గౌరవాన్ని తిన్న ఆకలి | Short Story in Telugu Literature | Sakshi
Sakshi News home page

గౌరవాన్ని తిన్న ఆకలి

Published Tue, Jul 10 2018 7:23 PM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

 Short Story in Telugu Literature  - Sakshi

ముసలితనం అంటే బాల్యం మళ్లీ తిరిగిరావడమే. నాలుక తప్ప మిగిలిన అన్ని జ్ఞానేంద్రియాల శక్తి కోల్పోయింది చిన్నమ్మ. ఆమె కాళ్లు, చేతులు, కళ్లు అన్నీ ఉడిగిపోయినై. ఇంట్లోవాళ్లు ఆమెకు వేళకు భోజనం పెట్టకపోయినా, చాలినంత పెట్టకపోయినా ఇల్లు అదిరేలా ఏడుస్తుంది.

ఆమె భర్త పోయి చాలా కాలమైంది. కొడుకు కూడా తరుణప్రాయంలోనే చనిపోయాడు. చెల్లెలి కొడుకు పండిత్‌ బుద్ధిరామ్‌ తప్ప ఆమెకు ఎవరూ లేరు. అతడి దగ్గరే ఉంటోంది. ఆమెకున్న ఆస్తినంతా అతడి పేర రాసింది. రాసేముందు అతడు పెద్ద వాగ్దానాలే చేశాడుగానీ అన్నీ కల్లలైపోయాయి. ఆమె ఆస్తి వల్ల ఏడాదికి రెండు వందల రూపాయలకు తక్కువ ఆదాయం రాదు. అయినా ఆమెకు కడుపునిండా తిండే పెట్టరు. దీనికి బుద్ధిరామ్‌ను నిందించాలా, ఆయన భార్య రూపనా అన్నది అర్థం కాదు. బుద్ధిరామ్‌ నిజానికి బుద్ధిమంతుడే, డబ్బులను ఖర్చు పెట్టాల్సిన అవసరం రానంతవరకు. రూపకు ముక్కుమీదే కోపం. కానీ దైవభీతి పరురాలు.

మొత్తం కుటుంబంలో చిన్నమ్మకు ఎవరిమీదైనా ప్రేమ ఉందంటే అది లాడ్లీ. బుద్ధిరామ్‌ ముగ్గురు పిల్లల్లోకీ చిన్నది. మొదటి ఇద్దరు మగవాళ్లు. తల్లిదండ్రులను బట్టే పిల్లల ప్రవర్తన ఉన్నట్టు ఈ ఇద్దరూ ముసలామెను ప్రతిదానికీ ఏడిపిస్తారు. ఒకడు గిచ్చి పరుగెడతాడు, ఇంకొకడు నీళ్లు జల్లుతాడు. ఇంట్లో ఏదైనా మిఠాయి చేసినప్పుడు అన్నలు గుంజుకుంటారని తన భాగాన్ని అమ్మమ్మ గదిలోకి వెళ్లి తింటుంది లాడ్లీ, తినుబండారాలు అంటే పడిచచ్చే అమ్మమ్మ తన మిఠాయిలో వాటా కోరుతుందని తెలిసీ. కానీ రౌడీ అన్నలు లాక్కునేదానితో పోలిస్తే అమ్మమ్మకు పోయేది తక్కువే కాబట్టి ఏం ఫరవాలేదు.

రాత్రి వేళ. బుద్ధిరామ్‌ ఇంట్లో షెహనాయ్‌ వినిపిస్తోంది. ఊళ్లోని పిల్లలు కళ్లు పెద్దవి చేసుకుని దాన్ని ఆనందిస్తున్నారు. అతిథులకు క్షురకుడు మర్దన చేస్తున్నాడు. ఒక కవిగాయకుడు కవిత్వాన్ని వినిపిస్తుంటే, అతిథులు ‘వహ్వా’ ‘వహ్వా’ అంటున్నారు. ఇంగ్లీషు చదువుకున్న యువకులు ఈ మూర్ఖులతో కలవడం తమ స్థాయికి తగదని  దూరంగా నిలుచున్నారు.
ఈరోజు బుద్ధిరామ్‌ పెద్దకుమారుడు సుఖ్‌రామ్‌కు వరపూజ జరుగుతోంది. రూప విందు పనుల్లో హడావుడిగా ఉంది. మట్టిపొయ్యిల మీద పెద్ద మూకుళ్లు పెట్టారు. ఒకదాన్లో పూరీ, కచోరీ, ఇంకోదాన్లో రుచికరమైన కూరలు తయారవుతున్నాయి. నెయ్యి వాసన గాలితో వ్యాపిస్తోంది.

తన గదిలో ఉన్న చిన్నమ్మకు ఈ వాసన సోకి ప్రాణం పోతోంది. నాకు కచ్చితంగా ఈ పూరీలు తేరు, అందరూ తినేసివుంటారు, నాకేమీ ఉంచరు అని తలుచుకుని ఆమె నీరయింది. ఏడుపొచ్చినా ఇంటికి అశుభమని దిగమింగుకుంది.

అబ్బా, ఏం ఘుమఘుమ! నా గురించి ఎవరికి పట్టింది? ఎండిపోయిన రొట్టెలు పెట్టడానికే వాళ్లకు చేతులు రావు, ఈ తీపి పూరీలు నాకు వడ్డిస్తారా? లాడ్లీ ఇవ్వాళ ఇటువైపు రాలేదు. ఇద్దరు మగవాళ్లు మామూలుగానే రారు. అసలు ఇంకా ఏమేం వండుతున్నారో తెలిస్తే బాగుండు.

పూరీలను తలుచుకోగానే చిన్నమ్మ నోట్లో నీళ్లూరినై. ఆమె ఊహలకు రెక్కలు వచ్చినై. బంగారు రంగులో కాలి, మృదువుగా తుంచుకోగలిగే పూరీలు ఆమె కళ్ల ముందు నర్తించినై. చిన్నమ్మకు వెళ్లి మూకుడు ముందు కూర్చోబుద్ధయింది. చేతులు నేలకు ఆన్చి, పాక్కుంటూ గడపదాటి బయటకు వచ్చి, మూకుడు ముందుకు చేరింది.

రూప ఆ సమయంలో ఆత్రంగా ఒక గది నుంచి ఇంకో గదికీ, మూకుళ్ల దగ్గరికీ, భోజన సామగ్రి పెట్టిన చోటుకీ  తిరుగుతోంది. ఎవరో వస్తారు, బుద్ధిరామ్‌ సాబ్‌ లస్సీ తెమ్మంటున్నాడని చెబుతారు. మరెవరో వస్తారు, ఇంకేదో ఇమ్మంటారు. ఈలోపు ఒకరు వచ్చి, ఇంకా భోజనాలకు ఎంత సమయం పడుతుందని అడుగుతారు. ఎవరి మీదా  అరవడానికి లేదు. అరిచామా ఈ మాత్రం పనులు వెళ్లదీసుకోలేక పోయిందని బంధువులు దెప్పుతారు. దాహంతో ఆమె గొంతు తడారిపోతోంది. 

మూకుళ్ల వేడి ఒంటిని మాడుస్తోంది. గుక్కెడు నీళ్లు తాగడానికిగానీ విసనకర్రతో ఊపుకోవడానికిగానీ ఆమెకు తీరుబడి లేదు. ఆ సమయంలో ముసలామె మూకుడు ముందు కూర్చోవడం రూప కంటబడింది. ఆమె కోపం నాషాళానికి ఎక్కింది. ‘అప్పుడే నీ కడుపు కాలిపోతోందా? అది కడుపా, కయ్యా? కదలకుండా నీ గదిలో కూర్చోలేవా? ఇంకా చుట్టాలకే పెట్టలేదు, దేవుడికి పెట్టలేదు, ఈమె తయారయ్యింది. నీ నాలుక పడిపోను. ఒకరోజు తిండి పెట్టలేదంటే వేరేవాళ్ల ఇండ్ల మీద పడుతుంది. అందరూ ఈమెకు భోజనం పెట్టక మాడుస్తున్నామని అనుకుంటారు. ప్రాణమైనా పోదు, పాతకి!’ముసలామె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా పాక్కుంటూ వెనక్కి తన గదిలోకి పోయింది.

భోజనాలు సిద్ధమైనాయి. విస్తళ్లు వేశారు. వడ్డనలు జరుగుతున్నాయి. పనివాళ్లు కూడా భోజనానికి వచ్చారు. కాకపోతే బంతితో కాకుండా దూరంగా కూర్చున్నారు. అందరి తినడమూ పూర్తయ్యేదాకా ఎవరూ బంతిలోంచి లేవకుండా ఉండటం మర్యాద. పనివాళ్లు తినడానికి ఎక్కువసేపు తీసుకుంటున్నారని ఒకరిద్దరు చదువుకున్న అతిథులు విసుక్కుంటున్నారు. ఎంగిలి చేత్తో ఊరికే కూర్చోవడంలో అర్థం లేదని వాళ్ల ఉద్దేశం.

తను చేసిన పనికి ముసలామె సిగ్గుపడింది. రూపమీద ఆమెకు కోపం రాలేదు. కోడలు నిజమే మాట్లాడింది– అతిథులు తినకుండా ఇంట్లోవాళ్లు ఎలా భోంచేస్తారు? ఎవరైనా పిలిచేదాకా ఈ గదిలోంచి బయటకు వెళ్లకూడదనుకుంది. కానీ గాలిలో కలిసి వస్తున్న నెయ్యి వాసన ఆమె ఓపికను పరీక్షిస్తోంది. ఒక్కో క్షణం ఒక యుగంలా గడుస్తోంది. నోట్లో ఏదో పాడుకోవడానికి ప్రయత్నించింది. ఇంతసేపు తింటున్నారా అతిథులు? ఆమెకు ఏ శబ్దమూ వినపడలేదు. అందరూ తినేసి వెళ్లిపోయివుంటారు. నన్ను పిలవడానికి ఎవరూ రాలేదు. రూప కోపంతో ఉంది, ఆమె పిలవకపోవచ్చు. నేనే వస్తానని ఆమె అనుకుంటూండవచ్చు. నేనేమైనా బంధువునా ఆమె వచ్చి పిలుచుకుపోవడానికి. తనే వెళ్లడానికి సిద్ధపడింది వృద్ధురాలు. పూరీలు, కచోరీల తలంపు ఆమెను చక్కలిగింతలు పెట్టింది. చాలారోజుల తర్వాత ఇంట్లో పూరీలు చేశారు. కడుపారా తినేయాలని నిశ్చయించుకుంది. జిహ్వ చాపల్యమని ఎవరు అనుకున్నా సరే లెక్క చేయకూడదనుకుంది.

నెమ్మదిగా చేతులు నేల మీద ఆన్చి, పాక్కుంటూ అరుగు మీదికి వెళ్లింది. కానీ అదృష్టం బాగాలేదు. ఆమె ఓపికలేని మనసు వేసిన లెక్క తప్పింది. అతిథులు ఇంకా తింటున్నారు. అప్పుడే తిన్నవాళ్లు వేళ్లు నాక్కుంటున్నారు. మిగిలిపోయిన పూరీలు ఎలా తీసుకెళ్లాలా అని కొందరు ఆలోచిస్తున్నారు. పెరుగు కానిచ్చి, మారు అడగటానికి మొహమాటపడుతున్నవాళ్లు కొందరు. సరిగ్గా ఈ సమయంలో వాళ్ల మధ్యకు వెళ్లింది. కొందరు ఉలిక్కిపడ్డారు. ఈ ముసల్ది ఎక్కడినుంచి ఊడిపడిందని కొందరు ఆశ్చర్యపోయారు. ఏమీ తాకకుండా చూడండని కొందరు అరిచారు.

చిన్నమ్మను చూడగానే బుద్ధిరామ్‌కు మండిపోయింది. ఆమె అప్పటికే పూరీల పళ్లెం పట్టుకుంది. దాన్ని నేల మీదికి విసిరికొట్టాడు. అప్పు చెల్లించకుండా పారిపోతున్నవాణ్ని కఠినమైన వడ్డీ వ్యాపారి ఎలా పట్టుకుంటాడో అలా ఆమెను గదిలోకి లాక్కెళ్లాడు. వృద్ధురాలి కల క్షణంలో కరిగిపోయింది.

అతిథులు తినడం పూర్తయింది. ఇంట్లోవాళ్లందరూ తిన్నారు. వాద్యకారులు, పనివాళ్లు కూడా తినడం అయింది. కానీ ముసలామెను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమె చేసిన సిగ్గుమాలినపనికి ఈమాత్రం శిక్ష పడవలసిందే అనుకున్నారు బుద్ధిరామ్, రూప. ఎవరూ ఆమె వయసు మీద దయచూపలేదు. ఆమె నిస్సహాయతను పరిగణనలోకి తీసుకోలేదు. లాడ్లీకి తప్ప ఎవరికీ ఆమె మీద ప్రాణం కొట్టుకోలేదు.

తల్లి, తండ్రి ఇద్దరూ నానమ్మను అలా అనడం ఆ చిట్టితల్లికి ఏడుపు తెప్పించింది. ఆమెకు చేతినిండా పూరీలు ఇస్తే ఏం పోతుంది? అతిథులకన్నా ఆమె ముందు తింటే ఆకాశం భూమ్మీద కూలిపోతుందా? గదిలోకి పోయి ఓదార్చుదామనుకుందిగానీ వాళ్లమ్మకు భయపడి ఊరుకుంది. తనకు వడ్డించిన పూరీల్ని తన బొమ్మపెట్టెలో దాచుకుంది.

రాత్రి పదకొండయ్యింది. రూప అరుగు మీద పడుకుంది. పూరీలు తింటున్నప్పుడు నానమ్మ కళ్లల్లో కనబడే సంతోషాన్ని తలుచుకుని లాడ్లీకి నిద్ర పట్టలేదు. అమ్మ నిద్రపోగానే నానమ్మ దగ్గరకు పోవాలనుకుంది. కానీ బయట చీకటిగా ఉంది. మట్టిపొయ్యిల్లోని నిప్పులు మాత్రమే వెలుగుతున్నాయి. అక్కడో కుక్క కూర్చునివుంది. తలుపు వెనకాల నిమ్మచెట్టు మీద లాడ్లీ చూపు పడింది. దానిమీద హనుమంతుడు కూర్చున్నట్టుగా అనిపించింది. తోక, గద స్పష్టంగా కనబడుతున్నాయి. భయంతో కళ్లు మూసుకుంది. అప్పుడే కుక్క లేచి నిలబడింది. అది లాడ్లీకి ధైర్యాన్నిచ్చింది. పడుకునివున్న మనుషులకన్నా నిద్రలేచిన కుక్కే ఆమెకు ఎక్కువ ధైర్యాన్నిచ్చింది. తన బొమ్మపెట్టెను తీసుకుని నానమ్మ గదిలోకి వెళ్లింది.

కొండమీదకు ఎవరో లాక్కుపోతున్నట్టుగా కల కంటున్న వృద్ధురాలు ఉన్నట్టుండి మేల్కొంది. అతిథులంతా వెళ్లిపోయుంటారు. దేవుడా, తిండి లేకుండా ఈ రాత్రి ఎలా గడపడం? నాకు పూరీలు ఇస్తే వాళ్ల సంపదేమైనా తరిగిపోతుందా? ‘నానమ్మ, లే’ అంటున్న లాడ్లీ గొంతు విని హుషారుగా లేచి కూర్చుంది. లాడ్లీని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. లాడ్లీ పూరీలు చేతికిచ్చింది. ‘మీ అమ్మ ఇచ్చిందా?’ ‘కాదు, ఇవి నా వాటా’. ఐదు నిమిషాల్లో పూరీలు తినేసింది. కొద్దిపాటి వాన భూమ్మీది తాపాన్ని తగ్గించకపోగా వృద్ధి చేసినట్టు ఆ పూరీలు ముసలామె ఆకలిని మరింత పెంచాయి. ఇంకొన్ని తెమ్మని పాపను అడిగింది. అమ్మ కొడుతుందని భయపడింది చిన్నది.  మిగిలిపోయిన తునకలు కూడా తిని, వేళ్లు నాక్కుంది ముసలామె. ఆకలి మరింత ఉధృతమైంది. విచక్షణ కోల్పోయేట్టు చేసింది. అతిథులు తిన్నచోటుకు పట్టుకెళ్లమని పాపను కోరింది.

దేవుడా! అతిథుల ఎంగిలి విస్తళ్లలో మిగిలిపోయిన పూరీ ముక్కలను తీసుకుని తినసాగింది ఆ దీన హీన వృద్ధురాలు! వృద్ధాప్యం, శాపం.

కళ్లు తెరిచిన రూపకు లాడ్లీ కనబడలేదు. ఆందోళనతో లేవగానే కనబడిన దృశ్యం ఆమెను స్తంభింపజేసింది. తన గొంతు కోస్తున్నప్పుడు ఆవు అనుభవించే లాంటి క్షోభను ఆమె అనుభూతించింది. ఎంగిలి విస్తళ్లలో చేయిపెట్టే ఖర్మానికి ఈ వృద్ధురాలిని తీసుకొచ్చానే! అయ్యో, ఈ ప్రపంచానికి ఏ విపత్తు రానున్నది? దయ, భయం ఆమె కళ్లల్లోంచి నీళ్లుగా జారినై. ఈ అధర్మానికి బాధ్యులెవరు? దేవుడా, నా బిడ్డల మీద దయ చూపించు. నేను చేసిన పాపానికి నన్ను శిక్షించకు. అయ్యో అయ్యో, ఇవ్వాళే నా పెద్దబిడ్డకు శుభకార్యం జరిగింది. వందల మంది భోంచేసి వెళ్లారు. ఎవరి ఆస్తినైతే మేము అనుభవిస్తున్నామో, ఆమెనే బిచ్చగత్తెను చేశామే! 

రూప దీపం వెలిగించింది. పళ్లెంలో పూరీలు నిండుగా పెట్టుకుంది. వృద్ధురాలి ముందు నిలబడి గద్గద స్వరంతో క్షమించమని ప్రార్థించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement