ప్రతిధ్వనించే పుస్తకం
మనుషులకీ జంతువులకీ మధ్య ఉండే సంబంధం ‘బ్లాక్ బ్యూటీ’లోని ప్రధాన వస్తువు. ఈ నవలను అన్నా సీవెల్ గుర్రాల పట్ల మనుషులు దయగా ఉండాలనే సందేశంతో రాసిందని అంటారు. అప్పటికి రైలు వచ్చేసింది. ఇంకా కారు ఒక మార్కెట్ సరుకుగా వచ్చి ఉండలేదు. మానవ నివాస భూఖండాలన్నింటా జంతువులు ఉత్పత్తి కార్యకలాపాలలో భాగస్వాములుగా ఉన్న కాలం అది. మానవ నాగరికత మారిపోయింది. కార్లు... రైళ్ళు... బస్సులు వచ్చాయి. అవి నడవడం కోసం రోడ్లు వచ్చాయి. రోడ్ల కోసం కొండలు పేలాయి. భూమి మీద మానవునితో సంబంధం లేకుండా ఆవిర్భవించిన గుర్రం అతని సంబంధంలోకి వచ్చి పెంపుడు జంతువై మనిషికి వ్యక్తిగత ఆస్తి అయ్యి , సరుకు అయ్యి, చివరికి అంతరించిపోయే దశలోకి వచ్చేసింది.
ప్రకృతికీ, సమాజానికీ సంబంధించిన పరిణామక్రమంలో యిప్పుడు ఉన్నట్టుగా ఉండడం అనేది ఒకానొక పరిణామ ఫలితమనీ యిది కూడా మారి పోతుందనీ మనకి సైన్స్‌పరంగానూ, తాత్వికంగానూ కూడా తెలుసు. ఈ ప్రక్రియలో మేధోజీవి అయిన మానవుడు ప్రకృతి పరిణామంగా వచ్చి దానిలో జోక్యం చేసుకోవడం, మార్చివేయడం అనే నాగరికత కలిగినవాడు. ఈ లక్షణాన్నీ, ఈ నాగరికతనీ మనం ప్రేమిస్తున్నాం. మార్చడం, మారిపోవడం రెండూ తప్పనిసరి అనీ, మార్పు యిలాగే ఉండాలనీ, అలా ఉండకపోవడం ఒక నేరమనీ భావిస్తున్నాం. అయితే మానవుని జోక్యంతో మారుతున్న ప్రకృతి యిప్పుడు చాలా ప్రశ్నల్ని మన ముందుకు తెస్తున్నది.
కొన్ని వేల యేళ్ళు ప్రకృతి పరిణామంగా ఏర్పడినవన్నీ కొన్ని రోజులలో నాశనమై అంతరించిపోవడం ఈవేళ మనకి నిత్యమూ కనపడుతున్న అంశం. బ్లాక్‌బ్యూటీలో గుర్రాన్ని ప్రేమించడం హింసించడం రెండూ కనిపిస్తాయి. గుర్రంతో మనిషికి మైత్రి ఉంది. అది తన లాంటి ఒక ప్రాణి అనే ఎరుక ఉంది. కానీ కారుతో అలాంటిదేమీ లేదు. కానీ సమస్య యిది కాదు. కారు రావడంతో గుర్రం అనే ఒక ప్రకృతి జీవి మానవునితో ‘ఉద్యోగిత’ కోల్పోయి అంతరించిపోయే దశకి చేరుకోవడం. ఒక సహజ పరిణామం మనిషి కార్యాచరణకి గురై అంతరించిపోవడం మనకి భయానకమైన ప్రశ్న వేస్తున్నది.
ప్రాజెక్టుల వల్ల నదులు, కొండలు, పట్టణీకరణవల్ల భూమి, చెట్లు, పక్షులు, అడవులు, ప్రపంచీకరణ వల్ల అన్నీ అంతరించిపోయే దశకి చేరుకోవడం ఈవేళ మనకి స్పష్టంగా తెలుస్తోంది.
యిదంతా మానవుడి చేతుల్లో లేని ఒక సహజ పరిణామమా? ఇది అనివార్యమా? భూమి మీద జీవం అంతరించిపోవడానికి ప్రకృతి ఏర్పాటు చేసిన ప్రక్రియా యిది?
- అద్దేపల్లి ప్రభు
Comments
Please login to add a commentAdd a comment