పెద్ద నేను | James Joyce A Little Cloud Story | Sakshi
Sakshi News home page

పెద్ద నేను

Published Mon, Jul 2 2018 1:00 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

James Joyce A Little Cloud Story - Sakshi

పెద్ద నేను

మనలోని ఎదగని నేను గుర్తొచ్చినప్పుడు మన పెద్ద నేను ఎలా బాధపడుతుంది?
ఎనిమిదేళ్ల కింద గాలాహర్‌ ఇంత స్థాయికి ఎదుగుతాడని చాండ్లర్‌ ఊహించలేదు. అలాంటి స్నేహితుడు ఉండటం మాటలు కాదు. లంచ్‌ టైమ్‌ నుంచే చాండ్లర్‌ ఆలోచనలు గాలాహర్‌ చుట్టూ, గాలాహర్‌ నివసిస్తున్న లండన్‌ చుట్టూ తిరుగుతున్నాయి. 
తను పనిచేస్తున్న కింగ్స్‌ ఇన్స్‌లోని డెస్క్‌ దగ్గర కూర్చుని, ఈ ఎనిమిదేళ్లు తెచ్చిన మార్పు గురించి ఆలోచిస్తున్నాడు చాండ్లర్‌. తన స్నేహితుడికి సరైన అవసరాలే తీరేవి కావు. అలాంటిది ఇప్పుడు లండన్‌ పత్రికారంగంలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. విసుగెత్తించే రాత నుంచి దృష్టి మరల్చుకోవడానికి కిటికీలోంచి కిందకు చూశాడు.
ఉడిగిపోయిన ముసలాళ్లు, అరుస్తున్న పిల్లలు అతడిని జీవితం గురించి ఆలోచింపజేసి బాధపెట్టాయి. జీవితం గురించి ఎప్పుడు ఆలోచించినా అతడికి బాధ కలుగుతుంది.  అవ్యక్త దుఃఖమేదో చుట్టుముట్టింది. భాగ్యానికి వ్యతిరేకంగా ఎంత పోరాడితే ఏం లాభం?
ఇంటి షెల్ఫుల్లో ఉన్న కవిత్వ పుస్తకాలు గుర్తొచ్చాయి. వాటిని తన బ్రహ్మచారి దినాల్లో కొన్నాడు. చాలా సాయంత్రాలు అందులోంచి ఒక పుస్తకం తీసి తన భార్యకు చదివి వినిపిద్దామన్న ఉబలాటం పుట్టేది. కానీ ఏదో సిగ్గు అడ్డు వచ్చి పుస్తకాలు అలాగే ఉండిపోయేవి. 
టైమ్‌ అవగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డెస్క్‌లోంచి లేచి బయటకు వచ్చేశాడు. హెన్రియెటా వీధి మురికి మనుషుల్ని దాటేసి, కులీనులు డంబాలు కొట్టే డబ్లిన్‌ వీధుల గుండా నడవడం మొదలుపెట్టాడు.
కార్లెస్‌కు అతడు ఎప్పుడూ వెళ్లలేదు. కానీ దానికున్న పేరు తెలుసు. థియేటర్‌కు వెళ్లిన వాళ్లు ఇక్కడ నత్తగుల్లలు తింటారు, మద్యం సేవిస్తారు. అక్కడ వెయిటర్లు ఫ్రెంచ్, జర్మన్‌ మాట్లాడుతారని విన్నాడు. ఖరీదైన వస్త్రాలు ధరించిన మహిళలు, విలాస పురుషులు తోడురాగా క్యాబుల్లోంచి దిగి వేగంగా నడుస్తున్నారు.
కాపెల్‌ వీధి వైపు మలిగాడు. లండన్‌ పత్రికారంగంలో ఇగ్నేషస్‌ గాలాహర్‌! ఎనిమిదేళ్ల కింద ఇది సాధ్యమని ఎవరు అనుకున్నారు? కానీ తన మిత్రుడి భవిష్యత్‌ గొప్పతనానికి సంకేతాలు అప్పుడే కనబడ్డాయి. కాకపోతే అతడికి పద్ధతీ పాడూ ఉండేది కాదు. పోకిరిరాయుళ్లతో తిరిగేవాడు. ఉదారంగా తాగేవాడు. అన్ని చోట్లా అప్పులు చేసేవాడు. కానీ అతడిలో ఉన్న ప్రతిభను మాత్రం ఎవరూ కాదనలేరు. అతడు అప్పు అడిగినా చేయి చాచినట్టు ఉండేది కాదు.
చాండ్లర్‌ తన వేగం పెంచాడు. జీవితంలో మొదటిసారి తను దాటుతున్న మనుషులకన్నా తాను ఉన్నతుడినన్న భావం కలిగింది. సొగసు లేని కాపెల్‌ వీధి పట్ల అతడి మనసు ఎదురు తిరిగింది. నువ్వు సక్సెస్‌ కావాలంటే బయటికి వెళ్లాలి. ఈ డబ్లిన్‌లో ఉండి నువ్వేమీ చేయలేవు. గ్రాటెన్‌ వంతెన దాటుతుండగా కింద పారుతున్న నదిని చూశాడు. రేవులో ఉన్న గుడిసెల్లాంటి ఇళ్ల పట్ల జాలి కలిగింది. మనుషులంతా గుంపుగా పోగైన దేశ దిమ్మరుల్లా కనబడ్డారు. వారి మురికి కోట్లు, మూర్ఛిల్లజేసే సూర్యాస్తమయం, మెలకువకు వీడ్కోలు పలికే చల్లటి రాతిరి గాలి... ఈ భావాన్నంతా ఒక కవితగా మలవగలనా అని ఆలోచించాడు. గాలాహర్‌ దాన్ని ఏదైనా లండన్‌ పత్రికలో ప్రచురణ అయ్యేలా చూడొచ్చు. నిజంగా తాను సిసలైనది రాయగలడా?
తన మనోవీధిలో చిన్న కాంతిపుంజం కదలాడింది. తన వయసు మరీ పెద్దదేం కాదు– ముప్పై రెండు. ఎన్నో భావాల్ని తను వ్యక్తం చేయాలనుకుంటాడు. నిజంగా తనకో కవి హృదయం ఉన్నదా? నిజంగా ఇవన్నీ కవితలుగా వ్యక్తం చేయగలిగితే పాఠకులు పట్టించుకుంటారు. మరీ అంత జనాదరణ పొందలేకపోవచ్చు. కానీ కొంతమంది సహృదయ పాఠకులను చేరగలడు. విమర్శకుల నుంచి రాబోయే గమనింపు వాక్యాలు కూడా అతడు ఊహించాడు. ‘శ్రీ చాండ్లర్‌కు సరళ సుందరమైన కవిత్వం వరంలా అబ్బింది’. కాకపోతే ఒకటే బాధ. తన పేరు ఎంతమాత్రమూ ఇక ఐరిష్‌గా ధ్వనించదు. అమ్మ పేరును తన పేరులో కలుపుకోవాలి. థామస్‌ మెలోన్‌ చాండ్లర్‌ లేదా టి.మెలోన్‌ చాండ్లర్‌. దీని గురించి గాలాహర్‌తో మాట్లాడాలి.
కార్లెస్‌ను సమీపించగానే మళ్లీ ఆందోళన అతడిని ఆక్రమించింది. తలుపు తెరిచేముందు ఒక క్షణం నిలిచి, ఎట్టకేలకు లోనికి ప్రవేశించాడు. బారులోని కాంతి, శబ్దం అతణ్ని ద్వారంలోనే కుదిపేశాయి. అందరూ తననే కుతూహలంతో గమనిస్తున్నట్టుగా భావించుకున్నాడు. అదిగో కౌంటర్‌కు ఒరిగి కూర్చుని... ఇగ్నేషస్‌ గాలాహర్‌!
‘హలో, టామీ, పాత హీరో, నువ్విక్కడ! ఏం తీసుకుంటావ్‌? దేవుడా, ఎట్లా పెద్దోళ్లమైపోతున్నాం!’ 
విస్కీ ఆర్డర్‌ చేశాడు గాలాహర్‌. అతడు సోడా పోసుకోలేదు. చాండ్లర్‌ మాత్రం పలుచగా తాగుతానన్నాడు. ఎప్పుడూ పరుగులు పెట్టాల్సిన పత్రికోద్యోగం గురించి మాట్లాడాడు గాలాహర్‌. మురికి డబ్లిన్‌లో అడుగుపెట్టాక చాలా విశ్రాంతిగా ఉందన్నాడు. పాత స్నేహితులను గుర్తు చేసుకున్నారు. 
‘టామీ, నువ్వు ఇంత కూడా మారలేదు. ఆదివారం ఉదయాల్లో నాకు లెక్చర్లు ఇచ్చే అదే గంభీరమైన మనిషివి. నువ్వు ప్రపంచాన్ని ఏదో చేయాలనుకునేవాడివి. ఎక్కడికీ పోలేదా కనీసం యాత్రకైనా?’
‘ఐల్‌ ఆఫ్‌ మేన్‌(ఐర్లాండ్‌ పక్కని చిన్న ద్వీపం)కు పోయాను,’ చెప్పాడు చాండ్లర్‌. గాలాహర్‌ నవ్వాడు. ‘లండన్‌ వెళ్లు లేదా పారిస్‌. పారిస్‌ బాగుంటుంది.’
‘నువ్వు పారిస్‌ చూశావా?’
పారిస్‌ లాంటి నగరం మరోటి లేదనీ, అందం కన్నా అక్కడి జీవితం ఆకర్షిస్తుందనీ ఊరించాడు గాలాహర్‌. ఐరిష్‌ వాళ్లంటే ఫ్రెంచ్‌వాళ్లకు పిచ్చి, తాను ఐరిష్‌ అని తెలిసి దాదాపు తినేయబోయారని చెప్పాడు. పారిస్‌ అమ్మాయిలు ఉంటారు...!
బార్‌మాన్‌ చూపును తనవైపు తిప్పుకోవడానికి కొంచెం తిప్పలు పడి, డ్రింక్‌ ఆర్డర్‌ చేశాడు చాండ్లర్‌. గాలాహర్‌ యాస, అతడు తన గురించి వ్యక్తం చేసుకుంటున్న తీరు చాండ్లర్‌కు అంతగా నచ్చలేదు. లండన్‌ అలా మార్చేస్తుందేమో! కానీ గాలాహర్‌ ప్రపంచాన్ని చూశాడు. చాండ్లర్‌లో అసూయ జనించింది.
గాలాహర్‌ తన సిగార్‌ కేసులోంచి సిగార్లు బయటికి తీశాడు. ఇద్దరూ మౌనంగా కాల్చారు. తర్వాత పై స్థాయి ఇంగ్లీషు సమాజంలోని చాలా రహస్యాలు పంచుకున్నాడు గాలాహర్‌. ఎవరినీ వదలిపెట్టలేదు. ‘అన్నట్టూ హోగన్‌ చెప్పాడు,  నువ్వు దాంపత్య సౌఖ్యాన్ని రుచి చూశావట, రెండేళ్ల కింద, నిజమేనా?’
చాండ్లర్‌ సిగ్గుతో నవ్వాడు. అప్పుడు చిరునామా తెలియలేదనీ, ఇప్పటికైనా మించిపోలేదని భావిస్తూ శుభాకాంక్షలు అందించాడు గాలాహర్‌. ‘నీకు ఎల్లవేళలా సంతోషం, కట్టలకొద్దీ డబ్బులు, నేను కాల్చేదాకా రాని చావును కోరుకుంటున్నా’.
పిల్లల గురించి అడిగాడు గాలాహర్‌. 
‘ఒకరు’. 
‘కొడుకు? కూతురు?’ 
‘బాబు’
వెళ్లే లేపు తమ ఇంటికి ఓసారి రావాలనీ, తన భార్య సంతోషిస్తుందనీ ఆహ్వానించాడు చాండ్లర్‌. ‘మనం ముందే కలవలేకపోయాం. రేపు రాత్రే నేను వెళ్లాల్సివుం’దని క్షమాపణ కోరాడు గాలాహర్‌. 
‘పోనీ ఈ రాత్రికి’
ఈ రాత్రి ఇంకొకరిని కలవాల్సివుందని బదులిచ్చాడు. వచ్చే సంవత్సరం కచ్చితంగా వస్తానని హామీ ఇచ్చాడు. ‘సంతోషం వాయిదాపడుతుందంతే’.
తన బంగారు వాచీని తీసి టైమ్‌ చూసుకున్నాడు గాలాహర్‌.
చివరి రౌండు డ్రింక్స్‌ తాగడం పూర్తయింది. మూడు పెగ్గులు, స్ట్రాంగ్‌ సిగార్‌ మితంగా తాగే చాండ్లర్‌ తలకు బాగా ఎక్కాయి. తన జీవితానికీ తన స్నేహితుడి జీవితానికీ మధ్య వున్న భేదం స్పష్టంగా అర్థమవసాగింది. పుట్టుకలోనూ చదువులోనూ గాలాహర్‌ తనకు సాటిరాడు. ఇది ఏ విధంగానూ న్యాయంగా కనబడలేదు. అన్నింటికీ జంకే తన స్వభావమే దీనికి కారణం. తన ఆహ్వానాన్ని గాలాహర్‌ తిరస్కరించడం ఎత్తినట్టుగా కనబడింది.
‘ఎవరికి తెలుసు? వచ్చే సంవత్సరం నువ్వు ఇక్కడికి వచ్చేసరికల్లా మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఇగ్నేషస్‌ గాలాహర్‌కు నేను శుభాకాంక్షలు చెబుతానేమో.’
గాలాహర్‌ ఖండించాడు. దానికంటే ముందు లోకాన్ని చూడాలని వుందన్నాడు. ఒకవేళ చేసుకున్నా డబ్బు బలిసిన అమ్మాయిని చేసుకుంటానన్నాడు. ‘వందలు వేల జర్మన్లు, యూదులు డబ్బుతో కుళ్లిపోతున్నారు. చూడు నా ఎత్తులు ఎలా వేస్తానో’.∙∙l
బాబును ఎత్తుకునివున్నాడు చాండ్లర్‌. డబ్బులు మిగుల్చుకోవడానికి వాళ్లు పనిమనిషిని పెట్టుకోలేదు. పొద్దున కాసేపు ఆనీ చిన్న చెల్లెలు మోనికా వచ్చి ఇంటిపనుల్లో సాయం చేసి వెళ్తుంటుంది. పావు తక్కువ తొమ్మిదయింది. ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా ఆనీ తెమ్మన్న కాఫీపొడిని మరిచిపోయి వచ్చాడు చాండ్లర్‌. అందుకే అతడు అడిగినవాటికి పొడిగా జవాబిచ్చింది. పడుకుంటున్న బాబును అతడి చేతుల్లో పెట్టి మళ్లీ షాపులు మూసేస్తారేమోనని తనే కాఫీ పొడి, చక్కెర తేవడానికి బయటికి వెళ్లింది. ‘ఇదిగో, వాడిని నిద్రలేపకు’.
ఫ్రేములో ఉన్న ఆనీ ఫొటో చూశాడు చాండ్లర్‌. ఆమె వేసుకున్న బ్లూ సమ్మర్‌ బ్లౌజ్‌ కొనడానికి తను ఎలా హడావుడి పడిందీ, అంత ఖరీదైనది ఎందుకని ముందు అని తర్వాత ఎలా వేసుకుని మురిసిపోయిందీ అంతా గుర్తొచ్చింది. హ్మ్‌! ఆమె కళ్లవైపు చూశాడు. స్నేహంగా కనబడలేదు. గాలాహర్‌ చెప్పిన ధనిక యూదుల గురించి ఆలోచించాడు. ఈ కళ్లను ఎందుకు తాను పెళ్లాడాడు! ఇంటికోసం అద్దె పద్ధతిలో తెచ్చిన అందమైన ఫర్నిచర్‌లో కూడా ఏదో అల్పత్వం కనబడింది. ఈ చిన్న ఇంట్లోంచి బయటపడే మార్గం లేదా? గాలాహర్‌లాగా ధైర్యంగా బతక ప్రయత్నించడానికి మరీ ఆలస్యమైందా? తాను లండన్‌ వెళ్లగలడా? ఒక పుస్తకం రాయగలిగితే ఏదైనా ద్వారం తెరుచుకుంటుందేమో!
టేబుల్‌ మీద పెట్టివున్న బైరన్‌ పొయెట్రీ తీసి చదవడానికి ప్రయత్నించాడు. తాను అలా రాయగలడా? గ్రాటన్‌ వంతెన దాటుతుండగా కలిగిన సంవేదన లాంటిది...
పిల్లాడు నిద్ర లేచి ఏడవటం ప్రారంభించాడు. వాడిని ఊరడిస్తూనే చదవబోయాడు. సాధ్యం కాలేదు. తాను చదవలేడు. ఏమీ చేయలేడు. వ్యర్థం, వ్యర్థం! పిల్లాడు అలాగే ఏడుస్తున్నాడు. ‘నోర్ముయ్‌’ అని అరిచాడు. వాడు ఒకసారి ఆగి, అంతకంటే గట్టిగా మొదలెట్టాడు. శ్వాస ఆగిపోతుందా? ఊరుకోబెట్టడం తన వల్ల కావడం లేదు. 
తలుపు తెరుచుకుని ఆనీ పరుగెత్తుకుంటూ వచ్చింది, ‘ఏమైంది? ఏమైంది? ఏం చేశావ్‌ వాణ్ని?’ పార్సిల్‌ను కింద పెట్టి భర్త చేతిలోంచి కొడుకును తీసుకుంది. తల్లి మాట వినగానే పిల్లాడు మరింత గట్టిగా ఏడ్చాడు.
‘నేనేం చేయలేదు ఆనీ... వాడే ఏడుస్తున్నాడు... నేనేం చేయలేదు... నేను నేను...’
‘ఓ చిన్ని తండ్రీ. భయపడ్డావా? ఉల్లలలలలలల.. నా బుజ్జి గొర్రెపిల్ల’
చాండ్లర్‌ చెంపలు సిగ్గుతో ఎర్రబారాయి. పిల్లాడి ఏడుపు క్రమంగా నెమ్మదించింది. చాండ్లర్‌ కళ్లలోంచి పశ్చాత్తాపపు కన్నీళ్లు కారాయి.

జేమ్స్‌ జాయ్స్‌(1882–1941) ‘ఎ లిటిల్‌ క్లౌడ్‌’ కథాసారం ఇది. ఐరిష్‌ కథకుడు, కవి, నవలాకారుడు జాయ్స్‌. ‘యులసిస్‌’ ఆయన ప్రసిద్ధ నవల. అత్యున్నత స్థాయిలో  చైతన్య స్రవంతి శైలి కనబరిచిన రచన. ‘డబ్లినర్స్‌’ ఆయన కథా సంకలనం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement