జీవితాన్ని కట్టిన హారం | Gai D Mapasa Write The Necklace Novel | Sakshi
Sakshi News home page

జీవితాన్ని కట్టిన హారం

Published Mon, Mar 26 2018 2:47 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

Gai D Mapasa Write The Necklace Novel - Sakshi

దురదృష్టవశాత్తూ మెటీల్డ్‌ ఒక గుమస్తా కుటుంబంలో పుట్టిందిగానీ ఆమెలాంటి అందగత్తెలు ఎప్పుడోగానీ జన్మించరు! 
అదే విధిరాత వల్ల ఆమె ప్రభుత్వ విద్యాశాఖలో ఒక చిన్న గుమస్తాను పెళ్లాడింది. జీవితం ప్రసాదించిన అన్ని భోగాలనూ అనుభవించలేకపోతున్నానన్న క్షోభ ఆమెను వెంటాడేది.

అలంకార రహితమైన  గోడలూ, చవకరకం కుర్చీలూ, వికారమైన తెరలూ దుఃఖం కలిగించేవి. ఆమెకు గౌన్లు లేవు, ఆభరణాలు లేవు, ఏమీలేవు. అలా ఉండటం కోసమే పుట్టానేమో అనుకునేది. అందరూ తనను చూసి అసూయపడేట్టు బతగ్గలిగితే ఎంత బాగుంటుంది! ఒక సాయంత్రం ఆమె భర్త చేతిలో ఒక పెద్ద ఎన్వెలప్‌తో వచ్చాడు. ఆమె ఆత్రంగా చింపి, అందులో ఉన్న పదాలు చదివింది. ‘విద్యాశాఖ మంత్రి జార్జెస్‌ ర్యాంపోనూ జనవరి 18, సోమవారం సాయంత్రం ఇవ్వనున్న విందుకు శ్రీమతి మరియు శ్రీ లొయిజెల్‌ను మంత్రిత్వ శాఖ భవనానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం’.


చూడగానే ఎంతో సంబరపడుతుందనుకున్న భార్య ఆహ్వానపత్రాన్ని టేబుల్‌ మీద పడేసి, ‘దానితో నేను ఏం చేయాలి?’ అని గొణుక్కుంది. దేనికీ బయటికి వెళ్లని భార్యకు ఇదో గొప్ప అవకాశం అనుకున్నాడతను. అసలు చాలామంది గుమస్తాలకు అందులో ప్రవేశమే లేదు. కష్టపడి ఈ ఆహ్వానాన్ని సంపాదించాడు. ‘మరి ఏం వేసుకుని వెళ్లాలి?’ అనేది ఆమె సమస్య. అతడు దాని గురించి ఆలోచించలేదు.  ‘థియేటర్‌కు వెళ్లేప్పుడు వేసుకునే గౌన్‌. అందులో నువ్వు నాకు బాగా కనబడతావు’. ఆమె మౌనంగా రోదించడం మొదలుపెట్టింది. ‘నేను వెళ్లలేను, అన్నీవున్న ఇంకెవరి భార్యకైనా ఇచ్చేయండి’.

అతడు నిరుత్సాహపడ్డాడు. ‘ఇదిగో, ఇటుచూడు, మెటీల్డ్‌. మళ్లీ వేరే సందర్భాలకు కూడా వేసుకునే ఒక... మామూలు గౌన్‌ ఎంతవుతుంది?’  అన్ని లెక్కలూ వేసి, భర్త వెంటనే తిరస్కరించకుండా, అలాగని భయపడే మొత్తం కూడా కాకుండా, ‘కచ్చితంగా తెలీదు. ఒక నాలుగు వందల ఫ్రాంకులైతే సరిపోతాయేమో’ అంది. అతడి ముఖం పాలిపోయింది. సరిగ్గా అంతే మొత్తాన్ని అతడు వచ్చే వేసవిలో తన స్నేహితులతో కలిసి నాంటేర్‌ మైదానాల్లో భరత పక్షులను వేటాడ్డంకోసం ఒక తుపాకీని కొనడానికి పక్కన పెట్టుకున్నాడు. ‘సరే మంచిది. నేను నాలుగు వందల ఫ్రాంకులు ఇస్తాను. అందమైన గౌను కొనుక్కో’.విందు రోజు దగ్గరపడుతోంది. 

మేడమ్‌ లొయిజెల్‌ గౌను సిద్ధమైంది. అయినా ఆమె అసహనంగానే కనబడింది. భర్త కారణం అడిగాడు. ‘ఒక్క నగ కూడా లేదు. నా దరిద్రం మొత్తం అక్కడ కనబడుతుంది. అసలు పోకుండా ఉంటేనే బాగుంటుంది’. ఈ కాలంలో వచ్చే సహజమైన పూవులను ధరించమని సలహా ఇచ్చాడతను. ‘పది ఫ్రాంకులకు మూడు దివ్యమైన గులాబీలు వస్తాయి’. అంతమంది సంపన్నురాళ్ల మధ్య పేదరాలిగా కనబడటం కంటే అవమానం ఇంకేముంటుంది?

భర్త సలహా ఇచ్చాడు. ‘నీ ఫ్రెండు మేడమ్‌ ఫోరెస్టీర్‌ ఉందికదా, ఆమె దగ్గర ఏమైనా అడిగి తీసుకునేంత చనువు నీకుంది కదా!’ అంతవరకూ ఆ ఆలోచనే రాని మెటీల్డ్‌ ఎగిరి గంతేసింది. తెల్లారే స్నేహితురాలి ఇంటికెళ్లి, తన బాధేమిటో చెప్పింది. మేడమ్‌ ఫారెస్టీర్‌ వార్డ్‌రోబ్‌లోంచి ఒక పెద్ద నగల పెట్టె తెచ్చి, మేడమ్‌ లొయిజెల్‌ ముందు పెట్టి, అందులోంచి కావాల్సింది ఎంచుకొమ్మంది. అందులో బ్రేస్‌లెట్స్, ఒక ముత్యాల హారం, రాళ్లు పొదిగిన వెనీస్‌ తయారీ క్రాస్‌ ఉన్నాయి. అవి వేసుకుని అద్దంలో చూసుకుంది. ఊహూ. ఉన్నట్టుండి, శాటిన్‌ వస్త్రం చుట్టివున్న ఒక అద్భుతమైన వజ్రాల హారం ఆమె కంటబడింది. దాన్ని తీసుకుంటుండగా ఆమె చేతులు వణికాయి. అది ధరించినప్పుడు అద్దంలో కనబడిన ప్రతిబింబం ఆమెను తన్మయత్వానికి గురిచేసింది. ‘దీన్ని అరువిస్తావా? ఇదొక్కటే?’ 
‘ఓ, తప్పకుండా’. స్నేహితురాలి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకుంది మెటీల్డ్‌.

విందునాట్యం రోజు మేడమ్‌ లొయిజెల్‌ అందరినీ ఆకట్టుకుంది. అక్కడున్న స్త్రీలందరిలోకీ ఆమే గొప్పగా కనబడింది. పెద్దపెద్దవాళ్లు కూడా ఆమె ఎవరో తెలుసుకునేందుకు కుతూహలపడ్డారు. అంతెందుకు, సాక్షాత్తూ మంత్రి కూడా ఆమెను ప్రశంసించారు. సరిగ్గా ఉదయం నాలిగింటికి వాళ్లు విందు నుంచి బయటపడ్డారు. ఇంత చలిలో వెళ్తే జలుబు చేస్తుందని లొయిజెల్‌ క్యాబ్‌ కోసం చూశాడు. ఏదీ ఆగలేదు. సీన్‌ నది పక్కన వణుకుతూ నడుస్తుండగా పాత క్యాబ్‌ దొరికింది. ఎట్టకేలకు ఇల్లు చేరుకున్నారు. ఆమెకు సంబంధించినంతవరకూ అంతా ముగిసిపోయింది. అతడు మాత్రం మళ్లీ పొద్దున పది గంటలకు ఆఫీసుకు వెళ్లాలి.అద్దం ముందు కూర్చుని బట్టలు మార్చుకునేముందు మరోసారి అందులో చూసుకుంది. ఒక్కసారి కెవ్వుమంది. నెక్లెస్‌ లేదు. బట్టలు మార్చుకుంటున్న భర్త, ‘ఏంటీ? ఎలా? అసాధ్యం’ అని మాత్రం అనగలిగాడు.

ఆమె స్కర్టు మడతల్లో చూశారు, జేబుల్లో వెతికారు. బయటికి వచ్చినప్పుడు మెడ చుట్టూ ఉందనిపించిందా? వీధిలో గనక పడిపోయుంటే శబ్దం తెలిసేది కదా! క్యాబ్‌లో పడిపోయుంటుందా? ఇద్దరూ స్తంభించిపోయారు. అతడు మళ్లీ బట్టలు వేసుకుని, కాలి నడకన క్యాబ్‌ ఎక్కిన చోటుకు వెళ్లాడు. ఆమెకు మంచం మీద పడుకోవడానికి కూడా శక్తి చాలలేదు. అతడు ఏడింటికల్లా తిరిగొచ్చాడు. దొరకలేదు. మళ్లీ, పోలీసుల దగ్గరికి వెళ్లాడు, తెచ్చి ఇచ్చిన వాళ్లకు బహుమతి పేరుతో ప్రకటన ఇవ్వడానికి పత్రికా కార్యాలయాలకు వెళ్లాడు, క్యాబ్‌ కంపెనీలకు వెళ్లాడు.
ఆమె రోజంతా అలాగే ఉండిపోయింది. రాత్రికల్లా అతడు పాలిపోయిన ముఖంతో తిరిగొచ్చాడు.

నెక్లెస్‌ కొక్కెం విరిగిపోయిందనీ, దాన్ని బాగుచేసి ఇవ్వడానికి కొంచెం సమయం కావాలనీ మెటీల్డ్‌తో ఆమె స్నేహితురాలికి ఒక లేఖ రాయించాడు. వారంకల్లా వాళ్ల ఆశలన్నీ అడుగంటాయి. అప్పటికే లొయిజెల్‌కు ఐదేళ్ల వయసు పెరిగినట్టయింది. ఆ హారం బదులు మరోటి ఎలా ఇవ్వాలి? తెల్లారి, నెక్లెస్‌ తెచ్చిన పెట్టె మీదున్న పేరును బట్టి ఆ దుకాణానికి వెళ్లారు. అతడు ఆ నెక్లెస్‌ అమ్మలేదు. ఆ పెట్టె మాత్రమే అమ్మాడు. అన్ని దుకాణాలు తిరిగారు అచ్చంగా అలాంటి హారం కోసం. ఆఖరికి రాయల్‌ ప్యాలెస్‌లో కనబడింది. వెల నలభై వేల ఫ్రాంకులు! ముప్పై ఆరు వరకు ఇస్తారు. మూడు రోజుల దాకా దాన్ని అమ్మొద్దనీ, ఒకవేళ వాళ్ల హారం గనక ఫిబ్రవరి చివరికల్లా దొరికితే ముప్పై నాలుగు వేలకు వాపసు కొనాలనీ బతిమాలారు.

వాళ్ల నాన్న ఇచ్చిన పద్దెనిమిది వేల ఫ్రాంకులు లొయిజెల్‌ దగ్గరున్నాయి. మిగిలింది అప్పు చేశాడు. వెయ్యి ఫ్రాంకులొకచోట, ఐదు వందలొకచోట, ఐదు లూయీలొక దగ్గరా, మూడు లూయీలు మరోదగ్గరా, దొరికినచోట దొరికినట్టుగా, వడ్డీల మీద వడ్డీలకు ఒప్పుకుంటూ అప్పుపత్రాలు రాసిచ్చాడు. చివరకు మెటీల్డ్‌ హారాన్ని పట్టుకెళ్లి ఇచ్చినప్పుడు, మేడమ్‌ ఫోరెస్టీర్‌ ‘ఇప్పుడా ఇవ్వడం’ అని గొణిగింది. కానీ దాన్ని తెరిచి చూడనందుకు మెటీల్డ్‌ సంతోషపడింది. తనను దొంగ అనుకోదుకదా!

తర్వాత వాళ్లు చిన్న ఇంటికి మారారు. పనిమనిషిని మాన్పించారు. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, నేల తుడవడం సహా ఇంటిపని మొత్తం గులాబీ వేళ్ల మెటీల్డే చేసుకుంది. అలుపు తీర్చుకుంటూ వీధిలోంచి నీళ్లు మోసుకొచ్చింది. మాంసం కొట్లో, పచారీ కొట్లో, పళ్ల దగ్గరా గీచి గీచి బేరాలు చేసింది. వయసు మీదపడ్డట్టయింది. లొయిజెల్‌ రాత్రిదాకా పేజీకింతని మరోచోట లెక్కల పద్దులు రాశాడు. ఫ్రాంకూ ఫ్రాంకూ జమచేస్తూ ఒక్కో నోటును చెల్లిస్తూ వచ్చారు. ఇట్లా ప..దే..ళ్లు గడిచాయి. ఎప్పుడైనా కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తే మెటీల్డ్‌కు ఆ విందునాట్యం రాత్రి గుర్తొస్తుంది. ప్చ్, ఆ హారం పోకపోయివుంటే? జీవితం ఎంత చిత్రమైంది! ఎంత అల్పమైన విషయం కూడా జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది కదా!

ఒక ఆదివారం మెటీల్డ్‌ తోవన నడుస్తున్నప్పుడు పాపతో ఉన్న స్త్రీ కనబడింది. మేడమ్‌ ఫోరెస్టీర్‌! అంతే అందంగా, అంతే యౌవనంతో! మాట్లాడాలా, వద్దా? అన్నీ చెల్లించేశారు కాబట్టి, చెబితే పోయేదేముంది? కానీ ఫోరెస్టీర్‌ గుర్తుపట్టనేలేదు. ‘నేను, మెటీల్డ్‌ లొయిజెల్‌’. ‘అయ్యో, మెటీల్డ్‌ నువ్వా? ఎంత మారిపోయావు?’
‘చాలా కష్టాలు అనుభవించాను... నీ కారణంగానే.’ ‘నా కారణంగానా? ఎలా?’
హారం పోవడమూ, బదులుగా వేరేది కొనివ్వడమూ, దానికి చేసిన అప్పు తీర్చడానికి పదేళ్లు పట్టడమూ అంతా చెప్పింది.
‘అంటే నువ్వనేది నా హారానికి బదులుగా మరో వజ్రాల హారం తెచ్చానంటావా?’
‘అయితే నువ్వు గమనించలేదన్నమాట. అవి రెండూ ఒకేలా ఉన్నాయి’.
‘అయ్యో పాపం మెటీల్డ్‌! అది ఆర్టిఫీషియల్‌. దాని విలువ ఐదొందల ఫ్రాంకులు కూడా ఉండదు’.

గై డి మపాసా(1850–1893) కథ ‘ద నెక్లెస్‌’ సారాంశం ఇది. 1884లో అచ్చయింది. ప్రపంచంలోని గొప్ప కథకుల్లో ఒకరైన మపాసా ఫ్రాన్స్‌లో జన్మించారు. తన కథల ద్వారా మనుషుల అంతరంగాల లోతులను పరిచయం చేసిన మపాసా 43 ఏళ్ల చిన్న వయసులోనే మరణించారు.
    -గై డి మపాసా


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement