’పంది’రి | Etgar Keret writer Breaking The Pig Novel | Sakshi
Sakshi News home page

’పంది’రి

Published Mon, Mar 19 2018 12:20 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

Etgar Keret writer Breaking The Pig Novel - Sakshi

కథాసారం
ఆకాశానికీ మనకూ మధ్య ఉండేది పందిరి. ఆకాశమంత ఆశవున్నా పందిరిని ప్రేమిస్తూనే ఉంటాం. నిజానికి  ప్రేమ ఆకాశమంత ఉంటే ఆశల పందిరి అడ్డమే కాదు!

నాన్న, బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ కొనడు. అమ్మ నిజానికి కొందామనే అంది. కానీ అలా కొనిస్తే చెడిపోతానట. ఎందుకు కొనాలసలు? వాడేదో ఏడుపు మొదలుపెట్టగానే నువ్వు ఠకీమని ఒప్పేసుకుంటావని అమ్మను కోప్పడ్డాడు కూడా. 

వాడికి డబ్బు విలువ తెలియట్లేదన్నాడు. చిన్నతనంలో కాక పొదుపు గురించి మరెప్పుడు నేర్చుకుంటాడన్నాడు. అడగ్గానే బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ అతిసులభంగా పొందిన పిల్లలు పెద్దయ్యాక మొద్దులుగా తయారవుతారని ఆయన ఉద్దేశం. ఇలాంటివాళ్లే ఏటీఎంల నుంచి డబ్బులు ఎత్తుకెళ్లే బాపతుగా తయారవుతారట. అందువల్ల బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ బదులుగా నాకు ఒక వికారమైన చైనా పంది బొమ్మ తెచ్చాడు. దాని వెనుక భాగంలో ఒక రంధ్రం ఉంది. ఇలా అయితే నేను మొద్దును కానన్నమాట!

ప్రతిరోజూ నేను కప్పు కోకో తాగాలి, అదంటే నాకు అసహ్యమైనప్పటికీ. తొక్కతో కోకో తాగితే ఒక షెకెల్‌(ఇజ్రాయిల్‌ నాణెం) ఇస్తారు. తొక్కలేనిదైతే అర షెకెల్‌. దాన్ని అట్లానే తీసి పారబోస్తే ఏమీ ఇవ్వరు! ఆ ఇచ్చిన నాణేల్ని పంది వెనకాలి రంధ్రంలో వేయాలి. ఆ బొమ్మను ఊపితే గలగలమని శబ్దం వస్తుంది. పంది ఎప్పుడైతే నిండుతుందో దాన్ని ఊపినప్పుడు గలగలమని శబ్దం రాదు. అప్పుడు స్కేట్‌బోర్డ్‌ మీద ఉన్న సింప్సన్‌ బొమ్మ కొంటాడు నాన్న. ఆ విధంగా నేను పొదుపు పాఠాలు నేర్చుకుంటున్నాను.

నిజానికి పంది బొమ్మ చూడముచ్చటగా ఉంది. దాని ముక్కును తాకితే చల్లగా ఉంటుంది. దాని వెనుక నాణేన్ని వేసినప్పుడల్లా అది నవ్వుతుంది. అర్ధనాణేన్ని వేసినా కూడా అలాగే నవ్వుతుంది. ఇంకో మంచి విషయమేమిటంటే, అసలు ఏ నాణేన్ని అందులో వేయకపోయినా కూడా అది అలాగే నవ్వుతుంది. నేను దానికి పెసాచ్సన్‌ అని పేరు పెట్టాను. ఈ పెసాచ్సన్‌ ఎవరంటే ఒకప్పుడు మేమున్న ఇంట్లో ఉండేవాడు. ఆయన పేరున్న లేబుల్‌ను మెయిల్‌ బాక్స్‌ మీదినుంచి ఎంత పీకేయడానికి నాన్న ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పెసాచ్సన్‌ మిగతా బొమ్మల మాదిరిగా ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. దాన్లో లైట్లూ, స్ప్రింగులూ, లీకయ్యే బ్యాటరీలూ లేవు. అయితే, అది టేబుల్‌ మీద నుండి కిందకు దూకకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. 

అది నేలవైపు వంగి కిందకు చూసినప్పుడు, ‘జాగ్రత్త పెసాచ్సన్‌! నువ్వు పింగాణీ తయారీవి’ అని చెబుతాను. అప్పుడు అది నా వైపు చూసి నవ్వుతుంది. నేను నా చేతిలోకి తీసుకునేంత వరకూ ఓపిగ్గా వేచి ఉంటుంది. పెసాచ్సన్‌ నన్ను చూసి నవ్వితే నేను వెర్రెత్తిపోతాను. కేవలం ఆ నవ్వు కోసమే నేను ప్రతి ఉదయం నాకిష్టం లేకపోయినా తొక్కతో ఉన్న కోకో తాగుతాను. దాని వెనకాల వున్న రంధ్రంలో నాణేన్ని వేసి దాని నవ్వు ఇంతకూడా ఎందుకు మారదో చూస్తాను. తర్వాత, ‘ఐ లవ్యూ పెసాచ్సన్‌’ అని చెబుతాను. ‘నిజంగా చెబుతున్నాను, అమ్మానాన్న కన్నా కూడా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఏటీఎంలను పగలగొట్టినా సరే , ఎల్లప్పుడూ నిన్ను ఇలాగే ప్రేమిస్తాను. కానీ ఒకటి, టేబుల్‌ మీది నుంచి దూకాలని మాత్రం కనీసం ఆలోచన కూడా నీవు చేయొద్దు’.
నిన్న నాన్న వచ్చాడు. టేబుల్‌ మీదున్న పెసాచ్సన్‌ను పైకెత్తి కిందికీ మీదికీ గట్టిగా ఊపడం మొదలుపెట్టాడు. 

‘నాన్నా, జాగ్రత్త. నువ్వు పెసాచ్సన్‌కు కడుపునొప్పి తెప్పించేట్టున్నావు’ అన్నాను. కానీ నాన్న వినలేదు. ఇంకా అలాగే ఊపుతూ, ‘ఇందులోంచి శబ్దం రావడం లేదు. దీనర్థం నీకు తెలుసుకదా యువీ? నీకు రేపే స్కేట్‌బోర్డ్‌ మీదుండే సింప్సన్‌ బొమ్మ కొనిస్తాను’ చెప్పాడు నాన్న.

‘అద్భుతం నాన్నా. సింప్సన్‌ బొమ్మా? అద్భుతం. కానీ పెసాచ్సన్‌ను మాత్రం ఊపడం ఆపు. ప్లీజ్‌ దానికి నొప్పెడుతుంది’ అన్నాను. నాన్న పెసాచ్సన్‌ను తిరిగి టేబుల్‌ మీద పెట్టాడు. అమ్మ దగ్గరికి వెళ్లాడు. ఒక నిమిషం తర్వాత అమ్మను చేత్తో పట్టుకొని లాగినట్టుగా తోడ్కొని వచ్చాడు. ఇంకో చేతిలో సుత్తి వుంది. ‘చూశావా, నేనూహించినట్లుగానే జరిగింది’ చెప్పాడు నాన్న. ‘వస్తువుల విలువ ఏమిటో ఇప్పుడు వాడికి తెలుసు. కదా యువీ?’. ‘కచ్చితంగా తెలిసింది నాన్నా. అదిసరేగానీ సుత్తి ఎందుకు తెచ్చినట్టు?’ అని నేను అడిగాను. ‘నీ కోసమే’ అంటూ సుత్తిని నా చేతిలో పెట్టాడు. ‘జాగ్రత్త సుమా!’ అన్నాడు. ‘నేను జాగ్రత్తగానే ఉంటాను’ అన్నాను. నేను నిజంగానే జాగ్రత్తగా ఉన్నాను. కొన్ని నిమిషాలు వేచి చూశాక, నాన్న విసిగిపోయాడు. 

‘కానివ్వురా, ఆ పందిని పగలగొట్టు’ అన్నాడు. ‘య్యేమిటీ?’ నేను అరిచాను, ‘పెసాచ్సన్‌ను పగలగొట్టాలా?’ ‘అవునవును, పెసాచ్సనే’ చెప్పాడు నాన్న, ‘కానీ, పగలగొట్టెయ్‌. నువ్వు చాలా కష్టపడ్డావు. బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ కొనివ్వడానికి అర్హత సంపాదించావు’. తన అంతిమ క్షణాలు వచ్చాయని తెలిసిపోయిన చైనా పందిలాగా పెసాచ్సన్‌ నావైపు చూసి దీనంగా నవ్వింది. సింప్సన్‌ బొమ్మ లేకపోతే పోయే! నేను నా ఫ్రెండు తల మీద సుత్తితో కొట్టడమా? ‘నాకు సింప్సన్‌ బొమ్మ వద్దు. ఈ పెసాచ్సన్‌ చాలు’ అని సుత్తిని నాన్నకు వెనక్కి ఇచ్చేశాను. ‘నీకు అర్థం కాలేదన్నమాట’ అన్నాడు నాన్న. ‘ఏం ఫర్లేదు. నన్ను చూసి నేర్చుకో. నీ కోసం నేనే పగలగొడతాను’. నాన్న అప్పటికే సుత్తిని పైకెత్తాడు. అమ్మ కళ్లు మూసుకుంది. పెసాచ్సన్‌ అలసిపోయినట్టుగా నవ్వుతున్నాడు. 

ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి. నేను ఏమీ చేయలేదంటే పెసాచ్సన్‌ చచ్చిపోయినట్టే! ‘నా...న్నా...’ అని గట్టిగా నాన్న కాళ్లను పట్టుకున్నాను. ‘ఏం, యువీ?’ అడిగాడు నాన్న. చేతిలోని సుత్తి ఇంకా గాల్లోనే లేచివుంది. ‘నాన్నా! నాకింకో షెకెల్‌ కావాలి, ప్లీజ్‌. రేపు కోకో తాగిన తర్వాత అందులో వేయడానికి. రేపు దాన్ని నేనే పగలగొడతాను, తప్పకుండా’ అన్నాను. ‘ఇంకో షెకెలా?’ నాన్న నవ్వుతూ సుత్తిని టేబుల్‌ మీద పెట్టాడు, ‘చూశావా? వాడిలో ఎంత అవగాహన పెరిగేట్టు చేశానో’. ‘రేపు’. అప్పటికే నా గొంతు పూడుకుపోయింది.

అందరూ గదిలోంచి బయటికి వెళ్లిన తరువాత పెసాచ్సన్‌ను గట్టిగా హత్తుకున్నాను. ఒక్కసారిగా బయటికి ఏడ్చాను. పెసాచ్సన్‌ ఏమీ మాట్లాడలేదు. నా చేతుల్లో నిశ్శబ్దంగా వణికింది. ‘బాధ పడకు’ తన చెవిలో గుసగుసగా చెప్పాను, ‘నేను నిన్ను కాపాడుతాను’.

రాత్రి నాన్న ముందుగదిలో టీవీ చూడటం ముగించి, నిద్రకు ఉపక్రమించే వరకూ వేచివున్నాను. నెమ్మదిగా మంచం మీదినుంచి లేచి, పెసాచ్సన్‌ను పట్టుకుని బయటికి వచ్చాను. చాలాసేపు మేమిద్దరమూ చీకట్లో నడిచాం. చివరకు ముళ్లపొదలున్న ఒక పొలాన్ని చేరుకున్నాం. ‘పందులకు ముళ్లపొదలున్న పొలాలంటే చాలా ఇష్టం’ అని పెసాచ్సన్‌ను నేల మీద పెడుతూ చెప్పాను, ‘నీకు ఇక్కడ నచ్చుతుంది’. జవాబు కోసం ఎదురుచూశానుగానీ పెసాచ్సన్‌ ఏమీ అనలేదు. దానికి గుడ్‌బై చెప్పడానికి ముక్కు మీద తాకినప్పుడు మాత్రం విషాదంగా చూసింది. మరి నన్ను మళ్లీ ఎప్పటికీ చూడలేనని తనకు తెలుసుకదా!

ఎట్గార్‌ కెరెట్‌ హీబ్రూ కథ ‘బ్రేకింగ్‌ ద పిగ్‌’ సారం ఇది. కెరెట్‌ 1967లో ఇజ్రాయిల్‌లో జన్మించారు.  కథలూ, గ్రాఫిక్‌ నవలలూ, సినిమాలూ, టీవీకి స్క్రిప్టులూ రాస్తారు.

- ఎట్గార్‌ కెరెట్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement