చీకట్లో చిరుదీపం! ఆ యాక్సిడెంట్‌ ఓ కొత్త బంధాన్ని.. | Going On Flight Is Fine | Sakshi
Sakshi News home page

చీకట్లో చిరుదీపం! ఆ యాక్సిడెంట్‌ ఓ కొత్త బంధాన్ని..

Published Sun, Oct 1 2023 3:40 PM | Last Updated on Sun, Oct 1 2023 3:40 PM

Going On Flight Is Fine - Sakshi

‘ఫ్లైట్‌లో భలే ఉంది డాడీ! ఇప్పుడు జుయ్య్‌ మంటూ పైకి ఎగిరి పోతుందా? మబ్బుల్లోకి దూరిపోతుందా? మనం మబ్బులను తాకవచ్చా?’ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది పింకీ. ‘ఫ్లైట్‌ పైకి ఎగిరిపోతుంది కానీ మనం మబ్బులను తాకలేము. నువ్వు అల్లరి చేయకుండా కూర్చోవాలి. లేకపోతే ఎయిర్‌ హోస్టెస్‌ నిన్ను కిందకు దింపేస్తుంది’ అన్నాడు వశిష్ట. ‘అమ్మా! మనం అమెరికా వెళ్ళగానే జార్జ్‌ మామయ్య ఎయిర్‌ పోర్ట్‌కి వచ్చి మనల్ని తీసుకెళ్తారా? ఒకవేళ మామయ్య రాకపోతే మనం ఏం చేద్దాం?’ సందేహంగా అంది పింకీ.‘జార్జ్‌ మామయ్య తప్పకుండా వస్తాడు పింకీ!’ నమ్మకంగా అన్నాను.

‘లేఖా! ఎప్పుడయినా ఇలా అమెరికా వెళ్తాము అని అనుకున్నామా?’ ఆనందంగా అన్నాడు వశిష్ట. ‘అలాంటి పగటి కలలు కనే అలవాటు మనకు లేదు కదండీ! మనం ఊహించనిది జరగడమే జీవితం’ నవ్వుతూ అన్నాను. అంతలో ఫ్లైట్‌ టేక్‌ ఆఫ్‌ అవుతోంది అని ఎయిర్‌ హోస్టెస్‌ అనౌన్స్‌మెంట్‌ వినిపించడంతో ప్రయాణికులు అందరూ సీట్‌ బెల్ట్‌ పెట్టుకుంటున్నారు. మేము కూడా వాళ్ళను అనుసరించాం. సీట్‌ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కొద్ది రోజుల వెనక్కి వెళ్ళాను.
∙∙ 
నేను ప్రభుత్వ ఆస్పత్రిలో హెడ్‌ నర్సుగా పని చేస్తున్నాను. ఆస్పత్రికి వెళ్ళే దారిలో రైల్వే పట్టాలు ఉంటాయి. వాటిని దాటి వెళ్తే దారి కలిసి వస్తుందని ఎక్కువగా అటువైపు నుండే నడిచి వెళ్తాను. ఆలస్యం అయినరోజు చుట్టూ తిరిగి ఆటోలో వెళ్తాను. సరిగ్గా రైల్వే పట్టాల దగ్గరకు వచ్చేసరికి చాలా మంది జనం గుమిగూడి కనిపించారు. ఏమైందోనని జనం మధ్యలో నుండి తొంగిచూశాను. ‘ఎవరో ఒక యువకుడు పడిపోయి ఉన్నాడు. తలకు కట్టు కట్టి ఉంది. బట్టలన్నీ చినిగిపోయి అర్ధనగ్నంగా ఉన్నాడు. ఆ అబ్బాయి మా ఆస్పత్రిలో నిన్నటి దాకా ఉన్న పేషెంట్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. బయటకు ఎలా వచ్చాడు? ఎప్పుడు స్పృహ వచ్చిందో? నుదుటి మీద దెబ్బలున్నాయి. ఎవరో రాళ్లతో కొట్టినట్లున్నారనుకుని, గబగబా దగ్గరకు వెళ్ళి చూశాను. స్పృహలోనే ఉన్నాడు కానీ మాటా పలుకు లేకుండా చూస్తున్నాడు.

వెంటనే అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి అతన్ని మళ్ళీ ఆస్పత్రిలో చేర్పించాను.. చికిత్స కోసం! సరిగ్గా ఒక పదిహేను రోజుల క్రితం ఆ ప్రాంతంలోనే ఒక రైలు పట్టాలు తప్పి పడిపోయింది. ఆ ప్రమాదంలో దెబ్బలు తగిలిన వాళ్ళను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.  చాలామందికి చిన్న చిన్న గాయాలే అయ్యాయి. ప్రాణనష్టం జరగలేదు. కానీ పది మందికి మాత్రం తీవ్రంగా గాయాలు అయ్యాయి. అందులో తొమ్మిది మంది సమాచారం వాళ్ళ వాళ్లకు  చేరింది. కానీ ఒకే ఒక యువకుడి తాలూకు అడ్రస్‌ మాత్రం తెలియలేదు. అతని దగ్గర బ్యాగ్‌ కానీ, ఫోన్‌ కానీ.. అతని ఉనికిని తెలిపే ఏ వస్తువు కానీ లేవు. తలకు బలమైన దెబ్బలు తగిలాయి. నిన్నటి వరకు పూర్తి స్పృలో కూడా లేడు. 

‘అతను బయటకు ఎలా వెళ్ళిపోయాడు?’ అంటూ డాక్టర్‌ గారు స్టాఫ్‌ అందరినీ గట్టిగా కేకలు వేశారు. ఆ తరువాత అతనికి స్పృహ వచ్చిందని మీడియాకి సమాచారం అందించారు. కాంపౌండర్‌కి చెప్పి అతని బట్టలు మార్పించి గాయాలు తుడిచి కట్టు మార్చి, మందులు వేశాను. అతను కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ ఏమీ మాట్లాడటం లేదు. అసలు మనం మాట్లాడేది అర్థం అవుతోంది లేనిది కూడా తెలియడం లేదు. ‘బహుశా తలకు తగిలిన దెబ్బ వల్ల మాట పోయిందా? లేక మతి భ్రమించిందా? అసలు చెవులు వినబడుతున్నాయా? లేదా?’ అనుకున్నాను. ‘శ్రీలేఖా.. ఏక్సిడెంట్‌తో ఇతను షాక్‌లోకి వెళ్లినట్లున్నాడు. వాళ్ల వాళ్లు వచ్చే వరకు మనమే టేక్‌ కేర్‌ చేద్దాం, జాగ్రత్తగా చూసుకోండి’ అని చెప్పారు డాక్టర్‌ గారు ఆ యువకుడిని పరీక్షించాక. 
∙∙ 
మీడియా వచ్చి అతని ఫొటోస్‌ తీసుకొని.. వివిధ రకాల ప్రశ్నలు వేసింది. అతడి నుండి ఎటువంటి సమాధానమూ రాకపోయేసరికి నిరాశతో వెనుదిరిగింది. ‘నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పదిహేను రోజుల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ఒక యువకుడికి రెండు రోజుల క్రితమే స్పృహ వచ్చిందని డాక్టర్‌ గారు సమాచారం ఇచ్చారు. అతను షాక్‌కి లోనయి ఉండటం వల్ల మాట్లాడటం లేదు. ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి వివరాలు తెలిసిన వారు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని సంప్రదించగలరు.’ అంటూ పేపర్‌లో వార్తగా వచ్చింది ఆ యువకుడి విషయం. 

రెండు.. మూడు.. వారం రోజులు గడిచాయి. ఎవరూ రాలేదు. అతడు ఎవరితో మాట్లాడటం లేదు. తిండీ తినడం లేదు. ఎవరయినా పలకరించినా అలా చూస్తూ ఉంటున్నాడు. కానీ సమాధానం చెప్పడం లేదు. డ్యూటీలోకి రాగానే ముందు అతడిని చూడటం.. అలాగే డ్యూటీ నుండి వెళ్లిపోయే సమయంలో నైట్‌ డ్యూటీ స్టాఫ్‌కి అతడి గురించిన జాగ్రత్తలు చెప్పి వెళ్లడం నా దినచర్యలో భాగమైంది. ఒకరోజు డాక్టర్‌ గారు రొటీన్‌ చెకప్‌లో భాగంగా ఆ అబ్బాయిని చూసి.. ‘శ్రీలేఖా.. అతని తాలూకు ఎవరూ రావడం లేదు కదా! మనం మాత్రం ఎన్నాళ్లని అతని బాధ్యత తీసుకోగలం? అందుకే డిశ్చార్జ్‌ చేసేద్దాం’ అన్నారు.

‘సర్‌.. అతనికి ఆకలి, దాహం కూడా తెలియడం లేదు. ఈ పరిస్థితుల్లో బయటకు పంపిస్తే ఎలా? అతని వల్ల మనకు సమస్యేమీ లేదు కదా! ఇంకొన్నాళ్లు చూద్దాం సర్‌’ అన్నాను రిక్వెస్టింగ్‌ ధోరణిలో. ఇక ఆయన ఏమీ మాట్లాడలేదు.
∙∙ 
ఒకరోజు ఉదయం నేను వచ్చేసరికి నర్సు కమల అతని మీద అరుస్తోంది.  ‘ఏమైంది కమలా.. ఎందుకు కోప్పడుతున్నావు?’ అడిగాను కంగారుగా. ‘ఇతను తిండి తిని రెండు రోజులు అవుతోంది మామ్‌! ఎంత చెప్పినా మెతుకు ముట్టడు. కాంపౌండర్‌ అన్న వచ్చి స్నానం చెయ్యమంటే చేస్తాడు. రెండు జతల బట్టలు ఆస్పత్రిలో ఉంటే ఇచ్చాం. అవి ఉతుక్కోమంటే మా ముఖాలు చూస్తాడు. వినపడదో.. చెప్పింది అర్థంకాదో తెలీట్లేదు. ఈ గోల ఎక్కడ పడం మామ్‌..  పంపించేస్తే సరిపోతుంది కదా!’ అంది కమల. అతని వైపు చూశాను. ముఖం కిందకు దించుకొని చూడసాగాడు.

నేను దగ్గరకు వెళ్లి అక్కడున్న ఇడ్లీ ప్లేటు అతని ముందుకి జరిపి అక్కడే కూర్చున్నాను. ఒక ముక్క తుంపి అతని చేతికి ఇచ్చి ‘తీసుకో! తిను’ అన్నాను మెల్లిగా. కాసేపు అలాగే చూసి ఇడ్లీ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అలాగే  నెమ్మదిగా మొత్తం తినేశాడు. నేను తెచ్చుకున్న అరటి పండునూ ఇచ్చాను నా బ్యాగ్‌లోంచి తీసి. మౌనంగానే  ఆ అరటి పండునూ తిన్నాడు. ‘మామ్‌! ఎవరం ఎంత చెప్తున్నా అతను వినడం లేదు. తిండి తినడం లేదు. కానీ మీరు చెప్పగానే భలే తినేశాడే! అలాగే అతను శుభ్రత విషయంలోనూ కాస్త సాయం చేద్దురూ.. ’ అంది కమల నవ్వుతూ.

‘సరే, ప్రయత్నిస్తాను కమలా!’ అని.. కాంపౌండర్‌ గోపిని  పిలిచాను. ‘గోపీ.. ఇతన్ని  స్నానానికి తీసుకెళ్లు. తర్వాత ఓ రెండు నైట్‌ డ్రెసెస్‌ కొనుక్కురా. ఆ..  సాయంత్రం నీ డ్యూటీ అయ్యాక సెలూన్‌కి తీసుకెళ్లు. అతని మానాన అతన్ని వదిలేయకుండా కాస్త జాగ్రత్తగా చూసుకో. నేను డాక్టర్‌ గారికి చెప్తాను’ అని పురమాయిస్తూ నా బ్యాగ్‌లో నుండి డబ్బులు తీసి గోపి చేతిలో పెట్టాను. ఆ రోజు ఇంటికి వెళ్ళాక ఆసుపత్రిలో జరిగినదంతా మా ఆయనతో చెప్పాను. ‘లేఖా! అతను ఎవరో అనాథై ఉండాలి. లేకపోతే ఏక్సిడెంట్‌ జరిగి ఇన్నాళ్ళయినా అతని కోసం ఎవరూ రాకపోవడం ఏంటీ! నువ్వు చెప్పేది వింటున్నాడు అంటే కచ్చితంగా మూగవాడు అయ్యుండడు. ఏదో ఒకరోజు నార్మల్‌ అవుతాడులే’ ప్రోత్సహకరంగా మాట్లాడాడు వశిష్ట.

హోమ్‌వర్క్‌ చేస్తున్న పింకీ ‘అమ్మా.. అమ్మా!’ పిలిచి.. నా అటెన్షన్‌ తన మీద పడగానే తన చేతిలో ఉన్న నోట్‌బుక్‌ను చూపిస్తూ..‘నా పేరును కలరింగ్‌ చేసి తీసుకు రమ్మన్నారు మా టీచర్‌. చూడు బాగుందా?’ అంది. ‘చాలా బాగుంది’ అంటూ పింకీని ముద్దు పెట్టుకొని కిచెన్‌లోకి వెళ్లాను. పింకీ పేరు చూడగానే నాకు మళ్లీ అతను గుర్తొచ్చాడు. అతని పేరు ఏంటీ? ఎలా తెలుసుకోవడం?
∙∙ 
మరుసటి రోజు ఉదయం ఆస్పత్రికి వెళ్ళగానే అతను ఎదురొచ్చాడు. గోపి అతనికి క్రాఫ్, గడ్డం చేయించినట్లున్నాడు. ముక్కు, ముఖం స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్టలు కూడా కొత్తవి వేసుకున్నాడు. చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అతన్ని చూస్తే చదువురాని వాడిలా అనిపించడం లేదు. నన్ను చూసి చెయ్యి చాపాడు. నాకు ముందు అర్థం కాలేదు.. తరువాత అర్థమయింది. బ్యాగ్‌లో నుండి అరటి పండు తీసి ఇచ్చాను. తిన్నాడు. అంటే నిన్న నేను అరటిపండు ఇచ్చింది గుర్తుందన్నమాట!

సాయంత్రం డ్యూటీ పూర్తి అయ్యాక అతని కోసం వెతికాను. పేషంట్స్‌ ఉండే రూమ్స్‌లో ఒక చోట కూర్చొని ఉన్నాడు. లోపలికి వెళ్లాను. నన్ను చూశాడు. కానీ నవ్వలేదు. ముఖం మాత్రం ప్రసన్నంగా మారింది. బయటకు రమ్మని సైగ చేశాను. కదల్లేదు. అలాగే చూస్తున్నాడు. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చొని నాతో తెచ్చుకున్న పుస్తకం మీద ‘శ్రీ లేఖ’ అని తెలుగులో, ఇంగ్లిష్‌లో, హిందీలో రాశాను. ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో అతను నా కుర్చీ దగ్గర.. నేను రాసేది చూస్తున్నాడు. గమనించీ గమనించనట్టుండిపోయా. నా చేతిలో ఉన్న పెన్ను ఇవ్వమని చెయ్యి చాపుతూ ఏదో అన్నాడు. 

అదేంటో నాకు అర్థం కాలేదు. యాసతో వచ్చిన మాట! స్పష్టత లేదు. కానీ మొదటిసారి అతను నోరు తెరిచాడు. అతనికి పెన్ను ఇచ్చాను. నా చేతిలోని పుస్తకం తీసుకున్నాడు. దాని మీద ‘జార్జ్‌’ అని రాశాడు ఇంగ్లిష్‌లో. ఆ నిముషంలో నాకు ఎగిరి గంతులు వేయాలి అన్నంత సంతోషం కలిగింది.. నా ఆలోచన సరిగ్గానే పని చేసిందని! ‘జార్జ్‌’ అతని పేరు అయ్యుంటుంది. ఇక ఇతర వివరాలు తెలియాలి.  పెన్నును పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రైలు ఏక్సిడెంట్‌ అయిన రోజు నుండి వచ్చిన న్యూస్‌ పేపర్లు అన్నీ అటెండర్‌తో తెప్పించాను. ఎక్కడ కూడా జార్జ్‌ అన్న పేరుతో ఒక్క వార్తా లేదు.

గాలిలోకి బాణం వేస్తున్నానేమో అనిపించింది. అంతలోనే నా దృష్టి ‘హైదరాబాద్‌లో విలియమ్స్‌ అనే ఓ విదేశీయుడు అమీర్‌పేట్‌లోని ఒక స్టార్‌ హోటల్‌లో రాత్రివేళ రూమ్‌ తీసుకొని మరుసటి రోజు ఉదయం లాక్‌ చేసుకొని బయటకు వెళ్ళాడు. తిరిగి రాలేదు. అతను ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ కూడా అందుబాటులో లేదు. హోటల్‌ వాళ్ళు మారు తాళం చెవితో రూమ్‌ తెరిచి చూస్తే అతని బట్టల సూట్‌కేస్‌ ఉంది. అవి అమీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు’ అన్న చిన్న న్యూస్‌ మీద పడింది. 

ఈ వార్తకు, జార్జ్‌కి ఏదయినా సంబంధం ఉందేమో అనిపించింది ఎందుకో! రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను దాని గురించి. నా అనుమానాలన్నిటినీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక వశిష్ట దగ్గర వెలిబుచ్చాను. ‘నువ్వు నర్సు ఉద్యోగం మానేసి సీఐడీలో చేరితే బాగుంటుందేమో!’ అన్నాడు నవ్వుతూ వశిష్ట. ‘అలా ఎగతాళి చేయకండీ! ఆ అబ్బాయి చూస్తే తమ్ముడిలా అనిపిస్తున్నాడు. అతనికంటూ ఒక కుటుంబం ఉండుంటే.. అతను ఇలా జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల తన వాళ్లను చేరుకోలేక.. అనాథలా మిగిలిపోతాడేమో!’ అన్నాను బాధగా.  

‘హోటల్‌ మేనేజ్‌మెంట్‌ వాళ్లకు ఫోన్‌ చేసి చూద్దాం!’ అన్నాడు వశిష్ట నన్ను అనునయిస్తూ. గూగుల్‌లో హోటల్‌ నంబర్‌ చూసి రిసెప్షనిస్ట్‌తో మాట్లాడాడు వశిష్ట..‘మామ్‌! మేము నిజామాబాద్‌ జిల్లా నుండి మాట్లాడుతున్నాం. పేపర్లో మీరు ఇచ్చిన వార్త చూశాం. మొన్న ఇక్కడ జరిగిన రైలు ఏక్సిడెంట్‌లో ఒక వ్యక్తి గతం మరచిపోయి గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో ఉన్నాడు. అతనికీ, మీ హోటల్‌ నుండి మాయమైన విలియమ్స్‌కీ ఏదయినా సంబంధం ఉందేమోనని ఫోన్‌ చేశాను’ అంటూ. రిసెప్షనిస్ట్‌ మేనేజర్‌కి కనెక్ట్‌ చేసింది. మేనేజర్‌ కూడా వెంటనే స్పందించాడు. 

‘విలియమ్స్‌ వచ్చిన రోజు సీసీ కెమెరాలో క్యాప్చర్‌ అయిన ఆయన ఫొటోను పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులకు ఇచ్చాం. అది ఒకటి నా దగ్గరా ఉంది.  మీ నంబర్‌కి వాట్సప్‌ చేస్తాను’ అని చెప్పి.. మరికొద్ది సేపట్లోనే విలియమ్స్‌ ఫొటోను వశిష్టకు వాట్సాప్‌ చేశాడు హోటల్‌  మేనేజర్‌. అందమైన ఓ పాతికేళ్ల యువకుడు.. చేతిలో ఒక లెదర్‌ సూట్‌ కేస్, క్యాబిన్‌ బ్యాగ్‌తో ఉన్న ఫొటో అది. పరీక్షగా చూస్తే అతనిలో జార్జ్‌ పోలికలు కనిపించాయి. ‘అతనే ఇతను!’ ఆనందంగా అరిచాను. ‘అయితే నీకు సీఐడీ పదవి గ్యారంటీ’ నవ్వుతూ అన్నాడు వశిష్ట.
∙∙ 
మరుసటి రోజు ఉదయం ఆస్పత్రికి వెళ్ళగానే మా చీఫ్‌ డాక్టర్‌ గారికి విలియమ్స్‌ ఫొటో చూపించి జరిగిందంతా చెప్పాను. ఆయన నిజామాబాద్‌లోని  పోలీస్‌ స్టేషన్‌కి కాల్‌ చేసి సమాచారం అందించారు. వాళ్ళు అంతా విన్నాక అమీర్‌పేట్‌ పోలీసులతో మాట్లాడి అక్కడ ఉన్న జార్జ్‌ లగేజ్‌  నిజామాబాద్‌కి పంపించే ఏర్పాట్లు చేశారు. మరుసటి రోజు హైదరాబాద్‌ నుంచి పోలీసులు లగేజ్‌తో ఆస్పత్రికి వచ్చారు. జార్జ్‌ని తీసుకురమ్మని అటెండర్‌కి పురమాయించారు డాక్టర్‌ గారు. అప్పుడు నేనూ అక్కడే ఉన్నాను.

జార్జ్‌ని తీసుకొచ్చాడు అటెండర్‌. వచ్చీరావడంతోనే జార్జ్‌ దృష్టి పోలీసుల దగ్గరున్న సూట్‌కేస్‌ మీద పడింది. అలా చూస్తూ నిలబడిపోయాడు. నేను అతనినే గమనిస్తున్నాను. సూట్‌కేస్‌ను పోలీసులు ఇదివరకే ఓపెన్‌ చేసి చూశారు. అందులో కొన్ని జతల బట్టలు తప్ప ఇంకేమీ లేవు. అందుకే వాళ్లకు వివరాలు తెలియలేదు. పిచ్చివాడిలా.. అయోమయంగా చూస్తుండే జార్జ్‌ చురుకుగా మారాడు. గబగబా వెళ్ళి సూట్‌కేస్‌ తీసుకొని ఓపెన్‌ చేశాడు. ‘వేర్‌ ఈజ్‌  మై ఫోన్‌?’ అడిగాడు అమెరికన్‌ యాసలో.  అక్కడున్న అందరం తుళ్ళిపడ్డాం. 

‘మీ ఫోన్‌ పోయింది. మీరు ఫోన్‌ చేసుకోవాలి అనుకుంటే ఇదిగో’ అని ఇంగ్లిష్‌లో చెబుతూ తన ఫోన్‌ ఇచ్చాడు ఒక పోలీస్‌. జార్జ్‌కి ఆ పోలీస్‌ ఇంగ్లిష్‌ అర్థం కాలేదని అతని ముఖ కవళికలు చెప్పాయి. భావం అర్థమైనట్టుంది అందుకే పోలీస్‌ చేతిలోని ఫోన్‌ తీసుకున్నాడు. వెంటనే ఎవరికో కాల్‌ చేశాడు. అటు వైపు ఉన్నవారు జార్జ్‌ గొంతు విని చాలా సంతోషించినట్లు తెలుస్తోంది. జార్జ్‌ మాట్లాడలేకపోతున్నాడు. సమాధానం చెప్పలేక అయోమయంగా చూస్తున్నాడు. నేను అది గ్రహించి అతని దగ్గర నుండి ఫోన్‌ తీసుకొని.. జరిగింది అంతా అవతలి వైపున వ్యక్తికి వివరించాను.

ఆ మాటలను బట్టి ఆ వ్యక్తి జార్జ్‌ తండ్రని అర్థమైంది. ఆయన నా ఫోన్‌ నంబర్, ఆస్పత్రి అడ్రస్‌ తీసుకున్నాడు. జార్జ్‌కి ఫోన్‌లోని నా సంభాషణ ద్వారా కాస్త ఊరట దొరికినట్టయింది తప్ప భరోసా అందినట్టు లేదు. అందుకే పూర్తిగా మామూలు స్థితికి రాలేదు. పోలీసులు జార్జ్‌కి సూట్‌కేస్‌ అందచేసి వెళ్లిపోయారు. ఏదో ఒక పెద్ద విజయం సాధించిన భావం నాలో! అనామకుడు అనుకున్న వ్యక్తిని తన కుటుంబంతో కలుపుతున్న ఆనందం! ఇంటికి వెళ్లగానే అడిగాడు వశిష్ట.. ‘ఏమైంది నీ ఇన్వెస్టిగేషన్‌?’ అంటూ కాస్త వెక్కిరించినట్టుగానే. జరిగిందంతా పొల్లు పోకుండా చెప్పాను. ‘అయితే జార్జ్‌ విలియమ్స్‌ పూర్తి కథ తెలుసుకునే సమయం దగ్గరకు వచ్చేసిందన్నమాట!’ అన్నాడు. ‘అవును’ అన్నాను సంతోషంగా!
∙∙ 
ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఉదయం తొందరగా లేచి మా ముగ్గురి లంచ్‌ బాక్స్‌లతో పాటు జార్జ్‌కి కూడా బాక్స్‌ సర్దాను. వశిష్ట వెక్కిరించినా పట్టించుకోలేదు. నేను ఆస్పత్రికి వెళ్ళగానే జార్జ్‌ కోసం వెతికాను. ఎప్పటిలా నాకు ఎదురు రాలేదు. నేనే అతను కూర్చున్న చోటుకు వెళ్ళాను. నేను దగ్గరకు వెళ్ళగానే ఎప్పటిలా చెయ్యి చాచలేదు. నేనే అరటి పండు తీసి ఇచ్చాను. తీసుకున్నాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నించి ఆగిపోయాడు. మధ్యాహ్నం నేను తెచ్చిన లంచ్‌ బాక్స్‌ అతనికి ఇచ్చి, నేను కూడా అక్కడే కూర్చుని తిన్నాను. సాయంత్రం జార్జ్‌ తండ్రి హైదరాబాద్‌ వచ్చాక నాకు ఫోన్‌ చేశాడు. డాక్టర్‌ గారు  సహా స్టాఫ్‌ అంతా ఆయన కోసం ఎదురు చూడసాగాం. 

అంతలోనే ఓ కారు వచ్చి ఆగింది. ఇద్దరు మగవాళ్ళు, ఒక ఆడమనిషి దిగారు. ఆ ఆడమనిషికి.. జార్జ్‌కి పోలికలు కనిపించాయి. ఆమె అతని తల్లి అయ్యుంటుంది. అమెరికన్‌ల రంగు కాదు ఆవిడది. ఇండియన్ల కలరే. అందుకే మేమెవ్వరం జార్జ్‌ని అమెరికన్‌ అని అనుకోలేకపోయాం. జార్జ్‌ని చూడగానే అతని కుటుంబం భావోద్వేగానికి లోనయింది.
జార్జ్‌ తల్లితండ్రుల ద్వారా మాకు తెలిసిన విషయం ఏమిటంటే..

‘జార్జ్‌ విలియమ్స్‌.. ఎమ్మెస్‌ పూర్తి చేసి భారతీయుల జీవన విధానం మీద ఆసక్తితో రీసెర్చ్‌ కోసం ఇండియా వచ్చాడు.  పేరెంట్స్‌కి అతను ఒక్కగానొక్క సంతానం. కోట్లకు అధిపతి. హైదరాబాద్‌ వచ్చి హోటల్‌లో దిగిన తరువాత నిజామాబాద్‌ జిల్లా పర్యటన కోసం రైల్లో బయలుదేరాడు. అనుకోకుండా ఏక్సిడెంట్‌లో అతని బ్యాగ్‌.. అందులో ఉన్న ఫోన్‌ పోయాయి. అతని తలకి బలమైన గాయం తగలడం వల్ల షాక్‌కి లోనయ్యాడు.

ఇక్కడి భాష, మనుషులు.. వాతావరణం.. అతన్ని మరింత అయోమయంలోకి నెట్టాయి. ఈ కాంటాక్ట్‌ లేక జార్జ్‌ సమాచారం అందక అతని తల్లితండ్రులు ఆందోళన పడ్డారు’ అని. ‘శ్రీలేఖ మా ఆస్పత్రిలో హెడ్‌ నర్స్‌గా పని చేస్తోంది. తను పేషంట్స్‌ను సొంత మనుషుల్లా చూస్తుంది. మీ అబ్బాయి కోసం ఎవరూ రాలేదు కాబట్టి నేను అతన్ని డిశ్చార్జ్‌ చేసెయ్యమని చెప్పాను. కానీ తను ఒప్పుకోలేదు. అతడి వివరాలు తెలిసేవరకు ఎదురుచూద్దాం అంది. ఈ అమ్మాయి వల్లే మీ అబ్బాయి మీకు దొరికాడు’ చెప్పారు చీఫ్‌ డాక్టర్‌ గారు జార్జ్‌ తల్లి తండ్రులకు.

‘అమ్మా! నీ ఋణం తీర్చుకోలేను’ అంటూ నా రెండు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది జార్జ్‌ తల్లి. ఖాళీ చెక్‌ పైన సంతకం చేసి ‘అమ్మా ఇది నా కొడుకు మమ్మల్ని చేరేలా చేసినందుకు మా బహుమానం. తప్పుగా అనుకోకుండా తీసుకో.. నీకు కావలసినంత రాసుకో’ అంటూ నా చేతుల్లో చెక్‌ లీఫ్‌ని పెట్టాడు జార్జ్‌ తండ్రి.  దాన్ని ఆయనకు తిరిగి ఇస్తూ ‘నా డ్యూటీ నేను చేశాను. దీన్ని నేను తీసుకుంటే డబ్బు కోసం చేసినట్లు అవుతుంది. జార్జ్‌ను చూస్తుంటే నాకు నా తమ్ముడిలా అనిపించింది. ఆ వాత్సల్యంతో అతడి వివరాల కోసం ప్రయత్నం చేశాను’ అన్నాను.

ఆ మాటలు వింటున్న జార్జ్‌ వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో కృతజ్ఞతా భావం. నా ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. వాళ్ళు ఎంత బలవంతం చేసినా నేను డబ్బు తీసుకోలేదు. వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. కానీ మా మధ్య బంధం రోజురోజుకీ బలపడుతూనే వచ్చింది. ఇదిగో ఇలా మేం అమెరికా వెళ్లిదాకా! 
∙∙ 
ఫ్లైట్‌ ల్యాండ్‌ అవుతోంది అని ఎయిర్‌ హోస్టెస్‌ అనౌన్స్‌మెంట్‌ వినిపించడంతో నేను వాస్తవంలోకి వచ్చాను. వశిష్ట, పింకీ ముఖాలలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. జార్జ్‌ని చూడబోతున్నానన్న ఆనందంతో నా మనసు నిండిపోయింది.

(చదవండి: గజరాజు గర్వభంగం!)


  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement