుగుప్స కలిగిస్తాయి’’ అని అసహ్యించుకున్న రారా వారి సామాజిక నిరసనను దర్శించలేకపోయారనిపిస్తుంది. అయితే, ‘క్రూరుడైన విమర్శకుడు’ అనిపించుకున్నప్పటికీ, ఈ వ్యాసాలు చదువుతుంటే సాహిత్య, సామాజిక, తాత్విక, విజ్ఞాన శాస్త్రాలను రారా ఎంత లోతుగా అధ్యయనం చేశాడో వెల్లడి అవుతుంది. పతంజలి అన్నట్లు, ‘గురజాడనూ, శ్రీశ్రీనీ, చలాన్నీ ఆయన అంచనా కట్టిన తీరు యువతరానికి మార్గదర్శకం’. చేరా అభిలషించినట్లు, ‘రారా ఒరవడి నిలవాలి’. రా.రా. సారస్వత వివేచనలో... తెలుగుజాతికి ఒక షేక్స్పియర్లేని లోటును తీర్చినవాడు గురజాడ. సాహిత్యకారుడికంటే ఎక్కువగా ప్రచారకుడు చలం. అయినా కళాకారుడు. గురజాడ తర్వాత సాహిత్య ప్రయోజనం స్పష్టంగా అర్థమైనవాడు కొ.కు. తిలక్ అభ్యుదయ కవి కాదు. ప్రబంధ (అవ)లక్షణాల భావుకుడు. - టి.హజరత్తయ్య 9502547993 -
సాహిత్యం హృదయ వ్యాపారం
ఫిబ్రవరి 28న రారా జయంతి ‘‘సాహిత్యం సంపూర్ణంగా హృదయ వ్యాపారం. విమర్శ మేధా వ్యాపారం. అయితే సాహిత్యాన్ని ముందు హృదయంతో ఆస్వాదించి, తరువాత మేధతో పరిశీలించేవాడే ఉత్తమ విమర్శకుడౌతాడు. ఆధ్యాత్మికవాదమూ, ప్రతీకవాదమూ, అస్తిత్వవాదమూ మొదలైన వాదాలెన్నివున్నా అవి సాహిత్య విమర్శకు సమగ్రతను చేకూర్చలేవు. మానవతావాదమొక్కటే నిజమైన సాహిత్యవాదం’’- ఈ వాక్యాలు ఉత్తమ సాహిత్య విమర్శకుడి గురించి, ఉత్తమ సాహిత్య లక్ష్యం గురించి రాచమల్లు రామచంద్రారెడ్డి(రారా) దృక్పథం. వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడమూ, ఉన్నత జీవనవిధానానికి మార్గం చూపించడమూ, ఉత్తమ హృదయ సంస్కారానికి ప్రేరణ యివ్వడమూ సాహిత్య లక్ష్యాలుగా చలామణి కావడం లేదు. యిట్టి స్థితిలో విస్మరణవాద సాహిత్యానికి అడ్డుకట్ట వేయకపోతే కలిగే ఉపద్రవాన్ని పసిగట్టిన రారా, తెలుగు పాఠకులు, పత్రికలు పనిగట్టుకుని మోసే అనాగరిక, ఆటవిక అథోస్థాయి సాహిత్యాన్ని తన కత్తివాదర లాంటి శైలితోనూ, రాజీలేని మార్క్కిస్ట్ నిబద్ధతతోనూ తుత్తునియలు చేశాడు. ‘సమాజంలోంచి పుట్టే సాహిత్యానికి గమ్యస్థానం కూడా సమాజమే’ కావాలని తపించిన వ్యక్తి రారా. మంచి సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్యం రావాలి, మంచి సాహిత్యం రావాలంటే మంచి సాహిత్య విమర్శ రావాలి. అందుకే రారా మార్క్స్ సిద్ధాంతాన్ని సాహిత్యానికి అన్వయించి చూపి, సాహిత్యానికి గల సమాజాన్ని మార్చే శక్తిని విశదీకరించినాడు. రారా కథకుడిగా కన్ను తెరిచినప్పటికీ, విమర్శకుడిగానే సాహితీలోకానికి సుపరిచితుడు. చాలామంది సమీక్ష వేరు, విమర్శ వేరు అనుకొంటుంటారు. ఈ సాంప్రదాయాన్ని మార్చి, పుస్తక సమీక్షల స్థాయిని పెంచి వాటిని గొప్ప విమర్శలుగా చేసిన ఘనత రారాతోనే మొదలైంది. ఒక రచనను విమర్శించేటపుడు ఆ రచయిత సాహిత్య జీవితాన్నంతటినీ ప్రస్తావించవచ్చుగానీ, అతని సాహిత్యేతర జీవితాన్ని ప్రస్తావిస్తే అది అక్రమమైన వ్యక్తిగత విమర్శ అవుతుందని రారా అభిప్రాయం. అలాగే గ్రంథ రచయిత ఎంతటివాడైనా, చివరకు తనతో స్నేహ బంధుత్వాలు కలిగివున్నా ఆ ప్రభావం గ్రంథవిమర్శ మీద పడకూడదనేది కూడా ఆయన అభిప్రాయం. అంతేగాక అకడమిక్‌గా చదువుకొని ఆ సూత్రాల చట్రంలో సాహిత్య విమర్శ చేస్తే, అది ‘అకడమిక్ విమర్శ’ అవుతుందనీ, గాఢమైన సాహిత్యాభిరుచి వున్నపుడే అతడు గొప్ప విమర్శకుడౌతాడనీ రారా వాదన- నిజమే సాహిత్యం హృదయానికి మాత్రమే అర్థమౌతుంది కనుక. టి.హజరత్తయ్య 9502547993 -
ఓడిపోయిన సంస్కారం
క్లాసిక్ కథ సుందరమ్మకంతా కలలో వున్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం మొదలైవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లియే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమెకెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే చాలా సిగ్గుపడింది. పునర్వివాహానికి ఆమె మొదట తీవ్రంగా వ్యతిరేకించినా తన యిద్దరి అన్నగార్లూ యెడతెగకుండా చేసిన హితోపదేశాల వల్లా, విధవ ఐన ఈ రెండేండ్లలోనూ తాను గడించిన జీవితానుభవం వల్లా, ఆమె యీ రెండవ పెండ్లికి ఒప్పుకుంది. ఐనా ఒక సంవత్సరం పాటు భర్తతో కాపురం చేసిన తాను సిగ్గు పెండ్లికూతురుగా పదిమందిలోనూ ఎట్లా ప్రవర్తించడమూ అన్న భయసంకోచాలు ఆమె మనస్సును పీడిస్తూనే వుండినాయి. అందువల్ల ఈ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా ప్రశాంతంగా జరిగిపోతుందని తెలిసినప్పుడు ఆమె సంతృప్తితో నిట్టూర్చింది. తీరా యిప్పుడు చూస్తే ఆ పాత ఆచారాల ఆర్భాటమే మేలనిపించేటట్లుంది ఈ కొత్త వ్యవహారమంతా. పెండ్లేమో పది నిముషాల్లోనే అయిపోయింది. వచ్చిన బంధువులంతా, పురోహితునితో గూడా కలిసి యిరవై మంది కంటే యెక్కువ లేరు. తనకు సిగ్గుపడాల్సిన ఘట్టాలేవీ లేకుండానే పెండ్లి ముగిసిందని ఆమె సంతోషిస్తూ వుండగానే - అంతలోనే ఉపన్యాసాల కార్యక్రమం మొదలైంది. ఒక్కొక్కరే లేచి పెండ్లికొడుకును అభినందించడం, అతని సంఘ సంస్కరణాభిలాషను పొగడడం, అతని ఔదార్యాన్ని మెచ్చుకోవడం, ఆఖరులో ఆశీర్వదించడం - ఆమెకంతా అయోమయంగా వుంది. సుమారు గంట నుండి ఉపన్యాసాలు సాగుతున్నాయి. ఇప్పటికి ఐదారు మంది మాట్లాడినారు. ఇంకా యెంత మంది మాట్లాడుతారో? విధవను పెండ్లి చేసుకోవడానికి యెవరైనా సిగ్గుపడతారని మాత్రమే ఆమెకు తెలుసు. కాకపోతే ఈ కాలంలో అదేమీ తప్పుకాదనీ, అందువలననే విధవా వివాహాలు జరుగుతున్నాయనీ ఆమె అనుకుంది. కాని ఇందులో ప్రశంసించవలసిందేముందో ఆమెకు అర్థం కాలేదు. ఇంతలో ఒక యువకుడు లేచి, అందరూ పెండ్లికొడుకైన రామనాథాన్ని మాత్రమే మెచ్చుకోవడం అన్యాయమనీ, సుందరమ్మ ధైర్య సాహసాలే యెక్కువగా మెచ్చుకోతగినవనీ ఉపన్యాసం మొదలుపెట్టినాడు. ఇదేదో మరీ విపరీతంగా కనపడిందామెకు. ఇందులో ధైర్య సాహసాలేమున్నాయి? జీవితమంతా సుఖపడాలనే ఆశతోనే తానీ పెండ్లికి సిద్ధపడింది. అందులో తన్ను అంత పెద్దగా పొగడవలసిందేముంది? యితరుల కోసం తాను చేసిందేమీ లేదే? ఆ ఉపన్యాసం అయిపోయినంత వరకూ ఆమెకు ముండ్లమీద కూర్చున్నట్లే వుంది. అదృష్టవశాత్తు అది ఐన వెంటనే కాఫీ ఫలహారాల కార్యక్రమం ప్రారంభమైంది. తరువాత 20 నిముషాల్లోనే ఆమె భర్త గృహం చేరుకుంది. రాత్రి భోంచేసిన వెంటనే పడక గదిలో మంచం మీద కూర్చుంది సుందరమ్మ. భర్త యెటువంటివాడా అని ఆలోచించడానికి పూనుకుంది ఆమె. వెంటనే మూడేండ్లనాడు తనకు కార్యం అయిన నాటి పరిస్థితులకూ ఈనాటి పరిస్థితులకూ వున్న తేడా ఆమె మనసులో మెదిలింది. ఆనాడు తన పెద్ద వదినె తన్నెంతో ఆప్యాయంగా అలంకరించి, గదివరకూ తన్ను పిలుచుకొని వచ్చి వాకిలి దగ్గర వదిలిపెట్టిపోయింది. ఆనాడు భర్త తన కొరకు ఎదురుచూస్తూ వుండినాడు సిగ్గుతో, వుత్సాహంతో, ఉత్కంఠతో. తానానాడు పడక గదిలో ప్రవేశించింది. ఆనాడు వదినెల పరిహాసంతో తన సిగ్గు నూరంతలు పెరిగినా, యేదో అపూర్వమైన సౌఖ్యం. అనంతమైన ఆనందం తన కందబోతున్నదని అర్థంకాని ఉత్సాహం కూడా తన్నావేశించింది. ఈనాడు తనను అలంకరించేవాళ్లూ లేరు. పరిహసించేవాళ్లూ లేరు. ఆ సిగ్గూ లేదు, ఉత్సాహమూ లేదు. ఈనాడు తానేవచ్చి పడక గదిలో భర్త కొరకెదురుచూస్తూ కూర్చుంది. ఈనాడు తనకు కలగబోయే సుఖం యొక్క స్వరూపం తెలుసు. అందువలన ఆనాటి ఉత్కంఠ లేదు. ఆనాడు తన ఉద్దేశాలతో నిమిత్తం లేకుండా యితరులు తన్నొక సుఖసముద్రంలో త్రోసినారు. ఈనాడు తాను బుద్ధిపూర్వకంగా స్వప్రయత్నంతో ఆ సుఖ సముద్రాన్ని సమీపించింది. ఈ సుఖం తాను విధినెదిరించి సంపాదించుకున్న సుఖం. ఇది తన జన్మహక్కు. తన జన్మహక్కు కొరకు యెదురుచూడడంలో సిగ్గుపడవలసిందేమీ లేదు. తన హక్కు లభ్యమైనప్పుడు తానెవ్వరికీ కృతజ్ఞురాలు కానక్కరలేదు. ఈ రామనాథం యెటువంటివాడో అన్న ప్రశ్న ఆమెకు మళ్లీ జ్ఞాపకం వచ్చింది. ఔను - భర్త గుణగణాల మీదే తన జీవితమంతా ఆధారపడి వుంటుంది. అతని స్వభావం మీదనే తన సుఖశాంతులన్నీ ఆధారపడతాయి. అతను మంచివాడైతే తన బ్రతుకంతా ఒక పూలపాన్పు. అతను మంచివాడు కాకపోతే... ఐనా, అతను మంచివాని మాదిరే వున్నాడు. తప్పక మంచివాడే ఐవుంటాడు. లేకపోతే తన అన్నలు తననెందుకు అతనికిచ్చి పెండ్లి చేస్తారు! ఏమో! మొదట మంచివాళ్లగానే వుండి తరువాత యెంతమంది పెండ్లాలను వేధించుకు తినటం లేదు? ఇతని సంస్కారం ఎటువంటిదో? తన బ్రతుకంతా యితని స్వభావ సంస్కారాల మీదనే యేర్పడుతుంది. సుందరమ్మకు యింకో విషయం జ్ఞాపకం వచ్చింది. మూడేండ్ల నాడు యిదే పరిస్థితిలో భర్త యెటువంటివాడు అన్న ప్రశ్న తనకు తట్టనేలేదు. ఆనాడు తనకు కలగబోయే సుఖాన్ని గురించే తాను ఊహించుకుంది. తన భవిష్యజ్జీవితాన్ని గురించే గాలి మేడలు కట్టుకుంది. ఆనాడు తన భర్త అందచందాలను గురించైనా కొంతవరకు తనలో తాను వితర్కించుకుంది గాని, అతని స్వభావ సంస్కా రాలను గురించిన ఆలోచనే తనకు రాలేదు. ఈ విషయం జ్ఞాపకం వచ్చి ఆమె ఆశ్చర్యపడింది. వెంటనే కారణం స్ఫురించి తనలో తాను నవ్వుకుంది. పురుషుల స్వభావ సంస్కారాలే స్త్రీ సుఖ సంతోషాలను నిర్దాక్షిణ్యంగా నిర్ణయిస్తాయని ఆనాడు తనకు తెలియదు. ఆనాడు తెలియనివి యీనాడు తనకెన్నో తెలుసు. ముఖ్యంగా స్త్రీలు సుఖపడడానికి పురుషుల ఆకారాల కంటె పురుషుల మనస్సులే ప్రధానం అన్న విషయం తనకు బాగా తెలుసు. అందుకే యీ పెండ్లి ఖాయమైనప్పటి నుండి ఈ ప్రశ్న యెడతెగకుండా తనకెదురౌతూనే వుంది. ఈ రామనాథం యెటువంటివాడు? ఇతని మనస్సు యెటువంటిది? వాకిలి దగ్గర చప్పుడౌతూనే ఆమె తలయెత్తి చూసింది. భర్త కనబడగానే లేచి నిలబడింది. ‘‘సుందరీ! పెండ్లిలో నీకేమీ కష్టం కలుగలేదు కదా?’’ అంటూ రామనాథం ఆమెను సమీపించి, మంచం మీద కూర్చొని, ఆమెను గూడా కూర్చోమన్నట్లు ఆమె భుజం మీద చేయి వేసి బరువుగా నొక్కినాడు. సుందరమ్మ అతని ప్రక్కనే కూర్చుంటూ - ‘‘లేదండీ’’ అన్నది. రామనాథం ఉత్సాహంగా అందుకున్నాడు: ‘‘ఏర్పాట్లన్నీ స్వయంగా నేనే చేయించినాను తెలుసా? నీ మనస్సుకేమీ ఆయాసం కలగకూడదని నేనెంత శ్రద్ధ తీసుకున్నాననుకున్నావ్?’’ ‘‘ఊ’’ అన్నది సుందరమ్మ నిరుత్సాహంగా. రామనాథం మరింత ఉత్సాహంగా అన్నాడు: ‘‘ఊ అనడం గాదు సుందరీ! నీ సుఖం కొరకు జీవితమంతా ధారపోయడానికి సిద్ధంగా వున్నానంటే నమ్ము. ఈ పెండ్లిని గురించి యెంతమంది బంధువులకు దూరమైనాననుకున్నావ్? అంతెందుకూ - రేపు పత్రికలో చూస్తావుగా నేను నీకొరకెంత త్యాగం చేసిందీ.’’ ఇంతవరకూ నేలకేసి చూస్తూ వున్న సుందరమ్మ తలయెత్తి రామనాథం ముఖంలోకి చూసింది. ఆ ముఖంలో వంచన యెక్కడా కనబడలేదు. అతని కన్నుల నిండా ఆత్మసంతృప్తి తప్ప మరే భావమూ లేదు. ఆమె మెల్లగా అడిగింది: ‘‘నా కొరకు అంత త్యాగం చేయవలసిన పనేముంది మీకు?’’ అది ప్రశ్నగా కాక తన అభిప్రాయం చెప్పినట్లు శాంతంగా చెప్పబోయింది ఆమె. కానీ, మధ్యలో అప్రయత్నంగా కంఠం వణికి అది ప్రశ్నగా ధ్వనించింది. తనకు తెలియకుండానే తనలో కలిగిన ఆవేశానికి సిగ్గుపడి ఆమె మళ్లీ తలవంచుకుంది. రామనాథం యివన్నీ గమనించకుండానే వెంటనే జవాబు చెప్పినాడు. ‘‘అదేం మాట సుందరం? మానవులన్న తర్వాత ఆదర్శాల కొరకు త్యాగం చెయ్యకపోతే యెట్లా? నీబోటి యువతులందరూ నిష్కారణంగా జీవిత సౌఖ్యాలకు దూరమై ఉసూరుమంటుంటే మన సంఘం బాగుపడేదెట్లా?’’ సుందరమ్మ మౌనంగానే వుంది. అతని మనస్సును అర్థం చేసుకోడానికి ఆమె ప్రయత్నిస్తూ వుంది. ఈ మనిషికి నన్ను సుఖపెట్టాలని యింత తాపత్రయమెందుకో? తాను సుఖపడాలనే ఆశ యితనికే కోశానా లేదా? ఆమె ఆలోచనల్ని రామనాథం సాగనివ్వలేదు. రెండు చేతులతోనూ ఆమె ముఖం తన వైపుకు తిప్పుకొని అతనన్నాడు: ‘‘యిటు చూడు సుందరం, యీ పెండ్లి కాకుండా వుంటే నీ జీవితమంతా యెట్లుంటుందో ఊహించుకున్నావా? నేను త్యాగం చెయ్యకపోతే నీ బ్రతుకులోని చీకటంతా తొలగిపొయ్యేదెట్లా?’’ అతని కన్నుల్లోకి చూస్తూ వున్న సుందరమ్మ కనురెప్పలు వాల్చి విచారంగా చిరునవ్వు నవ్వింది. రామనాథం ఆమె చిరునవ్వు మాత్రమే చూసినాడు. ఆ చిరునవ్వులోని విచారాన్ని గమనించే స్థితిలో లేడు అతను. ‘‘చూడు - యిప్పుడు నీ బ్రతుకంతా వెన్నెల అయింది. నా త్యాగమంతా నీ చిరునవ్వు రూపంలో ఫలించినందుకు నాకెంత ఆనందంగా వుందనుకున్నావ్’’ అని అన్నాడు సంతృప్తీ, సంతోషం నిండిన కంఠంతో. సుందరమ్మకు ఒక్కసారిగా భవిష్యత్తంతా అంధకారమయమైంది. ‘‘ఇంత త్యాగం జీవితమంతా మోసే శక్తి నాకు లేదు’’ అని బిగ్గరగా అరవాలనుకుంది. ఆమె దిగ్గున లేచి నిలబడింది. అంతలోనే తన అసహాయత మెరుపు వలె ఆమె మనసులో తోచింది. కండ్లు తుడుచుకుంటూ రామనాథం పాదాల దగ్గర నేలమీద కూర్చొని, ‘‘మీ త్యాగానికి తగిన యోగ్యత నాకు కలిగేటట్లు ఆశీర్వదించండి’’ అని గద్గద కంఠంతో పలికింది. - రాచమల్లు రామచంద్రారెడ్డి