1987. న్యూయార్క్. ‘తను చనిపోతున్నాడని ఫిన్ మామయ్యకి తెలుసు. అందుకే అక్క గ్రెటాదీ, నాదీ చిత్రం గీస్తున్నాడు,’ అంటుంది 14 ఏళ్ళ జూన్. సిగ్గరి అయిన జూన్ మేనమామతో మనసు విప్పి మాట్లాడగలుగుతుంది. ఫిన్ పేరున్న చిత్రకారుడు. అక్కచెల్లెళ్ళిద్దరూ ఆదివారాలు మేనమామతో గడపటానికి తల్లి డానీతోపాటు, అతని మన్హటన్ ఇంటికి వెళ్తుంటారు. పిల్లలకు వారి చిత్రం బçహూకరిద్దామనుకుంటున్నానని ఫిన్ అక్క డానీకి చెప్తాడు. నిజానికి, అది పిల్లలిద్దరితో గడిపే అవకాశం కలిపించుకోడానికి మాత్రమే. తోడేలు తల కూడా ఉన్న ఆ చిత్రానికి ‘టెల్ ద వుల్వ్‌స్ ఐ ఆమ్ హోమ్’ అన్న పేరు పెడతాడు ఫిన్. మామయ్యకున్న జబ్బేమిటో ఎవరూ పిల్లలకు చెప్పరు.
‘అమ్మ– మామయ్య వంటింట్లో రంగురంగుల రష్యన్ టీ సెట్టులో టీ కలుపుతూ, గంటలు వెచ్చిస్తుంది. ఆ సెట్ తనకిష్టమైన వాళ్ళకోసమేనని ఫిన్ చెప్పాడు,’ అంటుంది జూన్. ఫిన్ చనిపోతాడు. అంత్యక్రియలప్పుడు, అక్కడే తచ్చాడుతున్న టాబీని చూపిస్తూ, ‘అదిగో, అతనే ఫిన్‌కు జబ్బు అంటించిన వాడు,’ అని తల్లి చీదరిస్తూ పిల్లలకు చెప్తుంది. అంతకాలమూ డానీ పెట్టిన షరతువల్లే ఫిన్, టాబీ ఉనికిని పిల్లలనుండి దాచి పెట్టి ఉంటాడు. అతను ఫిన్ ప్రేమికుడని అప్పుడు జూన్‌కు తెలుస్తుంది. ఒక రోజు ప్యాకెట్లో జూన్‌కు ఫిన్ టీ సెట్ వస్తుంది. దానితో పాటు తనని కలుసుకోమంటూ టాబీ రాసిన చీటీ ఉంటుంది. టాబీతో కలిసి ఊరంతా తిరుగుతున్నప్పుడు, ఫిన్ లేని లోటు అనుభవిస్తున్నది తనొక్కతే కాదని జూన్ గ్రహిస్తుంది. అప్పటికే చెల్లెలికీ, ఫిన్‌కూ మధ్యనున్న అన్యోన్యత సహించలేని 16 ఏళ్ళ గ్రెటా– తాగుడు అలవరచుకుంటుంది.
జూన్‌కి టాబీ ఒక పుస్తకం ఇస్తాడు. దాన్లో, ‘టాబీకి ఎవరూ లేరు. అతనూ చనిపోబోతున్నాడు. నాకోసమని, అతన్ని జాగ్రత్తగా చూసుకో,’ అని ఫిన్ గతంలో రాసిన ఉత్తరం పెట్టుంటుంది.
ఇంతలో మీడియాకి చిత్రం గురించి తెలుస్తుంది. దాని వెల ఎంతో తెలిసిన తల్లి, చిత్రాన్ని బ్యాంక్ లాకర్లో పెట్టి, తాళాలు కూతుళ్ళకి ఇస్తుంది. జూన్ చిత్రాన్ని చూడ్డానికి వెళ్ళిన ప్రతిసారీ, తన చొక్కా మీద నల్ల బొత్తాలూ, గ్రెటా చేతి వెనుక కపాలం వంటి కూడికలు కనిపిస్తాయి. అది అక్క పనేనని అర్థం చేసుకున్న జూన్, తనూ చిత్రంలోని తమ జుట్టుమీద బంగారం రంగు చారలని వేస్తుంది.
తన స్కూల్ పక్కనున్న అడివంటే జూన్‌కు ఇష్టం. అక్కడుండే తోడేళ్ళ అరుపుల కోసం ఎదురు చూస్తూ సంతోషంగా అడివంతా తిరుగుతుంటుంది. ‘తోడేళ్ళు చెడ్డవి కావు. ఆకలి గొన్నవీ, స్వార్థపూరితమైనవి అంతే’ అనుకుంటుంది. ఒకసారి అక్కడే తాగి పడిపోయిన గ్రెటాని టాబీ ఇంటికి చేరుస్తాడు. ‘అక్కా, నేనూ ఎలా వేరయ్యామో అర్థం అయింది నాకు. ఇన్నేళ్ళ ఆప్తమిత్రులం. తన్ని నేనే విడిచిపెట్టానని ఎందుకు గుర్తించలేకపోయాను!’ అనుకున్న జూన్, గ్రెటాతో రాజీ పడుతుంది.
టాబీని జూన్ తనింటికి తీసుకొస్తుంది. తల్లి అతన్ని క్షమాపణ అడుగుతుంది. అదే రాత్రి టాబీ మరణిస్తాడు. డానీ, గ్రెటా– జూన్ జీవితంలో టాబీకున్న స్థానాన్ని అంగీకరిస్తారు.
హెచ్‌ఐవీ ఒక కళంకం, ఎయిడ్స్ అంటువ్యాధి– అనుకునే కాలపు నేపథ్యం ఉన్న పుస్తకం ఇది. అదే మంకుతనంతో కూడిన అజ్ఞానం డానీలోనూ కనిపిస్తుంది. సమలైంగికత గురించి నోరెత్తడానికి కూడా భయం వేసే ఆ కాలం గురించి సవివరంగా రాసిన కెరోల్ రఫికా బ్రంట్ తొలి నవలను రాండమ్ హౌస్ 2012లో ప్రచురించింది.
కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment