KV ramana reddy
-
సంక్షోభం నుంచి సంక్షేమం లోకి...
సంక్షేమ కార్యక్రమాలు వర్సెస్ ఉచితాలు, అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం తీవ్రంగా చర్చ జరుగుతోంది. సంక్షేమ కార్యక్రమాలు ఉచితాలు కావనీ మానవ వనరుల అభివృద్ధికి అవి తప్పనిసరి అనీ, దీర్ఘకాలంలో నిలకడైన అభివృద్ధికి అవి దోహదపడతాయనీ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. పైగా ఈ పథకాల ద్వారా కలిగే ప్రయోజనాలు కింది వర్గాల కొనుగోలు శక్తిని పెంచి దారిద్య్రాన్ని తగ్గించడమే కాక, కుటుంబాల శ్రేయస్సును, పురోగతిని పెంచుతాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపున ప్రధాన ప్రతిపక్షం మాత్రం సంక్షేమ పథకాలు అంటే ఉచితాలు మాత్రమేననీ, అవి వృధా ఖర్చు మాత్రమేననీ, అనుత్పాదకమైనవనీ విమర్శిస్తోంది. పైగా ఈ సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రజాకర్షక మార్గాలు మాత్రమేనని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకుల నుంచి రుణాల ప్రభావం గురించి సెర్ప్ (ఎస్ఈఆర్పీ) సంస్థ సీఈఓ అంచనా వేయాలని భావించారు. కూలంకషమైన చర్చల తర్వాత, ఒక కన్సల్టెంటుగా (ఎమ్ అండ్ ఈ) విశాఖపట్నం జిల్లాలో పద్మనాభ మండలాన్ని, రెండు మండల మహిళా సమాఖ్యలు, మరో రెండు గ్రామ సంస్థలను పరిశీలన కోసం ఎంపిక చేసుకున్నాను. ఎఫ్‌జీడీల ద్వారా, వీఓ నేతలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులతో వ్యూహాత్మక ఇంటర్వ్యూల ద్వారా ఈ కార్యక్రమాల ప్రభావాన్ని అంచనా వేయాలని నిర్ణయించుకున్నాను. ఈ పనిలో భాగంగా అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, క్లస్టర్ కోఆర్డినేటర్లు, వ్యవసాయ అధికారులు, మండలంలోని అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆదర్శ వ్యవసాయదారులతో కూలంకషంగా చర్చించాను. పద్మనాభ మండల మహిళా సమాఖ్య 45 వీవోలతో కూడి ఉంది. ప్రతి వీఓలో ఇద్దరు లీడర్లు ఉంటారు. 1,423 స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీలు) ఉన్నాయి. వీటి మొత్తం సభ్యుల సంఖ్య 15,363. మండలంలోని దాదాపు 90 శాతం గృహాలు ఎస్‌హెచ్‌జీల పరిధి కింద ఉంటున్నాయి. మండలంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలపై అభిప్రాయాలు తీసుకోవడానికి 100 మందితో మాట్లాడటం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు, మండలంలోని ప్రజల సామాజిక నిర్మాణం గురించి తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది. అప్పుడే ఏఏ వర్గాల వారు ఏ మేరకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందుతున్నారో అవగతమవుతుంది. ఎస్‌హెచ్‌జీలోని మొత్తం సభ్యులలో ఎస్సీలు 10 శాతం, ఓసీలు 10 శాతం, బీసీలు 70 శాతం మంది ఉంటున్నారు. సామాజికంగా వెనుకబడిన బృందాల వద్ద తక్కువ పరిమాణంలో భూమి ఉన్నదనీ తేలింది. దారిద్య్రం నుంచి బయటపడేయటానికి ప్రధాన సూచికలలో ఒకటి ఏమిటంటే డబ్బు అందుబాటులోకి రావడం. బ్యాంకులు, స్త్రీనిధి కలిసి 2019 నుంచి 2022 జూలై వరకు స్వయం సహాయక బృందాలకు రూ. 130 కోట్ల నగదును పంపిణీ చేశాయి. సున్నా వడ్డీ కారణంగా బృంద సభ్యులు ఒకటి నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు తీసుకోగలిగారు. పైన పేర్కొన్న కాలంలోనే రూ. 130 కోట్లను వీరికి పంపిణీ చేశారు. ఎస్జీహెచ్లలోని సభ్యుల్లో 95 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందారని తేలింది. మరోమాటలో చెప్పాలంటే 5 శాతం మంది సభ్యులు ఒక ప్రయోజనం మాత్రమే పొందగా 40 శాతం మంది సభ్యులు 3 ప్రయోజనాలు పొందారనీ, మిగిలిన 55 శాతం సభ్యులు 6 కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందారనీ తేలింది. సగటున ప్రతి గ్రూప్ మెంబర్ సంవత్సరానికి 50 వేల నుంచి లక్షరూపాయల వరకు లబ్ది పొందారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా స్వయం సహాయక బృందాలకు దాదాపు రూ. 170 కోట్లు పంపిణీ చేశారు. ఇది కాకుండా, రైతు భరోసా, అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, శ్రీనిధి తదితర సంక్షేమ పథకాలు, బ్యాంక్ రుణాలు కలిసి రూ. 300 కోట్ల నగదు మహిళలకు అందింది. ‘నవరత్నాలు’ పేరిట సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిని అనుసరించింది. దీంతో ప్రభుత్వం అందించే ప్రయోజనాలు నేరుగా లబ్ధి దారుల ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయి. వలంటీర్ వ్యవస్థతో కూడిన గ్రామ, వార్టు సచివాలయాల వ్యవస్థ ద్వారా కులం, మతం, జెండర్, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. బ్యాంకుల రుణాలు, సంక్షేమ పథకాలు సకాలంలో అందితే వ్యవసాయరంగం ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఏపీ ప్రభుత్వ పాలన నిరూపించింది. గత మూడేళ్ల నాలుగు నెలల్లో ఈ మండలంలో రైతులు ఖరీఫ్, రబీ సీజన్లు రెండింటిలోనూ మూడు పంటలు పండిస్తూ వచ్చారు. ఖరీఫ్‌లో ప్రధానంగా వరి పంట పండించారు. రబీలో బోర్‌వెల్స్‌లో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో రాగులు, వరి, నువ్వులు, నల్ల ఉలవలు వంటి పంటలను పండించారు. ఈ మూడేళ్ల నాలుగు నెలల కాలంలో వరి ధాన్యం 24– 26 సంచులు ఎక్కువగా పండించారు. వరి పంట పండించిన రైతుల ఆదాయం రూ. 12 వేల నుంచి 15 వేల రూపాయల వరకు పెరిగింది. రాగి పంట 7 బస్తాలు అదనంగా పండింది. ఆదాయం రూ. 30 వేలవరకు పెరిగింది. నువ్వుల పంట కూడా 3 క్వింటాల్స్ అదనంగా పెరిగి రూ. 30 వేల వరకు ఆదాయం కూడా పెరిగింది. మూడేళ్లలోపే పంటల విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగి రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరగడానికి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల వల్ల లభించే సహాయం సకాలంలో రైతులకు అందడమే కారణమని స్వయం సహాయక గ్రూపు సభ్యులు ముక్త కంఠంతో చెప్పారు. రైతుభరోసా కేంద్రాల్లో అవసరమైనంత పరిమాణంలో ఎరువులు, పురుగు మందులు మార్కెట్ రేట్ కంటే పది శాతం తక్కువ ధరకే లభించడంతో వ్యవసాయ దిగుబడుల్లో గణనీయంగా మార్పు వచ్చింది. వ్యవసాయ యంత్రాలు, ఇతర ఉప కరణాలను కూడా రైతు భరోసా కేంద్రాలు అద్దె ప్రాతిపదికన అందించడంతోపాటు వరి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి సేకరించడంతో రైతుకు బహుళ ప్రయోజనాలు కలిగాయి. మండలంలో అనేక కార్యక్రమాల ద్వారా కుటుంబ ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. సున్నావడ్డీ కారణంగా ఒకటి నుంచి రెండులక్షల రూపాయల మేరకు రుణాలను తీసుకున్న మహిళా సభ్యులు పెద్దగా కష్టం లేకుండానే రుణ చెల్లింపులు చేస్తూవచ్చారు. దీంతో మహిళా స్వయం సహాయక గ్రూపులు తీసుకున్న బ్యాంక్ రుణాల్లో నిరర్థక రుణాల శాతం 0.5 శాతం మాత్రమే నమోదవడం విశేషం. ఏపీలో ప్రభుత్వం ప్రారభించిన అమ్మ ఒడి పథకం కారణంగా మహిళలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో పెద్దఎత్తున చేర్పించ గలిగారు. ఇక ‘విద్యా దీవెన’, ‘విద్యా వసతి’ పథకాల ద్వారా ఆర్థిక ఇబ్బందులు లేకుండానే మహిళలు తమ పిల్లలను ఉన్నత విద్య చదవడానికి పంపించారు. పద్మనాభ మండలంలోని స్వయం సహాయక బృందంలోని 600 మంది సభ్యుల్లో వందమంది చేయూత పథకం కింద గొర్రెలు, మేకలు కొన్నారు. ఈ మండలం లోని 900 మంది మహిళా సభ్యులు ‘జగనన్న తోడు’ పథకం కింద తమ కూరగాయాలు, ఆకు కూరలను అమ్ముకోగలిగారు. దీంతో వడ్డీ చెల్లింపుల భారం తగ్గిపోయింది. ‘తోపుడు బండి’ పథకం కింద 300 మంది మహిళలు ఊరగాయలు తయారు చేసి అమ్మి లాభాలు సంపాదించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాల కల్పన, చక్కటి వర్షపాతం కారణంగా పద్మనాభ మండలంలోని ప్రతి ఒక్క కుటుంబం తాము సంతోషంగా ఉంటున్నట్లు తెలిపారు. రెండు పంటలు పండటం, పంటల్లో వైవిధ్యత, ప్రత్యేకించి కూరగాయలు, ఆకుకూరల సేద్యం పెరగడం వల్ల రైతుల నికర ఆదాయం బాగా పెరిగింది. దీంతో లేబర్‌కి డిమాండ్ పెరిగి కూలీ రేట్లుకూడా పెరిగాయి. ఇవన్నీ చేరి రైతు కుటుంబాలు రుణ భారం నుంచి బయటపడ్డాయి. కుటుంబాలు తమ సొంత వనరులను ఏర్పర్చుకోవడంతో అప్పులు లేకుండా ఇళ్లు కట్టుకుంటున్నారు. ఇటుకల బట్టీలు, ఆటో ట్రాన్స్పోర్ట్ వంటి వ్యవసాయేతర ఉపాధి అవకాశాలను వీరు సృష్టించుకున్నారు. పిల్లలకు ఉచిత విద్య కారణంగా మహిళలు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కేటాయించినా, 65 శాతం పైగా సీట్లను మహిళలే కైవసం చేసుకోవడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ పథకాలు, బ్యాంకుల వితరణ కారణంగా కుటుంబాల్లో దారిద్య్రస్థాయి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా నిరుపేదల్లో కెల్లా నిరుపేద కుటుంబాల్లో 90 శాతంపైగా దారిద్య్ర రేఖను అధిగమించేశారు. ప్రతి సంవత్సరమూ పెరుగుతున్న సంపాదన కారణంగా వీరు ఇప్పుడు దిగువ మధ్యతరగతి వర్గంలోకి చేరుకున్నారు. పోషకాహారం పట్ల శ్రద్ధ పెరగడం, నాణ్యమైన దుస్తులు ధరించడం, రోజువారీ దుస్తుల స్టయిల్ కూడా మారిపోవడం వంటి పలు కారణాలతో మహిళా బృంద సభ్యులు ఎలాంటి ఆకస్మిక పరిణామాలు, ఎదురుదెబ్బలనైనా తాము తట్టుకోగలమని ఆత్మ విశ్వాసంతో ఉండటం మరీ విశేషం. అంతిమంగా పేదల అనుకూల విధానాలను వైఎస్ జగన్ ప్రభుత్వం క్రియాశీలకంగా అమలు చేయడం వల్లే గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి గొప్ప మార్పు చోటు చేసుకుంటోందని చెప్పవచ్చు. సంక్షేమ పథకాల ద్వారా అట్టడుగు వర్గాలు, పేదల జీవితాల్లో సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుండటమే దీనికి కారణమని నొక్కి చెప్పవచ్చు. (క్లిక్ చేయండి: పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు) - ప్రొఫెసర్ కె.వి.రమణా రెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ -
ఆపత్కాలంలో ఏపీ నగదు వ్యూహం
జగన్ ప్రభుత్వం తక్షణమే నగదు బదిలీ చేయాలన్న ఒక సార్వత్రిక సహజ న్యాయ సూత్రాన్ని అమలు చేసింది. నగదు బదిలీ ద్వారా మాత్రమే రోజువారి కూలీలు, చిన్న సన్నకారు మెట్ట ప్రాంత రైతులు, అట్టడుగు సామాజిక వర్గాల వారి చేతిలో నాలుగు రూపాయల డబ్బులు పెరిగి మార్కెట్లో సరుకులకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా అది ఉత్పత్తులు పెరగడానికి, ఉద్యోగ ఆదాయ కల్పనకు దారితీస్తుంది. అందువల్లనే ప్రత్యక్ష నగదు చెల్లింపులు చేయాలని ప్రపంచంలో పేరుగాంచిన ఆర్థిక వేత్తలు, పరిశోధన సంస్థలు ఉమ్మడిగా తేల్చి చెప్పాయి. కరోనా వైరస్ మూలంగా లాక్డౌన్ మొదలై ఐదు నెలలు దాటింది. ఈ ఐదు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా రెండు కీలక అంశాలమీద చర్చ జరుగుతున్నది. మొద టిది, వీలైనంత తొందరగా టీకా కనుగొనే విషయమై వైద్యరంగానికి సంబంధించినది. రెండవది, లాక్డౌన్ మూలంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి నగదు బదిలీ ఆవశ్యకతపై చర్చ. వైరస్ సోకితే ప్రాణాపాయ సమస్య రెండు శాతానికే పరిమితం కాగా, ఆర్థిక సంక్షోభ సమస్య 90 శాతం పైగా ప్రజలను చుట్టుముట్టి వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడలేని నిస్సహాయ స్థితిలోకి సమాజాన్ని నెట్టివేస్తుంది. కరోనా టీకా వచ్చే వరకు ఆర్థిక వ్యవస్థకు కూడా ఆక్సిజన్ అందించడం అనివార్యం. ఆ ఆక్సిజన్ పేరే తక్షణ నగదు బదిలీ. ఈ విషయంలో అర్థశాస్త్ర నోబెల్ గ్రహీతలు అమర్త్యసేన్, అభిజీత్ బెనర్జీ మొదలు రఘురామ్ రాజన్, మన్మోహన్ సింగ్ వరకు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే కాక, భారీమొత్తంలో అంతర్జాతీయ సంస్థల నుండి అప్పులు చేసైనా, చిట్ట చివరి అస్త్రంగా కరెన్సీని అదనంగా ముద్రించైనా నేరుగా నగదు బదిలీ చేయాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తున్నారు. అంతర్జా తీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్ మొదలు ప్రపంచవ్యాప్తంగా వున్న అన్ని ఆర్థిక సంస్థలు కూడా ఇదే విషయమై అన్ని దేశాలకూ పిలుపునిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాల పాలనా సామర్థ్యాలకు సవాల్ విసరడమే గాక, మన సమాజ అనుభవంలోకి మునుపెన్నడూ రాని ఇంతటి గడ్డు పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఎదుర్కున్నదో పరిశీలించడమే ఈ వ్యాసం ఉద్దేశం. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టేనాటికి, అంటే కరోనా వ్యాప్తి జరగకముందే భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోయి కదలలేని స్థితిలో ఉంది. 2014 నుండి వృద్ధిరేటు క్షీణిస్తూ మూడు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి చేరింది. 2015– 16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతం ఉండగా, 2019– 20లో 4.2 శాతానికి పడిపోయింది. దీనికితోడు అంతకుముందే చంద్రబాబు ప్రభుత్వ అరాచక ఆర్థిక నిర్వహణ ఫలితంగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లు పేరుకుపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా ఉండటానికి ముందుచూపుతో ప్రభుత్వం ఆర్థిక సహకారం అవసరం ఉన్న అన్ని వర్గాలవారికి నేరుగా నగదు బదిలీ ద్వారా మొదటి సంవత్సరంలో దాదాపు 40139.58 కోట్ల రూపాయలను అందించింది. ఈలోగా కరోనా రూపంలో జగన్ ప్రభుత్వానికి మరో పరీక్ష ఎదురైంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2017 –18 గణాంకాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి తేల్చిన అంచనాల ప్రకారం, దేశంలో ఇదివరకే పేదరికంలో వున్న 56 కోట్లమంది కాక, లాక్డౌన్ వల్ల మరో 40 కోట్లమంది కొత్తగా పేదరికపు రేఖకు దిగువకు పడిపోయారు. వీరిలో దాదాపు 62 కోట్లమంది అంటే దాదాపు 47 శాతం కటిక దారిద్య్రపు కోరల్లో చిక్కుకున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అంచనా ప్రకారం, లాక్డౌన్ వల్ల ఒక నెలకు దేశ సంపద 12 శాతం హరించుకుపోయింది. పర్యవసానంగా నిరుద్యోగ రేటు అంచనాలకు అందనంతగా పెరిగింది. ఇంతటి విషాద పరిస్థితుల్లో ఖజానా నుండి పైసా తీయకుండా చేసే వట్టి ప్రచారాల వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని భావించిన జగన్ ప్రభుత్వం తక్షణమే నగదు బదిలీ చేయాలన్న ఒక సార్వత్రిక సహజ న్యాయ సూత్రాన్ని అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యగా స్వల్ప నగదు సహాయం మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుంది. అంతకంటే ఎక్కువగా పారిశ్రామిక వర్గాలకు పలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించింది. డిమాండ్ పడిపోయిన ఆర్థిక రంగంపై కేవలం ప్యాకేజీలు ఏమాత్రం ప్రభావం చూపవన్నది కఠిన వాస్తవం. ప్రజలకు ఆదాయాలు పెరిగితే మార్కెట్లో వస్తువులను కొంటారు, వస్తువులు అమ్ముడుపోతే పరిశ్రమలు సరుకులు ఉత్పత్తి చేస్తాయి. అందువలన ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ఏ ప్రభుత్వమైనా ప్రాధాన్యత ఇవ్వాలి. డిమాండ్ పడిపోయివున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులకు ద్రవ్య సరఫరా పెంచినా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడదనేది 1930 నుండి ప్రపంచ వ్యాప్తంగా అనుభవంలో ఉన్న విషయమే. నగదు బదిలీ ద్వారా మాత్రమే రోజువారి కూలీలు, చిన్న సన్నకారు మెట్ట ప్రాంత రైతులు, అట్టడుగు సామాజిక వర్గాల వారి చేతిలో నాలుగు రూపాయలు డబ్బులు పెరిగి మార్కెట్లో సరుకులకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా అది ఉత్పత్తులు పెరగడానికి, ఉద్యోగ ఆదాయ కల్పనకు దారితీస్తుంది. అందువల్లనే ప్రత్యక్ష నగదు చెల్లింపులు చేయాలని ప్రపంచంలో పేరుగాంచిన ఆర్థిక వేత్తలు, పరిశోధన సంస్థలు ఉమ్మడిగా తేల్చి చెప్పాయి. నగదు బదిలీద్వారా కొనుగోలు శక్తిని వీలున్నంతవరకు అందించడం అనేది ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కీలకాంశం అవుతుంది కాబట్టి. నగదు బదిలీ పథకం లబ్ధిదారులు మహిళలు అయితే దాని ప్రభావం మరింత శక్తిమంతంగా ఉంటుందనీ, అది మొత్తం కుటుంబ జీవన ప్రమాణాలను, ప్రత్యేకించి పిల్లల భవిష్యత్‌ను ప్రభావితం చేస్తుందనీ ఇప్పటికే అంతర్జాతీయ సర్వేలు తేల్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చాలా నగదు బదిలీ పథకాల్లో లబ్ధిదారులు నేరుగా మహిళలే ఉండటం ఒక అద్భుతమైన విషయం. నగదు బదిలీ ద్వారా పొందిన మొత్తం దేనిపై పెట్టుబడి పెట్టాలి, ఏ వినియోగంపైన ఏ అవసరాలకు ఖర్చు చేయాలి అనే ఎంపిక స్వేచ్ఛ కూడా ఆ కుటుంబాలకు ఉంటుంది. లాక్డౌన్ వల్ల ఒకవైపు కుటుంబాలకు పని లేక ఆదాయం తగ్గడమే గాక మరోవైపు ప్రభుత్వానికి కూడా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోవడం మూలంగా వనరుల కొరత ఏర్పడింది. అయినప్పటికీ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను మరింతగా విస్తరించింది. ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చడం కరోనా పూర్వపు పరిస్థితి కంటే అత్యవసరమని గుర్తించింది. ఏప్రిల్ 1 నుండి ఇప్పటివరకు 21,183.36 కోట్ల రూపాయలను నేరుగా నగదు బదిలీ ద్వారా 1,64,72,245 మందికి సహాయం చేసింది. వైఎస్సార్ విద్యా దీవెన ద్వారా 4200 కోట్లను విడుదల చేసి నగదు చెలామణిని పెంచింది. ప్రత్యేకించి అట్టడుగు వర్గాలకు దన్నుగా నిలిచింది. నేతన్న హస్తం ద్వారా చేనేతలకు ఒక్కో కుటుంబానికి 24 వేల చొప్పున 81,703 మందికి నేరుగా సహాయం చేసింది. జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ కుటుంబాలకు 10 వేల చొప్పున 480 కోట్లను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. రైతు భరోసా కింద మొదటి విడతగా 3,675 కోట్ల రూపాయలు మే నెలలోనే అందించింది. అంతేగాక 57 లక్షల మంది రైతులకు 1,150 కోట్ల వడ్డీ రహిత రుణాన్ని అందించింది. రైతుల దగ్గర వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి 5,744 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించింది. కందులు, శనగలు, జొన్నలు, పసుపు తదితర పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసి మరో 2,624 కోట్లు రైతులకు చెల్లించింది. ఇప్పటివరకు ఐదు విడతలుగా 1 కోటి 50 లక్షల రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కందులు, శనగలు పంపిణీ చేసింది. రేషన్‌కార్డుదారులకు 1000 చొప్పున నగదు సహాయం చేసింది. స్వయం సహాయక సంఘాల్లోని 91 లక్షల మంది మహిళలకు వడ్డీరహిత రుణ పథకం ద్వారా 1,400 కోట్లు అందించింది. అర్చకులకు, ఇమామ్‌లకు, పాస్టర్లకు 5 వేల చొప్పున 77,290 మందికి సహాయం చేసింది. వైఎస్సార్ చేయూత ద్వారా ఒక్కో కుటుంబానికి 18,750 చొప్పున 22,28,909 మంది మహిళలకు నేరుగా నగదు సహాయం చేసింది. దానితోపాటు అమూల్, అల్లానా, రిలయన్స్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తద్వారా మహిళలను మైక్రో ఎంటర్ప్రైనర్స్గా మార్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపట్టడం మరో సంచలనం. విభిన్న పథకాలకు అర్హత పొందడం ద్వారా దాదాపు 25 వేల చొప్పున నగదు సహాయం పొందిన కుటుంబాలు లక్షల్లో ఉండటం చెప్పుకోదగ్గ విషయం. దేశవ్యాప్తంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి దాని ప్రభావం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లపై కూడా పడింది. గత ఆర్థిక సంవత్సరం జూలై నెలతో పోల్చితే ఈ సంవత్సరం జూలైలో దాదాపు 14.36 తక్కువగా జీఎస్టీ వసూలైంది. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీఎస్టీ వసూళ్లలో దేశవ్యాప్తంగా నమోదైన 14.36 శాతం ప్రతికూలతలను అధిగమించి 2.65 శాతం వృద్ధిని సాధించింది. పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకంలో 1.90 శాతం అధికంగా వృద్ధి నమోదైంది. కరోనా ఆర్థిక సంక్షోభ కాలంలో కేంద్రప్రభుత్వం సహా మరే ఇతర ధనిక రాష్ట్రాలు సైతం చేయని విధంగా తక్కువ వనరులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా నగదు సహాయం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కలిగించిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. మాములుగా ఎన్నికలు అయిపోగానే ఎన్నికల మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన పార్టీనే కాక ‘ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయండి’ అని నిలదీయాల్సిన ప్రజలు కూడా మర్చిపోతున్న సంప్రదాయాన్ని ఇప్పటివరకు మనం చూశాం. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజునుండే తన ఎన్నికల మేనిఫెస్టోను తు.చ. తప్పకుండా అమలు చేయడమేగాక, దాన్ని ప్రజాక్షేత్రంలో బహిరంగంగా వుంచి ప్రజలకు మేనిఫెస్టోను నిరంతరం గుర్తుచేస్తూ జవాబుదారీగా ఉండటం ఒక సాహసం, సంచలనం. ఇది దేశ రాజకీయాల్లోనే ఒక న్యూ ట్రెండ్! ప్రొ. కె.వి.రమణారెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్కే యూనివర్సిటీ, అనంతపురం. ఫోన్: 9177335604 -
రా.రా. దృష్టిలో సాహిత్య ప్రయోజనం
40 వసంతాల సారస్వత వివేచన సర్వ సాహిత్యానికి హృదయమే కేంద్రం, హృదయమే యితివృత్తం, హృదయాన్ని దాటి సాహిత్యమంటూ ఉండజాలదు. పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్రలు వేయడం ద్వారా అతనిలో ఉత్తమ హృదయ సంస్కారాన్నీ, తద్వారా ఉత్తమ సమాజాన్నీ ఆవిష్కరించడం సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం అంటాడు రారా. ‘‘వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడమూ, ఉన్నత జీవిత విధానాలకు మార్గం చూపించడమూ, ఉత్తమ హృదయ సంస్కారానికి ప్రేరణ ఇవ్వడమూ సాహిత్య లక్ష్యాలుగా చలామణి కావడం లేదు. నిస్సారమూ, తరచూ బాధాకరమూ అయిన జీవిత వాస్తవాన్ని విస్మరించడానికి మద్యం లాగే ఒక సాధనమైంది సాహిత్యం’’. ఈ చేదు నిజాన్ని రాచమల్లు రామచంద్రారెడ్డి(రారా) వెల్లడించి నలబై ఏళ్లు. అంటే రారా ‘సారస్వత వివేచన’ వెలువడి ఈ జూలైకి నలబై ఏళ్లు. 1976లో వెలువడిన ఈ ‘సారస్వత వివేచన’ విమర్శా గ్రంథంలో 3 సంపాదకీయాలు (‘సంవేదన’ పత్రిక లోనివి), 13 సమీక్షలు, 2 స్వతంత్ర వ్యాసాలు ఉన్నాయి. ఇందులోని ‘లక్ష్య నిర్వచనం’ అన్న తొలి వ్యాసం ‘సంవేదన’ పత్రిక తొలి సంచిక కోసం రాసిన సంపాదకీయం. ఇందులో సాహిత్యం ముసుగులో కృత్రిమ మనోవికారాలు, అధోలోకపు నీచాభిరుచులు రాజ్యమేలడాన్ని రారా నిరసించాడు. ఉత్తమ సాహిత్యమనేది మానవ మానసిక వికాసంలో ఒక భాగమని తెలిపాడు. అంతేగాక ఉత్తమ సాహిత్యానికి జన్మస్థానం సమాజ జీవితమైనట్లే, దానికి గమ్యస్థానం కూడా సమాజ జీవితమే కావాలని ఆకాంక్షించాడు. రారా దృష్టిలో ‘సాహిత్యం సంపూర్ణంగా హృదయ వ్యాపారం. విమర్శ మేథా వ్యాపారం’. ‘‘సర్వ సాహిత్యానికి హృదయమే కేంద్రం, హృదయమే యితివృత్తం, హృదయమే హద్దు, హృదయాన్ని దాటి సాహిత్యమంటూ ఉండజాలదు.’’ పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్రలు వేయడం ద్వారా అతనిలో ఉత్తమ హృదయ సంస్కారాన్నీ, తద్వారా ఉత్తమ సమాజాన్నీ ఆవిష్కరించడం సాహిత్యం యొక్క పరమ ప్రయోజనం అంటాడు. - రాచమల్లు రామచంద్రారెడ్డి చలం సాహిత్యం మీద తీర్పునిస్తూ- చలం తన రచనలలోని విప్లవాత్మక భావాల ద్వారా సకల కళానియమాలు భగ్నం చేసినందువల్లా, తన హృదయంలోని భావుకత వలనా, తన మనస్సులోని నిస్సంకోచం వలనా, తన విశ్వాసాల్లోని అంతశ్శుద్ధి వల్లా, తన వ్యక్తిత్వంలోని ఔన్నత్యం వల్లా, తన రచనల్లోని విప్లవ భావజాలం గల పాత్రల వల్లా, తన చుట్టూ ఉన్న సమాజాన్నీ, తన సమకాలీన సాహిత్యాన్నీ, తను బ్రతికిన యుగాన్నీ తన విప్లవ దీధితులతో దేదీప్యమానం చేసిన మహానుభావుడు, అంటాడు రారా. అయితే, సాహిత్యకారుడిగా కంటే చలాన్ని ప్రచారకుడిగానే ఎత్తిచూపుతాడు. చలానికి కళానియమాల మీద ధ్యాస లేకున్నా, కళాత్మకతతో నిండడం వల్లే ఆ రచనలకు ప్రాముఖ్యం దక్కిందన్నాడు. చలమే లేకపోతే తెలుగు సాహిత్యంలో వాస్తవికావాదం ఇంత బలంగా ఉండేది కాదనీ, తెలుగు సాహిత్యానికి చలం ఇచ్చిన వరం అన్ని దుర్గుణాలలోనూ జీవితాన్ని వాస్తవికంగా చూడగల్గడమనీ రారా మూల్యాంకనం చేస్తాడు. అయితే చలాన్ని హెడోనిస్ట్(స్వసుఖవాది) అనీ, చివరి దశలోని ‘పురూరవ’లోనూ, ‘సుధ’లోనూ కనపడేది సాహిత్యజీవిత మరణదశే అనీ విమర్శించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. తిలక్ కవిత్వానికి ముగ్ధులయి నేటికీ ఆయన్ను అభ్యుదయ కవిగా పొరబడుతుంటారు (శ్రీశ్రీ సైతం ఆయన్ను అభ్యుదయ కవి అన్నారు). ‘‘దుఃఖితుల పట్లా, బాధితుల పట్లా తిలక్ అపారమైన కరుణతో కరిగిపోయిన మాట యెవరూ కాదనరు... ఆ కరుణ దుఃఖితులనూ, బాధితులనూ, క్రియాశీలురనూ కర్తవ్యోన్ముఖులనూ చేసేది కాదు’’. ‘‘తిలక్ కవిత్వంలో ప్రధానమైనది భావుకత’’. ఇక్కడ కారుణ్య తత్వానికీ, క్రియాత్మకతకీ మధ్య ఉన్న భేదాన్ని వివరించి, తిలక్ యొక్క భావకవితా పునాదిని ఎత్తి చూపడమేగాక, ఆధునిక ఆచ్ఛాదన ముసుగులో తిలక్‌లో దాగివున్న ప్రబంధకాలపు అవలక్షణాలను సైతం విమర్శించాడు రారా. ‘కన్యాశుల్కం’ని సమీక్షిస్తూ- సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో గురజాడ ముందుచూపును గూర్చి ఉన్నతంగా తీర్పునిస్తాడు రారా. ‘‘నాటి సంస్కర్తల అసంపూర్ణ జ్ఞానమూ, అవాస్తవిక దృక్పథమూ, అరకొర ఆలోచనలూ ఆయన భరించలేకపోయాడు’’. ‘‘సాంఘిక దృక్పథంలో, హృదయ సంస్కారంలో ఆనాటి సంస్కర్తలు, సంస్కరణోద్యమాల కంటే కొన్ని మైళ్ల ముందుచూపు కలిగి వుండినాడు.’’ ‘‘ఎంత ముందుచూపు అంటే, తన సమకాలిక ప్రగతి ఉద్యమాల పట్ల సానుభూతి చూపలేనంత ముందుచూపు; తన సమకాలిక మేధావుల బుద్ధికి అందనంత ముందుచూపు; తన సమకాలిక ప్రగతిశీలురలోని లోటుపాట్లను బహిర్గతం చేయడమే తన నాటకాలలోనూ, కథలలోనూ ఇతివృత్తంగా పెట్టుకునేటంత ముందుచూపు.’’ కాబట్టే, తెలుగు జాతికి ఒక షేక్స్పియర్ లేని లోటునూ, ఒక ఇబ్సెన్ లేని లోటునూ, ఒక చెహోవ్ లేని లోటునూ ఏకముఖంగా తీర్చిన మహానుభావుడు గురజాడ అని కీర్తిస్తాడు. కె.వి.రమణారెడ్డి ‘మహోదయం’ను గురజాడపై వచ్చిన విజ్ఞాన సర్వస్వం అంటాడు రారా. గురజాడ మీద సమగ్రమైన జీవితకథ లేని లోటు యీ ‘మహోదయం’తో తీరుతుందనీ, సాహిత్యాభిరుచి మరియు చారిత్రక అభినివేశమూ వుంటే తప్ప ఇలాంటి గ్రంథం రాయలేరనీ అంటాడు. అయితే, కె.వి.ఆర్. గురజాడ రచనల్లో ‘భాష, భావం, ఇతివృత్తం, ఛందస్సు’ అని అన్నింటా గల ఆధునికతను ప్రశంసిస్తూనే, ఈ అభిప్రాయాన్ని బలపర్చడానికి ఛాందసుల అభిప్రాయాలను ఉటంకించేసరికి, కె.వి.ఆర్.కు కొసవెర్రిలాంటిదేదో వున్నదని విమర్శిస్తాడు. దాన్తో పాటు రమణారెడ్డి శైలి బరువుగా వుంటుందనీ, వాక్య నిర్మాణం వ్యవహార భాషకు అనుగుణంగా లేదనీ అంటాడు. అద్దేపల్లి తన ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ గ్రంథంలో శ్రీశ్రీ అభిప్రాయాలను కానీ విశ్వాసాలను కానీ పట్టించుకోక, కేవలం శిల్పసంపద వల్లే శ్రీశ్రీ మహాకవి అయినాడని చెప్తాడు. అంతేగాక భారతీయ అలంకారిక శాస్త్ర సిద్ధాంతాల్ని శ్రీశ్రీ రచనల కన్వయించి శ్రీశ్రీ గొప్పకవి అని అద్దేపల్లి ప్రశంసించడాన్ని రారా క్షమించలేకపోయాడు. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ లోని కవితల్ని మూల్యాంకనం చేయాలంటే ఆధునిక యుగ సంవేదన అవసరమనీ, శ్రీశ్రీ ప్రవచించిన విప్లవ భావజాలంతో పరిచయం, కనీసం స్థూలంగానైనా అవసరమనీ రారా భావిస్తాడు. ‘‘అద్దేపల్లి రామమోహనరావు గారికి మన ఆలంకారికులు రాసిన లక్షణ గ్రంథాలు సరిగ్గా అర్థం కాలేదు. ఇక శ్రీశ్రీ కవిత్వం అర్థం చేసుకునే శక్తి ఈయనకీ జన్మలో కలిగేటట్లు లేదు. ఈ రెంటిలో ఏది సక్రమంగా అర్థమైవుండినా ఈయన ఈ వ్యాసాలు రాసేవాడు కాదు’’ అని తీవ్రంగా నిరసిస్తాడు. కొడవటిగంటి కుటుంబరావును అభినందిస్తూ- ‘‘ఆధునికత, వాస్తవికత, శాస్త్రీయత,అభ్యుదయ దృక్పథం మొదలైన పదాలన్నీ కొన్ని కొన్ని కోణాల నుండి మాత్రమే ఆయన్ను తెలియజేయగలవు’’. వీటి సమాహారమే కొ.కు. వ్యక్తిత్వ మంటాడు రారా. గురజాడ తర్వాత సాహిత్య ప్రయోజనం గురించి స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి కొకు అని చెబుతాడు. అయితే, దిగంబర కవుల్ని మాత్రం రారా సరిగ్గా అంచనా వేయలేకపోయారనిపిస్తుంది. ‘‘ఆ తిట్లూ, ఆ బూతులూ, ఆ ఆటవిక ఆవేశమూ, ఆ ఒళ్లెరుగని కుసంస్కారమూ, ఆ నోటితీటా జుగుప్స కలిగిస్తాయి’’ అని అసహ్యించుకున్న రారా వారి సామాజిక నిరసనను దర్శించలేకపోయారనిపిస్తుంది. అయితే, ‘క్రూరుడైన విమర్శకుడు’ అనిపించుకున్నప్పటికీ, ఈ వ్యాసాలు చదువుతుంటే సాహిత్య, సామాజిక, తాత్విక, విజ్ఞాన శాస్త్రాలను రారా ఎంత లోతుగా అధ్యయనం చేశాడో వెల్లడి అవుతుంది. పతంజలి అన్నట్లు, ‘గురజాడనూ, శ్రీశ్రీనీ, చలాన్నీ ఆయన అంచనా కట్టిన తీరు యువతరానికి మార్గదర్శకం’. చేరా అభిలషించినట్లు, ‘రారా ఒరవడి నిలవాలి’. రా.రా. సారస్వత వివేచనలో... తెలుగుజాతికి ఒక షేక్స్పియర్లేని లోటును తీర్చినవాడు గురజాడ. సాహిత్యకారుడికంటే ఎక్కువగా ప్రచారకుడు చలం. అయినా కళాకారుడు. గురజాడ తర్వాత సాహిత్య ప్రయోజనం స్పష్టంగా అర్థమైనవాడు కొ.కు. తిలక్ అభ్యుదయ కవి కాదు. ప్రబంధ (అవ)లక్షణాల భావుకుడు. - టి.హజరత్తయ్య 9502547993