అమెరికా– టెక్సస్‌లో ఉన్న చిన్న ఊరు స్లోన్. నల్ల ఫుట్‌బాల్ ఆటగాడైన డూంట్ మీద, స్కూల్ ఛీర్ లీడర్ అయిన తెల్లమ్మాయి నిక్కీని మానభంగం చేసి, హత్య చేసిన నేరం మోపబడి ఉరిశిక్ష పడుతుంది. నిజానికి, అతనికి ఆ హత్యతో ఏ సంబంధం ఉండదు. కాకపోతే, జ్యూరీ సభ్యులందరూ తెల్లవారే కావడం వల్ల డూంట్ జాత్యహంకారానికి బలై, తొమ్మిదేళ్ళ శిక్ష పూర్తి చేస్తుండగా నవల మొదలవుతుంది. 1998లో నిక్కీని అపహరించి, బలాత్కరించి, గొంతు నులిమి – ఆరుగంటల దూరాన ఉన్న మిజోరీలో శరీరాన్ని పాతి పెట్టినది ట్రావిస్. పోలీసులు డూంట్‌ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తూ ఊరుకుంటాడు.
వర్తమానంలో డూంట్ ఉరిశిక్షకి నాలుగు రోజులే మిగులుతాయి. బ్లాక్ అమెరికన్లు డూంట్ మీదున్న తప్పు దోషనిర్ధారణని వ్యతిరేకిస్తూ, సమ్మె చేస్తారు. డూంట్ లాయరైన రాబీ దానికి నాయకత్వం వహిస్తాడు.
ట్రావిస్ లైంగిక దాడుల రికార్డ్ చిన్నదేమీ కాదు. మరో నేరం చేసి, పూచీకత్తు మీద వదిలి పెట్టబడతాడు. శస్త్రచికిత్స లేని మెదడు కణితితో బాధపడుతూ, తన పాత నేరాన్ని వొప్పుకుందామని నిర్ణయించుకుంటాడు. ఊర్లో జాతి ఉద్రిక్తత నెలకొన్నప్పుడు, తను నిక్కీని ఎక్కడ పాతి పెట్టాడో ట్రావిస్ చెప్తాడు. డీఎన్‌ఏ శాంపిల్స్ బట్టి – బలాత్కారం, హత్యా నిర్థారించబడినప్పటికీ – తన అరెస్ట్ తాకీదుకి ముందే, ట్రావిస్ పారిపోతాడు. డూంట్ ఉరి ఎవరూ ఆపలేకపోతారు.
పాస్టర్ అయిన ష్రౌడర్– రేపిస్టూ, హంతకుడూ అయిన ట్రావిస్‌కు హామీ ఇచ్చి, జైలుబారిన పడకుండా రక్షించినందుకు పశ్చాత్తాపపడి, జరిమానా చెల్లిస్తాడు. తన పదవికి రాజీనామా చేస్తాడు.
ఈ పుస్తకంలో అతి వ్యాకులపరిచేవి డూంట్ గత జ్ఞాపకాలూ, తన పేరుకంటిన కళంకాన్ని దూరం చేసుకునే అతని ప్రయత్నాలూ. తన స్వస్థచిత్తతను కాపాడుకోడానికి జైల్లో బైబిల్ చదువుతూ, తన ఫుట్‌బాల్ ఆటని గుర్తు చేసుకుంటుంటాడు. భూమ్మీద తన ఆఖరి దినాన తనకు తాను నచ్చజెప్పుకుంటాడు: ‘రోజులు లెక్కపెట్టుకుంటూ సంవత్సరాలు గడిచిపోవడం చూస్తావు. నీవు మరణిస్తేనే నయం అని నమ్ముతూ, నిన్ను నీవు సమర్థించుకుంటావు. మరణాన్ని తేరిచూస్తూ, అవతల నీకోసం వేచి ఉన్నదేదైనా కానీ– అది మాట్లాడ్డానికి ఎవరూ లేని యీ ఆరు బై పది పంజరంలో, ముసలివాడివవుతూ గడపడం కన్నా నయమే అయి ఉంటుందనుకుంటావు. ఎలాగూ సగం మరణించే ఉన్నావు కనుక మిగతా సగాన్నీ చంపెయ్యమని మృత్యువు మొహం మీదే చెప్పడమే మంచిది అనుకుంటావు.’
‘ద కన్ఫెషన్’ పుస్తకం, రచయిత జాన్ గ్రిషమ్ నమ్మకాల ఆధారమే. ఏదీ ఉపదేశించే ప్రయత్నం చేయనప్పటికీ, రచయిత ఒక ఎదురులేని ప్రశ్న మాత్రం వేస్తారు: ‘ఒక అమాయకుడిని దోషిగా నిర్ణయించి, ఉరిశిక్ష వేసిన సందర్భంలో, స్వతంత్రంగా తిరిగే దోషులకి ఏమీ అవదా?’. మరణశిక్షకి గ్రిషమ్ వ్యతిరేకి అని మొదటినుండీ తెలుస్తూనే ఉంటుంది. వర్తమానం నుండి గతానికి, ఒక పాత్రనుండి మరొక పాత్రకు వెళ్ళే పుస్తకం, మొదలయినంత వేగంగానే ముగుస్తుంది కూడా. పూర్తి పుస్తకం కేంద్రీకరించేది కేవలం ఉరిశిక్ష ఎంత ఘోరమైనదోనన్న విషయం పైనే. నవల్లో–చట్టపరమైన సాంకేతికతల వివరాలూ, జైళ్ళల్లో జరిగే వాస్తవమైన సంఘటనలూ, సామాజిక సమస్యల అనేకమైన వివరాలూ ఉంటాయి. కథనం– తనకి తెలియకుండానే కేసులోకి లాగబడిన పాస్టర్ దృష్టికోణంతో ఉంటుంది. ‘మరణశిక్ష హంతకులకు ఒక పీడకల. ఒక అమాయకుడికి అది మానసిక హింస. దాన్ని తట్టుకునే ధైర్యం మనుష్యులకి ఉండదు’ అని గ్రిషమ్ చెప్పే ఈ నవలని డబల్ డే 2010లో ప్రచురించింది.
కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment