హృదయ సౌందర్యం | russian a tolstoy  life in sakshi literature  | Sakshi
Sakshi News home page

హృదయ సౌందర్యం

Published Mon, Jan 29 2018 1:10 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

russian a tolstoy  life in sakshi literature  - Sakshi

ఒకరు సాదామనిషిలాగా కనిపించవచ్చు. కానీ కష్టసమయం వచ్చినప్పుడు ఆ మనిషిలోకి ఎనలేని శక్తి ప్రవహిస్తుంది. శక్తి అంటే దేహదారుఢ్యమే కాదు; కరుణ, ప్రేమ ఏ రూపంలోనైనా ఆ శక్తి వెల్లడి కావచ్చు. 
యెగర్‌ ద్రోమొవ్, అందగాడు. దృఢకాయుడు. సైన్యంలో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నాడు. యుద్ధంలో ఎంత మంది శత్రువులనైనా చీల్చిచెండాడే వీరాధివీరుడు. అతడిది వోల్గా నదీ తీరంలోని ఒక గ్రామం. వాళ్లమ్మ ఫొలికార్పొన్నా. తండ్రి, యెగర్‌ యెగరోవిచ్‌. ఆ వూళ్లోనే కాత్యాను ద్రోమొవ్‌ ప్రేమించాడు. చలికాలంలో అందరూ భోంచేసి కందకంలో చలిమంట చుట్టూ కూర్చుని వున్నప్పుడు సైనికులు తమ ప్రియురాళ్లను గురించీ, భార్యలను గురించీ బోలెడు మాట్లాడుకునేవారు. కాత్యా తన గురించి వేచిచూస్తుందనీ, వేచిచూస్తుందంటే తను ఒంటరి కాలితో వెళ్లినా స్వీకరిస్తుందనీ చెప్పేవాడు ద్రోమొవ్‌.

ఆరోజు ద్రోమొవ్‌ వాళ్లు మలుపు తిరగగానే గుట్టమీద నాజీల ట్యాంకు కనబడింది. అక్కడున్న కొద్దిపాటి చెట్లను మాటు చేసుకుంటూ వీరి ట్యాంకు ముందుకు సాగింది. శత్రుట్యాంకు శతఘ్నిని గురిపెట్టింది. ఈలోగా ద్రోమొవ్‌ పేల్చిన గుండు వారి ట్యాంకు డొక్కలో తగిలింది. రెండో గుండు డర్రెట్‌కు తగిలింది. అది మోర పైకెత్తి ఒరిగిపోయింది. మంటలు సుమారు మూడువందల అడుగుల పైకి లేచాయి. అట్లా పోరాటం జరుగుతున్న కుర్క్స్‌ యుద్ధపు చివరి దశలో హఠాత్తుగా ద్రోమొవ్‌ ట్యాంకుకు షెల్‌ తగిలింది. సిబ్బందిలో ఇద్దరు వెంటనే చచ్చిపోయారు. రెండవ షెల్‌తో ట్యాంకు అంటుకుంది. డ్రైవర్‌ చువిల్యోవ్‌ ట్యాంకుమీదకు ఎక్కి ద్రోమొవ్‌ను బయటికి లాగాడు. అప్పటికే అతడికి స్పృహ తప్పింది. బట్టలు అంటుకున్నాయి. తలమీదా, బట్టలమీదా మట్టి చల్లి మంటలు ఆర్పేశాడు. 

ద్రోమొవ్‌ బతికాడు. కళ్లు పోలేదుగానీ ముఖం ఎంత కాలిపోయిందంటే అక్కడక్కడా యెముకలు బయటపడ్డాయి. ఆసుపత్రిలో ఎనిమిది నెలలు ఉన్నాడు. ప్లాస్టిక్‌ సర్జరీతో ముక్కూ, చెవులూ, పెదవులూ, కనురెప్పలూ పెట్టారు. ఎనిమిది నెలల తర్వాత కట్లు విప్పినప్పుడు ద్రోమొవ్‌ అద్దంలో చూసుకున్నాడు. తనదేనా ఆ ముఖం? చేతులతో తడుముకుంటూ ఈ కొత్త ముఖానికి అలవాటు పడటానికి ప్రయత్నించాడు. వైద్యబృందం అతణ్ని యుద్ధేతర కొలువుకు యోగ్యుడిగా ప్రకటించింది. కానీ ద్రోమొవ్‌ జనరల్‌ దగ్గరకు వెళ్లి, తనను మళ్లీ రెజిమెంటుకు పంపమని కోరాడు. జనరల్‌ తనతో మాట్లాడుతున్నప్పుడు తన ముఖం వైపు చూడకుండా చూపును పక్కకు తిప్పుకోవడం అతడు గమనించాడు. ముందైతే పూర్తిగా కోలుకోవడానికి ఇరవై రోజుల సెలవిచ్చారు. దాంతో స్వగ్రామానికి బయల్దేరాడు ద్రోమొవ్‌.

రైల్వే స్టేషన్‌ నుండి ఊరికి గుర్రపుబండి లేదు. పదిమైళ్లూ మంచులో నడిచే వెళ్లాడు. ఊరికి చేరుకునేసరికి చీకటి పడుతోంది. వీధి వెంబడి పోతే ఆరవ యిల్లు వాళ్లది. హఠాత్తుగా అతడు ఆగి, జేబులలో చేతులు పెట్టుకొని, తల పంకించాడు. వాకిలి వద్దకు పోకుండా, వెనక్కి వెళ్లి కిటికీలోంచి చూశాడు. తల్లి కనబడింది. కిరసనాయిల్‌ దీపపు మసక వెలుతురులో ఆమె టేబుల్‌ మీద రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేస్తోంది. మునుపటిలాగే తలకు నల్లని శాలువా కట్టుకుంది. భుజాలు మాత్రం పలుచబడ్డాయి. వయసు పెరిగింది. గిన్నెలో పాలూ, కాస్త బ్రెడ్డూ, రెండు గరిటెలూ, ఉప్పుడబ్బీ టేబుల్‌ మీదకు చేర్చింది. ఆ అమాయకమైన చిన్న ముఖాన్ని నిస్పృహతో మాడ్చివేయకూడదని ద్రోమొవ్‌ నిశ్చయించుకున్నాడు.

ముందు వైపు వెళ్లి, గేటు తెరుచుకుని లోగిట్లోకి వచ్చి, తలుపు తట్టాడు. ‘‘యెవరు?’’ అని తల్లి గొంతు వినిపించింది. ‘‘లెఫ్టెనెంట్‌ గ్రోమొవ్‌’’ అని జవాబిచ్చాడు. గుండె దడదడలాడటంతో అతడు ద్వారబంధానికి ఆనుకోవలసి వచ్చింది. లేదులే, తల్లి తన గొంతు గుర్తుపట్టలేదు. తనకే అది మొదటిసారి వింటున్నట్లు అనిపించింది.
‘‘యేం కావాలి బాబూ?’’ అడిగింది.
‘‘మీ అబ్బాయి సీనియర్‌ లెఫ్టెనెంట్‌ ద్రోమొవ్‌ వద్ద నుండి వర్తమానం తెచ్చాను’’
‘‘మా యెగర్‌ బతికేవున్నాడా? లోపలికి రా, బాబూ, లోపలికి రా’’
ద్రోమొవ్‌ టేబుల్‌ దగ్గర బెంచీ మీద కూర్చున్నాడు. తాను పసివాడుగా ఉన్నప్పుడు తన ఉంగరాల జుట్టు నిమురుతూ తల్లి ‘తిను బంగారూ’ అని బుజ్జగించేది. అతడు ఆమె కుమారుని గురించి, అంటే తనను గురించే చెప్పసాగాడు. ఆమె అతని ముఖం వైపు చూసినట్లే వుందిగానీ, చూపులు యెక్కడనో వున్నాయి. ఈలోపు తండ్రి యెగర్‌ యెగరోవిచ్‌ వచ్చాడు. ఆయనకు గడ్డం సగం నెరిసింది. అతిథిని చూసి, ఫెల్టుబూట్లకు అంటుకున్న మంచుగడ్డను గడప దగ్గర వదిలించుకుని, మెడచుట్టూ వున్న మఫ్లర్‌ నిదానంగా తొలగించి, చలికోటు విప్పి టేబుల్‌ దగ్గరకు వచ్చి కరచాలనం చేశాడు. ద్రోమొవ్‌ తాను మరొకరైనట్లు నటిస్తూ తనను గురించే మాట్లాడటం కొనసాగేకొద్దీ ఆ నటనను వదిలేయలేకపోయాడు. ‘అమ్మా, నాన్నా, నేను యెంత విరూపినైనా నన్ను గుర్తుపట్టలేదా?’ అని అడగటం అసాధ్యమైంది.‘సరే భోంచేద్దాం. అతిథికి వడ్డించు’ అంటూ తండ్రి లేచి, చిన్న అలమార తెరిచాడు. చేపల కొక్కేలు గల అగ్గిపెట్టె అక్కడ వుంది. ముక్క బోయిన టీపాట్‌ కూడా వుంది. అవన్నీ ద్రోమొవ్‌కు తెలుసు. తండ్రి వోద్కాసీసా బయటకు తీశాడు. అందులో కొద్దిగానే వుంది. 

అందరూ భోజనానికి కూర్చున్నారు. తాను గరిటె పట్టుకున్న కుడిచేతి యొక్క ప్రతి కదలికనూ తల్లి గమనిస్తున్నదని ద్రోమొవ్‌ కొద్దిసేపు తర్వాత గుర్తించాడు.
‘‘యెగర్‌ యింటికి ఎప్పుడు వస్తాడో మీరు చెప్పనేలేదు. అబ్బాయిని చూసి మూడేళ్లయింది. బాగా పెద్దవాడయివుంటాడు’’ అంది.
‘‘అవును, అతను తిరిగివస్తే మీరు గుర్తు పట్టలేకపోవచ్చు’’ 
అతనికి పడక ఏర్పాటు చేశారు. సొంత యింటి సౌఖ్యాన్ని అనుభవిస్తున్నాడు. కొయ్య దడికి ఆవల తండ్రి మెత్తగా గుర్రు పెడుతున్నాడు. తల్లి మంచం మీద నిట్టూరుస్తూ పొర్లుతున్నది. ఉదయం పొయ్యిలో కట్టెల చిటపటలతో నిద్రలేచాడు. అప్పటికే తల్లి అతడి మేజోళ్లు వుతికి ఆరవేసింది. ‘‘ఈ వూళ్లో కాత్యా మల్యిషేవా అనే అమ్మాయి వుందా? ఆమెకు మీ అబ్బాయి శుభాకాంక్షలు అందజేయమన్నాడు’’ అన్నాడు ద్రోమొవ్‌. కాత్యా బడిలో పంతులమ్మగా పనిచేస్తోంది. ఆమెకోసం పొరుగింటి పిల్లను పంపింది తల్లి. వెంటనే కాత్యా ప్రత్యక్షమైంది. ఆమె నేత్రాలు మిలమిలలాడుతున్నాయి. ఆ వెచ్చని మెత్తని వెంట్రుకలు ముద్దుపెట్టుకోగలిగితే! ‘యెగర్‌ నాకు శుభాకాంక్షలు పంపాడా?’ అని ఆమె అడిగినప్పుడు ఆమె వైపు చూడటం ద్రోమొవ్‌కు కష్టమైంది. తన విరూపితనపు ప్రతిబింబం వాళ్ల ముఖంలో కనిపించకూడదనే ఉద్దేశంతో ఇక ఒక్క క్షణం కూడా నిలువదలుచుకోలేదు. తండ్రి గుర్రాన్ని తెస్తానన్నా వినలేదు. నడుస్తూ స్టేషన్‌కు వెళ్లిపోయాడు. ‘ఇప్పుడేం చేయాలి నేను?’ అని బాధతో మూలిగాడు.
తిరిగి రెజిమెంటులో కలిశాడు ద్రోమొవ్‌. రెండు వారాల తర్వాత అతడికి ఒక ఉత్తరం వచ్చింది తల్లి నుంచి.

‘‘బాబూ, నీకు జాబు రాయాలంటే భయమౌతోంది. ఒక మనిషి మన ఇంటికి వచ్చాడు. నీ వద్దనుండి వచ్చానని చెప్పాడు. మంచివాడు. కానీ ముఖం విరూపం చెందింది. కొన్నాళ్లు వుండటానికి వచ్చి హఠాత్తుగా మనసు మార్చుకుని వెళ్లిపోయాడు. కానీ ఆ మనిషి నీవే అని నాకు అనిపిస్తున్నది. మీ నాన్నేమో అలా ఎందుకు నటిస్తాడు?   అలాంటి ముఖం ఉన్నందుకు ఎవరైనా గర్వించాలి అంటున్నాడు. అతను నీవే కదూ! అతని చలికోటు దులపడానికి పెరట్లోకి తీసుకుపోయి గుండెలకత్తుకుని ఏడ్చాను. బాబూ, యెగర్, భగవంతుని మీద ఆన, జాబు రాయి’’. ద్రోమొవ్‌ తల్లికి జాబు రాశాడు, క్షమించమని. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఆడవాళ్లు ఆ రెజిమెంటుకు వచ్చారు. ఒకరు, తల్లి, రెండో మనిషి, కాత్యా. తల్లిని గాఢంగా కౌగిలించుకున్నాక, కాత్యా వైపు తిరిగి అన్నాడు ద్రోమొవ్‌: ‘‘కాత్యా, నువ్వు కాచుకుంటానన్నది ఈ మనిషి కోసం కాదు’’.
‘‘యెగర్, నా జీవితమంతా నీతోనే కలిసివుంటాను. నా సమస్త హృదయంతోనూ నిన్ను ప్రేమిస్తున్నాను’’.
అదీ అంతఃశక్తి. మానవ హృదయపు మహాసౌందర్యం!
ద్రోమొవ్‌ బతికాడు.  కళ్లు పోలేదుగానీ ముఖం ఎంత కాలిపోయిందంటే అక్కడక్కడా యెముకలు బయటపడ్డాయి.  ఎనిమిది నెలల తర్వాత కట్లు విప్పినప్పుడు ద్రోమొవ్‌ అద్దంలో  చూసుకున్నాడు. తనదేనా ఆ ముఖం?

అలెక్జీయ్‌ తోల్‌స్తోయ్‌ (1883–1945) ‘రష్యన్‌ క్యారెక్టర్‌’కు సంక్షిప్తరూపం. దీన్ని రా.రా.  అనువదించారు. ఈ కథ రాసిన కాలం 1944. ‘ఒక సంస్కృతి వృద్ధి కావడానికి కావాల్సిన  ప్రాథమిక నియమం, శాంతి’ అని నమ్మారు అలెక్జీయ్‌. పీటర్‌ 1, నికితాస్‌ చైల్డ్‌హూడ్, సిస్టర్స్, ఇవాన్‌ ద టెరిబుల్‌ ఆయన ఇతర రచనలు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement