వడ్డెర చండీదాస్
సాహిత్యంలోకి ఒక వురుములా, మెరుపులా ప్రవేశించాడు వడ్డెర చండీదాస్. తొలి నవలతోనే సంచలనం సృష్టించాడు. ప్రత్యేకమైన వచనమూ, అంతే ప్రత్యేకమైన జీవితపు చూపూ ఆయన్ని కూడా అంతే ప్రత్యేకమైన రచయితగా నిలబెట్టాయి. ‘గమనాన్నీ, యానాన్నీ, ప్రవాహాన్నీ అక్షరాలలో చిత్రించాలని –– అంతర్ బహిర్ వర్తనాల మధ్యన వుండే గొలుసు పొరలు చిరగకుండా వొక్కొక్కటె విప్పి; యేదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కె’తో ఆయన రాసిన అస్తిత్వ వాద మనోవైజ్ఞానిక నవల ‘హిమజ్వాల’.
ప్రమాదవశాత్తూ పరిచయమైన కృష్ణచైతన్య, గీతాదేవిల బంధం ఏవో పురా పాపభీతుల కారణంగా ఏ తీరమూ చేరదు. తదుపరి పరిణామాల్లో శివరాం వైవాహిక సంకెళ్లలో గీతాదేవి బందీయవుతుంది. వారిరువురిలోని రసభేదాలు ఆ బంధాన్ని బీటలు వారుస్తాయి. ప్రకృతిలో పురివిప్పే నెమలికీ, దానికో కోక కప్పాలని చూసే అతడికీ మధ్య ఏమీ మిగలదు. అనంతరం, వయసు మళ్లిన విజయసారథి ఆమెను అంతరంగంలోకి ఆహ్వానిస్తాడు. మరోవైపు, గాలికి కొట్టుకుపోయిన కృష్ణచైతన్యకు రోగి చిదంబరరావుతో పరిచయం కావడం, ఆయన భార్యతో సంబంధం ఏర్పడటం, అనూహ్యంగా రోగి కోలుకోవడం, మరోసారి గాలికి విసరివేయబడి తండ్రి మరణవార్తతో ఇల్లు చేరడం, అక్కడ తండ్రి సహచరిగా గీతాదేవి కనబడటం, ప్రియుడిగా మారబోయిన కృష్ణచైతన్యను ఆమె అంగీకరించకపోవడం, పిచ్చివాడైన శివరాం తలతో మోది తాను చస్తూ గీతాదేవిని చంపేయడం... హిమజ్వాలను రెండు పొరల్లో అర్థం చేసుకోవాలనిపిస్తుంది.
ఒక పొర: మనుషుల చర్యలకు ఏ ప్రత్యేక అర్థం లేదనీ, జీవితాలు ఊరికే గాలికి కొట్టుకుపోయేవేననీ, అలా కొట్టుకుపోకుండా నిలిచిన ఆ కాస్త కాలంలో మాత్రం నేలను గట్టిగా తొక్కిపట్టడానికి ప్రయత్నిస్తాయనీ చెప్పినట్టనిపిస్తుంది. రెండో పొర: ఆ తొక్కిపట్టిన ఆ కొద్ది కాలంలో కూడా తాగడానికి రసం నిండిన పాత్రొకటి సిద్ధంగా ఉన్నదనీ, దాన్ని వృథాగా ఒలకబోసుకోకూడదనీనూ!
‘సరోవరం లాంటి హృదయంలో ఉండాల్సిన నేను నీ గాజు గుండెలో ఉండాలని కోరుకోనని తెలియదేమో నీకు! నువ్వొక కాగితం పువ్వువి. నాక్కావలసిన పరిమళం లభ్యం కాదు. నువ్వొక రంగు పువ్వులు చెక్కిన గాజు హృదయానివి. కానీ నాక్కావల్సింది పచ్చని పచ్చిక హృదయం. ప్రపంచంలో ఏ ఒక్కరి కోసమూ నన్ను నేను వంచించుకోలేను. కానీ ఒక్క రసస్పందనకోసం, ఒక్క వెన్నెల కోసం, రసహృదయపు లోలోతుల పలవరింతల కోసం నా సర్వస్వాన్ని అర్పించుకోగలను’ అంటుంది గీతాదేవి.
‘నీటిబుడగ చిట్లినట్లుగా’, ‘తారు పూసినట్టు ఆకాశంలో మబ్బులు’, ‘పర్వతపు పచ్చని నుదుటి మీద నిప్పురవ్వ ఐ పడి, పగకొద్దీ కాల్చి – అక్కడికీ కసి తీరక దోసిళ్ళతో మసియెత్తి గాలిలోకి యెగబోసి, వెళ్ళిపోయాడు సూర్యుడు’ లాంటి వాక్యాలు బుచ్చిబాబును గుర్తు చేస్తాయి. నవల కూడా ఆయనకే అంకితం ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment