ప్రతీకాత్మక చిత్రం
సాహిత్య మరమరాలు
కాళిదాసు అఆలు కూడా తెలియని అమాయకుడనీ, అతని భార్య పండితురాలనీ కథలు ప్రచారంలో ఉన్నై కదా! ఆ ముచ్చట ఇది.కాళిదాసు శోభనం గదిలో పందిరి మంచం మీద కూర్చొని ఉన్నాడు. భార్య పాలపాత్రతో గదిలోపలికి వచ్చింది. ‘అస్తి కశ్చిత్ వాగ్విశేషః?’(విశేషా లేమిటండీ) అంది. సంస్కృతంలో అఇఉణ్‌లు కూడా రాని కాళిదాసు తెల్లమొగం వేసి ‘నువ్వడిగింది ఏమిటి?’ అన్నాడు. సంగతి తెలుసుకొన్న భార్య పరిహాసంగా మాట్లాడింది. దాని నాయన అవమానంగా భావించి, ఆ అర్ధరాత్రి సమయంలోనే కాళికాదేవి ఆలయానికి వెళ్లాడు. ఆమె అనుగ్రహంతో అద్భుతమైన కవనశక్తిని పొందాడు. ఇంటికి తిరిగివచ్చాడు. తాను మహాకవి కావటానికి కారణమైన ఆ ప్రశ్నలోని అస్తి, కశ్చిత్ , వాక్... మూడు పదాలు ముందు వచ్చేట్లుగా కుమార సంభవం, మేఘ సందేశం, రఘువంశం రచించాడు.
‘అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామ నగాధి రాజః’– భారతదేశానికి ఉత్తర దిగ్భాగంలో హిమాలయమనే పర్వతరాజ మున్నది అంటూ కుమార సంభవం ప్రారంభ మవుతుంది. ‘కశ్చిత్కాంతా విరహగురుణా స్వాధికారాత్ ప్రమత్తః’– ఒకానొక యక్షుడు తన కర్తవ్యాన్ని సరిగా నిర్వహించకపోవటం వలన శపించబడి భార్యకు దూరమై విరహంతో వేగిపోతున్నాడు అంటూ మేఘసందేశం ప్రారంభ మవుతుంది. ‘వాగర్థా వివ సంపృక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే’– శబ్దార్థాల జ్ఞానం కోసం శబ్దం అర్థం లాగా కలిసి ఉన్నటువంటి జగన్మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అంటూ రఘువంశం ప్రారంభమవుతుంది.
- డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment