రా.రా. దృష్టిలో సాహిత్య ప్రయోజనం
40 వసంతాల సారస్వత వివేచన
సర్వ సాహిత్యానికి హృదయమే కేంద్రం, హృదయమే యితివృత్తం, హృదయాన్ని దాటి సాహిత్యమంటూ ఉండజాలదు. పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్రలు వేయడం ద్వారా అతనిలో ఉత్తమ హృదయ సంస్కారాన్నీ, తద్వారా ఉత్తమ సమాజాన్నీ ఆవిష్కరించడం సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం అంటాడు రారా.
‘‘వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడమూ, ఉన్నత జీవిత విధానాలకు మార్గం చూపించడమూ, ఉత్తమ హృదయ సంస్కారానికి ప్రేరణ ఇవ్వడమూ సాహిత్య లక్ష్యాలుగా చలామణి కావడం లేదు. నిస్సారమూ, తరచూ బాధాకరమూ అయిన జీవిత వాస్తవాన్ని విస్మరించడానికి మద్యం లాగే ఒక సాధనమైంది సాహిత్యం’’. ఈ చేదు నిజాన్ని రాచమల్లు రామచంద్రారెడ్డి(రారా) వెల్లడించి నలబై ఏళ్లు. అంటే రారా ‘సారస్వత వివేచన’ వెలువడి ఈ జూలైకి నలబై ఏళ్లు. 1976లో వెలువడిన ఈ ‘సారస్వత వివేచన’ విమర్శా గ్రంథంలో 3 సంపాదకీయాలు (‘సంవేదన’ పత్రిక లోనివి), 13 సమీక్షలు, 2 స్వతంత్ర వ్యాసాలు ఉన్నాయి.
ఇందులోని ‘లక్ష్య నిర్వచనం’ అన్న తొలి వ్యాసం ‘సంవేదన’ పత్రిక తొలి సంచిక కోసం రాసిన సంపాదకీయం. ఇందులో సాహిత్యం ముసుగులో కృత్రిమ మనోవికారాలు, అధోలోకపు నీచాభిరుచులు రాజ్యమేలడాన్ని రారా నిరసించాడు. ఉత్తమ సాహిత్యమనేది మానవ మానసిక వికాసంలో ఒక భాగమని తెలిపాడు. అంతేగాక ఉత్తమ సాహిత్యానికి జన్మస్థానం సమాజ జీవితమైనట్లే, దానికి గమ్యస్థానం కూడా సమాజ జీవితమే కావాలని ఆకాంక్షించాడు. రారా దృష్టిలో ‘సాహిత్యం సంపూర్ణంగా హృదయ వ్యాపారం. విమర్శ మేథా వ్యాపారం’.
‘‘సర్వ సాహిత్యానికి హృదయమే కేంద్రం, హృదయమే యితివృత్తం, హృదయమే హద్దు, హృదయాన్ని దాటి సాహిత్యమంటూ ఉండజాలదు.’’ పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్రలు వేయడం ద్వారా అతనిలో ఉత్తమ హృదయ సంస్కారాన్నీ, తద్వారా ఉత్తమ సమాజాన్నీ ఆవిష్కరించడం సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం అంటాడు.
- రాచమల్లు రామచంద్రారెడ్డి
చలం సాహిత్యం మీద తీర్పునిస్తూ- చలం తన రచనలలోని విప్లవాత్మక భావాల ద్వారా సకల కళానియమాలు భగ్నం చేసినందువల్లా, తన హృదయంలోని భావుకత వలనా, తన మనస్సులోని నిస్సంకోచం వలనా, తన విశ్వాసాల్లోని అంతశ్శుద్ధి వల్లా, తన వ్యక్తిత్వంలోని ఔన్నత్యం వల్లా, తన రచనల్లోని విప్లవ భావజాలం గల పాత్రల వల్లా, తన చుట్టూ ఉన్న సమాజాన్నీ, తన సమకాలీన సాహిత్యాన్నీ, తను బ్రతికిన యుగాన్నీ తన విప్లవ దీధితులతో దేదీప్యమానం చేసిన మహానుభావుడు, అంటాడు రారా. అయితే, సాహిత్యకారుడిగా కంటే చలాన్ని ప్రచారకుడిగానే ఎత్తిచూపుతాడు. చలానికి కళానియమాల మీద ధ్యాస లేకున్నా, కళాత్మకతతో నిండడం వల్లే ఆ రచనలకు ప్రాముఖ్యం దక్కిందన్నాడు.
చలమే లేకపోతే తెలుగు సాహిత్యంలో వాస్తవికావాదం ఇంత బలంగా ఉండేది కాదనీ, తెలుగు సాహిత్యానికి చలం ఇచ్చిన వరం అన్ని దుర్గుణాలలోనూ జీవితాన్ని వాస్తవికంగా చూడగల్గడమనీ రారా మూల్యాంకనం చేస్తాడు. అయితే చలాన్ని హెడోనిస్ట్(స్వసుఖవాది) అనీ, చివరి దశలోని ‘పురూరవ’లోనూ, ‘సుధ’లోనూ కనపడేది సాహిత్యజీవిత మరణదశే అనీ విమర్శించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు.
తిలక్ కవిత్వానికి ముగ్ధులయి నేటికీ ఆయన్ను అభ్యుదయ కవిగా పొరబడుతుంటారు (శ్రీశ్రీ సైతం ఆయన్ను అభ్యుదయ కవి అన్నారు). ‘‘దుఃఖితుల పట్లా, బాధితుల పట్లా తిలక్ అపారమైన కరుణతో కరిగిపోయిన మాట యెవరూ కాదనరు... ఆ కరుణ దుఃఖితులనూ, బాధితులనూ, క్రియాశీలురనూ కర్తవ్యోన్ముఖులనూ చేసేది కాదు’’. ‘‘తిలక్ కవిత్వంలో ప్రధానమైనది భావుకత’’. ఇక్కడ కారుణ్య తత్వానికీ, క్రియాత్మకతకీ మధ్య ఉన్న భేదాన్ని వివరించి, తిలక్ యొక్క భావకవితా పునాదిని ఎత్తి చూపడమేగాక, ఆధునిక ఆచ్ఛాదన ముసుగులో తిలక్‌లో దాగివున్న ప్రబంధకాలపు అవలక్షణాలను సైతం విమర్శించాడు రారా.
‘కన్యాశుల్కం’ని సమీక్షిస్తూ- సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో గురజాడ ముందుచూపును గూర్చి ఉన్నతంగా తీర్పునిస్తాడు రారా. ‘‘నాటి సంస్కర్తల అసంపూర్ణ జ్ఞానమూ, అవాస్తవిక దృక్పథమూ, అరకొర ఆలోచనలూ ఆయన భరించలేకపోయాడు’’. ‘‘సాంఘిక దృక్పథంలో, హృదయ సంస్కారంలో ఆనాటి సంస్కర్తలు, సంస్కరణోద్యమాల కంటే కొన్ని మైళ్ల ముందుచూపు కలిగి వుండినాడు.’’ ‘‘ఎంత ముందుచూపు అంటే, తన సమకాలిక ప్రగతి ఉద్యమాల పట్ల సానుభూతి చూపలేనంత ముందుచూపు; తన సమకాలిక మేధావుల బుద్ధికి అందనంత ముందుచూపు; తన సమకాలిక ప్రగతిశీలురలోని లోటుపాట్లను బహిర్గతం చేయడమే తన నాటకాలలోనూ, కథలలోనూ ఇతివృత్తంగా పెట్టుకునేటంత ముందుచూపు.’’
కాబట్టే, తెలుగు జాతికి ఒక షేక్‌స్పియర్ లేని లోటునూ, ఒక ఇబ్సెన్ లేని లోటునూ, ఒక చెహోవ్ లేని లోటునూ ఏకముఖంగా తీర్చిన మహానుభావుడు గురజాడ అని కీర్తిస్తాడు.
కె.వి.రమణారెడ్డి ‘మహోదయం’ను గురజాడపై వచ్చిన విజ్ఞాన సర్వస్వం అంటాడు రారా. గురజాడ మీద సమగ్రమైన జీవితకథ లేని లోటు యీ ‘మహోదయం’తో తీరుతుందనీ, సాహిత్యాభిరుచి మరియు చారిత్రక అభినివేశమూ వుంటే తప్ప ఇలాంటి గ్రంథం రాయలేరనీ అంటాడు. అయితే, కె.వి.ఆర్. గురజాడ రచనల్లో ‘భాష, భావం, ఇతివృత్తం, ఛందస్సు’ అని అన్నింటా గల ఆధునికతను ప్రశంసిస్తూనే, ఈ అభిప్రాయాన్ని బలపర్చడానికి ఛాందసుల అభిప్రాయాలను ఉటంకించేసరికి, కె.వి.ఆర్.కు కొసవెర్రిలాంటిదేదో వున్నదని విమర్శిస్తాడు. దాన్తో పాటు రమణారెడ్డి శైలి బరువుగా వుంటుందనీ, వాక్య నిర్మాణం వ్యవహార భాషకు అనుగుణంగా లేదనీ అంటాడు.
అద్దేపల్లి తన ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ గ్రంథంలో శ్రీశ్రీ అభిప్రాయాలను కానీ విశ్వాసాలను కానీ పట్టించుకోక, కేవలం శిల్పసంపద వల్లే శ్రీశ్రీ మహాకవి అయినాడని చెప్తాడు. అంతేగాక భారతీయ అలంకారిక శాస్త్ర సిద్ధాంతాల్ని శ్రీశ్రీ రచనల కన్వయించి శ్రీశ్రీ గొప్పకవి అని అద్దేపల్లి ప్రశంసించడాన్ని రారా క్షమించలేకపోయాడు. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ లోని కవితల్ని మూల్యాంకనం చేయాలంటే ఆధునిక యుగ సంవేదన అవసరమనీ, శ్రీశ్రీ ప్రవచించిన విప్లవ భావజాలంతో పరిచయం, కనీసం స్థూలంగానైనా అవసరమనీ రారా భావిస్తాడు.
‘‘అద్దేపల్లి రామమోహనరావు గారికి మన ఆలంకారికులు రాసిన లక్షణ గ్రంథాలు సరిగ్గా అర్థం కాలేదు. ఇక శ్రీశ్రీ కవిత్వం అర్థం చేసుకునే శక్తి ఈయనకీ జన్మలో కలిగేటట్లు లేదు. ఈ రెంటిలో ఏది సక్రమంగా అర్థమైవుండినా ఈయన ఈ వ్యాసాలు రాసేవాడు కాదు’’ అని తీవ్రంగా నిరసిస్తాడు.
కొడవటిగంటి కుటుంబరావును అభినందిస్తూ- ‘‘ఆధునికత, వాస్తవికత, శాస్త్రీయత,అభ్యుదయ దృక్పథం మొదలైన పదాలన్నీ కొన్ని కొన్ని కోణాల నుండి మాత్రమే ఆయన్ను తెలియజేయగలవు’’. వీటి సమాహారమే కొ.కు. వ్యక్తిత్వ మంటాడు రారా. గురజాడ తర్వాత సాహిత్య ప్రయోజనం గురించి స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి కొకు అని చెబుతాడు.
అయితే, దిగంబర కవుల్ని మాత్రం రారా సరిగ్గా అంచనా వేయలేకపోయారనిపిస్తుంది. ‘‘ఆ తిట్లూ, ఆ బూతులూ, ఆ ఆటవిక ఆవేశమూ, ఆ ఒళ్లెరుగని కుసంస్కారమూ, ఆ నోటితీటా జుగుప్స కలిగిస్తాయి’’ అని అసహ్యించుకున్న రారా వారి సామాజిక నిరసనను దర్శించలేకపోయారనిపిస్తుంది.
అయితే, ‘క్రూరుడైన విమర్శకుడు’ అనిపించుకున్నప్పటికీ, ఈ వ్యాసాలు చదువుతుంటే సాహిత్య, సామాజిక, తాత్విక, విజ్ఞాన శాస్త్రాలను రారా ఎంత లోతుగా అధ్యయనం చేశాడో వెల్లడి అవుతుంది. పతంజలి అన్నట్లు, ‘గురజాడనూ, శ్రీశ్రీనీ, చలాన్నీ ఆయన అంచనా కట్టిన తీరు యువతరానికి మార్గదర్శకం’. చేరా అభిలషించినట్లు, ‘రారా ఒరవడి నిలవాలి’.
రా.రా. సారస్వత వివేచనలో...
తెలుగుజాతికి ఒక షేక్‌స్పియర్‌లేని లోటును తీర్చినవాడు గురజాడ.
సాహిత్యకారుడికంటే ఎక్కువగా ప్రచారకుడు చలం. అయినా కళాకారుడు.
గురజాడ తర్వాత సాహిత్య ప్రయోజనం స్పష్టంగా అర్థమైనవాడు కొ.కు.
తిలక్ అభ్యుదయ కవి కాదు. ప్రబంధ (అవ)లక్షణాల భావుకుడు.
- టి.హజరత్తయ్య
9502547993